గ్రామీణ భారతం, బ్రతుకు జీవుల భారతం! వెతల భారతం, ఓటు బ్యాంకు భారతం!! మన భారతీయ గ్రామీణ జీవనాన్ని మూడు భాగాలుగా విభజించి చూడవచ్చు...
గ్రామీణ భారతం, బ్రతుకు జీవుల భారతం! వెతల భారతం, ఓటు బ్యాంకు భారతం!! మన భారతీయ గ్రామీణ జీవనాన్ని మూడు భాగాలుగా విభజించి చూడవచ్చు.
1) స్వాతంత్య్రం రాకముందు/బ్రిటిష్ పాలనకు ముందు: "సాగు లేదా వ్యవసాయం" ఈ భూమిపై మొట్టమొదటి మానవజాతి వృత్తి అని చెప్పవచ్చును. "వ్యవసాయదారుడు", లేదా "సాగు దారుడు" అని పిలవబడే ఈ వృత్తి దారులను కాలక్రమంలో "రైతు" అని పిలవడం మొదలు పెట్టారు. రైతు అంటే స్వయం సమృద్ధి, సంపద కలిగిన రాజు లాంటి వాడు. చరిత్ర పుటలు, మన పెద్దల ద్వారా తెలిసినది ఏమంటే, స్వాతంత్రానికి పూర్వం, రైతు తనకు కావలసిన ఆహార పదార్థాలను, వస్త్రాలను(ప్రత్తి పండించి తద్వారా నూలు వస్త్రాలు) స్వయంగా తన సాగు ద్వారాను, సాగు చేయలేని వాటిని "వస్తు మార్పిడి" పద్దతిలోను సమకూర్చుకునే వాడు. కనుకే, రైతు అంటే ఆరోజుల్లో ఆరోగ్యంగా ఉండేవాడు. ఆలోచన కలిగి ఉండే వాడు.
2) స్వాతంత్ర్యం వచ్చిన తరువాత:
హరిత విప్లవం రాకముందు: 1947 నాటికి గ్రామీణ భారతంలో 80 శాతం ప్రజలు వ్యవసాయంలోనూ, మిగిలిన వారు చేతివృత్తులు, చిన్నతరహా వ్యాపారాలలో ఆధారపడి ఉండే వారు. గ్రామీణ మహిళలు మాత్రం నూటికి నూరు శాతం, వ్యవసాయం దాని అనుబంధ పనులు అయిన పశుపెంపకం, కూరకాయ ఉత్పత్తి వంటి వాటి మీద ఆధార పడి ఉండే వారు.
మొదటి పంచవర్ష ప్రణాళికా (కాలం 1951-56) నాటికి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునే పరిస్థితే దేశంలో నెలకొని ఉండటం తో, ఆ ప్రణాళికలో ఎక్కువ భాగం నీటి ప్రాజెక్ట్ లకు, గ్రామీణ భారతం కు కేటాయింపులు జరగటం మనం తెలుసుకున్నాం.
రెండవ ప్రణాళికా కాలంలో పారిశ్రామిక అభివృద్ధి లో భాగంగా కర్మాగారాలు (భిలాయ్, రూర్కెల ఉక్కు పరిశ్రమ లు) రావడం, దరిమిలా గ్రామీణ ప్రాంతం వారు అటువైపు పయనం మొదలుపెట్టిన స్థితి.
హరిత విప్లవం తరువాత: అప్పటికీ గ్రామీణ భారతంలో 35 శాతం మంది భూమి దారులుగానూ, 45 శాతం మంది వ్యవసాయ కూలీలు గానూ, మిగిలిన వారు "నైపుణ్యం కలిగిన చేతి వృత్తులవారు" గానూ ఉండే పరిస్తితి. "మూడవ పంచవర్ష ప్రణాళిక" ప్రకారం వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలని, పెరుగుతున్న పట్టణ ప్రాంతం వారికి సరిపడే ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. ట్రాక్టర్ లు, పురుగు మందు పిచికారీ వస్తువులు, ధాన్యం గిడ్డంగులు, "బియ్యపు మరలు" లాంటివి వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడే "మెటల్ రోడ్లు" వేసే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ( 1972 లో మొట్టమొదటి ట్రాక్టర్ మా ఊరు లో మా పెదతండ్రి గారి ఇంట ప్రవేశించడం జ్ఞాపకం!) హెలికాప్టర్ మీద నుంచీ కృష్ణా జిల్లాలోని నూజివీడు మరియూ దివితాలుకా అవనిగడ్డ ప్రాంతపు "మామిడి తోటలకు" పూత పిందె దశలో దోమ నివారణ మందులు ప్రభుత్వం వారిచే పిచికారీ జరిగేటివి.
