ఒక ముద్ర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.. ఒక ముద్ర ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. ఒక ముద్ర ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది.. ప్రాచీన యోగ ...
ఒక ముద్ర ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది..
ఒక ముద్ర ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది..
ప్రాచీన యోగ ముద్రల్లో ఆధునిక జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారలున్నాయి... యోగ ముద్రల గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం...
లోతుగా మనం పరిశీలిస్తే అవేశం వస్తే పిడికిళ్ళు బిగుసుకుంటాయి.. దీర్ఘాలోచన వస్తే చూపుడు వేళ్ళన్నీ ఆకాశాన్ని చూస్తాయి... ఎదుటి వారిపై గౌరవం కలిగితే చేతులు ముకుళితం అవుతాయి... అభ్యర్ధించేప్పుడు చేతులు బిక్షపాత్రలా మారిపోతాయి... ఎదుటివారిని నిలదీసేప్పుడు చూపుడు వేలు దూసుకెళ్తుంది... ఏదైనా అద్బుతం జరిగితే చూపుడు వేలు బొటన వేలు సున్నాలా చుట్టుకుంటయి... ఎవరినైనా ఆశీర్వదించాలంటే అరచేయి పుష్పంలా మారిపోతుంది... మన చేతి వేళ్ళతో ఈ విధంగా అనేకం మనకు తెలియకుండానే ఎన్నో ముద్రలు చేస్తుంటాం..
మనం ప్రాథమిక విద్యనభ్యసించే సమయంలో మంచినీళ్ళకోసం బొటలవ్రేలు చూపిస్తాం బొటనవ్రేలు అగ్నికి ప్రతీక అగ్నిని చల్లార్చడానికి నీళ్ళు త్రాగాలి. అలాగే పాసుకి వెళ్ళాలంటే చిటికెన వ్రేలు చూపిస్తాం చిటికిన వ్రేలు జలత్వానికి ప్రతీక మనకు తెలీకుండానే అన్నీ మనచేత మన పూర్వీకులు చేయించారు.
ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. అయితే యోగసాధనకు కాల నియమం ఉంది. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు. అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. చేతివేళ్లు, అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికీ కేంద్ర స్థానాలు ఉంటాయి. ఇందులో మన శరీరానికి అరచేయి ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన చేతి వేళ్ల ద్వారా మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు. మన చేతివేళ్లు అయిదూ పంచభూతాల్లో ఒక్కో తత్త్వానికి సంకేతం. చిటికెన వేలు జలతత్త్వం, ఉంగరపు వేలు పృధ్వీతత్త్వం, బొటనవేలు అగ్నితత్త్వం, ఇలా ఒక్కో వేలు ఒక తత్త్వాన్ని సూచిస్తుంది. చేతి కొసల మధ్యలో కణుపుల వద్ద, మూలాలలో బొటనవేలితో కలపడం లేదా దగ్గరగా ఉంచడం వల్ల ఎన్నో ముద్రలు తయారవుతాయి. ఈ ముద్రలను సాధన చేయడం వల్ల ఒక్కో రకమైన ఫలితం వస్తుంది. మనిషి రుగ్మతను బట్టి ఆయా తత్త్వాలను నియంత్రించడం యోగ ముద్రలతో సాధ్యపడుతుంది. వీటిని సాధన చేసే కొద్దీ వీటి ప్రయోజనాలు అనుభవంలోకి వస్తాయి. వాటిలో కొన్ని సులభమైన ముద్రలను చూద్దాం.
జ్ఞానముద్ర
బొటనవేలు చూపుడు వేలు కలిపి గట్టిగా ఒత్తాలి. మిగిలిన మూడు వేళ్ళను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర మనోశక్తిని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. కోపాన్ని నియంత్రిస్తుంది. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే మానసిక గందరగోళం విడిపోయి స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి.
వాయుముద్ర
బొటనవేలును కొద్దిగా వాల్చి చూపుడు వేలును సున్నా ఆకారంలో మడవాలి. ఈ ముద్ర వల్ల శరీరంలోని వృథా వాయువులను బయటకు పంపుతుంది. గ్యాస్, ఛాతినొప్పి నివారిస్తుంది. పక్షవాతం, మోకాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు రాకుండా చేస్తుంది.
శూన్యముద్ర
మధ్యవేలుతో బొటనవేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా ఉంచాలి. ఈ ముద్రతో చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్టుండి తలతిరగడాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది. ఇది క్రమశిక్షణ, ఓర్పును పెంచుతుంది. చెముడు, చెవికి సంబంధించిన రుగ్మతను తగ్గిస్తుంది. బద్ధకాన్ని నివారిస్తుంది. రెండు, మూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్‌గా చేయాలి.
ఆపానముద్ర
మధ్యవేలు, ఉంగరం వేలు రెండూ బొటనవేలు అంచుని తాకేలా చేయాలి. చిటికెన వేలు చూపుడు వేలు లాగిపెట్టాలి. కలిసిన మూడు వేళ్ళ మధ్య ఒత్తిడి కలిగించాలి. ప్రోస్టేట్, మోనోపాజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది. శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు విసర్జించేందుకు సహాయపడుతుంది. మూత్ర సమస్యలు తొలగిపోతాయి. మధుమేహాన్ని కూడా నివారిస్తుంది.
ఆపానవాయుముద్ర
వాయుముద్రలాంటిదే ఇది కూడా. చిటికెన వేలు తప్ప మిగిలిన అన్ని వేళ్లను చివరి అంచులతో బంధించాలి. ముద్ర హృదయ సంబంధిత తీవ్రతను తగ్గిస్తుంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
పృథ్వీముద్ర
ఉంగరం వేలు బొటనవేలు అంచులు కలిపి ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడు వేళ్ళు ఆకాశం వైపు చూస్తుండాలి. ఈ ముద్ర మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో కూడా బరువు పెరగకుండా చేస్తుంది. శరీర బలహీనతను పోగొడుతుంది. చర్మకాంతిని పెంచుతుంది. ఓర్పును పెంచుతుంది. ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది.
సూర్యముద్ర
బొటనవేలు, ఉంగరం వేలు రెండూ మడవాలి. మిగిలిన మూడు వేళ్ళు నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర కనుక రెగ్యులర్‌గా చేస్తే మానసిక నిగ్రహం పెరుగుతుంది. అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.
శక్తిముద్ర
చివరి రెండు వేళ్ళను బొటను వేలితో కలపాలి. మిగిలిన రెండు వేళ్ళను ఒకదానితో ఒకటి తాకుతుండాలి. శక్తి ముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. ఈ ముద్ర జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది. దృష్టిలోపాన్ని సరిచేస్తూనే కంటిచూపును మెరుగుపరుస్తుంది.
వరుణముద్ర
బొటనవేలు, చివరివేలు కలిపితే వరుణ ముద్ర. మిగిలిన మూడు వేళ్ళను ఒకదానికి ఒకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి. ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది. ప్రోస్టేట్ సమస్యలు తగ్గిపోతాయి. రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు కూడా తగ్గుతుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అందాన్ని పెంచుతుంది. కండరాలు ముడుతలు పడకుండా కాపాడుతుంది.
బ్రహ్మముద్ర
రెండు చేతుల బొటన వేళ్ళనూ మడిచి, మిగతా నాలుగు వేళ్ళనూ దాని మీదుగా మడవాలి. ఆ తర్వాత రెండు చేతులనూ దగ్గరికి నాభి ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే రక్తపోటు సమస్యల్ని నియంత్రిస్తుంది.
ఆదిముద్ర
బొటనవేలుని మడిచి, మిగతా నాలుగు వేళ్ళనూ బొటనవేలుపై ఉంచాలి. దీనివల్ల జ్ఞానేంద్రియాలకు ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. మనసుకు ఉత్సాహాన్నిస్తుంది. రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ముద్ర జోలికి వెళ్లకపోవడమే మంచిది.
లింగముద్ర
అన్ని వేళ్ళనూ ఒకదానితో ఒకటి పెనవేసి కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకి ఉంచాలి. కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకి ఉంచాలి. ఈ ముద్ర జలుబు, రొంప తదితర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది.
అందుకే మీ చేతివేళ్ళలో ఏ రెండు వేళ్ళను కలిపినా మీ శరీరంలోని ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తే ఆరోగ్యంగా ఉంటామనుకోకండి. పోషక ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments