Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మాతంగిని హజ్రా జీవిత విశేషాలు - About Matangini Hazra in Telugu - azadi ka amrut mahotsav

వందేమాతరమ్..! వందేమాతరమ్..! వందేమాతరమ్..! ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు తుపాకి గుండ్లు 73 ఏళ్ళ మాతంగిని హజ్రా శరీరంలోకి దూసుకెళ్ళాయి. శరీ...

Matangini Hazra


వందేమాతరమ్..! వందేమాతరమ్..! వందేమాతరమ్..! ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు తుపాకి గుండ్లు 73 ఏళ్ళ మాతంగిని హజ్రా శరీరంలోకి దూసుకెళ్ళాయి. శరీరంలోకి తూపాకీ గుండ్లు దూసుకెళుతున్నా లెక్క చేయకుండా వందేమాతరమ్ అని నినదిస్తూ, చేతిలో పట్టుకున్న జెండాను పైకెత్తి పట్టుకున్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలు మాతంగిని హజ్రా. ధైర్యం, సంకల్పబలం గురించి చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏంకావాలి!.

ఇలాంటి మహనీయుల వీరోచిత గాథలను చదువుతున్న ప్రతిసారి, వారి తెగువ, ధైర్యం, దేశభక్తిని చూస్తుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. వారి పట్ల కృతజ్ఞతా భావంతో శరీరం ఉప్పొంగుతుంది. వారి అలుపెరుగని పోరాటం వల్లే మన దేశానికి బ్రిటీష్ పాలన నుంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభించింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లాలోని తమ్లుక్ అనే చిన్న గ్రామంలో పేదరైతు కుటుంబంలో అక్టోబర్ 19, 1870 మాతంగిని హజ్రా జన్మించారు. పేదరికం ఆమె చదువుకు ఆటంకంగా మారింది. చిన్న వయసులోనే పెద్దలు వివాహం చేశారు. 18 ఏళ్ళకే భర్తను కోల్పోయారు. భర్త మరణం తర్వాత సొంత గ్రామానికి తిరిగి వెళ్ళిన ఆమె వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేస్తూ జీవితాన్ని ముందుకు సాగించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాట వీచికలు బలంగా వీస్తున్న రోజుల్లో, మాతంగిని హజ్రా స్వరాజ్య పోరాటం దిశగా ఆకర్షితులయ్యారు. తమ ప్రాంతంలో బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారు.

కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఏ మాత్రం భయపడకుండా మహాత్మ గాంధీ ప్రేరణతో నూలు వడకడం, ఖాదీ వస్త్రాలను ధరించడం ప్రారంభించారు. మహాత్ముని సిద్ధాంతాలను ఆచరించడం, బోధించడమే గాక, వాటి పట్ల ఆమె చూపిన అంకితభావం వల్ల ప్రజలంతా ఆమెను గాంధీ బుఢీ (వయోధిక మహిళా గాంధీ) అని పిలిచేవారు. భారీ ఊరేగింపులకు నాయకత్వం వహించడమే గాకుండా క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా పోలీసుల పహారా నుంచి చాకచక్యంగా తప్పించుకుని, తమ్లుక్ కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి ధైర్యంగా జాతీయ జెండాను ఎగురవేశారు. చివరకు పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేశారు. వేర్వేరు నిరసల్లో చురుగ్గా పాల్గొన్న ఆమెను అనేక సందర్భాల్లో పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారి వయసును దృష్టిలో ఉంచుకుని విడుదల చేసేవారు.

ఏదేమైనా ఎన్ని మార్లు అరెస్టు కావలసి వచ్చినా, మాతృభూమి స్వేచ్ఛ కోసం పోరాడే దిశగా ఆమె సంకల్పబలంలో ఏలాంటి మార్పు రాలేదు. ఎక్కడా ఆమె పోరాటం ఆగలేదు. విడుదల అయిన వెంటనే ఆమె మళ్ళీ వెంటనే నిరసనల్లో పాల్గొనేవారు. కొన్ని సమయాల్లో, నిరసనల సందర్భంగా గాయాలు అయ్యేవి. అయినప్పటికీ వెనక్కు తగ్గేవారు కాదు. గతం కంటే బలంగా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేవారు. తుది శ్వాస వరకూ మాతంగిని హజ్రాలోని ధైర్యం, తెగువను ఏ శక్తి కదిలించలేకపోయింది.

సెప్టెంబర్ 29, 1942న ఆమె తమ్లుక్ పోలీస్ స్టేషన్ వైపు 6000 మంది మద్ధతుదారులతో ఊరేగింపునకు నాయకత్వం వహించి ముందుకు సాగారు. ఆ సమయంలో పోలీసులు ఆమె మీద కాల్పులు జరిపారు. తుపాకి కాల్పులు ఆమెను ఆపలేకపోయాయి. ముందుకు కదులుతున్న ప్రతిసారి పోలీసులు ఆమె మీద కాల్పులు జరిపారు. ఆమె ఆగలేదు, భయపడలేదు, వెనకడుగు వేయలేదు. అప్పటికే రెండు మార్లు తుపాకీ గుండ్లు శరీరంలోకి దూసుకువెళ్ళినా, మూడో సారి కాల్పులు మొదలైనా సరే, ధైర్యంగా వందేమాతరమ్ అని నినదిస్తూ జెండా పైకెత్తి నిలబడి చేతిలో జెండాతోనే పరమపదించారు.

మాతంగిని హజ్రా ధైర్యం, శౌర్యం, దేశభక్తి అనుపమానమైనవి. భారతదేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆమె అడుగుజాడలు, ఎంతో మందిలో ప్రేరణ నింపి, ముందుకు నడిపాయి. భారతదేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్య వాయువులు పీల్చేందుకు తమ జీవితాన్ని త్యాగం చేసిన స్ఫూర్తిదాయకమైన జీవితం వారిది. స్వరాజ్య సంగ్రామంలో పాల్గొని, తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన ఎంతో మంది మహనీయుల జీవితం, నిరుపమానమైన త్యాగాల గురించి ప్రజలు, ముఖ్యంగా యువత తెలుసుకుని స్ఫూర్తి పొంది దేశంకోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.

No comments