దేశం కోసం తన దుఃఖాన్ని సైతం లెక్క చేయని బీహార్ కు చెందిన వీరనారి శ్రీమతి తారా రాణి శ్రీవాత్సవ. తారా రాణి శ్రీ వాత్సవ ప్రస్తుత బీహార్ లోని స...
దేశం కోసం తన దుఃఖాన్ని సైతం లెక్క చేయని బీహార్ కు చెందిన వీరనారి శ్రీమతి తారా రాణి శ్రీవాత్సవ. తారా రాణి శ్రీ వాత్సవ ప్రస్తుత బీహార్ లోని సరన్ జిల్లాలో జన్మించారు. ఆమె ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు ఫులేండు బాబును వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమె తన భర్త అడుగుజాడల్లో స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మహాత్మ గాంధీ ఇచ్చిన సాధించు లేదా మరణించు (డు ఆర్ డై) అన్న ప్రసిద్ధ నినాదం దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరిచింది. చంపారన్ లో గాంధీజీ సత్యాగ్రహంతో మొదట ప్రయోగాలు చేసిన బీహార్. ఆయన క్విట్ ఇండియా ఉద్యమ నినాదం కూడా భారతీయ సనాతన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు జన్మనిచ్చిన ఈ భూమిలో ప్రతిధ్వనించింది. క్విట్ ఇండియా ఉద్యమంలోని అగ్ర నాయకులందరినీ బ్రిటీష్ ప్రభుత్వ అరెస్టు చేసినప్పటికీ, మహాత్మ గాంధీ చెప్పినట్లు సత్యం, అహింసా సూత్రాలకు కట్టుబడిన వ్యక్తుల ద్వారా ఈ ఉద్యమం ముందుకు సాగింది.
బ్రిటీష్ పాలకుల అధికార దాహాన్ని అణచివేసేందుకు, భారతదేశ ప్రజల స్వేచ్ఛా ఆకాంక్షలను నినదించేందుకు స్థానిక ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండాలను ఎగరేసేందుకు ప్రజలు దృఢమైన ప్రయత్నాలు చేసేవారు. 1942 ఆగస్టు 12న సరన్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ జెండాను ఎగరవేసేందుకు పులేండు బాబు, తన భార్య తారా రాణితో ఓ ఊరేగింపునకు నాయకత్వం వహించారు. అంతలో పోలీసులు వారిని ఆపి, వెనుతిరగాల్సిందిగా హెచ్చరించారు. వారి మాటలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న ఊరేగింపు మీద బ్రిటీష్ పోలీసులు లాఠీఛార్జ్ చేయడమే గాక, కాల్పులు జరిపారు. అంతలోనే పులేండు బాబు తుపాకీ తూటా తగిలి భార్య కళ్ళ ముందే కుప్పకూలి పోయారు. తీవ్రంగా గాయపడిన తన భర్తకు వెంటనే ఆమె చీరను చించి గాయాలకు కట్టు కట్టారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అయినప్పటికీ ఆమె ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. త్రివర్ణపతాకాన్ని బలంగా పైకెత్తి ఆమె ఊరేగింపునకు నాయకత్వం వహించారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు పోలీస్ స్టేషన్ వైపు ముందుకు సాగారు. ఆమె తిరిగి వచ్చే సమయానికి పులేండు బాబు బుల్లెట్ గాయాలతో మరణించారు. ఆ సందర్భం ఆమెకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటు అయినప్పటికీ, ఆమె దేశ స్వేచ్ఛ కోసం భర్త మరణించి బాధను సైతం మునిపంటిన బిగబట్టారు. స్వరాజ్యాన్నే శ్వాసగా మార్చుకున్నారు. ఆయన అంత్యక్రియల సమయంలో కూడా ఆమె ఎలాంటి భావోద్వేగానికి లోను కాలేదని చెబుతారు. 1947 ఆగష్టు 15న భారతదేశం స్వరాజ్యాన్ని సముపార్జించే వరకూ ఐదేళ్ళ పాటు ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో కొనసాగుతూ వచ్చారు.
మనం ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీరు దేశ స్వేచ్ఛ కోసం అసాధారణ త్యాగాలు చేసిన సాధారణ ప్రజలు. నిజానికి ఆ సమయంలో నాయకత్వం లేకపోయినా చిన్న పట్టణాలకు చెందిన స్థానిక సంఘాలు నిరసనలకు దిగాయి. సాహసోపేతమైన వరుస నిరసన మధ్య బ్రిటీష్ పాలకులు వారి పాలనను కొనసాగించలేకపోయారు.
కారణాలు ఏవైనా కావచ్చు, మన చరిత్ర పుస్తకాల్లో ఈ నిస్వార్థ యోధుల గాధలు మరియు దేశ వ్యాప్తంగా స్వరాజ్య ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో వారు పోషించిన కీలకమైన పాత్రలకు చోటు దక్కలేదు. వారి జీవన గాథలు మరియు త్యాగం యొక్క గాధలను మన చరిత్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది.
మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి తగినంత సమాచారం లభించడం లేదు. వారి గురించి తెలియజేసేందుకు, వారి జీవిత చరిత్రలు, త్యాగాల గురించి ప్రత్యేక సమాచార పత్రాలను ప్రచురించేందుకు ఆసక్తి చూపాలి. అదే ఆ మహనీయుల త్యాగాలకు ఇచ్చే నిజమైన నివాళి.
No comments