సరిగ్గా అప్పుడే "ఇండియా" మీద 'విదేశీ కంపెనీ' ల దృష్టి పడింది. ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇబ్బడి ముబ్బడిగా దేశంలోకి వచ్చి పడ్డాయి! "గ్రామీణ భారతానికి అదే కష్టకాల అంకురార్పణ అనీ చెప్ప వచ్చు" వామపక్ష / జాతీయ వాదులు ఎప్పటికప్పుడు దానిని గమనించి ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉండేవారు. "విదేశీ కంపెనీలు" సగం సగంగా చీలిపోయి అధికార పక్షం వైపు కొందరు వామపక్షవాదుల వైపు మరికొందరు ఉండేవారు. దరిమిలా "గ్రామీణ భారతం" అరుగుల మీది జనాల మధ్య చర్చలలో 'అమెరికా, రష్యా' దేశాల పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉండేవి. కృష్ణా, గోదావరి డెల్టా మెట్ట భూములలో వాణిజ్య పంటలైన పసుపు, కంద, మిర్చి, పొగాకు సాగు పెరిగింది. రైతు కూలీలకు పని బాగా కల్పించ బడేది. వాణిజ్య పంటల తో ఆదాయం కూడా బాగా ఉండేది.
3) ప్రపంచీకరణ నేపథ్యం, ప్రస్థుతస్థితి: "గ్లోబలైజేషన్" ... ఇన్ని సం.లకి, ఈ మాట వినగానే వ్యవసాయం మీద పట్టు ఉన్న వారికి, వ్యవసాయం అంటే ప్రేమ ఉన్న భారతీయులకు ఏవగింపు కలుగుతోంది. ఇండియా లోని పట్టణాలలో పారిశ్రామికీకరణ, నగరీకరణ లకు కావలసిన కార్మికులు, కూలీల కొరత ఒకవైపు. సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యత ఉద్యోగాల రిక్రూట్మెంట్ లు మరొక వైపు. వెరసి గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువగా పట్టణాల్లో కి వలస పోయిన తరుణం ఇది.
ఎక్కువ మొత్తంలో పట్టణాలకు వలస పోవడానికి, చదువుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం... "సాగుబాట"లో లాభాలు తగ్గి ఆపై నష్టాలే ఎక్కువ చవి చూడటం!! "గ్రామీణ వ్యవసాయ భారతం" నష్టాలు లేకుంటే... పట్టణాల వైపు చూడకుంటే... ఇంటిలో తిని ఇంటి బయట పారేసే 'పట్టణ వాసుల' చెత్తను ఎత్తే వారు కూడా కరువే అయ్యే పరిస్థితిని "భారత రాజకీయ గణం, అధికార గణం" గమనించే ఉంటుంది అనేది "చదువుకున్న గ్రామీణుల" ఇప్పటి అభిప్రాయం. అందుకే వ్యవసాయానికి గిట్టుబాటు అందని ద్రాక్షగా మిగిలింది అనేది కూడా ఒక వాదన!!
ప్రపంచీకరణలో భాగంగా రసాయనాలు పురుగుమందులు వాడటం అలవాటు పడిన రైతులు ఆదాయం కోసం అధిక ఉత్పత్తి వంగడాల వైపు, బీటీ విత్తనాల వైపు మొగ్గు చూపటం. రైతు తన విత్తనాలు తాను మదుపు చేసుకునే స్థితి పోయింది. ప్రతి ఇంటిలోనూ కొందరు చదువుల వైపు, కొందరు పరిశ్రమల్లో పనిచేసే అవకాశం తో పట్టణాలవైపు పోవటం. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ తగ్గిపోవటం. ఎరువులు కొనడం, విత్తనాలు కొనడం. పశు దాణా కొనడం ఆఖరుకు "భారతీయ రైతు" తాను తినే ప్రధాన ఆహారం అయిన "బియ్యం, గోధుమ పిండి" లాంటివి కూడా దుకాణాల నుంచీ కొనడం ప్రారంభం అయింది. పూర్తిగా గిట్టుబాటు అనేది మాయమయింది.
