Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మీకు ఓపికుంటే నన్ను ముక్కలు ముక్కలుగా చేసుకోండి: ఉల్లాస్‌కర్ దత్ - About ullaskar dutta in telugu

‘ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు అనవసర ప్రయత్నాలు చేయకు. నీ ప్రయత్నాలు సఫలం కావడానికి ఈ జైలు ఊర్లో లేదు. మొదటి సారి తప్పు చేస్తే చేతికి బేడీలు...



‘ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు అనవసర ప్రయత్నాలు చేయకు. నీ ప్రయత్నాలు సఫలం కావడానికి ఈ జైలు ఊర్లో లేదు. మొదటి సారి తప్పు చేస్తే చేతికి బేడీలు వేసి నిలబెడతాం. రెండోసారి అయితే, కాళ్లకు సంకెళ్లు వేస్తాం. మూడోసారి అలా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 30 కొరడా దెబ్బలు చవిచూడాల్సి వస్తుంది. నేను చెప్పింది అర్థం చేసుకుని జాగ్రత్తగా మసులుకో. ఈ జైలులో విధించే అత్యంత కఠినమైన శిక్ష అది. 30 కొరడా దెబ్బలు అంటే ఏంటో నీకు తెలుసా? ఒక్కో కొరడా దెబ్బకు నీ చర్మం ఒక్కో అంగుళం చొప్పున లోపలి వరకూ తీవ్రమైన గాయం అవుతుంది. సాధారణ ఖైదీలతో పోలిస్తే మరింత దారుణంగా మీతో వ్యవహరించాల్సి ఉంటుంది. జాగ్రత్త..!’ అని సెల్యులార్ జైలర్ హెచ్చరించాడు.

కానీ ఉల్లాస్‌కర్ భయపడలేదు. అంతే గంభీరంగా జైలర్‌కు సమాధానమిచ్చారు. ‘మీరు 30 కొరడా దెబ్బల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఓపికుంటే నన్ను ముక్కలు ముక్కలుగా చేసుకోండి. నేను చేసింది తప్పు అని నేను భావించే వరకూ నాతో చిన్న పనికూడా మీరు చేయించలేరు’ అంటూ తమ మనోధైర్యాన్ని ప్రకటించారు. అండమాన్ సెల్యులార్ జైల్లో బ్రిటిష్ అధికారుల అమానవీయమైన చిత్రహింసలను భరించిన స్వరాజ్య పోరాట యోధుడు ఉల్లాస్‌కర్ దత్.నాటి భారతదేశంలో, ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బ్రహ్మాన్‌బరియా జిల్లాలోని కాలికచ్చా గ్రామంలో 1885 ఏప్రిల్ 16న శ్రీ ద్విజ్‌దాస్ దత్, శ్రీమతి ముక్తకేశి దంపతులకు ఉల్లాస్‌కర్ దత్ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కాలికచ్చాలో పూర్తి చేసుకున్న తర్వాత ఉల్లాస్‌కర్ ఉన్నత విద్య కోసం కలకత్తాలోని ప్రతిష్టాత్మక ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. కలకత్తాలో విద్యాభ్యాసం సమయంలో ‘వినతులు ఇవ్వడం వాటిని ప్రభుత్వం అవమానకర రీతిలో తోసిపుచ్చుతున్నప్పటికీ, ప్రభుత్వ రాయితీలను పొందాలనుకునేందుకు మనం చేస్తున్న విఫలయత్నాలకు ఇకపై ఆపేద్దాం.

స్వయం సహాయం, హక్కుల కోసం పట్టుబట్టడం ఒక్కటే సరైన మార్గం’ అన్న శ్రీ బిపిన్ చంద్రపాల్ మాటలు వారిని బలంగా ప్రభావితం చేశాయి. ఆ రోజుల్లో శ్రీ బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ద్వారా ఉల్లాస్‌కర్ వంటి ఎంతో మంది యువకులు ప్రేరణ పొందారు. ఉల్లాస్‌కర్ కూడా ఈ ప్రసంగాల ప్రభావంతో విదేశీ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. బెంగాల్ విభజన, తదనంతర స్వదేశీ ఉద్యమం ప్రభావం నేపథ్యంలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ, సంప్రదాయ బెంగాలీ దుస్తులను ధరించడం ప్రారంభించారు.

