స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధుల పోరాటం. బొమ్మలసత్రం: స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్...
స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధుల పోరాటం.
బొమ్మలసత్రం: స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పాలకులను ఎదిరించారు. కుటుంబ సభ్యులకు దూరమై, ఆస్తులను త్యాగం చేసి స్వాతంత్ర పోరాటం చేశారు. కొందరు యోధులు బ్రిటీష్ పాలకుల చిక్కకుండా నల్లమలలో అజ్ఞాత జీవితం గడపగా, మరి కొందరు జైలు పాలై ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. నేడు వీరు భౌతికంగా లేకున్నా, వారి త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాయి.
నంద్యాల ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులు జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం చేశారు. ప్రస్తుతం ఆర్‌డీఓ, వన్‌టౌన్ పోలీసు స్టేషన్, డీఎస్పీ బంగ్లా, తహసిల్దార్ కార్యాలయాల్లో బ్రిటీష్ పాలకులు ఉంటూ పాలన చేసేవారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో పోలీసు బలగాలు ఉండేవి. నంద్యాల 25వేల జనాభాతో, చిన్న పట్టణంగా ఉందేది. జాతీయ స్థాయిలో గాంధీజీ ఉప్పు సత్యగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు పిలుపునిచ్చినా, ఏ నేతను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసినా నంద్యాల నేతలు త్రీవంగా స్పందించేవారు.
19వ శతాబ్ధంలో ఉద్యమం:
నంద్యాలలో 19వ శతాబ్ధంలో నంద్యాలలో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకొనేది. బిట్రీష్ పాలకులకు వ్యతిరేకంగా నేతలు సభలు, సమావేశాలను నిర్వహించేవారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, టీఆర్‌కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, కోడి నరసింహం, దేశాయి కుప్పూరావు తదితరులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. దీంతో బ్రిటీష్ పోలీసులు వెంట పడి, వీరిని అరెస్టు చేయడానికి యత్నించేవారు. దీంతో నేతలు నక్సలైట్లలా నల్లమల అడవిలోకి పారిపోయి, అజ్ఞాత జీవితం గడిపేవారు. వీరు మహానంది, బండి ఆత్మకూరు ప్రాంతాల్లోని అడవుల్లో తలదాచుకున్నప్పుడు, కొందరు నేతలు, గ్రామస్తులు వీరికి ఆహారాన్ని పంపేవారు.
ఖ్యాతి తెచ్చిన గాడిచర్ల, నివర్తి:
స్వాతంత్య్ర సంగ్రామంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర స్థాయిలో నంద్యాలకు ఘనకీర్తిని తెచ్చారు. ఆంధ్రా తిలక్‌గా పేరొందిన గాడిచర్ల కర్నూలు ప్రాంతానికి చెందినవారు. నంద్యాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆయన నంద్యాల కేంద్రంగా కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. స్వరాజ్య పత్రికను స్థాపించి, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. తిలేస్వరంలో బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులపై జరిపిన కాల్పుల సంఘటనలను తీవ్రంగా విమర్శిస్తూ స్వరాజ్య పత్రికలో ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిండి తలకు మురికి టోపీ పెట్టి, కాళ్లకు, చేతులకు గోలుసులు వేసి, మట్టి చిప్పలో భోజనం పెట్టి తిడ్తూ, కొట్టినా ఆయన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తర్వాత ఆయన నంద్యాల నుండి మద్రాస్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.
పత్తికొండకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య నంద్యాలకు వలస వచ్చారు. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి తాలూకా ఆఫీసులోని ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యమ బాట పట్టారు. వ్యక్తి సత్యగ్రహంలో పాల్గొన్న నివర్తిని ఆయన 140మంది సహచరులను అక్టోబర్ 14, 1940లో ప్రభుత్వం ఆరెస్టు చేసి, 8నెలలు జైలు శిక్ష వేసింది. జైలు నుండి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. విద్యార్థులతో, కాంగ్రెస్ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశారు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్ధేశిస్తూ ఆయన రూపొందించిన సర్క్యూలర్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఆయన లొంగిపోయారు. స్వాతంత్రం వచ్చాక, 1968 నుండి 78వరకు శాసన మండలి అధ్యక్షుడిగా పని చేశారు.
