తిరుమల పరిధి - ఏడుకొండలు - జీవోలు ఏడుకొండలు - వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు జి. వో.746 తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ 2 జూన్,...
తిరుమల పరిధి - ఏడుకొండలు - జీవోలు
ఏడుకొండలు - వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు
జి. వో.746
తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ 2 జూన్, 2007న రాష్ట్ర ప్రభుత్వం జి.వో. 746 జారీ చేసింది. ఈ జి.వో.లో క్రింది అయిదు ప్రధానాంశాలున్నాయి.
1. ఏడుకొండలు అనగా శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రిలతో కూడినదే తిరుమల.
2. చంద్రగిరి నుంచి, తిరుపతి నుంచి, బాలపల్లి నుంచి తిరుమలకు వెళ్లే మార్గాలు, ఏడుకొండల మీద నున్న అన్ని తీర్థాలకు వెళ్లే మార్గాలు తిరుమల క్రిందికే వస్తాయి.
3. తిరుమలలో మద్యపానం, మాదక పదార్థాలు సేవించడం, సిగరెట్లు త్రాగడం, మాంసాహారం, జంతువధ, వేట, జూదం నిషిద్ధం. తిరుమలలో భిక్షమెత్తుకొనడం కూడా నిషిద్ధం.
4. తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నికలుండవు. రాజకీయ కార్యకలాపాలుండవు. అక్కడి సాధారణ పరిపాలనా వ్యవహారాలన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చూచుకొంటాడు.
5. ఒక మతానికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 22 మే 2007న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సు ప్రకారం తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించబడింది.
ఇప్పటి వరకు వచ్చిన జి.వో. లతో పోలిస్తే జి.వో.746 హిందువుల మనోభావాలకు చాలావరకు అనుగుణంగా ఉంది.
కాని దీనిలో రెండు ప్రధానమైన అసంధిగ్ధతలున్నాయి. అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. వీటిని క్రైస్తవ మిషనరీలు ముందు ముందు తమ ప్రచారానికి అనుకూలంగా వుపయోగించుకొనే ప్రమాదం ఉంది.
జి.వో.746 దాటవేసిన అంశాలు:
1. జి.వో.746 కీలకమైన తిరుమల భౌగోళిక సరిహద్దుల అంశాన్ని దాటవేసింది. ఏడుకొండల విస్తీర్ణాన్ని ఎవరిష్టమొచ్చినట్లు వారు చెప్పుకోవచ్చు.
2. ఈ జి.వో.లో పాపవినాశ, సనకసనంద మొదలగు 10 పుణ్యతీర్థాలను ఏడుకొండలతో కూడిన తిరుమల నుంచి వేరు చేసి చూపడం జరిగింది. (పేరా 6) ఈ తీర్థాలన్ని ఏడుకొండల సానువుల నుంచి జారే జలధారలకు సంబంధించినవే. గోపాల, శేషతీర్థాలు శేషశైలానికి సంబంధించినవి. తుంబుర, రామకృష్ణ, కుమారధార, పసుపు తీర్థాలు వృషభాద్రివి. భీమతీర్థం గరుడాద్రిపై ఉంది. ఈ జి.వో.లో పేర్కొనబడని తీర్థాలు కూడా ఎన్నో వున్నాయి. జాబాలి, ఆకాశగంగ అంజనాద్రిపై వున్నాయి. చక్ర, వైకుంఠ, సీతమ్మ తీర్థాలు శేషశైలంపై ఉన్నాయి. అటువంటపుడు ఏడుకొండలమీద అన్యమత ప్రచారాన్ని నిషేధించిన తర్వాత మళ్లీ ఈ తీర్థాలలో కూడా నిషేధిస్తున్నామని చెప్పాల్సిన అవసరమేముంది?
బ్రిటిష్ పాలకుల దుర్మార్గం
1879 జి.వో.
ఏడుకొండల మీదగల అటవీ సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతో ఏడుకొండల నుంచి శ్రీవారి ఆలయాన్ని వేరు చేస్తూ, తిరుమలను కేవలం 4.5 చదరపు మైళ్లకు పరిమితం చేస్తూ, సెక్రటరీ సి.ఎ. గాల్టన్ (మద్రాసు ప్రెసిడెన్సీ) 18.1.1879న ఒక జి.వో. జారీ చేశాడు.
