Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కనకలత బారువా అస్సాంకు చెందిన 17 ఏళ్ళ అమర వీరాంగిణి - About Kanaklata Barua in Telugu

అస్సాంకు చెందిన 17 ఏళ్ళ వీరనారి కనకలతా బారువా వీర మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా మహాత్మ గాంధీ ఇచ్చ...


అస్సాంకు చెందిన 17 ఏళ్ళ వీరనారి కనకలతా బారువా వీర మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా మహాత్మ గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై (సాధించు లేదా మరణించు) నినాదాన్ని అందుకుని మత, ప్రాంత, లింగ, వయో బేధాలు, సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎంతో మంది స్పందించారు. అదే సమయంలో మొక్కవోని ధైర్యంతో ఒక పోలీసు స్టేషన్ లో జాతీయ జెండాను ఎగురవేసే సంకల్పంతో, ఆ ప్రయత్నంలో తుపాకీ గుండ్లను ఎదుర్కొని అమరురాలైన చరిత్ర వీరనారి కనకలతా బారువాది.

1924 డిసెంబర్ 22న గోహ్పూర్ లో శ్రీమతి కర్ణేశ్వరి మరియు శ్రీ కృష్ణకాంత్ బారువా దంపతులకు జన్మించిన కనకలతా బారువా, 13 ఏళ్ళ వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పటికీ తన తమ్ముడు, చెల్లెల్ని చూసుకునేందుకు మూడవ తరగతిలో ఉన్నప్పుడు చదువును మానేయాల్సి వచ్చింది. ఆమె పూర్వీకులు అహోం కింగ్స్ కోర్టులో మంత్రులుగా ఉన్నారని చెబుతారు.

చిన్నతనంలోనే స్వరాజ్య ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆమె, విదేశీ పాలనకు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్నారు. ప్రముఖ స్థానిక నాయకులైన శ్రీ చెనిరామ్ దాస్, శ్రీ మహిమ్ చంద్ర, శ్రీ జ్యోతి ప్రసాద్ అగర్వాల్ లను బ్రిటీష్ వారు దారుణ హింసలకు గురి చేయడం ఆమెలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. స్వాతంత్ర్య సమరయోధుల సమావేశాలకు వీరనారి కనకలతా హాజరు కావడం ఆమె తాత గారికి ఇష్టం లేకపోయినా, ఆమె పిన్ని శ్రీమతి జోనాకి దేవి బారువా ఆమెను రహస్యంగా పంపించేవారని చెబుతారు.

ఓ యువతీ యువకుల్లారా...! మీరంతా నాయకత్వం వహించే శక్తి కలిగినవాళ్ళు. మీ రక్తంతో ఈ భూమికి రంగులు అద్దండి. హృదయపు లోతుల నుంచి పెల్లుబికివచ్చే వాగ్దాన బలంతో ఈ లోకాన్ని అందంగా తీర్చిదిద్దండి. మీ వెచ్చని రక్తాన్ని చీకట్లను చీల్చుకుంటూ సూర్యరశ్మిలా ఈ భూమి మీద ప్రవహించనివ్వండి. ప్రఖ్యాత అస్సామీ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ కరంబీర్ నబిన్ చంద్ర బోర్డోలై మాటలు ఎంతో మంది యువతలో స్ఫూర్తిని రగిలించి స్వరాజ్య సమరం దిశగా ప్రేరేపించాయి.

ఆస్సాంకు చెందిన ప్రముఖ సామాజికవేత్త, కవి, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ జ్యోతి ప్రసాద్ అగర్వాల్ ఈ ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్ధతు కూడగట్టడంలో భాగంగా, తేజ్ పూర్ లో మృత్యువాహిని (డెత్ స్క్వాడ్) పేరిట ఓ సంస్థను స్థాపించారు. బిర్బలా పేరుతో వీరనారి కనకలత బారువా కూడా మృత్యువాహినిలో క్రియాశీల సభ్యులయ్యారు.

జాతీయ నాయకుల అరెస్టులకు వ్యతిరేకంగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో, మృత్యువాహిని సభ్యులు 1942 సెప్టెంబర్ 20న గోహపూర్ పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండా ఎగరేయాలని నిశ్చయించుకున్నారు. జాతీయ జెండాను పట్టుకుని డు ఆర్ డై నినాదంతో ముందుకు సాగుతున్న ఊరేగింపునకు వీరనారి కనకలతా బారువా నాయకత్వం వహించారు.

వారి బృందాన్ని ముందుకు వెళ్ళవద్దని బ్రిటీష్ పోలీసు బలగాలు హెచ్చరికలు జారీ చేయడమే గాక, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. పోలీసు హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిన వీరనారి కనకలతా బారువా మీద పోలీసులు కాల్పులు జరిపారు. అయినా సరే ఆమె జెండాను విడిచిపెట్టలేదు. శ్రీ ముకుంద కాకాటి అనే మరో స్వాతంత్ర్య యోధుడు ఆమె చేతి నుంచి జెండాను తీసుకునే వరకూ జెండా నేలను తాకుతుందేమోనని, ఆమె కనీసం నేల వరగకుండా అలానే నిలబడిపోయారు. అనంతరం అతడి మీద కూడా పోలీసులు కాల్పులు జరిపారు. ఇరువురూ మాతృభూమి స్వేచ్ఛ కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించి, వీరమరణం పొందారు. అయినా వారి త్యాగం వృధా కాలేదు. మరో స్వరాజ్య సమరయోధుడు శ్రీ రాంపతి రాజ్ ఖోవా చివరకు పోలీసు స్టేషన్ మీద విజయవంతంగా జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ యువతీ యువకుల అంకిత భావం ఎంత ఉన్నతమైనదంటే, స్వరాజ్య కాంక్షతో చేసిన నిరసనల్లో భాగంగా వారు మరణభయాన్ని కూడా అధిగమించారు. భావితరాలకు ప్రేరణనిచ్చే ఇలాంటి వారి త్యాగాలకు గౌరవాన్ని అందించలేని చరిత్ర అసంపూర్ణంగా మిగిలి పోతుంది. వీరనారి బిర్బలా కనకలతా వంటి భారత స్వరాజ్య సంగ్రామ వీరనారుల స్ఫూర్తిదాయక గాథలను మన చరిత్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments