ఆలయ ప్రవేశానికి ఉద్యమించిన అయ్యంకాళి కులదురహంకారపు కుంపటిలో రగిలిన చైతన్యశిఖ, మరొక పోరాట యోధుడు మహాత్మ అయ్యంకాళి. 18 శతాబ్ది రెండవ భాగంలో నా...
ఆలయ ప్రవేశానికి ఉద్యమించిన అయ్యంకాళి
కులదురహంకారపు కుంపటిలో రగిలిన చైతన్యశిఖ, మరొక పోరాట యోధుడు మహాత్మ అయ్యంకాళి. 18 శతాబ్ది రెండవ భాగంలో నారాయణ గురు ప్రేరణతో కులాధిపత్యానికి, వివక్షకు వ్యతిరేకంగా ప్రయత్నాలు మొదలు పెట్టిన సంస్కర్త. ఆయన తిరువనంతపురానికి దగ్గరలోని వెంగనూరులో పులయ అంటరాని కులంలో 1863 ఆగస్టు 28 న జన్మించారు. ఆయనకు చదువులేదు. కూలిగా పనిచేశాడు. నారాయణ గురు ఉద్యమం విద్య,విజ్ఞానంతో సాగితే..... అయ్యంకాళికి సంఘర్షణ చేయటం తప్పలేదు. నిమ్నవర్గాలలోని పైస్థాయి వారైన ఈళవలను కొంత వ్యతిరేకతతోనైనా సమాజం అంగీకరించింది. కానీ అంటరాని పులయ, పరయలను ఆనాటి సమాజంలోని కొన్ని ఆధిపత్య కులాలు గుర్తించడానికి ఇష్టపడలేదు. అందుకే సంఘర్షణ అనివార్యమైంది. రక్తపాతం జరిగింది. సమాజంలో ఎన్ని వైరుధ్యాలున్నా, కులాల మధ్య ఎన్ని విభేదాలున్నా, అంటరాని కులాల విష యానికి వచ్చేసరికి తీవ్ర వివక్ష ఆనాటి కేరళ సమాజంలో ఉండేది. అందుకేనేమో స్వామి వివేకానంద కేరళ ను "పిచ్చి ఆసుపత్రి" అని అన్నారు. అయ్యంకాళి సామాజిక ఉద్యమం
పులయలు వీధుల్లో నడవరాదనే ఆంక్షలను అయ్యంకాళి ఎదిరించారు. అనేక మంది యువకులతో "నడక పోరాటాన్ని" చేపట్టారు. బలరామాపురం లోని చళియార్ బజార్‌కు చేరుకునేసరికి అగ్రవర్ణాల గుంపు ఎదురు నిలిచింది. కోట్లాట మొదలై, ఇరువర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీన్ని కేరళలో దళితుల మొదటి సాయుధ ఘర్షణగా చెప్తుంటారు. పులయలు సంఘటితం అవుతుండటంతో కొన్ని కులాలు దాడులకు దిగాయి. అయ్యంకాళి వాటిని ఎదిరించడానికి ఆత్మరక్షణ దళాలను నిర్మించారు. ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి ‘సాధుజన పరిపాలన సంఘం’ స్థాపించారు. ఈ సభ ద్వారా ‘సాధుజన పరిపాలని’ అనే మాస పత్రికను నడిపాడు. అయోతీదాస్ నడిపిన ‘ఒరుపైసా తమిళన్’ అన్న పత్రికతోపాటు అయ్యంకాళి నడిపిన పత్రిక భారతదేశంలో మొట్టమొదటి దళిత పత్రిక. సభ తరఫున కొన్ని డిమాండ్లతో ప్రభుత్వానికి దరఖాస్తులను సమర్పించారు. వాటిలో ఒకటైన పాఠశాలల్లో అంటరానికులాల పిల్లలను చేర్చుకోవడం పట్ల ఆనాటి ట్రావెన్ కోర్ సంస్థానం దివాను రాజగోపాలాచారి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు ఇచ్చారు. భూస్వాములు వాటి అమలుకు నిరాకరించారు. దీనికి విరుగుడుగా అయ్యంకాళి ‘‘మీరు మా పిల్లలను చదువుకోనివ్వక పోతే మీ పొలాల్లో పిచ్చిగడ్డి మొలుస్తుంది. మీ పొలాలు బీళ్ళు పడతాయి’’ అని హెచ్చరించారు. దీనితో భూస్వాములు దిగివచ్చారు. అయితే ఒక అమ్మాయిని బడిలో చేర్పించడానికి వెళ్తే ఆధిపత్య కులాలకి చెందినవారు కొందరు దాడిచేశారు. దానిని అయ్యంకాళి ప్రతిఘటించారు. ఇట్లా కొన్ని పదుల సంఘర్షణలు జరిగాయి. అయ్యంకాళిని హత్యచేయడానికి పథకం వేసినా ఆయన ధైర్యంతో ఎదుర్కొని బయటపడ్డాడు.1924లో జరిగిన వైకొం సత్యాగ్రహం కన్నాముందే 1907లో దేవాలయాల ప్రవేశం కోసం అయ్యంకాళి చేసిన పోరాటం గురించి ఎవ్వరూ చెప్పకపోవడం విడ్డూరం.
ట్రావెంకూర్ సంస్థానం ప్రజాసభలో పులయల సమస్యలపై, ప్రత్యేకించి విద్యాసౌకర్యాల కల్పన గురించి ఆయన చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టు కున్నాయి. దేశ చరిత్రలోనే మొదట కూలీల సమ్మెను నిర్వహించిన ఘనత అయ్యంకాళిదే. అయితే ఈ సమ్మె కూలీల హక్కుల కోసం చేసింది కాదు.. ఇది అస్పృశ్యతకు వ్యతిరేఖంగా చేసిన మొదటి సమ్మె. సభకు పోలీసులు అనుమతి నిరాకరిస్తే, సమీపంలోని సముద్రంలో పడవలన్నింటిని ఒక చోటకి చేర్చి సభ నిర్వహించిన గొప్ప ఉద్యమ వ్యూహకర్త అయ్యంకాళి. ఆయనది అత్యంత సాహసోపేతమైన సామాజికఉద్యమం.
ఇన్ని పోరాటాలు చేస్తూ ఆయన చేసిన మరొక విప్లవాత్మకమైన ఉద్యమం – స్త్రీలకు సంబంధించిన సాంస్కృతిక ఉద్యమం. ఆ రోజుల్లో కేరళలో అంటరాని కులాల స్త్రీలు రవికెలు వేసుకోరాదు. వీళ్ళు ఛాతిని కప్పుకోడానికి కేవలం రాళ్ళ, పూసల దండలు మాత్రమే వేసుకోవాలి. ఈ అలవాటునూ, నియమాన్నీ నిర్మూలించడానికి అయ్యంకాళి వేలాదిమంది స్త్రీలను సమావేశపరిచి వాళ్ళ మెడల్లోని రాళ్ల, పూసలదండల్ని తెంచివేయమని పిలుపునిచ్చాడు. వెంటనే వేలాది మంది స్త్రీలు అది పాటించారు. వాళ్ళు రవికెలు వేసుకోవడం మొదలుపెట్టారు. అయ్యంకాళి ఈ వికృత ఆచారాన్ని వదులుకొమ్మని పిలుపునివ్వడం, స్త్రీలు వెంటనే అది పాటించడంతో ఆ సమస్య ముగిసిపోకున్నా... ఓ సాంస్కృతిక చైతన్యానికి దారితీసింది.
అంటరాని కులాల్లో స్వాతంత్రేచ్ఛ, ఆత్మవిశ్వాసం నింపటంతో పాటు, స్త్రీల ఆత్మగౌరవం కోసం వారిని సాంస్కృతికంగా చైతన్యపర్చిన సంఘసంస్కర్త అయ్యంకాళి 1941 జూన్ 18 న మరణించారు. ఆయన ఉద్విగ్నభరితమైన పోరాటం, జీవితం ఆదర్శప్రాయం. ఆయన పోరాటంలో నారాయణ గురు తాత్వికత ఉంది, ఆయన జీవితంలో సంస్కరణవాది అయ్యవు స్వామికల్ ఆధ్యాత్మికత ఉంది. అందుకే క్రైస్తవమత మార్పిడులకి గురికాకుండా స్వామికల్ నింపిన ధార్మికధారతో హిందూసమాజంలోని అస్పృశ్యత నివారణకు అయ్యంకాళి ఉద్యమించారు. ఆనాటి ఘోరమైన వికృతదురాచారాలు నేడు లేకపోయినా, అక్కడక్కడా వివక్ష రూపంలో వెంటాడుతున్న అంటరానితనం దూరం చేసేందుకు అయ్యంకాళి స్పూర్తిని కొనసాగిద్దాం. హిందూసమాజంలో భాగమైన అందరికీ ఆలయ ప్రవేశం జరిగేలా ముందుకెళ్దాం.
No comments