Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహిళల స్వేచ్ఛకు, సాధికారతకు బాటలు వేసిన కమాలాదేవి - About Kamaladevi Chattopadhyay in Telugu - megaminds

కమలాదేవి చటోపాధ్యాయకు 27 ఏళ్ల వయసులో గాంధీజీ దండి యాత్ర చేపట్టి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించబోతున్నారని ఆమెకు తెలిసింది. కానీ ఈ ఉద్యమ...

కమలాదేవి చటోపాధ్యాయకు 27 ఏళ్ల వయసులో గాంధీజీ దండి యాత్ర చేపట్టి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించబోతున్నారని ఆమెకు తెలిసింది. కానీ ఈ ఉద్యమంలో మహిళలకు ప్రవేశం లేదు. స్వాతంత్రోద్యమంలో మహిళలు రాట్నం తిప్పుతూ, మద్యం దుకాణాలను ముట్టడి చేసి మూయించే పనిలో ఉండాలని గాంధీ నిర్ణయించారు. ఇది కమలాదేవికి నచ్చలేదు. ఉప్పు సత్యాగ్రహంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని, ఈ విషయమై గాంధీతోనే నేరుగా మాట్లాడాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆ తరువాత ఆమె ఒక రోజు రైల్లో గాంధీజీని కలుసుకున్నారు. మొదట గాంధీ, కమలాదేవిని ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వాదనలు విన్న తరువాత ఉప్పు సత్యాగ్రహంలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు కావడానికి గాంధీ అంగీకరించారు. ఇది ఒక చారిత్రక నిర్ణయం.

ఈ అడుగుతో స్వాతంత్రోద్యమంలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ప్రపంచం మొత్తం చూస్తుండగా మహిళలందరూ చేయి చేయి కలిపి ఉప్పు సత్యాగ్రహాన్ని భుజాన వేసుకుని ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ పార్టీలోనూ, స్వతంత్ర్యం వచ్చిన తరువాత రాజకీయాల్లోనూ మహిళల పాత్రను మలుపు తిప్పింది. ఉప్పు సత్యాగ్రహంలో కమాలాదేవి ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసులను ఎదురించి, తన సహచరులతో కలిసి ఉప్పును తయారుచేసి పొట్లాలలో కట్టి అమ్మడం ప్రారంభించారు. ఒకసారి ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో కూడా ప్రవేశించి ఉప్పు పొట్లాలను వేలం వేసారు.

కమాలాదేవి ధైర్యం వెనుక తన తల్లి, అమ్మమ్మల పాత్ర ఎంతైనా ఉంది. కమలాదేవి మంగళూరులో గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో 3 ఏప్రిల్, 1903న గిరిజాబాయి, అనంతయ్య దంపతులకు జన్మించారు. తండ్రి అనంతయ్య ధరేశ్వర్ జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. ఆయన ప్రగతిశీల భావాలున్న వ్యక్తి. కానీ కమలాదేవి చిన్నతనంలోనే ఆయన మరణించారు. తరువాత కుటుంబ బాధ్యత అంతా ఆమె తల్లి మీద పడింది. 19వ శతాబ్దంలో బాలికలకు పాఠశాలలు లేనప్పటికీ ఇంటి దగ్గరే కమలాదేవికి చదువు చెప్పించే ఏర్పాటు చేసారు. కానీ సాంఘిక ఒత్తిడికి తలవొగ్గి 11 వ యేటనే కమలాదేవి వివాహం జరిపించారు. తరువాత ఏడాదిన్నరకే కమలాదేవి భర్త మరణించారు. అయితే కమలాదేవికి వితంతు ఆచారాలను జరపడానికి ఆమె తల్లి నిరాకరించారు. అంతేకాకుండా కమలాదేవిని స్కూలుకు పంపి, జీవితంలో ముందుకు వెళ్లడానికి దారి చూపించారు. ఆ తరువాత 20 యేళ్ల వయసులో కమలాదేవి హరింద్రనాథ్ చటోపాధ్యాయను వివాహమాడారు.

1923లో గాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించినప్పుడు కమలాదేవి తన భర్తతో పాటూ లండన్‌లో ఉన్నారు. ఆమె వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చి కాంగ్రెస్ సేవా దళంలో చేరారు. మొట్టమొదటిసారిగా మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలలో మహిళలకు ఓటు వేసే హక్కును ఇచ్చారు. అలాగే 1926లో మద్రాస్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ఇప్పటి విధానసభకు సమానమైనది) ఎన్నికల్లో మహిళలకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కమలాదేవి పోటీ చేసారు. కానీ ఎన్నికల ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. కమలాదేవి భర్త హరింద్రనాథ్ కూడా నాటకాలు, దేశ భక్తి గీతాలు ప్రచారం చేస్తూ కమలాదేవి ఎన్నికల ప్రచారం కూడా చేసారు. అయితే, ఈ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతో కమలాదేవి ఓడిపోయారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి తలుపులు తెరిచారు.

1927-28లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యురాలిగా చేరారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగానూ, సమ్మతి చట్టాన్ని తీసుకురావడంలోనూ, రాచరికం ఉన్న రాష్ట్రాల్లో ఉద్యమాల విషయంలోనూ కాంగ్రెస్ నిర్ణయాలను ప్రభావితం చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషించారు. స్వతంత్ర్యం వచ్చిన తరువాత...విభజన సమయంలో శరణార్థుల పునరావాసంపై ఆమె దృష్టి కేంద్రీకరించారు. సహకారోద్యమంపై ఆమెకు అచంచల విశ్వాసం ఉండేది. దాంతో ఆమె 'భారత సహకార సంఘం' (ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్) స్థాపించారు. ప్రజల సహకారంతో శరణార్థుల కోసం ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను నెహ్రూ ముందుంచారు. అయితే దీనికోసం ప్రభుత్వ సహాయాన్ని ఆశించకూడదనే షరతుతో నెహ్రూ ఈ ప్లాన్‌కు అంగీకరించారు. భారత సహకార సంఘం సహాయంతో ఈశాన్య సరిహద్దునుంచీ వస్తున్న శరణార్థులకోసం దిల్లీకి దగ్గర్లో ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసారు. దాన్నే నేడు ఫరీదాబాద్ అని పిలిస్తున్నారు.

1950 నుంచీ కమలాదేవి భారతీయ హస్తకళలు, చేనేత వస్త్రాల పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం మరియు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు. భారతీయ నాటక సంప్రదాయాలను ప్రోత్సహించడానికి 'ఇండియన్ నేషనల్ థియేటర్' స్థాపించారు. ఇదే తరువాతి కాలంలో 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'గా ప్రసిద్ధికెక్కింది. కమలాదేవి కృషితో ప్రసిద్ధ 'సంగీత నాటక అకాడమీ' స్థాపించబడింది. 1955లో పద్మ భూషణ్, 1987లో పద్మ విభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. అంతేకాకుండా 1966లో కమలాదేవికి రామన్ మెగసేసే పురస్కారం కూడా లభించింది. 1988 అక్టోబర్ 29న 85 సంవత్సరాల వయసులో కమలాదేవి చటోపాధ్యాయ కన్నుమూసారు. మహిళల స్వేచ్ఛకు, సాధికారతకు కమాలాదేవి వేసిన బాటలు నిరంతరం స్ఫుర్తిదాయకమైనవి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments