జాతీయోద్యమంలో మహిళా చైతన్య ఉద్యమమూ అంతర్వాహినిగా సాగింది. తమ రచనల ద్వారాను, క్షేత్రస్థాయిలోనూ మహిళలే సాటి మహిళల జాగృతి కోసం నడుం...
జాతీయోద్యమంలో మహిళా చైతన్య ఉద్యమమూ అంతర్వాహినిగా సాగింది. తమ రచనల ద్వారాను, క్షేత్రస్థాయిలోనూ మహిళలే సాటి మహిళల జాగృతి కోసం నడుంకట్టిన ఉదంతాలు తెలుగునాట ప్రముఖంగా కనిపిస్తాయి. మహిళాభ్యుదయ సంఘాల కార్యకలాపాలు విస్తరిస్తున్న ఆ రోజుల్లో మద్రాసు మంగళాంబ, నెల్లూరు కనకమ్మ, కర్నూలు కల్యాణి, విశాఖపట్నం సూరమ్మ, గుంటూరు వరలక్ష్మమ్మ - ఈ అయిదుగురు విజయవాడలో ఒక ఇంటి ఆవరణలో నారింజ చెట్టు కింద కూర్చుని వారి వారి ప్రాంతాల యాసల్లో కబుర్లు చెప్పుకొనేవారు. ఆ కబుర్లనే ‘మా చెట్టు నీడముచ్చట్లు’గా 1922 ప్రాంతంలో ఆంధ్ర పత్రికలో లీలావతి రాసేవారు. ఆ తరవాత 1928లో గృహలక్ష్మి మాస పత్రిక తొలి సంచిక నుంచి వరసగా ఆరేళ్లు శారదలేఖలు ప్రచురితమై సంచలనం సృష్టించాయి. ఆ లీలావతి, శారదలు ఎవరా అని పాఠకులు కుతూహలంతో చర్చించుకునేవారు. వారిద్దరూ ఒకరేనని ఆమె పేరు కనుపర్తి వరలక్ష్మమ్మ అని ఆ తరవాత వెల్లడైంది. సంప్రదాయానికి, అభ్యుదయానికి సజీవవారధిగా ఆమెను సాహితీవేత్తలు ప్రశంసించారు. సమాజం కల్పించిన సంకెళ్ల నుంచి మహిళలను విముక్తుల్ని చేసి, వారి జీవితాల్లో చైతన్యాన్ని ఉత్సాహాన్ని నింపడానికి కలంపట్టిన సాహితీమూర్తిగా వరలక్ష్మమ్మ తెలుగు సాహిత్యంలో విశిష్ట గౌరవాన్ని పొందారు.
రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా, వక్తగా, విదుషీమణిగా మన్ననలు పొందిన వరలక్ష్మమ్మ 1896 అక్టోబరు 6న గుంటూరు జిల్లా బాపట్లలో పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు. పన్నెండేళ్ల వయసులోనే కనుపర్తి హనుమంతరావుతో ఆమెకు వివాహమైంది. ఆ తరవాత విదేశాల్లో విద్యాభ్యాసం చేసి వచ్చిన భర్త సంస్కరణాభిలాష, చోరగుడి సీతమ్మ వంటి సంఘ సేవాపరాయణురాలి సాంగత్యం వరలక్ష్మమ్మను ప్రభావితం చేశాయి. అన్నయ్య నరసింహం ప్రోత్సాహంతో పత్రికలు, వీరేశలింగం, చిలకమర్తి మొదలైన వారి రచనలు చదివేవారు. కృష్ణాపత్రిక చదివి నాటి దేశకాల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. ప్రాచీన తెలుగు కావ్యాలను చదివి భాషాపటిమ పెంచుకున్నారు. అన్నయ్య తోడ్పాటుతో ఒక ఆంగ్ల కథను ‘సౌదామిని’ పేరుతో అనువదించారు. అది 1919లో అనసూయ పత్రికలో ప్రచురితమైంది. నాటి నుంచి వరలక్ష్మమ్మ రచనా వ్యాసంగం నిరాటంకంగా సాగింది. ఆమె అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. దాదాపు 60 కథలు రాశారు. భారతి, వినోదిని మొదలైన పత్రికల్లో అవి ప్రచురితమయ్యాయి. సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించిన ఆ కథలన్నీ శిష్ట వ్యావహారికంలోనే సాగాయి. ‘ఐదు మాసముల ఇరువది దినములు’ (1931) విదేశ వస్తు బహిష్కరణ లక్ష్యంగా రాసిన కథ. ‘పెన్షన్ పుచ్చుకొన్న నాటి రాత్రి’ కరుణ రస ప్రధానంగా పాఠకులను కదిలిస్తుంది. ‘కన్యాశ్రమం’ పేరిట కథల సంపుటిని వెలువరించారు. వసుమతి, వరదరాజేశ్వరి నవలలు రాశారు. ద్రౌపదీ మాన సంరక్షణం, సత్యాద్రౌపదీ సంవాదం... వరలక్ష్మమ్మ ద్విపద రచనలు. ఎన్నికల సమయంలో ఓటు విలువను తెలియజెబుతూ ‘ఓటుపురాణం’ రాసి టంగుటూరి ప్రకాశం పంతులుకు అంకితం ఇచ్చారు. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవ లక్ష్మీబాయిల జీవిత చరిత్రలనూ గ్రంథస్థం చేశారు.
తెలుగులో లేఖా సాహిత్యానికి ఆద్యురాలిగా వరలక్ష్మమ్మను సాహిత్య పరిశోధకులు గుర్తించారు. కల్పలత అనే స్నేహితురాలికి శారద అనే ఆమె రాసినట్లుగా కనుపర్తి రచించిన శారద లేఖల్లో- శారదా చట్టం, విడాకుల చట్టం, నూలు వడకడం, దక్షిణ దేశ యాత్రలు, పండుగలు మొదలైన విషయాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నాటికలూ రాశారు. రచనల ద్వారా సామాజిక చైతన్యానికి దోహదం చేయడమే గాక వరలక్ష్మమ్మ స్వయంగా మహిళా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1931లో బాపట్లలో ‘స్త్రీ హితైషిణీ మండలి’ స్థాపించి 20 సంవత్సరాలు నిర్వహించారు. భద్రాచలంలో ఆంధ్రమహిళా సభకు అధ్యక్షత వహించారు. బందరులో గాంధీజీని దర్శించి తన వేలి ఉంగరాన్ని సమర్పించినప్పుడు- ‘మిల్లు చీరకట్టారేం, ఇక నుంచైనా ఖద్దరు కడతారా’ అని ఆయన అడిగారు. బాపూజీకి ఇచ్చిన మాట మేరకు జీవితాంతం ఆమె ఖద్దరే ధరించారు. తిక్కన జయంతి సందర్భంగా నెల్లూరులో గృహలక్ష్మి ప్రథమ స్వర్ణకంకణాన్ని వరలక్ష్మమ్మకు బహుకరించారు. 1975 ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర్ణఫలకంతో ఆమెను గౌరవించారు. విశ్వనాథ, జాషువా, పుట్టపర్తి వంటి విద్వత్కవులతో పాటు వరలక్ష్మమ్మ కవితా గోష్ఠుల్లో పాల్గొన్నారు. దేశభక్తితో మహిళా జాగృతి లక్ష్యంగా సాహిత్య, సామాజిక రంగాల్లో అవిశ్రాంత కృషి సాగించిన ఈ నారీశిరోమణి 1978 ఆగస్టు 13న బాపట్లలో కీర్తిశేషులయ్యారు.
భారత అమృత మహోత్సవాలలో ఇటువంటి మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత. అలాగే మీమీ గ్రామాలలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం గురించి మాకు వాట్సాప్ ద్వారా పంపండి 8500581928
No comments