హైందవీ స్వరాజ్ ను స్థాపించిన శివాజి: దౌష్ట్యమైన మొగలుల పాలనలోకెల్లా పరాకాష్ట ఔరంగజేబు పాలన. భారత దేశంలో పరంపరాగతంగా వస్తున్న అనేక శక్తివంతమై...
మహారాష్ట్ర, మధ్యభారత్ ప్రాంతాలలో ఒక ప్రక్క సమర్థ రామదాసస్వామి, మరోప్రక్క ఛత్రపతి శివాజి చేసిన కృషి ఫలితంగా ఈ దేశం ప్రాచీనమైన హిందూ సంస్కృతి గల దేశంగా తనను తాను నిలద్రొక్కుకోగలిగింది. ఛత్రపతి శివాజి తన సైనికుల ముందు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంచాడు. ఆ లక్ష్యసాధనకు విశేష కృషి చేసాడు. 'హైందవీ స్వరాజ్'ను సాధించడమే శివాజి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వేలమంది సుశిక్షిత సైనికులను నిర్మాణం చేసుకొన్నాడు. దానికోసం స్వదేశీ రాజులతో యుద్ధం చేయవలసి వచ్చినా కూడా వెనుకాడలేదు. తన సైనికులలో కూడా క్రమశిక్షణా రాహిత్యాన్ని అంగీకరించక పోగా కఠినంగా శిక్షించేవాడు.
శివాజి సైనికులలో రాజభక్తి కంటే 'హైందవీ స్వరాజ్' సాధించే సంకల్పం ఎక్కువగా కనబడేది. దాని కారణంగానే శివాజి అద్భుత విజయాలు సాధించాడు. శివాజి సాగించిన పోరాటం అద్భుతం. ఒక ప్రక్క బహ్మనీ సుల్తాన్ లు, రెండవ ప్రక్క మొగలులు ఇరువురితో పోరాటం సాగింది. శివాజి సామ్రాజ్యాన్ని నాశనం చేయటానికి శివాజి చనిపోయిన తరువాత కూడా ప్రయత్నాలు కొనసాగాయి. ఔరంగజేబు 25 సంవత్సరాల పాటు ఢిల్లీని వదలి వచ్చి మహారాష్ట్రలో తిష్ట వేసి శివాజి సైనికులతో పోరాటం చేసాడు. చివరకు శివాజి సైన్యం ధాటికి తట్టుకోలేక వెన్ను చూపి పారిపోయాడు. ఇదంతా మొగలులపై శివాజి సాగించిన ధర్మయుద్ధం. ఎటువంటి శత్రవుతో ఎట్లా వ్యవహరించాలో కూడా శివాజి నేర్పించాడు.
హిందూ సమాజంలో స్వాభిమానం జాగృతం చేసినవాడు శివాజి. వందల సంవత్సరాలుగా ఇస్లాం ఆక్రమణలో ఉన్న భారతదేశంలో ఎవరూ సామ్రాట్ గా పట్టాభిషేకం చేసుకోలేదు. శివాజి సామ్రాట్ గా పట్టాభిషేకం చేసుకొన్నాడు. శివాజి 1674 సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం నాడు "క్షత్రియ కులావతంసా సింహాసనాధీశ్వర మహారాజ:" అంటూ జరిగిన కీర్తనల మధ్య ఛత్రపతి శివాజి పట్టాభిషేకం అత్యంత వైభవంగా, ఘనంగా, కన్నుల పండువలా జరిగింది.
అప్పుడప్పుడే భారత్ లో ప్రవేశిస్తున్న ఐరోపా దేశాల వారిపై ఒక కన్ను వేసి ఉంచవలసిన అవసరం ఏర్పడింది. వారి ఆగడాలను అరికట్టడంలో కూడా శివాజి విజయం సాధించాడు. అష్ట ప్రధానులతో చక్కటి ధర్మబద్ధ పాలనను ప్రజలకు అందించాడు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో తిలక్ మహాశయుడు శివాజి జయంతి ఉత్సవాలను నిర్వహించి ప్రజలను జాగృతపరిచాడు. శివాజి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్లు విధించిన 'గృహ నిర్బంధం' నుండి బయటపడి జర్మని చేరి ఒక ప్రక్క రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే మరోప్రక్క జపాన్ కేంద్రంగా భారత స్వాతంత్ర్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించి ఆంగ్లేయులపై యుద్ధం సాగించాడు. ఇలా శివాజి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అమెరికాతో జరిగిన యుద్ధంలో తమకు విజయం లభించటానికి స్ఫూర్తి శివాజి జీవితమే అని వియత్నాం చెప్పుకొన్నది.
శివాజి హిందూ సమాజం, హిందూ ధర్మ రక్షణ కొరకు సాగించిన పోరాటం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ల రాజ్యం సాగుతున్న కాలంలో ఎక్కువగా కొనసాగలేదు. బ్రిటిష్ వాళ్లు ఈ దేశ చరిత్రను, ఈ దేశ ఆదర్శాలను నాశనం చేసే ప్రయత్నం చేసారు. ఈ దేశంలో పాశ్చాత్య ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసి కొనసాగించారు. అందులో సెక్యులరిజం కూడా వచ్చింది. హిందుత్వం భారత జాతీయతగా నిర్మాణం కాకుండా కుట్ర పన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా అదే కొనసాగుతూ వచ్చింది. హిందుత్వం అంటే మతతత్వం అని, మెజార్టీ ప్రజల మతతత్వం మైనార్టీల మతతత్వం కంటే ప్రమాదకరమని నూరిపోశారు. ఇదే పాఠాన్ని ఇక్కడి రాజకీయ పక్షాలు ఒంటబట్టించుకొన్నాయి. అందుకే సెక్యులరిజం సంరక్షణకు తాము కటిబద్ధులుగా ఉన్నామని ఎన్నికలప్పడు పదేపదే ప్రకటించుకొంటూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి, హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ విశేషంగా కృషి చేస్తున్నది.
నేడు భారతదేశంలో హిందుత్వ చైతన్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. హిందూ సమాజం జాగృతమౌతున్నది. శివాజి మహరాజ్ వ్యవహార శైలిని ఆదర్శంగా తీసుకొని ఇంకా హిందూ సమాజం చైతన్యం కావాలి. ఇదే హిందూసామ్రాజ్య దినోత్సవ సందేశం.
No comments