స్వచ్ఛతకోసం తపించిన సంత్ గాడ్గే బాబా: పరిశుభ్రత దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త, చీపురుతో వీధుల్ని- కీర్తనలతో మస్తిష్కాలను శుభ్...
స్వచ్ఛతకోసం తపించిన సంత్ గాడ్గే బాబా: పరిశుభ్రత దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త, చీపురుతో వీధుల్ని- కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు, బడిలో ఆధ్యాత్మికతను వెతికిన వాడు, నిమ్న వర్గాలకు అంబేద్కరే దేవుడు అన్న దార్శనికుడు, సామాజిక న్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు, మెహర్ బాబాకి ఆత్మీయుడు, సమస్త ఛాందసాలను హేతువుతో ఖండించిన సాధువు ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణ వాది, యావత్ జీవితాన్ని సమాజానికి అర్పించిన సర్వసంగ పరిత్యాగి సంత్ గాడ్గే బాబా.
సంత్ గాడ్గే బాబా అసలు పేరు దేబు. ఇతను జింగ్రా, సక్కుబాయిలకు 1870 ఫిబ్రవరి 23వ తేదీన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో షేన్ గావ్ అనే చిన్న పల్లెటూరులో ఒక రజక కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి మేనమామ ఇంట్లో పెరిగాడు. ముక్కుపచ్చలారని వయసునుంచే పగలంతా చాకిరీ చేసే వాడు. రాత్రి అయితే చాలు ఊర్లోనో, పొరుగూరులోనో పాటకచేరికి వెళ్లిపోయేవాడు. పనీపాట ఆయన జీవితంలో భాగం. శ్రమించని రోజు కానీ, భజన చేయని రోజు కానీ ఆయన జీవితంలో లేనేలేదు. చిన్నతనంలో తన పాటలకు జనం ముగ్దులు అవుతున్నారని గమనించిన గాడ్గే బాబా పెద్దయ్యాక సమాజ హితం కోసం దాన్నే అస్త్రంగా వాడుకున్నాడు. వివాహమైన తర్వాత దేబుకు ఆడపిల్ల పుట్టింది. అలోక అని పేరు పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ కుల సంప్రదాయాల ప్రకారం బారసాల ఘనంగా జరపాలి. మేకలు బలి ఇవ్వాలి కల్లు, సారా ఏరులై పారాలి అప్పుడే దేవతలు దీవిస్తారు. కానీ వీటికి ఒప్పుకోక ఆచారం పేరుతో మేకను నరికినా చుక్క సారా తాగినా ఒప్పుకోను నేను అని ఇంట్లో వాళ్లకు చెప్పేసాడు. ఆచారాలు అనేవి కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు అదే చెడ్డగా మారొచ్చు, మనం కాలాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్లాలి అని బారసాలకి వచ్చిన ఊరిలో వాళ్ళకి బంధువులకి మేక మాంసం బదులు మిఠాయి పెట్టాడు. దాంతో బంధువుల్లో చాలా మందికి కోపం వచ్చింది. వాళ్లకు తెలిసి ఒక చాకలి కుటుంబంలో నెత్తురు చూపించకుండా జరుగుతున్న తొలి శుభకార్యం ఇది. అప్పటికే కొంతమంది వాదనకు దిగారు. దీంతో దేబుజి కూతురు పుట్టిందని సంతోషించే సమయంలో మరొక జీవిప్రాణం తియ్యాలా, అలాగే సారా తాగి బాగుపడిన వాళ్ళు ఉన్నారా బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ తాగినట్టు మీరు ఎక్కడైనా చూశారా అని వాళ్లకు తన వాదన అర్థమయ్యేలా ప్రశ్నించాడు. దీంతో బంధువుల్లో కొందరు రాజీపడ్డారు. తర్వాత కొద్ది సంవత్సరాలకు అనగా 1905 ఫిబ్రవరి 5వ తేదీన ఒక సాధువు ప్రభావంతో దేబు తల్లినీ, భార్యాపిల్లలను వదిలి సత్యాన్వేషణకు ఇంటి నుంచి బయటపడ్డాడు.
సుమారు 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు కావడానికి ముందు సిద్ధార్థుడు కూడా ఇంటి నుంచి ఇలాగే నిష్క్రమించాడు. అప్పుడు సిద్ధార్థుడు వయస్సు కూడ 29 సంవత్సరాలే. ఆయన రాజు అయితే దేబు రైతు. ఇద్దరిలో ఉన్న పోలిక ఏమిటంటే అప్పటికి స్థిరపడి ఉన్న బాటలో నడవలేదు స్థిరపడి ఉన్న నమ్మకాలతో సర్దుకోలేదు, ఎంత కష్టమైనా సరే తమ సొంత మార్గాల్లోనే సత్యాన్వేషణకు పూనుకున్నారు. ఇలా ఇంటి నుంచి బయటపడ్డాక మట్టి మూకుడే దేబు తలకి మకుటం. మూకుడు, చీపురు ఈ రెండు ఆయన ప్రతీకలు. దర్జీల దగ్గర రంగురంగుల పీలికలను ఏరుకొని వాటితో దుస్తులను కుట్టుకునే వాడు. మూకుడునే నెత్తి మీద టోపీ లాగా బోర్లించుకునేవాడు. బిక్ష అవసరమైనప్పుడు అడుక్కొని తిన్నాక శుభ్రంగా కడిగి దాన్నే నెత్తి మీద పెట్టుకునేవాడు. మరాఠీలో మట్టిచిప్పను గాడ్గే అంటారు దీంతో ఆయనకి గాడ్గే బాబా అని పేరు వచ్చింది. సత్యాన్వేషణలో ఉన్నవాడు ముందుగా అహంను రద్దు చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గాడ్గే బాబా ఎవరైనా మీదే కులం అని అడుగుతే అంటరానివాడని చెప్పేవాడు. దానితో అవమానాలు చీత్కారాలు ఎదురయ్యాయి. ఆ రకంగా సమాజంలో ఓ ప్రధాన సమూహం వందల సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధల్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు.
ఊళ్ళో వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్లు పెట్టే జొన్న రొట్టెలు మాత్రమే తీసుకునేవాడు. కూలీ డబ్బులు ఇవ్వబోతే తీసుకునేవాడు కాదు. తన సంచారంలో గమనించింది ఏమిటంటే అన్ని ఊళ్లలోనూ చెత్తాచెదారం గుడి దగ్గర పారబోసి ఉండటం. ఇలా లాభం లేదని ఏ ఊరు వెళితే ఆ వూరి వాళ్లను చీపురు అడిగి చెత్తను ఊరు చేయడం మొదలుపెట్టాడు ఇదంతా చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. పిచ్చి వాడేమో అనుకునేవాళ్ళు. కొందరేమో ఉచితంగా రొట్టె లు అడగలేక ఈ పని చేస్తున్నాడు ఏమోనని భావించేవాళ్ళు. వారు ఏమనుకున్నా సరే ఊరంతా ఊడ్చిన తర్వాతగాని శాంతించే వాడు కాదు ఇక సాయంత్రం మళ్లీ అదే గుడి దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. రెండు రాళ్ళను తీసుకుని తాళం వేస్తూ తన అద్భుతమైన కంఠంతో కీర్తనలు పాడేవాడు.
గాడ్గే బాబా ఎప్పుడూ కాలినడకనే ఇష్టపడేవాడు. దారిపొడవునా ప్రకృతిని జన జీవితాన్ని గమనించేవాడు. కొందరు డబ్బులో మునిగేలా మరికొందరు పేదరికంలో మగ్గేలా ఎవరు చేశారు? భిన్న కులాలను పుట్టించింది ఎవరు? బ్రాహ్మణుల, మరాఠాల, అంటరానివారి మధ్య గోడలను కట్టింది ఎవరు? పోనీ సంపదలో తూగుతున్న వారెవరైనా సంతోషంగా ఉన్నారా? ఇంతకీ ఆ సంతోషం అంటే ఏమిటి?అది ఎక్కడుంది? ఇంత సంపద ఉన్న సంతృప్తి ఎందుకు ఉండదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆయన్ను తొలుస్తూ ఉండేవి. విద్యారంగానికి బాబా చేసిన సేవలకు గుర్తింపుగా 1983లో ఏర్పాటు చేసిన అమరావతి విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక 1998లో కేంద్రం బాబా పేరిట తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన స్మారకార్ధం జాతీయ అవార్డును ప్రకటించింది. పారిశుద్ధ్య రంగంలో ఆదర్శప్రాయంగా నిలిచిన గ్రామాలకు, వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడం మొదలు పెట్టింది. స్వచ్ఛత అంటే కేవలం వీధులను శుభ్రం చేయడమే కాకుండా ప్రజల మనసులను కూడా శుభ్రం చేయడమని నిరూపించిన గాడ్గె బాబా 1956 డిసెంబర్ 20న మరణించారు. వీరి జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనది. స్వచ్ఛత వైపు నడిచేలా సమాజానికి ప్రేరణ అందించిన ఆ మహనీయుని వర్ధంతి స్మృతిలో... అందరం మన మనస్సులని మలినం లేకుండా చేసుకుందాం. సామాజిక సమరసతను పెంపొందిద్దాం. విద్వేషాలు లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం. (డిసెంబర్ 20 సంత్ గాడ్గే బాబా వర్ధంతి)
-సామల కిరణ్, అధ్యాపకులు-రచయిత
కరీంనగర్,9951172002.
No comments