భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవసాహిత్యానికి మూలం భగవద్గీత: భారత స్వతంత్ర సంగ్రామంలో సాహిత్యం పాత్ర స్మరించుకోదగినది మరి ఆరోజుల...
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవసాహిత్యానికి మూలం భగవద్గీత: భారత స్వతంత్ర సంగ్రామంలో సాహిత్యం పాత్ర స్మరించుకోదగినది మరి ఆరోజుల్లో ఎటువంటి సాహిత్యం లభించేది మరియు చదివేవారు అని లోతుగా అధ్యయనం చేస్తే మొదటిగా స్పురించే పుస్తకం భగవద్గీత. ఈ భగవద్గీత ప్రతి ఒక్క స్వాతంత్ర్య సమరయోధుడి చేతుల్లో ఎప్పుడూ ఉండేది. భగవద్గీత ఎంతలా స్వాతంత్ర్య ఉద్యమకారులను ప్రభావితం చేసిందీ అంటే మరలా ఈ దేశంలో జన్మిస్తామంటూ భగవద్గీత ను చేతిలో ఉంచుకుని ఉరిని ముద్దాడేవారు, హిందువులు పునర్జన్మను విశ్వసిస్తారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరంలేదు.
అలాగే భగవద్గీత తో పాటుగా సావర్కర్ వ్రాసిన 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం. బంకించంద్రుడు వ్రాసిన ఆనందమఠం, దేవి చౌదురాణీ నవలలు. మరియు తిలక్ కేసరి పత్రిక, అరబిందో వందేమాతం పత్రికలు, హిందూ బందు, జుగంతర్ ఇలా మరికొన్ని పత్రికలు ఉద్యమ సాహిత్యాన్ని అందించేవి. ఇలా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సాహిత్యం పాత్ర స్మరించుకోదగినది. భగవద్గీత స్వాతంత్ర్య సమరయోధులను ఎంతలా ప్రభావితం చేసిందో ఎవరెవరు భగవద్గీతను తమ శ్వాసగా భావించారో సంక్షిప్తంగా.
బంకిం చంద్ర తన రచనల ద్వారా దేశభక్తి భావాలను మరియు స్ఫూర్తిని మొదటగా దేశమంతా నింపాడు. అతని రచనలలోని జ్ఞానయుక్తమైన అవగాహన ప్రజల మనస్సులలో జాతీయవాద, మతపరమైన మరియు కళాత్మక వైఖరిని రగిలించింది. ప్రసిద్ధ నవల “ఆనందమఠం” లో “వందేమాతరం” అనే గీతం అందించారు. "వందేమాతరం" భారత స్వాతంత్ర్య నినాదంగా మారింది. స్వాతంత్ర్య జ్వాలలను రగిలించిన రచనలు గీత నుండి ప్రేరణ పొందాయి! బంకిం భగవద్గీత ద్వారా ఎంతగానో ప్రభావితమయ్యాడు, ఎంతలా అంటే? జీవితం చివరి నాళ్ళల్లో బంకించంద్ర పూర్తిగా వేదాంతిగా మారిపోయాడు. ఆరోగ్య పరిరక్షణకు మందులను శ్రద్ధగా తీసుకోవాలన్న ఆసక్తి కూడ చచ్చిపోయింది. “నీవు మందులు తీసుకోకపోతే చేజేతులా మృత్యుదేవతను కౌగిలించుకున్నట్లు గాదా?” అని ప్రశ్నించాడు వైద్యుడు మహేంద్రలాల్ సర్కార్. మహేంద్రలాల్ సర్కార్ ఆ కాలంలో ఎంతో పేరుమోసిన వైద్యుడు. రామకృష్ణ పరమహంసకు కూడా వైద్యం చేశారు. "నేను మందు వాడడంలేదని ఎవరన్నారు? మందు తీసుకొంటూనే ఉన్నానే” అని బంకించంద్ర సమాధానమిచ్చాడు. వైద్యుడాశ్చర్యపోయి “ఏది చూపించు మం”దన్నాడు. బంకిం భగవద్గీత తీసి చూపించి “ఇదిగో ఇదే నా మందు" అన్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకే కృష్ణుని చెంతకు చేరాడు బంకిం.
భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన సోదరి నివేదిత లాంటి అగ్ని శిఖను మనదేశానికి పరిచయం చేసిన వివేకుడు భగవద్గీత చదవడంతో పాటుగా ఫుట్ బాల్ ఆడమంటాడు. ఓ క్రైస్తవుడు మా బైబిల్ అన్నిటికన్నా పైనుంది అని ఎగతాళి చేస్తుంటే వీటన్నిటికి పునాది భగవద్గీత అని అన్ని పుస్తకాల క్రింద వున్న భగవద్గీతను పక్కకు లాగి ఆ క్రైస్తవుడికి జ్ఞానోదయం చేశాడు. వివేకుడు వందల మంది స్వాతంత్ర్య సమరయోదులకి ప్రేరణగా నిలిచాడు.