ఈ సమయంలోనే ప్రెసిడెన్సీ కళాశాలలో జరిగిన ఓ సంఘటన ఉల్లాస్‌కర్ కాలేజీ జీవితానికి ముగింపు పలికింది. ఈ కళాశాల ఉపాధ్యాయుడైన శ్రీ రసెల్, కలకత్తా విద్యార్థులపై విషం కక్కుతూ రాసిన రాతలను ప్రతిఘటించిన ఉల్లాస్‌కర్, ఆ ఉపాధ్యాయుడి చెంప పగలగొట్టారు. ఆ తర్వాత ఉల్లాస్‌కర్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘ఈ రాతల పట్ల నేను మౌనంగా ఉండదలచుకోలేదు. అందుకే జరగాల్సింది చేశాను. మంచి పని కోసం నేను కాలేజీ నుంచి బహిష్కృతుడిని కావాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

అనంతరం బరీంద్రనాథ్ ఘోష్‌తో కలిసి ‘అనుశీలన్ సమితి’తో పాటు పలు స్వరాజ్య విప్లవ మార్గ సంఘాలతో ఉల్లాస్‌కర్ పనిచేశారు. ఉల్లాస్‌కర్ తండ్రి శివ్‌పూర్‌లోని సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. దీంతో ఈ కాలేజీలోని ప్రయోగశాల సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ, ఉల్లాస్‌కర్ కొన్ని విస్ఫోటక పధార్థాలను తయారూచేశారు. ఈ నేపథ్యంలోనే 1908లో అలీపూర్ బాంబు పేలుడు ఘటనలో పాల్గొన్నారన్న ఆరోపణలపై ఉల్లాస్‌కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ గవర్నర్ లెఫ్టినెంట్ ఆండ్రూ ఫ్రేసర్‌ ప్రయాణిస్తున్న రైలుపై మిడ్నాపూర్ ప్రాంతంలో బాంబు వేసి హత్యాయత్నం చేసిన ఘటనలో ఈ అరెస్టు జరిగింది. ఈ బాంబును ఉల్లాస్‌కర్ రూపొందించారనే విషయం పోలీసులకు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా 1909లో ఉల్లాస్‌కర్‌కు మరణశిక్ష ఖరారైంది. ఈ శిక్షపై అప్పీలు చేసుకునేందుకు కూడా ఆయన నిరాకరించారు. ‘మనం అంగీకరించని అధికారానికి సంబంధించిన న్యాయ వ్యవస్థకు మనం ఎలా అప్పీలు చేసుకోగలం’ అని ప్రశ్నించారు. అయితే తల్లిదండ్రులు, బరీంద్రనాథ్ ఘోష్ పదే పదే చెప్పడంతో చివరకు అప్పీలు చేసుకునేందుకు అంగీకరించారు. అతని మరణశిక్షను మార్పుచేసి కాలాపానీలో జైలుశిక్ష అనుభవించాలని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

కాలాపానీ జైలులో ఖైదీలపై బ్రిటిష్ అధికారుల అమానవీయ ప్రవర్తన, క్రూరమైన శారీరక శిక్షల గురించి ఉల్లాస్‌కర్‌కు వివరిస్తూ, ‘మన దేశీయ పద్ధతిలో ఎద్దును కట్టి తిప్పే గానుగలో రోజుకు 16 పౌండ్ల కన్నా (దాదాపు 7.25 కిలోలు) ఎక్కువ నూనెను తీయలేము. కానీ కాలాపానీలో విధించే శిక్షలో మనుషుల ద్వారా తిప్పే గానుగలో రోజుకు 80 పౌండ్ల నూనెను (దాదాపు 36.25 కిలోలు) తీయాలని హుకుం జారీ చేసేవారు. ముగ్గురు వ్యక్తులు ఇనుప గానుగను చుట్టూ తిప్పుతూ ఉండాలి. అది కూడా ఎద్దు తిరిగినట్లు మెల్లిగా కాదు, గుర్రం పరిగెట్టినట్లుగా పరిగెట్టాలి. ఎక్కడా ఆగకూడదు. ఆగితే అంతే. ఇది అత్యంత క్రూరమైన శిక్ష’ అని తన ఆత్మకథలో పేర్కొన్నారు.

జైలు అధికారుల అమానవీయమైన తీరుకు నిరసనగా ఉల్లాస్‌కర్‌ బలంగా గొంతెత్తేవారు. దీంతో పాటుగా జైల్లో కనీస వసతులు కల్పించాలంటూ గట్టిగా నిలదీసేవారు. దీంతో అధికారులు విధించిన శిక్షలను భరిస్తూ ఉల్లాస్‌కర్‌ తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. ఆయన శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీలకు చేరింది. కొద్దిరోజుల పాటు ఉల్లాస్‌కర్‌ అచేతనంగా పడిఉన్నారు. దీని కారణంగా ఆయన మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆయన ప్రయత్నించారు. ‘దీనికి గానూ నన్ను నేనే నిందించుకోవడం మొదలుపెట్టాను. యావత్ భూమండలం మీద నాకంటే అత్యంత అపరాధం మరొకరు చేయలేదేమో అనుకున్నాను. నేను దుర్మార్గం తప్ప మంచి చేయలేదనే ఆలోచనలో పడిపోయాను. ఆవిధంగా మనస్తాపం చెందుతున్న సమయంలో నా మానసిక స్థిరత్వం దెబ్బతిన్నది. ఈ కఠినమైన శిక్షను అనుభవించడం కంటే, ఆత్మహత్యే శరణ్యమనే విధంగా నా ఆలోచనలు సాగాయి’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ సమయంలో వారి మనస్సాక్షి భరించిన కఠినమైన ఇబ్బందులను మనం అర్థం చేసుకోవచ్చు. ఉల్లాస్‌కర్‌ వంటి ఎంతో మంది స్వరాజ్య విప్లవ మార్గ సమరయోధులు ఈ కాలాపానీ జైలులో తీవ్రమైన శారీరక, మానసిక క్షోభను అనుభవించారు. కాలాపానీ ఘటనలను ఉల్లాస్‌కర్‌ వివరించిన తీరును సచీంద్ర సన్యాల్ గుర్తుచేస్తూ, ‘హాడ్ ఖబే, మాంస్ ఖబే, చండా దియే దుగ్దుగి బజాబే’ అని పేర్కొన్నారు. అంటే బ్రిటిషర్లు మన ఎముకలను తింటారు, మన మాంసాన్ని తింటారు. అంతే కాదు మన చర్మంతో డోలు చేసుకుని వాయిస్తారు’ అని అర్థం.

మానసిక స్థితి క్షీణిస్తుండటంతో ఆయన్ను మొదట స్థానిక మానసిక వికలాంగుల కేంద్రానికి తరలించారు. అనంతరం మద్రాసు జైలుకు పంపించి మిగిలిన జీవిత ఖైదును అమలుచేశారు. అనంతరం జర్మనీ ఆమ్నెస్టీ ఒప్పందం ప్రకారం 1920లో ఆయన్ను విడుదల చేశారు.

కాలాపానీలో విధించిన కఠినమైన శిక్షలతో మానసిక స్థిరత్వాన్ని కోల్పోయినా, ఆయన స్వాతంత్ర్య కాంక్ష మాత్రం తగ్గలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ స్వరాజ్య విప్లవ మార్గ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇందుకు గానూ 1931లో అరెస్టయ్యి మళ్ళీ 18 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తన సొంత గ్రామమైన కాలికచ్చాకు చేరుకుని అక్కడే ఉన్నారు. తర్వాత పదేళ్లకు కలకత్తాకు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. శ్రీ బిపిన్ చంద్రపాల్ కూతురిని (వికలాంగురాలు, వితంతువు కూడా) ఉల్లాస్‌కర్ దత్ వివాహం చేసుకున్నారు. అక్కణ్నుంచి సిల్చార్‌కు మకాం మార్చారు. అనంతరం 1965లో ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు.

ఉల్లాస్‌కర్ దత్ ‘ద్వీపాంతర్ కథ, అమర్ కారాజీవన్’ అనే రెండు పుస్తకాలను బెంగాలీలో రాశారు. ఈ పుస్తకాలు కాలాపానీ జైలులో అనుభవించిన క్రూరమైన శిక్షలను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాయి. బెంగాలీలో ప్రఖ్యాతి పొందిన అమర్ కారాజీవన్ పుస్తకం తర్వాతి కాలంలో ఆంగ్లంలోకి అనువాదమైంది. వలసపాలకులు భారతీయులపై చేసిన అమానవీయమైన ఘటనలకు ఈ రెండు పుస్తకాలు సాక్ష్యాలుగా నిలిచిపోయాయి. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించినందుకు మన స్వాతంత్ర్య పోరాటయోధులు అనుభవించిన క్రూరమైన శిక్షలకు ఈ రెండు పుస్తకాలు ప్రాథమిక సమాచారంగా అందుబాటులో ఉన్నాయి.

ఈ పుస్తకాలను వివిధ భారతీయ భాషల్లోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రచార/ప్రసార సాధనాలు సైతం ఈ పుస్తకాల్లోని ముఖ్యమైన ఘట్టాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలి. పాఠ్యాంశాల్లోనూ ఈ అంశాలను చేర్చాలి. పాఠశాలలు, కళాశాలలు తమ విద్యార్థులను అండమాన్ జైలుకు తీసుకెళ్లి, నాటి పరిస్థితులపై వారికి అవగాహన కల్పించాలి. మన స్వాతంత్ర్య పోరాటయోధులు ఎదుర్కొన్న అమానవీయ ఘటనలను వారికి తెలియజేయాలి. నాటి మహనీయుల పోరాట పటిమను గౌరవించుకోవడంతో పాటు, వారి త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మనందరి గురుతర బాధ్యతగా యువత అర్థం చేసుకోవాలి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments