Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్ర్య పోరాటంలో 16 ఏళ్లపాటు వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన సోహన్ సింగ్ భాఖ్నా - About Sohan singh bhakna

‘అది జైలు అయినా, బయట అయినా, ఓ నిజమైన విప్లవవీరుడి పోరాటం ఎన్నడూ ఆగదు. వారి పోరాటం మొత్తం బానిసత్వం, అన్యాయానికి వ్యతిరేకంగానే’ - సోహన్ సింగ్...



‘అది జైలు అయినా, బయట అయినా, ఓ నిజమైన విప్లవవీరుడి పోరాటం ఎన్నడూ ఆగదు. వారి పోరాటం మొత్తం బానిసత్వం, అన్యాయానికి వ్యతిరేకంగానే’ - సోహన్ సింగ్ భాఖ్నా.

అమానవీయమైన శిక్షలకు చిరునామాగా మారిన అండమాన్ సెల్యులార్ జైలులో, దేశ స్వాతంత్ర్య పోరాటంలో సర్వం త్యాగం చేసి క్రూరమైన శిక్షలను అనుభవించిన భారతీయ విప్లవవీరుడు, పోరాటయోధుడు, గదర్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సోహన్ సింగ్ భాఖ్నా 1870 జనవరిలో సర్దార్ కరమ్ సింగ్, మాతా రామ్ కౌర్ దంపతులకు సోహన్ సింగ్ జన్మించారు. వీరికి ఏడాది వయసున్నప్పుడే తండ్రి పరమపదించారు. వీరి కుటుంబం ఆర్థికంగా కాస్త పర్వాలేదన్నట్లుగానే ఉన్నప్పటికీ, తండ్రి సర్దార్ కరమ్ సింగ్ మంచి మనసుతో పేదలకు పంటలో భాగాన్ని పంచడం, ఆస్తులను పంచి ఇవ్వడం కారణంగా కొంత కాలానికే ఆస్తులన్నీ కరిగిపోయాయి.

తన ఆత్మకథ ‘జీవన్ సంగ్రామ్’లో ‘మాకు భూములు బాగానే ఉండేవి. కానీ మా నాన్నగారు ఆదర్శవంతమైన సిక్కుగా, తనకున్న దాన్ని మంచి పనుల కోసం విరివిగా పంచి పెట్టారు’ అని సోహన్ సింగ్ పేర్కొన్నారు. తదనంతర పరిస్థితుల్లో బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులను చదువుకునేలా ప్రోత్సహించలేదు. దీంతో నిరక్షరాస్యులైన భారతీయులను సులువుగా పక్కదారి పట్టించి, పూర్తి ఆధిపత్యం చలాయించేందుకు వీలైంది. కానీ సోహన్ సింగ్ తల్లి మాత్రం తన కుమారుడిని బాగా చదివించాలని నిశ్చయించుకుంది. కానీ అందుబాటులో చాలా తక్కువ సంఖ్యలోనే పాఠశాలలుండేవి. ప్రారంభంలో గురుద్వారాలో విద్యనభ్యసించేందుకు వెళ్లినా, ఆ తర్వాత ఉర్దూ పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఐదో తరగతి వరకు అక్కడే చదివిన సోహన్ సింగ్, ఆ తర్వాత చదువుకు ముగింపు పలకాల్సి వచ్చింది. చిన్నాచితకా పనులు చేసిన సోహన్ సింగ్. 1907లో ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లారు.

అమెరికాకు వెళ్లిన ప్రారంభంలో సోహన్‌సింగ్ తో పాటు వారి మిత్రులకు జీవితం చాలా విచిత్రంగా, ఇబ్బందికరంగా ఉండేది. అక్కడ భారతీయులతో వ్యవహరించే అనుచిత విధానాన్ని వారు ప్రత్యక్షంగా అనుభవించారు. భారతదేశం విదేశీయుల పాలనలో ఉన్నకారణంగానే తమతో దారుణంగా వ్యవహరిస్తున్నారనేది వారికి బాగా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే సోహన్ సింగ్, లాలా హర్దయాల్, బాబా కాన్షీరామ్ కలిసి ‘ద పసిఫిక్ కోస్ట్ హిందీ అసోసియేషన్’ను స్థాపించారు. తదనంతరం ఇది గదర్ పార్టీగా పేరుమార్చుకుంది. ఈ అసోసియేషన్‌కు సోహన్ సింగ్ తొలి అధ్యక్షుడు.

ఈ అసోసియేషన్ ‘గదర్’ అనే పత్రికను, ‘గదర్ దీ గుంజ్’ పేరుతో కరపత్రాలను ముద్రించి పంచేవారు. దీని ద్వారా భారత జాతీయవాదులంతా ఒక్కటై బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మాతృభూమికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కల్పించడమే ఈ పత్రిక, కరపత్రాల లక్ష్యంగా ఉండేది. అమెరికాలో ఉన్న భారతీయుల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించి.. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వారిని ఏకం చేయడంలో ఈ ప్రయత్నం విజయవంతమైంది.

దీని కారణంగానే అమెరికాలో స్థిరపడిన చాలా మంది గదర్ పార్టీ సభ్యులు, అక్కడున్న సుఖవంతమైన జీవితాన్ని వదిలి భారతదేశానికి స్వాతంత్ర్యం కలిగించే మహాయజ్ఞంలో తాము కూడా సమిధలుగా మారేందుకు భారతదేశానికి తిరిగొచ్చారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దేశానికి స్వాతంత్ర్యం కల్పించే ఏకైక లక్ష్యంతోనే వీరు వస్తున్నట్లుగా సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం, వీరు ప్రయాణిస్తున్న నౌక భారతదేశ జలాల్లోకి రాగానే వారందరినీ అరెస్టు చేసింది. ఇందులో సోహన్ సింగ్ కూడా ఉన్నారు.

ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు ‘లాహోర్ కుట్ర కేసు’ అనే పేరుతో కొందరికి మరణశిక్షను విధించారు. అందులో సోహన్ సింగ్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే ఈయనకున్న ఇల్లును, కొన్ని ఆస్తులను అధికారులు జప్తుచేసుకున్నారు. దీనిపై విచారణల అనంతరం మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చి, సోహన్ సింగ్‌ను అండమాన్‌ సెల్యులార్ జైలుకు పంపించారు.

అక్కడ సోహన్‌ సింగ్ తో పాటు ఇతర గదర్ పార్టీ సభ్యులను ఇతర ఖైదీల్లాగే చిత్రహింసలు పెట్టారు. అసాధ్యమైన పనులను అప్పజెబుతూ, అమానవీయమైన, క్రూరమైన శిక్షలను వేస్తూ విధించేవారు. నిర్ణీత సమయంలో పని పూర్తికాకపోతే పరిస్థితి ఊహించేందుకు కూడా వీల్లేనంత కఠినంగా వ్యవహరించేవారు. బేడీలు వేసి ముఖానికి గోనె సంచులు కట్టి నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టేవారు. ఇంతకన్నా క్రూరమైన శిక్షలెన్నో విధించేవారు.

జైల్లోని ఖైదీలకు సరిగ్గా భోజనం ఇచ్చేవారు కాదు. దీంతో దినమంతా గొడ్డుచాకిరీ చేసిన తర్వాత ఆకలితో అలమటించాల్సి వచ్చేది. కొందరు ఖైదీలకు కనీసమైన మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉండేది కాదు. ఇలా ఖైదీల పట్ల వారు వ్యవహరించే పద్ధతులు ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉండేవి.

విపత్కర పరిస్థితుల్లోనూ మనోనిగ్రహాన్ని కోల్పోని చాలా తక్కువమంది వ్యక్తుల్లో సోహన్ సింగ్ ఒకరిగా చెప్పుకోవచ్చు. జైలులో అనుసరిస్తున్న అమానవీయ, క్రూరమైన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ, తోటి గదర్ పార్టీ సభ్యులు, ఇతర తోటి ఖైదీలతో కలిసి గొంతెత్తి ప్రశ్నించేవారు. పలుమార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. మంచి భోజనం, దుస్తులు, కనీస పారిశుద్ధ్య అవసరాల కోసం వీరు చేసిన విజ్ఞప్తులు, నిరసనలను జైలు అధికారులు నిర్ద్వందంగా తిరస్కరించేవారు. అయినా సోహన్ సింగ్‌తోపాటు పలువురు తమ ప్రయత్నాలను కొనసాగించారు. దీంతో దిగొచ్చిన బ్రిటీష్ అధికారులు కొన్ని డిమాండ్లను అంగీకరించారు. అనంతరం, 1921లో సోహన్ సింగ్‌తోపాటు కొందరు ఖైదీలను మద్రాసులోని పలు జైళ్లకు పంపించారు. ఆ తర్వాత వారిని ఒక జైలు నుంచి మరో జైలుకు మారుస్తూ పోయారు. పోయిన ప్రతి కొత్తజైల్లోనూ సరికొత్త సమస్యలు, సవాళ్లు సోహన్ సింగ్ కు స్వాగతం పలికేవి. అయినా వారి పట్టుదల ఏమాత్రం సడలలేదు.

1929లో లాహోర్ జైలులో భగత్‌సింగ్‌తో పాటు ఇతర ఖైదీలతో కలిసి నిరాహార దీక్షకు కూర్చున్నారు. పెద్ద వయసును దృష్టిలో పెట్టుకుని సోహన్ సింగ్‌ను ఈ నిరసనలో పాల్గొనవద్దని అందరూ అభ్యర్థించారు. అండమాన్ జైలుతోపాటు పలు ఇతర జైళ్లలో కనీస వసతులకోసం డిమాండ్లతో నిరాహార దీక్షలు చేసిన కారణంగా, అప్పటికే వారి ఆరోగ్యం చాలా క్షీణించింది. కానీ సోహన్ సింగ్ మాత్రం నిశ్చలంగా ‘నా శరీరానికి వృద్ధాప్యం వచ్చి ఉండొచ్చేమో గానీ, నాలోని విప్లవ పోరాట యోధుడికి మాత్రం కాదు’ అని చెప్పి అక్కడున్న వారిలో మరింత స్ఫూర్తిని, తుదిశ్వాస వరకు మాతృభూమికోసం పోరాడే కసిని రగిలించారు. దాదాపు 16 ఏళ్లపాటు వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన తర్వాత 1930లో విడుదలయ్యారు.

మన స్వాతంత్ర్య పోరాటయోధులు జైళ్లలో అమానవీయమైన, అమానుషమైన శిక్షలను అనుభవించి, ఎంతటి దారుణమైన శారీరక బాధలను అనుభవించినప్పటికీ, తమ స్వాతంత్ర్య సాధన కాంక్షను, ఇందుకోసం పయనించాల్సిన మార్గాలను ఎప్పుడూ విడువలేదు, మరువలేదు. అంతటి త్యాగవీరుల ధైర్యసాహసాలను, చిత్తశుద్ధిని, ఆత్మత్యాగాన్ని మనం నిరంతరం గుర్తుచేసుకోవాలి. వారి పోరాట ఫలితంగానే మనం ఈనాడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామనే విషయాన్ని మరువ కూడదు. జైహింద్...!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments