రాజర్షి కులమని ప్రకటించిన రాజయోగి కులం రాజర్షి అని, గోత్రం అచల ఋషి అని, సూత్రం పరిపూర్ణమని.... కులప్రసక్తి లేకుండా, కుల వివక్ష లేకుండా వేలాద...
కులం రాజర్షి అని, గోత్రం అచల ఋషి అని, సూత్రం పరిపూర్ణమని.... కులప్రసక్తి లేకుండా, కుల వివక్ష లేకుండా వేలాది మంది శిష్యప్రశిష్యులను తయారు చేసి తెలుగునాట సమరసత సద్భావన ను చాటిచెప్పిన రాజయోగి అచల పరిపూర్ణ సిద్ధాంత ప్రవక్త శ్రీ రామడుగు శివరామ దీక్షితులు.
నల్గొండ జిల్లా నారాయణ పేట సంస్థానం లో రామడుగు విశ్వనాధ శాస్త్రి, నిర్మలాంబ అను వైదిక బ్రాహ్మణ దంపతులకు 1690లో శివరామ దీక్షితులు పుట్టాడు . ఆయన శివ పూజా దురంధరుడు, వేదవేదాంగపారంగతుడు, తర్కవ్యాకరణ వేదాంతశాస్త్రవిధుడు, శతక్రతుయాజి, నిత్యాగ్నిహోత్రి. అయితే ఈ చదువులు, సంపదలు, పేరుప్రతిష్ఠలు అశాశ్వతం అని వేదాంతమీమాంస అనే ఔషధం అందించే గురువు తనకు కావాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజున కుండెడు నీళ్లు యజ్ఞకుండంలో పోసి నిరంతరం వెలిగే అగ్నిని ఆర్పేసినాడు. ఆయన భార్య ఏడుస్తూ ఎంత పని చేసినారు అంటే? "యజ్ఞాలు, మందిర నిర్మాణాలు, వేదఅధ్యయనం స్వర్గసుఖాలు ఇస్తాయేమో కానీ మోక్షాన్ని ఇవ్వవు. నేను మోక్షప్రాప్తిని.పూర్ణ ఆనంద బోధ చేసే గురువు కలిస్తే తిరిగి వచ్చి నిన్ను చూస్తాను లేకపోతే లేదు" అంటూ ఇల్లు విడిచి పోయాడు
దేశ సంచారానికి వెళ్ళిన శివరామ దీక్షితులు గురువుని అన్వేషిస్తూ కాశీ మొదలు అనేక క్షేత్రాలు తిరిగారు. ఆత్మజ్ఞానం కోసం దేశ సంచారం చేస్తూ చేస్తూ ,ఒక దొమ్మరి గడసాని లక్ష్య శుద్ధికి అబ్బురపడి ,ఆమె గురువైన శ్రీధరులను దబ్బాకుపల్లిలో వటవృక్షం క్రింద తపస్సులో ఉండగా దర్శించాడు. ఇతనికోసమే అయన దేహత్యాగం చేయకుండా ఉన్నాడు .మూడురకాల తీర్దాలు ప్రసాదాలు ఇచ్చి తారకం అమనస్కత బోధించాడు .మూడు దీక్షలిచ్చాడు. నాలుగు మహావాక్యాలు, వాటి శబ్దార్ధాలు బోధించి ద్వాదశి, పంచదశి,షోడశి మంత్రాలు- అర్ధాలు బోధించి వాటిని ప్రచారం చేయమని ఆదేశించి పాదుకలు అనుగ్రహించారు .21వ రోజు గురువు దేహం చాలించాక ఉత్తరక్రియలు జరిపి స్వగ్రామం చేరి అమనస్కత ప్రచారం చేశాడు దీక్షితులు.
శివరామ దీక్షితులు ప్రవచించిన అచల బోధ కి ఈనాడు ఆంధ్ర దేశమంతటా చాలా ప్రచార ప్రభావం ఉన్నది. అచలం అనే మాట మొదట వేమన పోతులూరి ఉపయోగించినప్పటికీ, దానికి ఒక సిద్ధాంతాన్ని,ఒక గ్రంథాన్ని,మంత్రాలను ప్రసాదించిన వారు రామడుగు శివరామ దీక్షితులు. శివరామ దీక్షితులు రచించిన గ్రంథం బృహత్ వాశిష్టము. పండరి క్షేత్ర వాసులైన శ్రీధర స్వాములవారు అచల బోధ సంస్కృతంలోనూ,మరాఠీలోనూ చేయగా దానిని పండిత పామరులకు తెలుగులో వ్రాసి యోగ శిక్షణ సామాన్య జనులకు గృహస్తులకు కు అందించిన వారు శివరామ దీక్షితులు. శివరామ దీక్షితుల శిష్య ప్రశిష్యులు వారి శాఖలు దేశమంతటా వ్యాపించాయి ఈ శిష్య పరంపర లోని వారు కొందరు తమ తమ రచనల ద్వారా బహుళ ప్రచారం చేసినారు,నేటికీ చేస్తున్నారు. అచలము చదువుసంధ్యలు లేని అట్టడుగు వర్గాలలో ఆస్తిక బుద్ధిని పెంపొందించి, భారతీయ సంస్కృతికి అచల మతం గొప్ప సేవ చేసింది అని దేశభక్తులైన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి నవల లో అంటారు.
ఆదిశంకరులు ప్రవచించిన అద్వైత సిద్ధాంతానికి, అచల పరిపూర్ణ సిద్ధాంతానికి ఎంతో సామ్యం ఉన్నప్పటికీ, కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. అవి పట్టించుకోవాల్సిన పనిలేదు. జీవుడే దేవుడు అనే అద్వైత అమృతాన్ని, అచలంగా సామాన్య జనులకు అందించి, కులాలకు అతీతంగా ఎందరినో గురుస్థానంలో నిలిపిన అచల సిద్ధాంతం నేటికీ ఎందరో తెలుగు నాట అనుసరిస్తున్నారు. అనేక కులాలకి చెందిన ఎందరెందరో పీఠాలకు, ఉప పీఠాలకు అధిపతులుగా ఎదిగి సద్భావన సమరసత మంత్రాన్ని ఇంకనూ అందజేస్తున్నారు. అచలామృతంతో "అహం" అణచివేసి అందరిని ఒక్కటి చేసిన శివరామ దీక్షితులు 101ఏళ్ళు జీవించి 23-11-1791 విరోధి కార్తీక శుద్ధ శనివారం దేహం చాలించారు. వారు అందించిన గురుపరంపరలోని శిష్యప్రశిష్యులు వారి స్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తున్నారు. వారి అడుగుజాడల్లో అందరం పయనిద్దాం. హిందూసమాజాన్ని కులవివక్ష లేని సమాజం గా నిర్మిద్దాం.
Hi
ReplyDelete