రైతు రాజు... రైతే రాజు అంటూ మభ్యపెట్టే రాజకీయం మొదలయ్యింది. అది గ్రహించిన రైతు కళ్ళు తెరిస్తే జరిగే ప్రమాదాన్ని ఊహించిన "రాజకీయ రంగం" .... రైతులను విడ దీసి, సన్నకారు, చిన్నకారు లుగా మార్చింది. సహకార వ్యవసాయం అంటూ ప్రణాళికలు రచించింది, కానీ ముందుకు పోలేక ఆగింది. సబ్సిడీ ల బాగోతం మొదలు పెట్టి, కులాల వారిగా సబ్సిడీ లెవెల్స్ తెచ్చింది. రైతు తనమీద ఆధార పడే ప్రణాళికలు రచించింది. పడతాయో లేదో తెలియని వర్షాలను ఆధారం చేసుకుని "వేలాది లక్షలాది కోట్ల ప్రాజెక్టుల" మాటున "కమిషన్ ల బాగోతం" నడిపింది! (బహుళార్థ సాధక ప్రాజెక్టు లైన బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి వాటి పూడిక తీత మరిచారు) గిట్టుబాటు కాకున్నా వ్యవసాయాన్ని నమ్ముకొని, పట్టణాల వైపు పోలేని, కంప్యూటర్ నైపుణ్యత లేని గ్రామ వాసులను మభ్యపెడుతూ "పనికి ఆహార పథకం" లాంటివి తెరమీదకు తీసుకు వచ్చింది! మొత్తానికి "వ్యవసాయ రంగాన్ని" అతలాకుతలం చేసింది మన "భారత రాజకీయ భూతం"!!
పరిష్కారాలు:
"భారతీయ సనాతనం" అంటే కట్టూ, బొట్టూ, వేషధారణ మాత్రమే కాదు. మనం పండించే పంటలలోనూ సనాతన పద్దతులు ఉండాలి. వాటికి తోడ్పాటు అందించే "రాష్ట్రవారీ/దేశవారీ బడ్జెట్" లు ఉండాలి. ఇప్పుడు పట్టణాలలో నివసించే వారు, వారి వారి గ్రామీణ మూలాలు గుర్తెరగాలి. పల్లెలు ఊసురోమంటే, అది పట్టణాలు... నగరాలకు శ్రేయస్కరం కాదనీ గమనించాలి.
"సనాతన గ్రామీణ వాతావరణ, వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ" జరగాలి. ప్రకృతిలో తిరుగుతూ ఉండే పశువులు ఇచ్చిన పాలు ఆరోగ్యం, పల్లెలలో కోళ్లు పెట్టే గుడ్లు శ్రేయస్కరం. అలాంటి వాతావరణం కల్పించే "విధాన నిర్ణేతలను" ఎన్నుకోవాలి మన అందరం. అప్పుడే ఉపాధి కల్పనా సమస్యలు కూడా తీరుతాయి.
అధిక జనాభా కొనుగోలు శక్తి మీద దృష్టి పెట్టిన విదేశీ కంపెనీలకు ధీటుగా, మనం మన దేశీయ ఉత్పత్తుల వాడకం పై దృష్టి పెట్టాలి. "ప్రజామోద అభిప్రాయాల్ని సమీకరించే సమర్థత" ఆనాటి పాలకులది. కానీ ఇప్పుడు ప్రజలే సరైన అభిప్రాయంతో నాయకులను సమీకరించి నడిపించాల్సిన సమయం వచ్చింది! పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య ఏకరూప అభిప్రాయం ఎంతైనా అవసరం. ఆదాయాలు పెరిగిన పట్టణ వాసుల కోర్కెలు మితం కావాలి.
పల్లెల జీవన విధానం మెరుగు పడాలంటే, ఉచిత తాయిలాలు, వ్యసనాలకు పల్లెలు దూరంగా ఉండే వాతావరణం కల్పించాలి. రిటైర్ అయిన విద్యావంతులు గ్రామీణులకు చేదోడుగా ఉండాలి. అవసరం అయితే గ్రామాలకు వలస వెళ్లి నివసించాలి. తద్వారా కల్చరల్ (వర్కింగ్ & బిహేవియర్) ఎక్సేంజ్ జరుగుతుంది.
అప్పుడే పల్లెలలో "పాలపాకెట్లు" కొనే అవసరం పోతుంది. రూరల్ పెట్రోల్ బంక్ లలో పెట్రోలియం ఉత్పత్తుల క్వాలిటీ మెరుగు పడుతుంది. అప్పుడే మరింత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను గ్రామీణ వాసులు దేశానికి అందించ గలుగుతారు!! మనం ఆత్మనిర్భర్ భారత్ గురించి రోజూ వింటున్నాము రైతు తన విత్తనం తను మరలా నాణ్యతగా తయారు చేసుకున్న రోజు ఆత్మనిర్భర్ వ్యవసాయం లో సాధించినట్లు. జై కిసాన్. -గణేష్ బాబు కుడితిపూడి, బేతపూడి గ్రామం, రేపల్లె.
This comment has been removed by the author.
ReplyDelete