Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అండమాన్‌ జైలులో 12 ఏళ్లపాటు కఠినకారాగార శిక్షను, ఎన్నో చిత్రహింసలను భరించిన బరీంద్ర కుమార్ ఘోష్ - About Barindra Kumar Ghosh in Telugu

అండమాన్ జైలులో చిత్రహింసలు భరించిన వారు‌‌ అంటే సహజంగా అందరికీ సావర్కర్ పేరు ఎక్కువగా గుర్తొస్తుంది అలాంటి మరో స్వాతంత్ర్య సమరయోధ...

అండమాన్ జైలులో చిత్రహింసలు భరించిన వారు‌‌ అంటే సహజంగా అందరికీ సావర్కర్ పేరు ఎక్కువగా గుర్తొస్తుంది అలాంటి మరో స్వాతంత్ర్య సమరయోధుడు ‘శ్రీ బరీంద్ర కుమార్ ఘోష్ స్వయాన అరవింద్ ఘోష్ తమ్ముడు’. అండమాన్ సెల్యులార్‌ జైలులో కఠినమైన క్రూరమైన శిక్షను అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు. అండమాన్‌ జైలులో 12 ఏళ్లపాటు కఠినకారాగార శిక్షను, ఎన్నో చిత్రహింసలను భరించిన గొప్ప విప్లవ మార్గ దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బరీంద్ర కుమార్ ఘోష్.

బరీంద్ర కుమార్ ఘోష్1880 జనవరి 5న ఇంగ్లండ్‌లోని క్రోయడోలో జన్మించారు. డాక్టర్ కృష్ణధన్ ఘోష్, శ్రీమతి స్వర్ణలత వీరి తల్లిదండ్రులు. ఇంట్లోవారు వీరిని ముద్దుగా బరీన్ అని పిలుచుకునేవారు. దేవ్‌ఘర్‌లో పాఠశాల విద్యను, ఆ తర్వాత పాట్నా కాలేజీలో ఉన్నతవిద్యను అభ్యసించిన బరీంద్ర, తన అన్నయ్య అరబిందో స్వాతంత్ర్య కార్యక్రమాలు, రచనలతో ప్రభావితమయ్యారు.  కొంతకాలానికే బరీంద్ర స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములయ్యారు. బరీంద్ర వారి మిత్రులతో కలిసి యువ విప్లవ కారులైన దేశభక్తుల సాయంతో, విప్లవ కార్యక్రమాలను నిర్వహించేవారు. ఈ ప్రయత్నంలోనే వారు ‘యుగంతర్’ పేరుతో ఓ బెంగాలీ పత్రిక ప్రారంభించారు. ఈ పత్రిక బ్రిటిష్‌ వారి ఆగడాలను ఎదుర్కొనాలని చెప్పడంతోపాటు, దిశానిర్దేశం కూడా చేసేది. మురారిపుకార్, మంచిక్‌టొల్ల లోని తమ ఇళ్లలో యువ దేశభక్తులకు విప్లవ కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేవారు. ఆ ఇళ్లను ‘విప్లవ యోగుల ఆశ్రమం’గా మార్చేశారు.

ఈ ఆశ్రమంలో యువ విప్లవ మార్గ దేశభక్తులకు శారీరక దారుఢ్యం, మిలటరీ వ్యూహాలపై శిక్షణ, ఆయుధాల వినియోగంతోపాటు ధ్యానం కూడా నేర్పించేవారు. భగవద్గీత, ఉపనిషత్తులను బోధించేవారు. బ్రిటిష్ అధికారి డగ్లస్ కింగ్స్‌ ఫోర్డ్ ను హతమార్చేందుకు ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి చేసిన  ప్రయత్నం విఫలం కావడంతో, కోల్‌కతాలోని వివిధ అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఇందులో భాగంగా అరబిందో ఘోష్, బరీంద్ర ఘోష్‌లతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బరీంద్ర, ఆయన సహచరుడు ఉల్లాస్‌ కర్‌ లకు మరణశిక్ష విధించారు. అయితే హైకోర్టులో అప్పీలు చేసుకోవడంతో మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పుచేశారు. బరీంద్రతోపాటు ఇతర విప్లవకారులను అత్యంత క్రూరమైన శిక్షలు విధించే అండమాన్‌ జైలు (కాలాపానీ జైలు) కు పంపించారు.

ఈ జైలులో శిక్ష పడిందంటే అది ఖైదీలకు అత్యంత దారుణమైన పీడకల లాంటిదే. వెలుతురు సరిగాలేని ఇరుకు గదుల్లో బందీలుగా ఉండడం, గానుగలు తిప్పడం, తాళ్లను తయారుచేయడం, కొబ్బరినార తీయడం (Pounding)  వంటి కఠినమైన శరీర సత్తువ మొత్తాన్ని హరించే పనులను అప్పజెప్పేవారు. నాటి బరీంద్ర డైరీలోని ‘ఖైదీలకు అడవిలో కట్టెలు కొట్టడం, ఇటుకలు తయారుచేయడం, సున్నపుబట్టీల్లో పని చేయడం, రబ్బరు సేకరణ వంటి పనులను కనీస విరామం కూడా ఇవ్వకుండా చేయించేవారు. దీంతో కొందరు పారిపోయేందుకు ప్రయత్నించగా, చాలా మంది ఇక జీవితంలో ఇళ్లకు వెళ్లలేమని తెలిసి ఆత్మహత్య చేసుకున్నారు’ అన్న మాటలు అక్కడి పరిస్థితులను కళ్ళకు కడతాయి.

అండమాన్ జైలులోని దారుణాలను వివరిస్తూ ‘24 గంటలపాటు ఎవరితో మాట్లాడకపోవడం, అధికారులు అమానవీయంగా వ్యవహరించడం ఆపై శారీరక చిత్రహింసలను సామాన్య మానవులే భరించలేరు. అలాంటిది ఖైదీల మానసిక స్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత కాలం శిక్షను అనుభవిచడం కంటే ఆత్మహత్యే శరణ్యమనుకుని అలా చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. గుండెను రాయిని చేసుకుని, భవిష్యత్తుపై ఆశను పెట్టుకుని ఈ క్రూరత్వాన్ని మౌనంగా సహించినవారే అక్కడ మిగిలారు’ అని ఆయన పేర్కొన్నారు.

‘దారుణం అనే పదానికి అర్థమేంటి? దీన్ని శిక్ష అని పిలవాలా? లేక ప్రతీకార అణచివేతగా భావించాలా?’ అంటూ బరీంద్ర ప్రశ్నించారు. సెల్యులార్ జైలులోని  ఖైదీల పట్ల అమానవీయ ప్రవర్తన ఉండేది. కనీస ఆహారం ఉండేది కాదు. అక్కడి పరిస్థితులను బరీంద్ర వివరిస్తూ. ‘ప్రారంభంలో ఆహారం సరిగ్గా లేకపోవడం పెద్ద ఇబ్బందిగా ఉండేది కాదు. కానీ రోజూ అదే అన్నం, పప్పు, కాచు చెట్ల ఆకులతో కూర కారణంగా కొన్నిరోజులకు భోజనం అంటేనే విరక్తి వచ్చేది. మాతృభూమికి దూరంగా ఉంటూ, కేవలం అండమాన్‌లో గాలి పీల్చుకుంటూ బతికేవాళ్లం. రోజు రోజుకూ అక్కడి భోజనం పట్ల విరక్తి పెరుగుతూ పోయింది. హింస కూడా పెరుగుతూనే ఉంది. భోజనం అనేది క్రూరమైన, బతికేందుకు అవసరమైనదిగా మారిపోయింది. ఆ అవసరమే మాతో భోజనం చేయించేది’ అని పేర్కొన్నారు. దారుణమైన, నివాసయోగ్యంగాని విషతుల్య పరిస్థితులతో అనారోగ్యం పాలయ్యేవారికి అక్కడ కనీస వైద్యసౌకర్యం కూడా ఉండేది కాదు. ఓ సందర్భంలో బరీంద్ర దీని గురించి వివరిస్తూ ‘కనీస వైద్య సదుపాయాలు కూడా ఉండేవి కావు. ఖైదీలను ఆసుపత్రికి పంపేందుకు కూడా నిరాకరించేవారు. దీనికితోడు పని తీవ్రత కొనసాగేది. ఒకవేళ పంపినా వారికి సరైన వైద్యం, కనీస భోజనం ఉండేది కాదు’ అని తెలిపారు.

అండమాన్ ఖైదీగా తన అనుభవాలను వివరిస్తూ, ‘ఎంతటి దారుణమైన జీవితమిది. పగలు, రాత్రి నవ్వుతూనే ఉండాలి. అది ఏమీ చేయలేని నిస్సహాయతలో వచ్చే వెకిలి నవ్వయినా సరే లేదా యజమానికి గౌరవం తెలిపేదైనా సరే’ అని పేర్కొన్నారు. భయంకరమైన జీవితం ఖైదీలను శారీరకంగా, మానసికంగా కుంగదీసేది. అయినా ఈ పరిస్థితులనుంచి బయపడేందుకు క్రూరత్వాన్ని తట్టుకుంటూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరి. 

మేము ఎన్నో బాధలను భరించే వాళ్ళం. కానీ మిత్రుల తోడు లేకుండా ఒంటరిగా గడపడం మరింత బాధించేది – బరీంద్ర కుమార్ ఘోష్ అన్నారు. 1920 సమయంలో బరీంద్ర విడుదలయ్యాడు మరియు జర్నలిజం వృత్తిని ప్రారంభించడానికి కోల్‌కతాకు తిరిగి వచ్చాడు.  వెంటనే జర్నలిజం వదిలి కోల్‌కతాలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. బరీంద్ర తన జ్ఞాపకాలను "నా ప్రవాసం యొక్క కథ - అండమాన్లలో పన్నెండు సంవత్సరాలు" ప్రచురించాడు.

1923 లో, బరీంద్ర తన అన్నయ్య అరబిందో ఘోష్ శ్రీ అరబిందో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన పాండిచేరికి బయలుదేరాడు. అన్న అరబిందో ఆధ్యాత్మికత సాధన వైపు బరీంద్ర ప్రభావితం అయ్యాడు.  బారిన్ 1929 లో కోల్‌కతాకు తిరిగి వచ్చి మళ్ళీ పాత్రికేయుడు గా ఉన్నారు. 1933 లో ది డాన్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. ది స్టేట్స్‌మన్ వార్తాపత్రికతో సంబంధం కలిగి ఉన్నాడు మరియు 1950 లో బెంగాలీ దినపత్రిక దైనిక్ బసుమతి సంపాదకుడయ్యాడు. 18 ఏప్రిల్ 1959 న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు. మాతృభూమిని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన లెక్కలేనన్ని త్యాగాలు మనందరికీ ఎప్పటికీ గుర్తుండాలి. మరీ ముఖ్యంగా యువతీ యువకులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment