చరిత్ర పాఠాలను మరచిపోయి వ్యవహరించేవారు మరల ఆ తప్పిదాలనే చేసి మళ్లీ మళ్లీ ఆ దుష్ఫలితాలనే పొందక తప్పదు. అంతేకాదు, ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితుల...
చరిత్ర పాఠాలను మరచిపోయి వ్యవహరించేవారు మరల ఆ తప్పిదాలనే చేసి మళ్లీ మళ్లీ ఆ దుష్ఫలితాలనే పొందక తప్పదు. అంతేకాదు, ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితులను గమనించే వారికి మళ్లీ దేశం ముక్కలయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదేమోనన్న భయము, సందేహమూ కలగటంలో ఆశ్చర్యం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమంటే- ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కాకుండా నివారించటమెలా? అని ఎవరూ ఆలోచించటం లేదా? అని.
భారత రాజ్యాంగ నిర్మాత గా,దళిత వర్గాల పెన్నిధి గా గుర్తింపబడిన డా౹౹బాబా సాహబ్ అంబేడ్కర్ ఈ విషయమై లోతుగా అధ్యయనం చేశారు. తన ఆలోచనల నన్నింటినీ 'థాట్స్ ఆన్ పాకిస్తాన్ ' అనే గ్రంథంద్వారా వ్యక్తీకరించారు.'దళిత్ వాయిస్' పత్రికా సంపాదకుడైన వి.టి. రాజశేఖర్ షెట్టి మొదలైన తథాకథిత దళిత నాయకులు ఈనాడు ప్రచారం చేస్తున్న భ్రమలను డా౹౹అంబేడ్కర్ ఆనాడే ఖండించారు. తాను హిందువుగా పుట్టినా,ఈ హిందూ సమాజంలో తనకు, తనతోటి ప్రజలకు సరియైన సామాజిక న్యాయం, సమాదరణ లభించనందున తాము హిందువులుగా చావదలుచుకోలేదని, హిందూ మతం విడిచి పెట్టి సామాజిక న్యాయం, సమాదరణ లభించే మతాన్ని స్వీకరిస్తానని 1935లోనే డా౹౹ అంబేడ్కర్ ప్రకటించాడు. తదనుగుణంగా అట్టి మతం కోసం అన్వేషిస్తూ వివిధ మతాల సిద్ధాంతా లను , వాటి చారిత్రక వికాస క్రమాన్ని లోతుగా అధ్యయనం చేసిన అనుభవంతో వ్రాసిన గ్రంథమిది. హిందూ సమాజం కంటే మహమ్మదీయ సమాజం ప్రగతిశీలమైనదనే వాదాన్ని డా౹౹అంబేడ్కర్ నిర్ద్వంద్వంగా ఖండించారు. హిందూ సమాజంలో ఉన్నవని భావించే సామాజిక దుర్నీతులు, కురీతులు మహమ్మదీయ సమాజంలోనూ ఉన్నాయని తేల్చి చెప్పారు. బానిసతనాన్ని కొరాన్ సమర్థించిందని, ఆవిధంగా మానవాళికి శత్రువు గా వ్యవహరించిన దనీ వ్యాఖ్యానించారు.'బానిసలను దయతో , న్యాయంగా చూసుకోవాలని ప్రవక్త ఇచ్చిన సలహాలు ప్రశంసనీయమైనవే ఐనా, ఆ దుర్నీతిని తొలగించేందుకు ఇస్లాం చేసిందేమీ లేదని తేటతెల్లం చేశారు.
ఇస్లాంలో కూడా సామాజికమైన వర్గీకరణ ఉందని, విదేశాలనుండి వచ్చిన వారి సంతానము, హిందూ అగ్రకులాల నుండి మతం మార్చబడినవారు 'షరాఫ్' లేదా 'అష్రఫ్' అను పేర్లతో గౌరవనీయులుగా భావింపబడుతూ ఉండగా మిగిలిన వారు(వివిధ వృత్తులవారు, ఇతర కులాలనుండి మతం మార్చ బడినవారు) 'అజ్లఫ్' అనే పేరుతో నీచులుగా వ్యవహరింపబడుతుంటారని, కొన్నిచోట్ల అర్జల్ అనుపేరుతో కట్టకడపటివారుగా భావింపబడే మూడవ వర్గం కూడా గుర్తింపబడినదని డా౹౹అంబేడ్కర్ తెలియజెప్పారు. ఈ మూడవ వర్గానికి మసీదులలో ప్రవేశించే అర్హతగాని, మహమ్మదీయ గోరీలదొడ్లను ఉపయోగించుకొనే అవకాశం గాని ఇవ్వబడలేదు.
హిందూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలు మాత్రమే గాక, మహమ్మదీయ సమాజంలో మరికొన్ని జాడ్యాలు అదనంగా ఉన్నాయి. మహమ్మదీయ స్త్రీల ను వెలుగులోకి రానివ్వకుండా ఉంచే పరదా పద్ధతి వాటిలో ఒకటి అంటూ దాని అనర్థాలను వివరించారు. మహమ్మదీయులలో సామాజిక దోషాలు ఉండటమే కాదు, వీటిని గుర్తించడానికి, తొలగించడానికీ ఏవిధమైన ప్రయత్నమూ చేయక పోవటమే అన్నింటికంటే ఎక్కువ ప్రమాదకరమని అంబేడ్కర్ నిర్ధారించాడు. ఇస్లాం అన్ని దేశాలకు, అన్ని కాలాలకూ వర్తించేదని, అది అపరివర్తనీయ మైనదనీ వారు గట్టిగా విశ్వసించటమే అందుకు కారణం.
డా౹౹అంబేడ్కర్ దీని గురించి గ్రహించిన కారణమిది- హిందువులు మహమ్మదీయులూ నిరంతరం ఘర్షణ పడుతూ ఉండాలని, ఆ జరిగే పోరాటంలో విజయం సాధించాలంటే తమలో తమకు విభేదాలు కలిగించే ఆలోచనల నన్నింటినీ అణిచిపెట్టి ఉంచాలనీ మహమ్మదీయులు భావించటమే.
ఈ అవగాహన ప్రాతిపదికపై మహమ్మదీయులు ఆనాడు రాజకీయంగాచొచ్చుకు వచ్చిన తీరును మూడు రకాలుగా విశ్లేషించారు.
1) 1892 నుండి 1932 వరకు మహమ్మదీయులు కోరిన కోరికలను తీర్చుతున్నకొద్దీ,మరిన్ని కోరికలను చేతబుచ్చుకొని రావటం- కోర్కెలజాబితా విస్తరిస్తూ ఉండటం.
2)హిందువుల బలహీనతలను సొమ్ముచేసుకొని తమ పంతం నెగ్గించుకోవటం.
3)రాజకీయాలలో గూండాగిరి పద్ధతులను అవలంబించి, అవసరమని భావించినప్పుడల్లా మతకల్లోలాలను రెచ్చగొట్టటం , వ్యాపింపజేయటం.
వీటిని నివారించడానికి 1932 నాటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ముస్లిం లీగ్ కోరిన కోరికలు- వాటిని కాంగ్రెసు అనుమతించిన తీరు ఉదాహ రించారు డా౹౹అంబేడ్కర్. దేశాన్ని విభజించాలనే మహమ్మదీయుల కోరిక విషయానికి వస్తూ- తామే స్వయంగా పరిపాలకులుగా ఉండే విధంగా తప్ప, ఒక స్వతంత్ర రాజ్యంలో హిందువులతో కలిసి జీవించడానికి సిద్ధపడే ప్రసక్తి లేదని ఆనాటి మహమ్మదీయ నాయకుల ఉపన్యాసాలను ఉదాహరించారు డా౹౹అంబేడ్కర్. మౌలానా ఆజాద్ సొభానీ ఇలా అన్నారు: "అధిక సంఖ్యాకులు, హిందువులూ అయిన 22కోట్ల శత్రువులతోనే మన యుద్ధం. ఎందుకంటే వారు బలపడితే హిందూస్థాన్ లోని మహమ్మదీయులనే కాదు, ఈజిప్టు, టర్కీ, కాబూల్, చివరికి మక్కాలోని మహమ్మదీయుల్ని కూడా మ్రింగివేస్తారు. కాబట్టి హిందువులు ఇక్కడ బలంగా పాతుకోకుండాను, ఆంగ్లేయులు వైదొలగు తునే మహమ్మదీయ పాలన నెలకొనేవిధంగానూ పోరాడటం, అందుకై ముస్లింలీగ్ లో చేరటం ప్రతి మహమ్మదీయునికీ అనివార్యమైన కర్తవ్యం"
హిందువుల పట్ల మహమ్మదీయులలో పేరుకు పోయిన వ్యతిరేకభావాలకు ఆంగ్లేయుల 'విభజించి పాలించు' సూత్రం మాత్రమే కారణం కాదని, దాని వెనుక చారిత్రకమైన, మతపరమైన, సాంస్కృతిక మైన వైముఖ్యాలు కారణమని, రాజకీయ వైముఖ్యం వాటికి ప్రతిబింబం మాత్రమేనని డా౹౹అంబేడ్కర్ గ్రహించారు. ఆ కారణంగా మహమ్మదీయులు - హిందువులు రెండు విభిన్న జాతులనే సిద్ధాంతాన్ని అంగీకరించాలని కూడా డా౹౹ అంబేడ్కర్ భావించారు. వారి రాజకీయ ఉద్దేశ్యాలు వేఱువేఱు దిశల్లో ఉన్న కారణంగాను, సాంస్కృతిక వైరుధ్యాల కారణంగానూ వారిని ఒకే రాజ్యంలో ఉండండని బలవంతం చేయజాల మని, మహమ్మదీయుల ప్రత్యేక జాతీయత సిద్ధాంతాన్ని ఒప్పుకోవలసి వస్తుందని గ్రహించారు. ఇలా భావించిన మొట్టమొదటి మహమ్మదీయేతర నాయకుడు డా౹౹అంబేడ్కర్.
ఒకసారి ఈ అవగాహనకు వచ్చిన తర్వాత దాని తార్కిక పరిణామాలను గురించి వేగంగా ఆలోచించి ఇలా ప్రతిపాదించారు. రెండు జాతులు కలిసి జీవించలే వనేదే దేశవిభజనకు కారణమైతే, నూతనంగా ఏర్పడే రాజ్యాలలో వేఱేజాతికి చెందిన అల్పసంఖ్యాకులను అలాగే ఉంచుకోవడంలో అర్థం లేదు. కాబట్టి జనాభా మార్పిడి జరుగవలసిందే. బల్గేరియా, గ్రీస్,టర్కీ లలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలా తరలివెళ్ళేవారికి ఆస్తుల సంరక్షణ లేక అమ్మకములకు సంబంధించిన హక్కులు, పింఛను హక్కులు మొదలైనవాటి గురించి చట్టాలు ముందుగానే రూపొందించుకోవాలని డా౹౹అంబేడ్కర్ సూచించారు.
ఏమైనాసరే పాకిస్తాన్ సాధించి తీరాలని ముస్లిం లీగ్ ప్రయత్నాలు ప్రారంభించిన నాటినుండి ఎంత తక్కువ నష్టంతో దీనినుండి బయటపడాలి, అందు కొరకు ఏమిచేయాలి అని డా౹౹అంబేడ్కర్ ఆలోచించ టమూ, తదనుగుణంగా వ్యవహరించటమూ ప్రారంభించారు. నెహ్రూ-గాంధీలు మాత్రం ఏవేవో వాగ్దానాలు చూపి ముస్లింలీగును మురిపించ వచ్చునని, దేశవిభజనను తప్పించవచ్చని భావిస్తూ, ఒక బేరం కుదరకపోతే మరొక బేరం చేస్తూచేస్తూ అలసిపోయారు. మానసిక పరిపక్వత ఉన్న మనుష్యుల మధ్య కుదుర్చుకొనే పరిష్కారం వంటిదానిని డా౹౹అంబేడ్కర్ సూచించిగా, భగ్నమై పోతున్న తమ కలలను, నినాదాలనూ విడిచిపెట్టి మరో ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడానికి నెహ్రూ గాంధీలు సిద్ధపడలేదు.
జనాభా మార్పిడి ప్రతిపాదనను కాంగ్రెసు వ్యతిరే కించింది. అత్యంత ఆవశ్యకమైన ఈ చర్యకు పూనుకోలేదు సరికదా, నిరసించింది కూడాను. అయినా 1947లో పాక్షికంగా జనాభా మార్పిడి జరిగింది. అయితే ముందుయోజన, సంసిద్ధత లేకుండా జరిగినందున 6 లక్షలమంది పాకిస్తాన్ గా ఏర్పడిన ప్రాంతాలనుండి మిగిలిన భారతదేశం వైపుగా వస్తూ, దారిలో హతమైనారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లనుండి నేటికీ ప్రజలు వస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లు ఒక్క హిందువుకూడా మిగలని ఒకేమత ప్రజానీకంతో కూడిన రాజ్యాలుగా రూపొందినాయి లేదా రూపొందుతున్నాయి. భారత దేశంలో నిలిచిపోయిన అల్ప సంఖ్యాకవర్గాలు తమ పూర్వపు ఆటను కొనసాగిస్తూనే ఉన్నాయి. డా౹౹ అంబేడ్కర్ దూరపుచూపుతో యిచ్చిన సలహాను పాటించని కారణంగానే ఈనాడు కాశ్మీరు లోయలో, డోడాలో, అసమ్ లో, త్రిపురలో బెంగాలులో భయానక విపత్కర పరిస్థితులు నెలకొంటున్న వనేది స్పష్టం.
మరొకమాటకూడా గుర్తుతెచ్చుకోవాలి. 1947లో పాకిస్తాన్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా చేయబడిన జోగేంద్రనాథ్ మండల్ ఇలా పిలుపు నిచ్చారు- "పాకిస్తాన్ లోఉన్న షెడ్యూల్డు కులాల వారందరూ జిన్నాను తమ రక్షకునిగా సంభావించు కోవాలి. మహమ్మదీయులతో కలిసి ఉన్నందుకు గర్విస్తున్నట్లుగా పతకాలు (బేడ్జీలు) ధరించండి" అని. దానికి డా౹౹అంబేడ్కర్ వెంటనే ప్రతి స్పందించారు. పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి రాదలచిన షెడ్యూల్డుకులాలవారిని అడ్డుకొని, వారిని మతం మార్చే ప్రయత్నాల గురించి ఫిర్యాదు చేశారు.
మహమ్మదీయుల సంఖ్య పెంచటం కోసం హైదరాబాద్ ప్రాంతంలో కూడా షెడ్యూల్డు కులాల వారిని బలవంతంగా మతం మార్పిడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. "ఈనాడు పాకిస్తాన్ లో చిక్కబడిపోయిఉన్న షెడ్యూల్డుకులాలవారికి నేను చెప్పేది ఒకటే- మీకు ఏ సాధనం లభిస్తే ఆ సాధనం ఉపయోగించుకొని, ఏమార్గం అందుబాటులో ఉంటే ఆమార్గంద్వారా భారతదేశానికి వచ్చేయండి. పాకిస్తాన్ లోఉన్న వారైనా, హైదరాబాద్ లో ఉన్న వారైనా వారు మహమ్మదీయులను, ముస్లిం లీగునూ నమ్ముకోవటమంటే మృత్యువును కౌగిలించు కోవటమే. హిందువులపై అయిష్టం కారణంగా ముస్లింలను తమ హితులుగా భావించుకోవటం షెడ్యూల్డు కులాల వారికి అలవాటయి పోయింది. ఈ దృష్టి సరైనది కాదు." అని స్పష్టీకరించారు డా౹౹ అంబేడ్కర్. అలాగే భారతదేశానికి శత్రువుగా వ్యవహరిస్తున్న నిజాం నవాబు పక్షాన చేరి తమ జాతికి తలవంపులు తీసికొని రావద్దని కూడా ఆయన హైదరాబాద్ లోని షెడ్యూల్డు కులాల వారిని హెచ్చరించారు. (1994 ఆగస్టు స్ఫూర్తి పత్రిక నుండి) -వడ్డి విజయసారథి.
No comments