రేబవళ్ళు ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించారే తప్ప, ఏనాడూ పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడలేదు. దేశం స్వరాజ్యం సముపార్జించిన తర్వాత కూడా ఆమెను వ...
1892లో మంగుళూరులో గోలికేరి కృష్ణారావు, జుంగాబాయి దంపతులకు ఉమాబాయి జన్మించారు. తొలుత ఆమె పేరు భవాని గోలికేరి. ఆ తర్వాత ఆమె కుటుంబం ముంబైకి వలస వచ్చింది. చాలా చిన్న వయసులో ఉమాబాయికి, సంజీవ్ రావు కుందాపూర్ తో వివాహం జరిగింది. ఆమె అత్త మామలది ధనవంతుల కుటుంబం. ఆమె మామ ఆనందరావు కుందాపూర్ ప్రగతిశీల ఆలోచనలు కలిగిన వ్యక్తి. మహిళల సాధికారత పట్ల వారిది ప్రత్యేకమైన దృష్టికోణం. ఈ నేపథ్యంలో ఉమాబాయికి ఆయనే మార్గనిర్దేశం చేయడమే గాక, ఆమెలో ఉన్నతభావాలను నాటారు. ఆయన ప్రోత్సాహంతో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఉమాబాయి, ముంబైలోని గౌందేవి మహిళా సమాజ్ ద్వారా మహిళలకు విద్యను అందించడంలో తమ మామ గారికి సహాయం చేయడం ప్రారంభించారు.
1920లో లోకమాన్య బాలగంగధర్ తిలక్ ఇక లేరనే వార్త అందరిని శోకసంద్రంలో నింపింది. ఆ మహోన్నత నాయకుడి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజా సంద్రంతో పాటే ఆయన అంత్యక్రియల ఊరేగింపు ముందుకు సాగుతోంది. వారిలో ఉమాబాయి కూడా ఉంది. తిలక్ అంత్యక్రియల కోసం తండోపతండాలుగా తరలివచ్చి, అశ్రునయనాల మధ్య ఆ మహనీయునికి వీడ్కోలు పలికిన సందర్భం ఆమెలో అలజడి సృష్టించింది. ప్రజల భావోద్వేగాలు ఆమె హృదయంలో నూతన మార్పునకు నాంది పలికాయి. బ్రిటిష్ పాలకుల అణచివేత నుంచి మాతృభూమి దాస్యశృంఖలాలు విడిపించాలనే దృఢమైన సంకల్పాన్ని గుండెల నిండా నింపుకుని, ఉమాబాయి ఓ లక్ష్యంతో తిరిగి ఇంటికి చేరారు.
ఆ తర్వాత ఉమాబాయి స్వరాజ్య ఉద్యమం దిశగా అడుగులు వేశారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఖాదీ ధరించడం ప్రారంభించారు. స్వరాజ్య సంగ్రామంలో మహిళలు పాల్గొనవలసిన ఆవశ్యకతను గ్రహించిన ఉమాబాయి, మహిళలకు అవగాహన కల్పించేందుకు, వారిలో స్వరాజ్య ఉద్యమ స్ఫూర్తిని మేల్కొలిపేందుకు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఆమె ప్రయత్నాలకు భర్త, మామ గారి మద్ధతు పూర్తిగా లభించింది.
అలాంటి సమయంలో దురదృష్టవశాత్తు ఉమాబాయి భర్తను క్షయ వ్యాధి మింగేసింది. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఉమాబాయిలో మార్పు తీసుకువచ్చేందుకు ఆమె మామ గారు, ఆమెను హుబ్లి తీసుకెళ్ళారు. అక్కడ కర్ణాటక ప్రెస్ ను ప్రారంభించి, దాని బాధ్యతను ఆమెకు అప్పగించారు. అనతి కాలంలోనే ఆమె తిలక్ కన్యా శాల అనే బాలికల పాఠశాలకు నిర్వాహకురాలు అయ్యారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డా. ఎన్.ఎస్. హర్దికర్ యువతను స్వరాజ్య ఉద్యమం దిశగా ఆకర్షించే సంకల్పంతో హిందుస్థానీ సేవాదళ్ ను ప్రారంభించారు. అందులో ఉమాబాయిని మహిళా విభాగానికి నాయకురాలిని చేశారు. నూలు వడకడం, నేత నేయడం, కసరత్తులు చేయడం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో యువతకు శిక్షణ అందించడం లాంటి కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహించేది. అనతికాలంలోనే హుబ్లి-ధార్వాడ్ హిందూస్థానీ సేవాదళ్ కార్యకలాపాల కేంద్రంగా మారడమే గాక, అనేక మంది జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించింది.
మహిళలకు చదువు నేర్పించే సంకల్పంతో 1922లో ఉమాబాయి హుబ్లిలో భాగిని మండల్ ని స్థాపించారు. వ్యక్తిని శక్తివంతం చేయడంలో అక్షరాస్యత ముఖ్యమని ఆమె గట్టిగా నమ్మారు. సామాజిక సేవ దిశగా ఆమె మహిళలను ప్రేరేపించారు. ఆ కాలంలో అదంత తేలికైన పని కాదు, కానీ ఉమాబాయి ఎంతో పట్టుదలతో శ్రమించారు. 1924లో జరిగిన చారిత్రక బెల్గాం కాంగ్రెస్ సెషన్ లో ఆమె శ్రమ తాలూకా ఫలాలు స్పష్టంగా కనిపించాయి. మహాత్మా గాంధీ నేరుగా ఓ సమావేశానికి అధ్యక్షత వహించిన సమయమది. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత మొత్తం డాక్టర్ హర్దికర్, ఉమాబాయి భుజాల మీద పడింది. ఆమె మొత్తం రాష్ట్రమంతా పర్యటించి, 150 మందికి పైగా మహిళా వాలంటీర్లను సమావేశానికి సమీకరించారు. వారు వేలాది మహిళలను తమ ఇళ్ళ నుంచి బయటి ప్రపంచంలోకి తీసుకువచ్చి, స్వరాజ్య ఉద్యమంలో చేరే దిశగా ప్రేరణనిచ్చారు.
ఈ కార్యక్రమానికి వితంతువులు సహా సమాజంలోని అన్ని వర్గాల మహిళలు ముందుకు వచ్చారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఉమాబాయి స్వరాజ్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించారు. 1932లో ఆమె యెర్వాడ జైలులో నాలుగు నెలల జైలు శిక్షను అనుభవించారు. ఆ కాలంలో ఉమాబాయికి ఎంతో మద్దతునిస్తూ వచ్చిన ఆమె మామ గారు కూడా పరమపదించారు. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత, బ్రిటీష్ అధికారులు ఆమె మామ గారు నడుపుతున్న ప్రెస్ ను జప్తు చేశారు. ఆమె ఇంఛార్జ్ గా ఉన్న పాఠశాలను మూసేసి, స్వచ్ఛంద సంస్థ అయిన భాగిని మండల్ ని చట్ట విరుద్ధమైనదని ప్రకటించి ఉమాబాయిని భయపెట్టే ప్రయత్నాలు చేశారు.
ఇలా వరుసగా తగిలిన తీవ్రమైన ఎదురు దెబ్బలు ఆమెను గతం కంటే మరింత బలంగా, దృఢంగా మార్చాయి. స్వరాజ్య ఉద్యమం ఉద్ధృతమైన దరిమిలా, స్వాతంత్ర్య సమరయోధులను జైళ్ళలో పెట్టారు. విడుదల తర్వాత వారు ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో కూడా పాలు పోని పరిస్థితులు కల్పించారు. అలాంటి సమయంలో స్వాతంత్ర్య సమరయోధులకు మద్ధతు ఇచ్చేందుకు ఉమాదేవి బహిరంగంగా ముందుకు వచ్చారు. వారికి ఆశ్రయం కల్పించి, ఆహారాన్ని అందించడమే గాక ఆయా ప్రదేశాలకు తిరిగి వెళ్ళేందుకు వారికి ఆర్థిక సహకారం కూడా అందించారు.
1934లో బీహార్ లో భూకంపం సంభవించినప్పుడు ఉమాబాయి, ఆమె వాలంటీర్ల బృందంతో కలిసి బాధిత ప్రాంతాలకు చేరుకుని ప్రజలకు సహాయం చేయడానికి గడియారంతో పోటీపడి పని చేశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా పని చేస్తున్న ఎంతో మంది సమరయోధులకు ఆహారం మరియు ఆర్థిక సహకారం అందించారు. అలా చేయడం వల్ల తనకు ప్రమాదం ఎదురౌతుందనే విషయాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు.
1946లో మహాత్మా గాంధీ, ఉమాబాయిని కస్తూర్బా ట్రస్టుకు అధిపతిగా నియమించారు. ట్రస్ట్ నిర్వహణ ఎన్నో సవాళ్ళతో కూడుకున్న పని. ప్రత్యేకించి వనరులు అందుబాటు లేకపోవడం మరిన్ని ఇబ్బందులను సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె విరాళాల సేకరణ కోసం ఇంటింటికి తిరగాలని నిశ్చయించుకున్నారు. అంతే కాకుండా నిరాశ్రయులకు, బాల్యవితంతువులకు, అనాథలకు, ఇతర మహిళలకు చేతిపనులు, వివిధ కళల్లో శిక్షణ అందించారు. తమ నిస్వార్థమైన సేవల ద్వారా అనతికాలంలో సమాజంలో అనేక వర్గాల ప్రశంసలు అందుకున్నారు.
భారతదేశం స్వరాజ్యం సముపార్జించిన తర్వాత అమెకు అనేక పదవులను ఇచ్చే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆమె మాత్రం తమ సామాజిక కార్యకలాపాలను కొనసాగిస్తూ, మహిళా సాధికారతకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. స్వరాజ్య సమరయోధురాలిగా, సామాజిక కార్యకర్తగా అనేక సంవత్సరాలు దేశానికి అమూల్యమైన సేవలు అందించి, ప్రతి గుండెలో తమ నిస్వార్థ సేవా స్ఫూర్తిని రగిలించి 1992లో పరమపదించారు. వారి ప్రేరణ రాబోయే తరాలకు స్ఫూర్తిని పంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
No comments