ఉత్తరప్రదేశ్ లో ముజఫర్ నగర్ దగ్గరలోని ముండ్ భర్ గ్రామానికి చెందిన వీరనారి మహాబిరి దేవి వీరోచిత పోరాటం భారతీయులుగా మనం మరచిపోలేనిది. ఆమె బ్రి...
1857లో జరిగిన తొలి స్వరాజ్య సంగ్రామాన్ని సిపాయిల తిరుగుబాటుగా మనం చదువుకున్నాం సత్యాన్ని అన్వేషించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 1857 మే 10న మీరట్ కంటోన్మెంట్ వద్ద ఉన్న భారతీయ సిపాయిలు తమ బ్రిటీష్ సీనియర్ల మీద తిరుగుబాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. వారి ఆగ్రహం కేవలం కంటోన్మెంట్లకు మాత్రమే పరిమితం కాలేదు. మీరట్ పక్కన ఉన్న ముజఫర్ నగర్ సహా మొత్తం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. మానవ విసర్జితాలను సాటి మనుషుల చేత తొలగింపజేసే అమానవీయ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు మహాబిరి దేవి 22 మంది స్థానిక మహిళలతో బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లలు ఈ తరహా పనులు చేయవద్దని ఆమె ఉద్యమించారు.
వారంతా ఆయుధాల శిక్షణ అంటే ఏంటో తెలియని సాధారణ ఇంటి పనులు చేసుకునే ప్రజలు. బ్రిటీష్ వారి మీద తీవ్ర కోపం, ఆగ్రహం ఉండడం వల్ల, వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసే దిశగా మహాబిరి దేవి తమ బృందాన్ని ప్రేరేపించారు. 1857 మే 8న శౌర్యానికి ప్రతిరూపమైన ఈ మహిళల బృందం బ్రిటీష్ సైనికుల మీద కత్తులు, రాళ్ళు వంటి సాధారణ ఆయుధాలు, కర్రలతో దాడి చేసి అనేక మందిని చంపడమే గాక, మరెంతో మందిని గాయపరిచారు.
ఈ 22 మంది వీరమహిళలు విదేశీయుల పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు జీవిత చరమాంకం వరకూ పోరాటం సాగించారు. మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్ర్య వాయువులు పీల్చేందుకు తమ ప్రాణాలను అర్పించి అత్యున్నత త్యాగాలతో దేశభక్తిని చాటుకున్నారు. కొన్ని చారిత్రక గాధల్లో ఇంద్ర కౌర్, మన్ కౌర్, రహీమి, దేవి త్యాగి, బఖ్తావరి, హబీబా, ఉమ్దా, ఆశాదేవి, శోభాదేవి, భగవతి దేవి వంటి ఎంతో మంది పేర్లు మనకు కనిపిస్తాయి.
ఆయుధాలను వినియోగించడంలో ఎలాంటి శిక్షణ లేకపోయినా వారు అసాధారణ ధైర్యాన్ని, తెగువను ప్రదర్శించి ముందు తరాల ప్రజలను ప్రేరేపించారు. ఒక ఉద్యమ ప్రభావాన్ని సమాజంలోని వివిధ వర్గాల ప్రజల్లో ఎంత మేర స్ఫూర్తిని రగిలించి, ఎంత మేర మద్ధతు సంపాదించిందనే అంశాల ఆధారంగా కొలుస్తారు. అక్కడి స్థానిక వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు తమ స్వేచ్ఛ గురించి ఎల్లప్పుడూ స్పృహ కలిగి ఉండడమే గాక, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించేందుకు వినియోగించుకున్నారు.
సాధారణ ప్రజలు చేసిన ఇలాంటి అసాధారణ త్యాగాలు, వారి శౌర్య గాధలను వివరించని మన చరిత్ర ఎప్పుడూ అసంపూర్ణంగానే నిలిచిపోతుంది. నాగరిక సమాజంగా మానవ విసర్జితాలను సాటి మనుషుల చేత శుభ్రం చేయించడం లాంటి అమానవీయ కార్యక్రమాలను విడిచిపెట్టడమే, మహాబిరి దేవి మరియు ఆమె వెంట నడిచిన మహిళలకు మనం అందించే నిజమైన నివాళి.
No comments