ఈ ఉత్తర్వుకు అనుగుణంగా సర్వే చెయ్యడానికి వచ్చిన షఫీల్డ్ (అటవీ అధికారి) కు మహంత్ తన నిరసన తెలియజేశాడు. తిరుమల అటవీ ప్రాంతంలో కనీసం సగమన్నా తనకు స్వాధీనం చెయ్యమని ప్రాధేయపడ్డాడు.
50 సంవత్సరాల నిరంతర వేడికోలు తర్వాత బ్రిటిషు ప్రభుత్వం తిరుమల పరిధిని 10 1/3 చదరపు మైళ్లుగా నిర్ణయిస్తూ 12.5.1924న ఉ త్తర్వులు జారీచేసింది.
1940 జి.వో.
1933లో మద్రాసు ప్రభుత్వం తిరుమల - తిరుపతి దేవస్థానముల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఆ చట్టం (మద్రాసు చట్టం 29/1933) ఆధారంగా తిరుపతి మునిసిపాలిటీలో తిరుమలను విలీనం చేస్తూ 13.9.1940న బ్రిటిషు ప్రభుత్వం జి.వో.1429ని జారీ చేసింది. దానిప్రకారం అదివరకే నిర్ణయించిన 10 1/3 చ.మై విస్తీర్ణంతోపాటు, చంద్రగిరి నుంచి, తిరుమల నుంచి, బాలపల్లి నుంచి తిరుమలకు వెళ్లే మార్గాలను, శేష- తుంబురు- కుమారధార- పసుపు- సనకసనంద- రామకృష్ణ- పాపవినాశ- భీమ- గోపాల తీర్థాలకు వెళ్లేదారులను తిరుమల పరిధిలోకి చేర్చారు. జి.వో. తిరుమలను ఒక గ్రామంగా ప్రకటించింది. అయితే తిరుమల గ్రామానికి పంచాయితీ బోర్డు ఉండదు. పాలనాపరమైన పనులన్నీ తి.తి.దే. కమిషనర్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి.
అప్పటినుంచి 1940 జి.వో. పునావృతమవుతూ వచ్చింది.
కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కుట్ర
కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1963లో పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్ర ఫలించివుంటే ఈనాడు తిరుమల పరిస్థితి ఎంతో దయనీయంగా వుండేది.
చిత్తూరుజిల్లా కలెక్టర్ 21.5.1963న గోప్యంగా ఈ క్రింది ప్రమాదకరమైన ప్రతిపాదనలను రెవిన్యూ బోర్డుకు పంపాడు. (హెచ్ 4-8425/ 344/63).
1. తిరుమల చుట్టూ నిరుపయోగంగా పడివున్న భూమిని (గతంలో తితిదేకు ప్రభుత్వం ఇచ్చినది) ఇండ్ల స్థలాలుగా మార్చి తిరుమలలో నివాసం వుంటున్న వారికి పట్టాలివ్వాలి. (ఆచరణలో దీన్ని బాగా దుర్వినియోగం చెయ్యొచ్చు.)
2. తిరుమల పరిధి (10 1/2 చ.మై) లోని భూములను ప్రభుత్వానికి లీజుకిచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఇప్పటివరకూ చేసుకొన్న లీజు ఒప్పందాలన్నీ రద్దు కావాలి. ఈ భూములమీద దేవస్థానం అవసరాలకన్నా ప్రభుత్వ అవసరాలకే ప్రాధాన్యత వుండాలి. ఈ భూముల మీద యాజమాన్యపు హక్కులు ప్రభుత్వానివే.
3. తిరుమలకు హిందువులు కాని వారు వెళ్లగూడదనే నిబంధనకు కాలం చెల్లింది
ఈ ప్రతిపాదనలపై తి.తి.దే వారితో చర్చించి రిపోర్టు తయారు చెయ్యవలసిందిగా ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీ కె.జి.దేశికన్ ను నియమించింది.
తిరుమల విస్తీర్ణాన్ని 10 1/3 చ.మై నుంచి కుదించటాన్ని దేశికన్ తిరస్కరించాడు. ప్రైవేటు వ్యక్తులకు తిరుమల కొండమీద స్థలాలకు పట్టాలివ్వకూడదని కూడా సూచిస్తు చిత్తూరు జిల్లా కలెక్టర్పై అక్షింతలు వేశాడు. ఆవిధంగా దేశికన్ పుణ్యమా అని తిరుమల విస్తీర్ణం ఆమాత్రంగానైనా మిగిలింది. 1.4.1965 నాటి జి.వో.1784లో యధాస్థితి కొనసాగించబడింది.
1975 జి.వో.
2.12.1975 రాష్ట్ర ప్రభుత్వం జి.వో. 1606ను జారీ చేసింది. దాని ప్రకారం అదివరకువలె తిరుమల విస్తీర్ణం 27.5 చ.కి.మీ. (చ.మై.లో 10 1/3)
2005 జి.వో.
రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 16.9.2005న జారీచేసిన జి.వో.నెం. 338 తిరుమల పరిధిని 27.5 చ.కి.మీ.గా కొనసాగిస్తూ దాని హద్దులు కూడా పేర్కొన్నది. ఈ 1940 జి.వో. లో పేర్కొన్నవే.
తితిదే తీర్మానం నెం. 302 (27.7.2006)
2005లో విడుదలైన జి.వో. లో కాని అంతకుముందు విడుదలైన జి.వో.ల్లో కాని నిర్ధారించబడిన 27.5 చ.కి.మీ. తిరుమల విస్తీర్ణంలో అన్ని కొండలూ రావని ప్రజలు ఆందోళన చేశారు.
ఆ ఆందోళన కారణంగా తితిదే స్పెసిఫైడ్ అథారిటీ 27.07.2006న తిరుమల సరిహద్దుల విషయంలో మార్పులు చేయాలని సూచిస్తు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో తిరుమల విస్తీర్ణం 322.68 చ.కి.మీ.గా ఉండాలని పేర్కొనబడింది.
తిరుమల హద్దులు ఈ క్రింది విధంగా ఉండాలని తీర్మానం పేర్కొన్నది:
తూర్పు: కరకంబాడి రిజర్వు ఫారెస్టు ఆగ్నేయ మూల నుంచి బయలుదేరి కరకంబాడి రిజర్వు ఫారెస్టు తూర్పు సరిహద్దు వెంబడి (రైల్వేట్రాక్ ప్రక్క నుంచి) చిత్తూరు జిల్లా సరిహద్దు వరకు.
ఉత్తరం: చిత్తూరు జిల్లా సరిహద్దు నుంచి, తలకోన, చామల రిజర్వు ఫారెస్టుల వాయవ్య సంగమం వరకు.
పశ్చిమం: తలకోన, చామల రిజర్వు ఫారెస్టుల సంగమం నుంచి బాకర్ పేట రిజర్వు ఫారెస్టు వెంబడి మైలాద్రిపల్లి గ్రామం వరకు, అక్కడి నుంచి దక్షిణదిశగా బాకరపేట రిజర్వు ఫారెస్టు పశ్చిమ బౌండరీ వెంబడి తిరుపతి - బాకరపేట రోడ్డు వరకు
దక్షిణం: తిరుపతి - బాకర్పేట రోడ్డు వెంబడి నాగపట్ల రిజర్వు ఫారెస్టు వరకు అక్కడి నుంచి అలిపిరి, ఆల్వార్ తీర్ధం వరకు అయితే జి.వో. 746 ఈ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు.
ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన జి.వో.లు ఎన్ని ఉన్నప్పటికీ ఆ జి.వో.లలో ఎవో ఒక లొసుగులు ఉంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దేవదేవుడి విషయంలో జాగ్రత్తగా మసులుకుని పాలించాలని... పాలకుల మనసులు మారాలని దేవదేవుణ్ణి ఆయన భక్తులుగా వేడుకుందాము.....
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
nice ji
ReplyDelete