లోకమాన్య తిలక్ కర్మయోగిగా ఉండేందుకు గీత ప్రేరేపిస్తుంది! అనేవారు. కాంగ్రెస్ సమావేశాలలో బ్రిటన్ నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరిన మొట్టమొదటి వ్యక్తి. స్వాతంత్య్ర పోరాట సమయంలో తన ఉత్సాహాన్ని ఎలా కొనసాగించగలిగాడో అతని అభిప్రాయాలను బట్టి స్పష్టంగా చెప్పవచ్చు. గీత యొక్క అత్యంత ఆచరణాత్మక బోధన, మరియు జీవితంలో పోరాటాల పరంపరగా ఉన్న ప్రపంచంలోని పురుషులకు ఇది ఆసక్తి మరియు విలువైనది, విధి కోరినప్పుడు ఎటువంటి అనారోగ్య భావాలకు దారితీయకూడదు. దృఢత్వం మరియు భయంకరమైన వాటిని ఎదుర్కొనే ధైర్యం." మరియు, "భారతదేశంలోని ప్రతి పురుషుడు, స్త్రీ మరియు బిడ్డ గీతా సందేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనదని నా దృఢ విశ్వాసం." అంటూ గీతపై “గీత రహస్యం” అనే ఉపన్యాసం రాశాడు, ఇది నేటికీ గీతపై వ్రాసిన ఉత్తమ పుస్తకాలలో ఒకటి.
అరవింద్ ఘోష్ స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప విప్లవకారుడు మరియు గీతాసారాన్ని ఓంటబట్టించుకున్ని గొప్ప ఆధ్యాత్మికవేత్త. తోటి విప్లవకారులతో ప్రత్యర్థులతో పోరాడండి! ప్రారదోలండీ!! పడగొట్టండి!!! అంటూ గీతాసారాన్ని విప్లవకారుల్లో నూరిపోశాడు స్వయాన తమ్ముడు బారీంద్ర ఘోష్ అన్న అరవింద్ ఘోష్ మాటలను తూచా తప్పకుండా పాటించాడు. మురారిపుకార్, మంచిక్‌టొల్ల లోని తమ ఇళ్లలో యువ దేశభక్తులకు విప్లవ కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చేవారు. ఆ ఇళ్లను ‘విప్లవ యోగుల ఆశ్రమం’గా మార్చేశారు. ఈ ఆశ్రమంలో యువ విప్లవ మార్గ దేశభక్తులకు శారీరక దారుఢ్యం, మిలటరీ వ్యూహాలపై శిక్షణ, ఆయుధాల వినియోగంతోపాటు ధ్యానం కూడా నేర్పించేవారు. భగవద్గీత, ఉపనిషత్తులను బోధించేవారు. అలాగే స్వాతంత్ర్యం కోసం అత్యంత చిన్నవయసులో ఉరికంబాన్ని ఎక్కిన ఖుదీరాం బోస్ చేతిలో భగవద్గీత ఉందంటే అది అరవింద్ ఘోష్ ఇచ్చిన స్పూర్తి అలాగే బంకిం బాబు ఆనందమఠం వ్రాసిన 25 ఏళ్ళ తరువాత అది బెంగాల్ లో ఒక విప్లవాగ్ని రగిలించింది. ఆ చైతన్యంతో 1905లో బెంగాల్ స్వదేశీ ఉద్యమం కలకత్తా వీధుల్లో 50,000 మంది ప్రజలతో కలిసి ప్రారంభమైంది, ప్రతి ఒక్కరూ వారి చేతుల్లో భగవద్గీతతో. బ్రిటీష్ వస్తువులను బహిష్కరిస్తామని, బ్రిటీష్ వారిని తమ భూముల నుండి తరిమికొడతామని ప్రతిజ్ఞ చేసి ప్రజలంతా కాళీ ఆలయానికి చేరుకున్నారు, అదీ భగవద్గీత సారం అనిపిస్తుంది ఆ సంఘటన చూస్తే…
విప్లవనాయకులకు అడ్డా పంజాబ్ కేంద్రంగా తయారయ్యింది. డిల్లీ, ఆగ్రాలకు విప్లవకారులంతా సైకిళ్ళపై తిరుగుతూ భగవద్గీతా శ్లోకాలని పలికేవారు. ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్ బృందాలకు గీత శ్లోకాలు నోటిమీద ఉండేవి. కాకోరి రైలు దోపిదీలో పట్తుబడ్డ పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ కు అసలు సిసలైన అనుయాయుడు రోశన్ సింగ్ 'బిస్మిల్ లక్నో జైలులో 16 రోజులు నిరాహార దీక్షలో ఉన్నప్పుడు రోశన్ సింగ్ కూడా 16 రోజులు పూర్తిగా ఉపవాసం ఉండి ఆయనకు తోడు నిలిచాడు. కాకోరీ కేసు విచారణ జరుగుతున్న రోజుల్లో రామ్ ప్రసాద్ 'బిస్మిల్ తో పాటు రోశన్ సింగ్ కు కూడా ఉరిశిక్ష పడుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ 1927 డిసెంబరు 19న చేతిలో భగవద్గీత పట్టుకొని వెనువెంటనే బయలుదేరి 'వందేమాతరం' నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ఆయన ఉరికంబం ఎక్కాడు. రోశన్ చివరిమాటలు ఇలా ఉన్నాయి. భూమి పైన జన్మనెత్తిన తర్వాత చావు తప్పదు. చనిపోయేటప్పుడు భగవంతుని మరువకుండా ఉండాలి.. మన శాస్త్రాల్లో రాశారు కదా - అడవుల్లో ఉంటూ తపస్సు చేసే వాడికి ఎలాంటి గతులు కలుగుతాయో, ధర్మ యుద్దంలో ప్రాణాలర్పించేవాడికి కూడా అవే గతులు కలుగుతాయని!.
సింధ్ కూడా విప్లవకారులకు అడ్డాగా ఉండేది అక్కడ హేమూకలాని కూడా ఇలా చేశాడు. హేము కలాని క్విట్ ఇండియా ఉద్యమం 1942 లో ప్రారంభమైనప్పుడు మహాత్మా గాంధీతో కలిసి ఉద్యమంలో చేరారు. సింధ్ ఉద్యమానికి మద్దతు బ్రిటిష్ పాలకులు యూరోపియన్ బెటాలియన్లతో కూడిన ప్రత్యేక దళాలను పంపవలసి వచ్చింది. ఈ దళాలు రైలులో, బాంబులు ఇతర సామాగ్రి తన స్థానిక పట్టణం గుండా వెళుతుందని హేము కలాని తెలుసుకొన్నారు, వెంటనే రైల్వే ట్రాక్ నుండి ఫిష్ ప్లేట్లను తొలగించడం ద్వారా రైలు పట్టాలు తప్పాలని నిర్ణయించుకున్నారు. హేము సహచరులకు అవసరమైన సాధనాలు లేనప్పటికీ, ఫిక్సింగ్లను విప్పుటకు ఒక తాడును ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పని మొత్తం పూర్తయ్యే లోపే బ్రిటిష్ దళాలు వారిని చూశాయి హేము పట్టుబడ్డాడు. వాదోపవాదాలు తరువాత ఉరిశిక్ష విధించారు. మరణశిక్ష విధించిన తరువాత హేము కలాని చాలా సంతోషంగా ఉన్నాడు. ఉరితీసిన రోజున హేము చాలా ఆనందంగా కనిపించాడు మరియు భగవద్గీత ప్రతిని తన చేతుల్లో ఉంచుకున్నాడు, నవ్వుతూ ఉరిని కోరుకున్నాడు. అని ఉరితీసిన అధికారి సమాచారం ఇచ్చాడు.
సావర్కర్ అండమాన్ జైలులో ఖైదీలకి భగవద్గీత, రామాయణాలను నూరిపోశాడు. అలాగే గాంధీ, మరియు తన అనుచరుడు భూ ఉద్యమకారుడు వినోభా భావే కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో భగవద్గీతా ప్రచారం చేశారు. దామోదర్ పంత్ చాపెకర్ 1898 లో మొట్టమొదట భగవద్గీత చేతిలో ఉంచుకుని ఉరిని ముద్దాడినారు. ఇంకా ఎంతోమంది భగవద్గీత చేతిలో ఉంచుకుని దేశ స్వాతంత్ర్యంకోసం ఉరికొయ్యలపాలయ్యారు. కేవలం ఈ వ్యాసం ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివాటిపై యువత అధ్యయనంచేయాలి. భారత స్వాతంత్ర్య ఉధ్యమంలో విప్లవసాహిత్యానికి మూలం భగవద్గీత. జై హింద్. రాజశేఖర్ నన్నపనేని. మెగామైండ్స్.
సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28
or Directly Buy
సరైన సమయంలో చక్కని వ్యాసం
ReplyDelete