11 వ శతాబ్దంలోనే దేవాలయ వ్యవస్థను క్రింది కులాల వారి చేతిలో పెట్టి గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు, విశిష్టాద్వైత సిద...
11 వ శతాబ్దంలోనే దేవాలయ వ్యవస్థను క్రింది కులాల వారి చేతిలో పెట్టి గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందించిన ప్రవక్త రామానుజాచార్యులు క్రీ.శ. 1017లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జన్మించారు. చిన్నతనంలోనే కాంచీపురంలోని యాదవ ప్రకాశుని దగ్గర వేదాంత విద్యను అధ్యయనం చేశాడు. ఆ తరువాత తన సిద్ధాంతంతో అతణ్ణి ప్రభావితుణ్ణి చేశాడు. అనంతర రామానుజాచార్యులు కంచిలో పెరియనంబి అనే గురువు దగ్గర వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. వివాహానంతరం కొంతకాలానికి విరక్తి చెంది సంసారాన్ని పరిత్యజించి, సన్యాసాన్ని స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు.
అందరి కోసం నేను నరకానికి వెళ్ళినా సరే!:
శ్రీ రంగమునందు గోష్ఠిపూర్ణుడనే ఆచార్యుణ్ణి ఆశ్రయించి, తనకు తారకమంత్రాన్ని ఉపదేశించుమని కోరాడు. అయితే గోష్ఠిపూర్ణుడు ఒక షరతుపై తారక మంత్రోపదేశం చేస్తానన్నాడు. అదేమంటే – ‘తాను ఉపదేశించే తారకమంత్రాన్ని ఇతరులెవ్వరికీ ఉపదేశించకూడదు’ అని. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే నరకానికి పోతావని హెచ్చరించాడు. రామానుజాచార్యులు అందుకు అంగీకరించి, తారక మంత్రోపదేశాన్ని పొందాడు. కానీ, గురువుకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగంచేసి, శ్రీరంగంలోని రంగనాథాలయం దగ్గర తారకమంత్రాన్ని అందరికీ బహిరంగంగానే ఉపదేశించాడు. అప్పుడు గురువు మండిపడగా – ‘స్వామీ! నేను చేసిన ఈ మంత్రోపదేశం వల్ల ఈ జనులందరూ వైకుంఠానికి వెళ్లే అవకాశం లభించింది కదా! నేను ఒక్కణ్ణి నరకానికి పోతే నష్టం ఏమిటి?’ అని సమాధానం చెప్పి, లోకాన్ని ఉద్ధరించాడు. గురువు అతని లోకోపకారదృష్టికి ఆశ్చర్యచకితుడైనాడు.
ఆ తరువాత రామానుజాచార్యులు నలభై సంవత్సరాలు శ్రీరంగంలోనే రంగనాథాలయానికి అధిపతిగా సేవలను అందించి, యావత్ భారతదేశాన్ని పర్యటించి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. రామేశ్వరం నుండి బదరీనాథ్ వరకు అన్ని దిక్కులా జనపదాలను పర్యటించి, తన జ్ఞాన ప్రబోధంతో మేల్కొలిపాడు. ఈ కాలంలోనే బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని రచించాడు. ఇది విశిష్టాద్వైత సిద్ధాంతానికి పరమప్రామాణికంగా భాసిస్తున్నది. ఆ తరువాత భగవద్గీతాభాష్యాన్ని రచించాడు. వేదాంత సారం, వేదాంతదీపం, శరణాగతిగద్యమ్, వైకుంఠగద్యమ్ వంటి ఉత్తమ రచనలు చేసి, లోకానికి మార్గదర్శనం చేశాడు.
విశిష్టాద్వైత సిద్ధాంతం:
రామానుజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతంలో బ్రహ్మ సత్యమేకానీ, జగత్తూ, జీవాత్మలూ మిథ్యకాదని ప్రబోధించాడు. బ్రహ్మం, జీవాత్మ, జగత్తూ ఈ మూడూ సత్యపదార్థాలే అనేది రామానుజుల సిద్ధాంతం. రామానుజులు భక్తి మార్గాన్ని విశేషంగా ప్రచారం చేశారు. భక్తి ఒక్కటే మోక్షానికి సాధనం అనీ, కర్మజ్ఞానాలు భక్తి మార్గాన్ని సుగమం చేస్తాయనీ ప్రవచించాడు. భక్తిలేని కర్మజ్ఞానాలు వృథా అని రామానుజుల సిద్ధాంతం. మహావిష్ణువుని నవవిధ భక్తులతో కొలిస్తే మోక్షం లభిస్తుంది. శ్రవణం (భగవత్కథలు వినడం), కీర్తనం (భగవన్మహిమలను గానం చేయడం), స్మరణం (భగవన్నామాన్ని స్మరించడం), పాదసేవనం (భగవంతుని పాదాలను మొక్కడం, అర్చించడం), అర్చనం (వివిధోపచారాలతో పూజించడం), వందనం (భగవంతునికి ఎల్లప్పుడూ నమస్కరించడం), దాస్యం (భగవంతుని దాసునిగా భావించుకొని సేవలు చేయడం), ఆత్మనివేదనం (శరణాగతితో మనస్సును భగవంతునికి అర్పించడం) అనేవి నవవిధ భక్తి మార్గాలు. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి ఒక్కటే సులభోపాయం. భక్తికి తోడ్పడేది ప్రపత్తిమార్గం. ప్రపత్తి అంటే శరణాగతి. అన్నింటినీ భగవంతునికే అర్పించి, అతణ్ణే కాపాడుమని కోరడమే శరణాగతి భగవద్గీత కూడా – ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః’ అని ఈ ప్రతిపత్తి మార్గాన్నే ప్రబోధించింది. ఇలా రామానుజుల విశిష్టాద్వైతం లోకరంజకమై అందరినీ తరింపజేస్తున్నది.
రామానుజులు తమ సిద్ధాంతముతో లోకుల మనస్సులను ఆకట్టుకొన్నారు. ఈ భవబంధాలనుండి మానవులను తరింపజేశారు. అస్పృశ్యులని భావించే వారిని ఆనాడే తిరుక్కలతర్ ( ఉన్నతులు) అని పిలిచారు. వారికీ ఆలయ ప్రవేశం కల్పించి, ఆనాడే అంటరానితనపు అడ్డుగోడల్ని కూల్చివేశారు. ఆయన గురువులైన తిరుకచ్చి నంబి, పెరియనంబి ఇద్దరూ ఆనాటి వ్యవస్థలో తక్కువకులంవారే! అయినా వాళ్ళే రామానుజుని గురువులు. వృద్ధ్యాప్యంలో స్నానఘట్టానికి వెళ్ళే సమయంలో బ్రహ్మణశిష్యుల భుజాల పై చేతులు వేసి వెళ్లి, స్నానము తర్వాత చర్మకారుల భుజాలపై చేతులు వేసి నడిచి వచ్చేవారు. "నేను" అనే అహంకారం తొలగిపోవడానికే తాను ఆ విధంగా చేస్తున్నట్లు తన శిష్యులకి రామానుజులు చెప్పారు. రామానుజుడు కులతత్వాన్ని పోగొట్టటానికి చూపిన ధైర్యసాహసాలు నేటికీ అనుసరణీయం. ఆయన ఆచరణ లో చూపిన సమరసతా-సద్భావాన్ని మనం అందుకుందాం.... ముందుకు తీసుకెళ్దాం.
No comments