Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దౌర్జన్యానికి ఎదురునిలిచిన గున్నమ్మ - About Veera Gunnamma in Telugu

జమీందార్ జగన్నాథరాజు పై పోరాటం చేసిన వీరనారీమణి గున్నమ్మ. స్వాతంత్ర్య వీరాంగన‌గా‌ ఉత్తరాంద్ర ప్రజలందరికీ సుపరిచితం ఈ పేరు. మరి జ...

జమీందార్ జగన్నాథరాజు పై పోరాటం చేసిన వీరనారీమణి గున్నమ్మ. స్వాతంత్ర్య వీరాంగన‌గా‌ ఉత్తరాంద్ర ప్రజలందరికీ సుపరిచితం ఈ పేరు. మరి జమీందారీ వ్యవస్థ పై పోరాటం చేస్తే సహజంగా మనకు అనిపిస్తుంది. జమిందారులు మనవాళ్ళే కదా మరి వాళ్ళతో తలపడితే స్వాతంత్ర్య సమరయోధురాలు అంటున్నారు ఏంటీ అని? కాని భారతదేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో అనేక మంది జమిందార్ లు, తహసిల్దార్ లు, మునసుబ్ లు, కర్ణాలు బ్రిటీషర్ లకు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టేవారు. ఈ జమిందారీ వ్యవస్థ ఉత్తరాంద్రలో ఎక్కువగా ఉండేది. బెంగాల్ లో జమిందార్లు వడ్డీ వ్యాపారులుగా ఉంటూ బ్రిటిషర్స్ వచ్చాక వారికి తొత్తులుగా మారారు బెంగాల్ లో అప్పుడు పీజెంట్స్ (రైతు) విప్లవం జరిగింది, అనేకమంది బ్రిటిష్ అనుకూల జమిందార్ లను ఊచకోత కోశారు రైతులు. అలాంటి ఒక పోరాటమే ఉత్తరాంధ్రలో 1940 లో జరిగింది. ఆ పోరాటంలో వీర గున్నమ్మ అమరురాలయ్యింది. ఆ సంఘటన ఏమిటో చూద్దాం.

శ్రీకాకుళం జిల్లా మందస సంస్థానంలోని గుడారి రాజమణిపురం అనే కుగ్రామంలో రైతు కుటుంబంలో 1914లో జన్మించారు గున్నమ్మ. మందసం జమీందారు జగన్నాథరాజు మణిదేవ్‌ దివాను కఠినాత్ముడు. జనాల మూలుగలు పీల్చి రాజు ఖజానా నింపేవాడు. అతని దోపీడి నిరాటంకంగా సాగుతున్న సమయంలోనే 1940 మార్చి చివర్లో పలాసలో అఖిల భారత కిసాన్‌ మహాసభలు జరిగాయి. ఆ స్ఫూర్తితో జమీందారు ఆజ్ఞలను ధిక్కరించి ప్రజలు అడవిలో కట్టెలు కొట్టారు. దాంతో దివాను పల్లె మీదకి దండెత్తాడు. కానీ, తోక ముడవక తప్పలేదు. ఆ తర్వాత ‘‘కలేకట్టురు పోలీస్‌ మూకల బలముగ దీసుకొని... పందుల్లాగా తిని బలిసిన ఒక మందను బిలుచుకొని’’ వెళ్లాడు. గున్నమ్మ తాచుపాములాగ లేచింది. కలెక్టరు కారుకు అడ్డంగా నిలుచుంది. ఓ కానిస్టేబులు బోయినెట్టుతో ఆమె రొమ్ముమీద పొడిచాడు. గాయమయ్యింది అంతలోనే ఒక తుపాకి గుండు గొంతున దూసింది చిందిన నెత్తురు చిందుతుండగా ముందుకు కదిలింది.. నిండు గర్భిణి అని కూడా చూడకుండా అధికారులు ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఆ దెబ్బకు గున్నమ్మ పని అయిపోయింది అనుకు‌‌న్నారు కానీ గున్నమ్మ వెన్నుచూపలేదు, అధికారులు వణికిపోయారు.

ఆ తరువాత కొంత సమయానికే మరో బ్రిటిష్ పోలీస్ ఆమె పై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు గున్నమ్మ నేల కొరిగింది. గున్నమ్మతో పాటు నలుగురు రైతులు కూడా అమరులయ్యారు. తూరుపును ఎరుపెక్కించిన ఆ తల్లి త్యాగమయిగా పల్లెజనం గుండెల్లో కొలువుదీరింది. అందుకే రాజమణిపురానికి ‘వీరగున్నమ్మపురం’ అని పేరు పెట్టారు. గ్రామస్థులు ఆమెకు అక్కడ ఓ సమాధిని నిర్మించారు. ఆమె స్మృతి మందిరం ఓ యాత్రాస్థలం ఆమెతోపాటు స్వర్గస్థులైన ఆ నలుగురూ చిరంజీవులు.. 1988లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి, గున్నమ్మ స్మారక స్థూపం ఆవిష్కరించారు. ‘మందస జమీందారీ రైతుల తిరుగుబాటు- గున్నమ్మ’ పేరిట డా.బి.వి.ఎ.రామారావు నాయుడు ఓ చిరుపొత్తాన్ని తీసుకొచ్చారు.

దౌర్జన్యానికి ఎదురునిలిచిన గున్నమ్మ 1940 ఏప్రిల్‌ 1న వీరమరణం పొందారు. ఈ బలిదానాన్ని చరిత్ర విస్మరించినా, గున్నమ్మ పోరాట స్ఫూర్తిగాథ నేటికీ ఉత్తరాంధ్ర పల్లె ప్రజల కథలు, జముకుల కథాగానాల్లో వినిపిస్తూనే ఉంటుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments