Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

విజయ దివస్ డిసెంబర్ 16, బాంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో భారత్ పాత్ర - Vijay Diwas December 16, 1971 - When India won and Bangladesh got liberated

చరిత్రలో డిసెంబర్ 16 చిరస్మరణీయమైన రోజు. ఇది భారతదేశం మరియు బాంగ్లాదేశ్ లకు చెందిన అమరుల త్యాగాలను స్మరించుకొనే రోజు. బాంగ్లాదేశ...

చరిత్రలో డిసెంబర్ 16 చిరస్మరణీయమైన రోజు. ఇది భారతదేశం మరియు బాంగ్లాదేశ్ లకు చెందిన అమరుల త్యాగాలను స్మరించుకొనే రోజు. బాంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను సంస్మరించుకొనే రోజు. బాంగ్లాదేశ్ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాడిన భారత సైనిక వీరులను స్ఫురణకు తెచ్చుకొనే రోజు. అంతేకాదు, బాంగ్లాదేశ్ మీద జరిగిన క్రూరమైన దాడిని, ఫలితంగా లక్షలాది ప్రజల ప్రాణాలు బలి కావడాన్ని మనకు గుర్తుకు తెచ్చేటటువంటి రోజు కూడా. అదే సమయంలో ఈ విషాదం వెనుక ఉన్న అనాగరిక మనస్తత్వాన్ని ఖండించవలసిన రోజు. అలాగే ప్రస్తుతం 130 కోట్ల మంది భారత ప్రజల చెక్కు చెదరని విశ్వాసాన్ని, మనోబలాలను గుర్తించగల అవకాశం ఇవాళ మనకు లభించింది. అంతేకాకుండా మన సమాజానికి సౌభాగ్యంను  అలాగే బలమైన భవిష్యత్తునివ్వడంపై ఈ రోజు ఎప్పటికీ మన ముందు ఉండాలి. బాంగ్లాదేశ్ కు జరిగిన అన్యాయానికి, జన హననానికి వ్యతిరేకంగా మాత్రమే కాక భారతీయ సంస్కృతిలో అంతర్నిహితమైన మానవ విలువల రక్షణ కోసం కూడా అసమాన సాహసులైన భారతదేశ సైనికులు ఆనాడు పోరాడారు. 

పాకిస్తాన్ సైన్యం 1971 మార్చి 25 రాత్రి నుండి తన క్రూరమైన అణిచివేతను తూర్పు పాకిస్తాన్ లో ప్రారంభించింది. అయితే ఊచకోత తార స్థాయి లో ఉన్న రోజులు 1971 ఏప్రిల్ నెల. ఈ నెలలో పాకిస్తాన్ ఉగ్రమూక విరుచుకుపడింది, బాంగ్లాదేశ్ లో ఒక తరం మొత్తాన్ని తుడిచిపెట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. బాంగ్లాదేశ్ ప్రతిష్ఠతో ముడిపడిన, భావి తరాలకు బాంగ్లాదేశ్ చరిత్రను అవగతం చేయగల ప్రతి వ్యక్తినీ చంపేశారు. ఈ ఊచకోత ఉద్దేశం అమాయక జన హననం ఒక్కటే కాదు. అసలు బాంగ్లాదేశ్ అన్న ఆలోచననే కూకటి వేళ్లతో పెకలించే అమానుష ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మానవత్వాన్ని మంటగలిపిన అరాచకాలు అనేకం. అలాంటి సంఘటనలను ఎవరు మరచిపోలేరు. ఆనాటి ఆ దారుణాలకు సంబంధించిన  జ్ఞాపకాలు ఇప్పటికీ బంగ్లాదేశీయుల్లో నిలిచే ఉన్నాయి.

ఈ యుద్దానికి సంబంధించిన రెండు సంఘటనలు తెలుసుకుందాం. 
మొదటిది:
సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు, మరాఠా యోధుడు శివాజీ ఆధ్వర్యంలో జరిగిన సముద్రాలపై వ్యాపారాలు కావచ్చు. అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న సుదీర్ఘమైన చరిత్రకు ప్రతీకలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్నింటికన్నా గొప్ప వీరోచిత ఘటన ఆపరేషన్ ట్రైడెంట్. డిసెంబరు 3, 1971 సాయంత్రం 5.45గం సమయం, పాకిస్తాన్ యుద్ధ విమానాలు 6 భారతీయ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు బదులుగా భారతీయ వైమానిక దళానికి చెందిన కానబెరా విమానాలు పాకిస్తాన్ స్థావరాలను ముట్టడించాయి, దాదాపు అన్ని సెక్టర్లలో యుద్ధం మొదలయింది. భారత్ కు చెందిన "కిల్లర్ స్క్వాడ్రన్" తమ శక్తి సామర్త్యాలు ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఆసన్నమయినది. డిసెంబర్ 3 రాత్రి 3 Osa-1s బోట్లు INS-nipat, INS-nirgat, INS-veer లు, లెఫ్టినెంట్ కమాండర్లు బి.ఎన్.కవీనా, ఐ.జె.శర్మ, ఓ.పి.మెహతా ల ఆధ్వర్యంలో ముంబై బేస్ నుండీ బయలుదేరాయి.

డిసెంబరు 4న, రెండు పెట్యా క్లాస్ కు చెందిన నౌకలు INS-katchall, INS-kiltonలు కలసి ఆపరేషన్ ట్రైడెంట్ టీం గా ఏర్పడ్డాయి. మొదట పడమటి దిశగా వెళ్లి తర్వాత ఉత్తరం వైపు పయనించి పాకిస్తాన్లోని అత్యంత పటిష్టమైన కరాచీ నౌకా స్థావరాన్ని చేరుకున్నాయి. టీం మొత్తం రష్యన్ భాషలో మాట్లాడుకోటంవల్ల శతృదేశీయులు వీళ్ళను గుర్తుపట్టే అవకాశం బాగా తగ్గిపోయింది. రాత్రి 10గం 43ని, INS-నిర్గట్ లోని రాడార్లు రెండు పెద్ద లక్ష్యాలను గుర్తించాయి అవే పాకిస్తాన్ యుద్ధనౌకలు PNS-ఖైబర్, PNS-షాజహాన్. వీటికి తోడుగా వీనస్ ఛాలెంజర్ అనే వాణిజ్య నౌక పాకిస్తాన్ కు ఆయుధ మందుగుండు సామగ్రి తీసుకొచ్చి అక్కడే ఉంది. ఏమాత్రమూ ఆలస్యం చెయ్యకుండా Osa-1s లు తమ స్టిక్స్ క్షిపణులను ఒకటి వెనుక ఒకటిగా ప్రయోగించి మూకుమ్మడి దాడి చేశారు. ఏమి జరుగుందో అర్థం కాని పాకిస్తాన్ నేవీ అది ఇండియా యుద్దావిమానాల దాడి అనుకోని స్టిక్స్ క్షిపణులను తమ anti aircraft guns తో ఎదుర్కోవటానికి విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. (అదే సమయంలో భారత యుద్దావిమానాలు వేరే సెక్టార్ లో కేమారీ ఆయిల్ డిపో మీద దాడి మొదలెట్టాయి). PNS-ఖైబర్ రెండుముక్కలై సముద్రగర్భనికి చేరింది. అప్పటికే ఇండియన్ స్క్వాడ్రన్ తీరం వెంబడి ఉన్న ఆయిల్ ట్యాంకులను తమ లక్ష్యంగా చేసుకొన్నారు. తమ సామర్త్యానికంటే ఎన్నో రెట్లు దూరం వెళ్లి, యుద్దావిమానాలు దాడి నుండి ఎటువంటి రక్షణ లేకుండా తమవద్ద మిగిలిన క్షిపణులను ప్రయోగించి తమ చిన్నపాటి పడవల్తో మొత్తం కరాచీ హార్బర్ ను అగ్నికి ఆహుతి చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం ట్రైడెంట్ టీం ఆపరేషన్ ముగించుకొని వెనుదిరిగారు. ఇండియా టీం వెనుదిరిగిన ఎంతోసేపటికి పాకిస్తాన్ యుద్దావిమానాలు తమ దేశానికే చెందిన PNS-జులిఫికర్ ను నీట ముంచి శతృదేశ పడవను నీట ముంచినట్టు ప్రకటించుకున్నారు.

డిసెంబర్ 7న ఈ కిల్లర్ స్క్వాడ్రన్ ముంబై బేస్ చేరింది. 90 నిముషాల వ్యవధిలో 6 క్షిపణులు ప్రయోగించి, 3 యుద్ధ నౌకలను నీట ముంచి, ఆయిల్ నిల్వవుంచే అన్ని డిపోలను పూర్తిగా ధ్వంసం చేసి ఏమాత్రం ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా క్షేమంగా తమ స్థావరాన్ని చేరిన ఘనత ఈ ట్రైడెంట్ టీంది. ఆపరేషన్ ట్రైడెంట్ తో సాధించిన ఘనవిజయంతో ఏమాత్రం తృప్తిపడకుండా ఇంకో నాలుగురోజుల తర్వాత అదే పంథాలో ఆపరేషన్ పైథాన్ నిర్వహించి ఇంకో మూడు యుధ్దనౌకలను నీట ముంచి, ఆయిల్ డిపోలను పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్ నేవీ నడుం విరిచారు. ఈ రెండు ఘటనలతో పాకిస్తాన్ భారత్ కు ఎదుర్కొనే శక్తిని పూర్తిగా కోల్పోయింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ దేశాలు భారత నౌకా దళాల శక్తి సామర్త్యాలను ఆశ్చర్యచకితులై గమనించే స్థాయలో ఈ రెండు సంఘటనలు జరిగాయి. ఇవి ఎంతలా ప్రపంచాన్ని ప్రభావితం చేసాయంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కు ఇచ్చే morning-brief లో ఈ విషయాన్నే మొట్టమొదటిదిగా ప్రస్తావించడం జరిగింది. ఎవరూ అంచనా వెయ్యని ప్రణాళిక, సాహసోపేతమైన అమలు, సరితూగని ధైర్యానికి గుర్తింపుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ముగ్గురు కమాండర్లకు వీర్ చక్ర, ఆపరేషన్ కమాండర్ BB యాదవ్ గారికి మహావీర్ చక్ర ప్రధానం చేశారు. ఈ వీరులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తుగా డిసెంబరు 4ను నేవీ-డే గా జరుపుకొంటున్నాము.

రెండవది:
భారత్‌-పాక్‌ మధ్య 1971లో హోరాహోరీగా బసంతర్ యుద్ధం జరుగుతోంది. బసంతార్‌ నదీ తీరంలో పాక్‌ బలగాలు యుద్ధట్యాంకులతో భారత సైన్యంపై విరుచుకుపడుతున్నాయి. పాక్‌ బలగాలు ఎక్కువగా ఉండడంతో పుణె హర్స్‌ రెజిమెంట్‌కు చెందిన సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ ఖేతర్పాల్, మరో కమాండర్‌తో కలిసి రెండు యుద్ధట్యాంకులతో శత్రువులపైకి దూసుకెళ్లారు. కొద్దిసేపటికి ఖేత్రపాల్‌ యుద్ధ ట్యాంకు పాక్షికంగా, మరో యుద్ధట్యాంకు పూర్తిగా ధ్వంసమైంది.అరుణ్ ఖేతర్పాల్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ట్యాంకును వదిలేసి వెనక్కి రావాలని ఖేతర్పాల్ కు  రేడియోలో ఉన్నతాధికారులు సూచించారు. కానీ అతను వినలేదు. ‘యుద్ధట్యాంకును వదిలి నేను రాను సార్‌. మెయిన్‌ గన్‌ పనిచేస్తున్నది. శత్రువుల ఆటకట్టిస్తా’ అంటూనే పాక్‌ బలగాలపైకి విరుచుకుపడ్డారు.

His last words:
 "No, Sir, I will not abandon my tank. My main gun is still working and I will get these bastards."

పాక్‌ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశారు. చివరి ట్యాంకు 100 మీటర్ల దూరంలో ఉందనగా రేడియోలో సమాచారం అందిస్తూనే 16 డిసెంబర్ 1971న అమరుడయ్యాడు. ఖేతర్పాల్ తెగువ వల్ల పాక్‌ బలగాలపై భారత్‌ పైచేయి సాధించింది.

ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది భారత ప్రదాని ఇందిరా గాంధీ. ఆమె ఎప్పుడైతే డిసెంబర్ 3, 1971 న పాకిస్తాన్ వంచనతో వాయువ్య భారత వైమానిక స్థావరాలపై దాడి చేశాయో అప్పుడు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్చని ఇచ్చింది, మూడవ భారత్- పాకిస్తాన్ యుద్దం మొదలైంది. పాకిస్తాన్ అవమానకరమైన ఓటమితో ముగిసిన ఈ యుద్ధం, విముక్తి పోరాటం తరువాత బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించడానికి,  సార్వభౌమరాజ్యంగా ఆవిర్భవించడానికి దారితీసింది.

అయితే డిసెంబరు 16 వరకు సాగించిన మారణహోమం, సామూహిక అత్యాచారాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్ (బాంగ్లాదేశ్) లో గణాంకాల ప్రకారం 30 లక్షల మంది ప్రజలు వధించబడ్డారు, 5లక్షల మంది మహిళలను అత్యాచారం చేశారు, ఒక కోటిమందికి పైగా శరణార్థులుగా భారతదేశానికి వచ్చేశారు, 3 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇటువంటి భయంకరమైన  గాయాలను ఏ దేశమూ మర్చిపోలేదు. అంతిమంగా హింసకు పరాజయం తప్పలేదు. కోట్లాది బాంగ్లాదేశ్ ప్రజల మనోబలం, మానవ విలువలు మాత్రమే విజయం సాధించాయి. పాకిస్థాన్ పై యుద్ధం ముగిసిన తరవాత పాకిస్తాన్ సైన్యం లొంగిపోవటం మరియు తూర్పు పాకిస్తాన్ విడిపోయి కొత్తగా బంగ్లాదేశ్ ఏర్పడింది.

1971 భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన తరువాత 16 డిసెంబర్ 1971న పాకిస్తాన్ దళాధిపతి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజి నేతృత్వంలో 93000 దళాలు, భారత సైన్యం మరియు జనరల్ జగ్జిత్ సింఘ్ అరోరా నేతృత్వంలోని ముక్తి బహిని లకు ఢాకా లో బేషరతుగా లొంగిపోయారు. ఇందిరా గాంధీ తరువాత ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా లొంగిపోయిన ఖైదీలను మానవతా దృక్పథంతో వదిలేసింది. ఆరోజుల్లోనే మనాళ్ళు ఇరగదీశారు, నేడు మన సైనిక శక్తి ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి గా ఎదుగుతున్నది. రాఫెల్ లాంటి యుద్ద విమానాలు, ఎన్నో అధునాతన ఆయుధ సంపత్తి కలిగివుంది మన ప్రస్తుత భారతదేశం. భారత్ మాతా కీ జై. జై హిందు రాష్ట్ర. రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments