ఉత్తరప్రదేశ్ లోని బందాకు చెందిన రాజ్ కుమారి గుప్తా, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్నందుకు ఆమెను కుటుంబ సభ్యులు కూడా ఆదరించలేదు అయిన...
ఉత్తరప్రదేశ్ లోని బందాకు చెందిన రాజ్ కుమారి గుప్తా, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్నందుకు ఆమెను కుటుంబ సభ్యులు కూడా ఆదరించలేదు అయినా ఎన్నో ఇబ్బందులు పడుతూ దేశం కోసం అహర్నిశలు పనిచేసింది. రాజ్ కుమారి గుప్తా, 1902లో కాన్పూర్ సమీపంలోని బందాలో జన్మించింది. ఆమె తండ్రి స్థానికంగా కిరాణా దుకాణాన్ని నిర్వహించేవారు. తల్లి సాధారణ గృహిణి. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న సాంఘిక కట్టుబాట్ల ప్రకారం ఆమెకు 13 ఏళ్ళ వయసులోనే మదన్ మోహన్ గుప్తాతో వివాహం జరిగింది. ఆ తర్వాతి కాలంలో మహాత్మా గాంధీ భారతదేశానికి చేరుకుని సత్యం, అహింస, నైతిక ధర్మం పునాదుల మీద సత్యాగ్రహాలు నిర్వహించడం ద్వారా సాధారణ ప్రజానికంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని విస్తరించడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో ఆ దంపతులిరువురు మహాత్ముని బోధనల ద్వారా ప్రభావితం అయ్యారు. అనంతరం స్వరాజ్య సంగ్రామంలోకి అడుగు పెట్టి, చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు.
1920 ప్రారంభంలో చౌరాచౌరి సంఘటన కారణంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నందుకు కొందరు యువకులు స్వరాజ్య సంగ్రామం పట్ల నిశ్చయమైన భావాలతో సాయుధ పోరాటం కొనసాగించారు. రాజ్ కుమారి గుప్తా సైతం విప్లవాత్మక పోరాట మార్గం పట్ల మొగ్గు చూపింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ బందా జిల్లాను సందర్శించారు, అక్కడి ప్రజలు స్వాతంత్ర్య పోరాటానికి నిధిని మరియు ఆయుధాలను అందించి ఆయనకు విశేషంగా మద్ధతును తెలిపారు.
రాజ్ కుమారి గుప్తా ఆ విప్లవకారులతో, ప్రత్యేకించి చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న పోరాటానికి మరింత సన్నిహితంగా ఉండేది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్.ఎస్.ఆర్.ఏ)కు సందేశాలు మరియు సామగ్రిని అందించే కార్యక్రమాలను విరివిగా నిర్వహించేది. తన భర్త సహా ఇతర కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా ఆమె ఈ విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనేది.
లక్నో సమీపంలోని కకోరి వద్ద ప్రభుత్వ ఖజానా డబ్బును తీసుకువెళుతున్న రైలు మీద దాడి చేసేందుకు ఉద్యమకారులకు ఆయుధాలు అందజేసే బాధ్యతను ఆమెకు అప్పగించారు. మన చరిత్రలో ఈ దాడి కకోరి కేసుగా ప్రసిద్ధి చెందింది. రాజ్ కుమారి గుప్తా తన ఖాదీ వస్త్రాల కింద ఆయుధాలను దాచి పెట్టి, తన మూడేళ్ళ పిల్లవాడితో పాటు పొలాల గుండా నడుస్తూ, ఎలాంటి అనుమానం రాకుండా ఈ బాధ్యతను నిర్వహించింది. “హమ్ ఉపర్ సే గాంధీ వాది – నీచే సే క్రాంతి వాది” (నేను బాహ్యంగా గాంధేయవాదినే అయితే అంతర్గతంగా మాత్రం విప్లవ వాదిని) అంటూ ఆమె ఒక సారి తన విప్లవాత్మక భావాలను బాహాటంగానే చాటి చెప్పింది.
విప్లవాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందలేదు. చివరకు భర్త కూడా ఆమెను తిరిగి ఇంటికి రానివ్వలేదు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బహిరంగంగా వార్తాపత్రికల్లోనే ప్రకటించాడు కూడా. ఇది ఆమెకు వ్యక్తిగతంగా పెద్ద నష్టమే అయినప్పటికీ, ఆమె ఏ మాత్రం భయపడకుండా, భారత స్వరాజ్య సంగ్రామంలో తమ చురుకైన పాత్రను కొనసాగించింది. ఆ తర్వాత కూడా ఉద్యమంలో భాగంగా ఆమె అనేక పర్యాయాలు అరెస్టు అయ్యింది.
ఒక చరిత్ర కారుడితో ఆమె మాట్లాడిన ముఖాముఖి కార్యక్రమం లో భాగంగా “హమ్ కో జో కర్నా థా, కియా (నేను చేయాల్సిందంతా చేశాను)” అని చెప్పింది.
రాజ్ కుమారి గుప్తా వంటి వీర మహిళా మూర్తులు బ్రిటీష్ వలస పాలకుల అణచివేతకు వ్యతిరేకంగానే కాకుండా, వారి కుటుంబాలలో సామాజిక కట్టుబాట్లు, వైఖరి, వ్యతిరేకతలను ఎదిరించి పోరాటం చేయవలసి వచ్చింది. వారిది వీటన్నింటితో చేసిన మిశ్రమ పోరాటం. అందుకే మన భారత స్వరాజ్య సంగ్రామం కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు, ఓ రకమైన సామాజిక పునరుజ్జీవనం కూడా. సమాజంలోని అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన అలాంటి నిజమైన వీర మహిళల గాధలు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
No comments