త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్టతో తపస్సు చేస్తుండేవాళ్లు. వీరిలో ప్రచేతసుడు అనే ముని ...
త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్టతో తపస్సు చేస్తుండేవాళ్లు. వీరిలో ప్రచేతసుడు అనే ముని కుమారుడు రత్నాకరుడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారితప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని అటుగా వెళ్తున్న ప్రయాణిస్తున్న ఓ వేటగాడు గమనించాడు. ఆ ముని కుమారుడిని ఓదార్చి తనతో పాటు తీసుకెళ్లిన బోయవాడు తన కుమారునిగా పెంచుకుంటాడు. తన కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినో పడి మరణించి ఉంటాడని ప్రచేతసుడు భావిస్తాడు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. యుక్త వయస్సుకు వచ్చిన రత్నాకరుడికి ఓ యువతితో వివాహమవుతుంది. వీరికి ముగ్గురు సంతానం. వీరితోపాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి వెనుకాడని పరిస్థితికి చేరుకుంటాడు రత్నాకరుడు.
అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ మనిషి రూపంలో ఆ దారి వెంట వస్తాడు. ఆయనను దోచుకోడానికి రత్నాకరుడు ప్రయత్నించగా తన వద్ద వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెడుతాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిస్తాడు. పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే. పాప పుణ్యాలు నాకు తెలియవని అంటాడు. రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగించేందుకు నారదుడు ఓ ఉపాయం పన్నుతాడు. ఓ బోయవాడా.. నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్తాడు. తన పాపాల్లో మీరూ కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను ప్రశ్నించగా, అందుకు వారు సమ్మతించరు. పైగా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేం, తీసుకోలేమని బదులిస్తారు. వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాపవిముక్తి కలిగించాలని నారదుని వేడుకుంటాడు.
అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపి భక్తి మార్గానికి ‘రామ.. రామ‘ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేస్తాడు. తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు వెలుస్తాయి. అలా కొనేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని రత్నాకరుని చెవిలో రామ.. రామ.. రామ.. అని నారదుడు మూడుసార్లు పలుకుతాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు. ‘‘రత్నాకరా.. నీవు గొప్ప తపశ్శాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణిచాడు. నీవు మళ్లీ జన్మించావు. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావు’’ అని దీవించి నారదుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణ సంకలనం చేస్తాడు.
సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కావడంతో రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. 24 వేల శ్లోకాలతో శ్రీరాముని జీవితాన్ని లోకానికి అందించి వాల్మీకి మహోపకారం చేశారు. శ్రీరామున్ని ధర్మమూర్తిగా, ఆదర్శ మానవునిగా మహర్షి ఇందులో నిలబెట్టిన తీరు సదా స్ఫూర్తిదాయకం. భారతీయ సనాతన ధర్మ సంస్కృతి వారసత్వాన్ని భారతీయుల నరనరాన నింపిన అత్యద్భుత కావ్యం రామాయణం. కుటుంబ జీవన విలువలు, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం, రాజ్యపరిపాలనధర్మం, సోదర అనుబంధం, సకల ప్రాణికోటి పట్ల ఉండాల్సిన సమరసతా భావం, సాధు రక్షణ, దుష్ట శిక్షణ....ఇవన్నీ మనకు రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి అందించి సమాజ శాంతికి, సామాజిక సమరసత కు బాటలు పరిచాడు.
నేటికీ రామాయణంలోని ప్రతి మాట, రాముని ప్రతి బాట అనుసరణీయమే-సందేహం అక్కర్లేదు. రామాయణ కావ్యం విస్తరించినంతగా ప్రపంచంలో మరేదీ విస్తృతి పొందలేదు అనటంలో అతిశయోక్తి లేదు. రామాయణం పై, శ్రీ రామచంద్రుని పై ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎవరెన్ని కొత్త సిద్ధాంతాలు చెప్పినా, ఎవరెన్ని దుర్మార్గపు వ్రాతలు వ్రాసినా...... రామకథ శాశ్వతం, రాముని జీవితాదర్శాలు శాశ్వతం. ఇంత గొప్ప కావ్యాన్ని అందించిన వాల్మీకి మహర్షి సదా వందనీయుడు. (ఆశ్వీయుజ పౌర్ణిమ- వాల్మీకి జయంతి) -సామల కిరణ్.9951172002.
No comments