ఆంధ్రదేశ చరిత్రలోఎఱ్ఱన నిర్వహించిన పాత్ర: ఆంధ్రదేశ చరిత్రలో ఎఱ్ఱన నిర్వహించిన పాత్ర సాటిలేనిది. నన్నయనాటికి దేశము శాంతముగా నున్న...
ఆంధ్రదేశ చరిత్రలోఎఱ్ఱన నిర్వహించిన పాత్ర: ఆంధ్రదేశ చరిత్రలో ఎఱ్ఱన నిర్వహించిన పాత్ర సాటిలేనిది. నన్నయనాటికి దేశము శాంతముగా నున్నదని చెప్పవచ్చును. తిక్కన నాటికి శైవ వైష్ణవ భేదములు చెలరేగినవి. వానిని హరిహరాద్వైత తత్త్వ ప్రతిపాదనతో ప్రసన్నము గావించిన మహనీయుడు తిక్కన. ఎఱ్ఱన నాటి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్న మైనది; భీకరమైనది. క్రీ. శ.1323 ప్రాంతమున డిల్లీ సుల్తానగు ఘియాజుద్దీన్ తుగ్లక్ నాయకత్వమున తురుష్క సేనలు ఆంధ్రదేశము నాక్రమించి ప్రళయమును సృష్టించినవి. దీని నరికట్టుటకు విప్లవ యజ్ఞముచేసిన తెలుగువీరులు ముసునూరి ప్రోలయ నాయకుడు,కాపయ నాయకుడు, వేమారెడ్డి, ఈతని సహోదరుడు మల్లారెడ్డి ప్రభృతులు.
వేమారెడ్డి అద్దంకి రాజధానిగ తెలుగు రాజ్యమును స్థాపించి, దేశమును , ధర్మమునూ కాపాడిన మహనీయుడు. ఈతని ఆస్థానకవియే మన మహాకవి. ఆనాడు జరిగిన విధ్వంసకాండను కండ్లార చూసినవా డెఱ్ఱన. అది ఆతన హృదయంపై చెఱగని ముద్రవేసినది. అప్పటి కాతని వయస్సు ఇరువదియైదేండ్లుండును. ఒకవైపున ప్రభువులు ఖడ్గశక్తితో దేశమును రక్షించుచుండ మఱియొక వైపున గంటము చేతబూని వాఙ్మయ మహాధ్వరము గావించి ధర్మమును ప్రతిష్ఠించుటలో ప్రభువులకు బాసటగా నిలిచినవా డెఱ్ఱన. తొలుత కలిధ్వంసక మగు రామాయణమును రచించెను. పిమ్మట అరణ్యపర్వమును పూరించెను. తరువాత ప్రబంధములు నృసింహ హరివంశములు. అరణ్య పర్వ శేషమునందును, హరివంశమునందును వచ్చు కలియుగ ధర్మములను వర్ణించునప్పుడు అతడు వ్రాసిన కొన్ని పద్యములు ఆనాటి దేశపరిస్థితుల కద్దము పట్టుచూ అతని హృదయావేదనను ఆవిష్కరించుచున్నవి. ఈపద్యమును చూడుడు:
వివిధ వ్యాఘ్ర మృగోరగాకులములైవిస్తీర్ణ శూన్యాటవీ
నివహాభీలములై యరాజకములై నిర్మూలధర్మంబులై
ద్రవిళావీర తురుష్క బర్బర పుళింద వ్యాప్తి దుష్టంబులై
భువిలో నెల్లెడ బాడగున్ జనపదంబుల్ తద్యుగాంతంబునన్.
ఇందలి తురుష్క శబ్దము వ్యాసభారతమున లేదు, ఉండుటకు వీలులేదు. ఎఱ్ఱన దీనిని ప్రయోగించి ఆనాటి భీషణపరిస్థితులను కన్నుల కట్టించుచున్నా డన్నమాట. అప్పటి విలస శాసనమున వర్ణింపబడిన భీకర పరిస్థితులకు ఈ పద్యము ప్రతిబింబమని చెప్పవలెను. ఎఱ్ఱన సామాజిక స్పృహ కల్గిన ఆధ్యాత్మిక జాతీయ మహాకవి. -వడ్డి విజయసారథి.
(డా౹౹ఓగేటి అచ్యుతరామశాస్త్రి సిద్ధాంతగ్రంథము ఎఱ్ఱన అరణ్యపర్వ శేషము నుండి)
No comments