1857 మే 10న, మీరట్ కంటోన్మెంట్ వద్ద ఉన్న భారతీయ సిపాయిలు (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం) బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు బ...
1857 జులై 18న బ్రిటీష్ దళాలు బరాట్ చేరుకుని దుర్మార్గమైన పద్ధతుల్లో దాడులకు పాల్పడ్డాయని చెబుతారు. ఆ తర్వాత జరిగిన పోరాటంలో, శ్రీ షాహమల్ సింగ్ తోమర్ అమరుడయ్యారు. 30 మందికి పైగా స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటీష్ వారు బంధించి చెట్టుకు ఉరి తీశారు. ఆ సమయంలో గ్రామాలను కొల్లగొట్టి దోచుకున్న బ్రిటీష్ వారు, ఆయా గ్రామాలకు ఆహారం, నీటి సరఫరాను అడ్డుకుని, అదే సమయంలో అక్కడి ప్రజలు దాచుకున్న ఆహార ధాన్యం, ఆస్తులు, పశువులను జప్తు చేశారు.
తమ ఆత్మీయులు, బంధువుల మీద జరిగిన ఈ దారుణాలకు 16 ఏళ్ళ శివదేవి ప్రత్యక్ష సాక్షి. ఆమె కళ్ళ ముందే ఈ దుర్మార్గపు ఘటన చోటు చేసుకుంది. ఆమె స్నేహితురాలు కిషన్ దేవితో కలిసి ఆమె గ్రామానికి చెందిన యువతను ఉత్తేజపరిచారు. బ్రిటీష్ వారి దారుణాలకు ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బరాట్ వద్ద ఉన్న బ్రిటీష్ సైనికుల మీద వారంతా మెరుపు దాడి చేశారు. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని సైనికులు వారికి పట్టుబడ్డారు.
శివదేవి తోమర్ స్వయంగా ఈ దాడికి నాయకత్వం వహించారు. అనేక మంది బ్రిటీష్ సైనికులను చంపడంలో కీలక పాత్ర పోషించారు. మంచి ఆయుధాలు, తుపాకులతో బ్రిటీష్ దళాలు ఉన్నతమైన యుద్ధ సంపత్తిని కలిగి ఉన్నప్పటికీ, అన్నింటినీ అధిగమించి దాడి చేసిన తెగువ ఆమె సొంతం. ఈ దాడితో గతంలో దారుణాలకు తెగబడ్డ బ్రిటీష్ దళాలు బరాట్ వదలి పారిపోవలసి వచ్చింది. అయితే దాడి సమయంలో శివదేవి తోమర్ తీవ్రంగా గాయపడింది. వెంటనే గ్రామస్థులంతా అక్కడకు చేరుకుని ఆమె గాయాలకు చికిత్స చేయడం ప్రారంభించిన తర్వాత, తిరిగి మళ్ళీ ఆ ప్రాంతాన్ని చేరుకున్న బ్రిటీష్ దళాలు ఆమె మీద కాల్పులకు తెగబడ్డాయి. ఆమె శరీరమంతా తుపాకి బుల్లెట్లతో జల్లెడలా మారిపోయింది. మాతృభూమి కోసం పోరాడుతూ శివదేవి తోమర్ వీరమరణం పొందారు.
శివదేవి తోమర్ త్యాగం ఫలించకపోవడంతో, అక్క హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె చెల్లెలు 14 ఏళ్ళ జైదేవి తోమర్ ప్రతిజ్ఞ చేసింది. ఆమె చుట్టు పక్కల గ్రామాల నుంచి యువతను సమీకరించి, లక్నోకు వెళుతున్న బ్రిటీష్ దళాలను వెంబడించింది. ఈ మార్గంలో మీరట్, బులంద్హహర్, అలీఘడ్, మణిపురి, ఎటావా ప్రజలను బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మార్చే దిశగా యువతను ప్రేరేపించింది. లక్నోలో బ్రిటీష్ బృందాల కోసం వెతకడం ప్రారంభించింది. తెలియని ప్రదేశంలో ఆహారం, సహాయం లేకుండా వారి గురించి వెతికేందుకు ఎన్నో రోజులు కష్టపడాల్సి వచ్చింది.
చివరకు వారు బ్రిటీష్ దళాలను కనుక్కోగలిగారు. జైదేవి తోమర్ స్వయంగా ఓ బ్రిటీష్ అధికారిని చంపడమే గాక, మరికొందరు సైనికుల మీద దాడి చేసింది. బ్రిటీషర్ల బంగళాకు నిప్పటించింది. ఈ ప్రయత్నంలో జైదేవీ తోమర్ కూడా వీరమరణం పొందారు. తర్వాత స్థానికులు ఆమెకు నివాళులు అర్పించి లక్నోలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మారుమూల గ్రామాల నుంచి స్వరాజ్య సంగ్రామం దిశగా ప్రజలను ఉత్తేజితం చేసిన ఇలాంటి వీరులు, వీరనారుల శౌర్యం, త్యాగం, దేశభక్తితో నిండిన ఇటువంటి సాహసోపేతమైన
వీరనారీమణుల కారణంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇలాంటి మహనీయులు త్యాగాలను స్మరించుకుని వారి స్మృతికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛా భారతావనికి చెందిన భావితరాలు, నాటి మహనీయుల పోరాటాలు, త్యాగాలకు మనం రుణపడి ఉన్నాము. భారతదేశాన్ని వలస పాలన నుంచి విముక్తం చేసేందుకు అనేక మంది వీరులు, వీరనారులు పోషించిన పాత్ర గురించి ప్రతి తరానికి మనం తెలియజేయాలి.
No comments