రథసారథులు వీరే...:
ఖాదర్‌బాద్ నర్సింగరావు ఫిరంగి పాలనకు వ్యతిరేకంగా 1910లో కాంగ్రెస్‌లో చేరీ, ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1928లో బ్రిటీష్ పాలకులు భారతీయులు చదువుకోవడానికి పెద్దగా సహకరించలేదు. కాని స్థానిక బ్రిటీష్ పాలకులు వ్యతిరేకించినా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకొని వచ్చి, ఆరెకరాల భూమిని విరాళంగా ఇచ్చి నంద్యాల మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ వేల మంది రాజకీయ నాయకులకు, శాస్త్రవేత్తలకు, వైద్యులకు ఇంజనీర్లకు, పారిశ్రామిక వేత్తలకు అక్షరాలను నేర్పించింది. ఖాదర్‌బాద్ నర్సింగరావు జైలు పాలైన దేశ భక్తుల కుటుంబ సభ్యులకు ఆశ్రయమిచ్చి నెలలు తరబడి భోజనాలను పెట్టి ఆదుకునేవారు.
ఈయనతో పాటు దేశాయి కుప్పూరావు, కోడి నరసింహం, ఆత్మకూరు నాగభూషణం శెట్టి, టీ ఆర్‌కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, యరబోలు సుబ్బారెడ్డి, యాతం మహానందిరెడ్డి, రాజా శ్రీనివాస్‌లు ఉద్యమ పోరాటంతో నిస్వార్థంగా సేవలను అందించారు. స్వాతంత్ర ఉద్యమంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడమే కాక పోరాటాన్ని జరిపిన ఏకైక మహిళగా పద్మావతమ్మ ఆదర్శనీయంగా నిలిచింది. బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీసులుగా పని చేసిన శ్యాముల్ బెనెటిక్ట్ సుభాష్‌చంద్రబోష్ ఇచ్చిన పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు. కాంగ్రెస్ సభ్యురాలుగా పని చేసిన పద్మావతమ్మ స్వాతంత్య్ర అనంతరం కమ్యూనిష్టుగా మారారు. బైర్మల్ వీధిలో ఉన్న ఇప్పటి డాక్టర్ ఉదయ్‌శంకర్ హాస్పిటల్, వాసవీ భవన్, ప్రక్కనే ఉన్న దళితులు హాస్టల్ పలువురు నేతలు ఇళ్లలో సభల, సమావేశాలు జరిగేవి.
నంద్యాలను సందర్శించిన గాంధీ, నెహ్రూ:
జాతిపిత గాంధీజీ 1930లో నంద్యాలను సందర్శించి విక్టోరియా రీడింగ్ రూంలో జరిగిన సభలో ప్రసంగించారు. 1934లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 1937లో రాజాగోపాలచారి, 1952లో ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ పర్యటించారు. వీరితో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు, వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, కళావెంకటరావు, కల్లూరి సుబ్బారావు, ఆచర్య రంగా, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, గోపిరాజు రామచంద్రారావు, వెన్నెటి విశ్వనాథం, కడప కటిరెడ్డి, శ్రీమతి రామసుబ్రమ్మ, వాలిలాలు గోపాలక్రిష్ణయ్య నంద్యాలను సందర్శించారు. అప్పటి మున్సిపాలిటీ చైర్మన్ ఖాదర్‌బాద్ నర్సింగరావు వీరికి ఆహ్వానం పలికారు.
భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలలో ఇలాంటి చారిత్రక విషయాలు స్మరించుకోవడం మన బాధ్యత.
Super sir, mmana charithra ni velikitgiyyadam lo meeru chala kastapadthunnaru, God bless you.
ReplyDeleteTq Shiva pradeep
Delete