Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్ర్య పోరాటంలో విష్ణు దామోదర్ చితాలే, తిల్కా మాంఝి, మహదేవ్ దేశాయ్, సైఫుద్దీన్ కిచ్లూ పాత్ర

భారతదేశ స్వాతంత్ర్య సమరం ఆధునిక ప్రపంచంలోని గొప్ప పోరాటాలలో ఒకటి. ప్రతి వర్గం, సామాజిక సమూహం నుంచి ప్రజలు ఈ పోరాటంలో తమ వంతుగా స...

భారతదేశ స్వాతంత్ర్య సమరం ఆధునిక ప్రపంచంలోని గొప్ప పోరాటాలలో ఒకటి. ప్రతి వర్గం, సామాజిక సమూహం నుంచి ప్రజలు ఈ పోరాటంలో తమ వంతుగా సహకరించారు. వారి పోరాటాల ఫలితంగానే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించింది. స్వాతంత్య్ర ఘట్టం 75వ ఏట ప్రవేశించిన నేపథ్యంలో దేశం 'స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు' జరుపుకుంటోంది. దేశాన్ని బానిసత్వ సంకెళ్లనుంచి విముక్తం చేసేందుకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అమరవీరులను నేడు జాతి స్మరిస్తోంది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా ఈ వ్యాసంలో మహాదేవ్ భాయ్ దేశాయ్, తిల్కా మాంఝి, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, విష్ణు దామోదర్ చితాలేల జీవితం, రచనలను స్పృశిస్తున్నాం. వారు బ్రిటిష్ పాలకులతో పోరాడటమేగాక మనకు ఒక ఆలోచన దృక్పథాన్ని కూడా వదిలివెళ్లారు. ఈ వారసత్వాన్ని ఇప్పటికీ దేశప్రజలు ఆదరించి, అనుసరిస్తున్నారు.


దేశ నిర్మాణంలో వహించిన ప్రముఖ పాత్ర స్వాతంత్య్ర  సమరయోధుడు విష్ణు దామోదర్ చితాలే: విష్ణు దామోదర్ చితాలే బాల్యం నుంచే దృఢ నిబద్ధత, జీవిత ధ్యేయాలుగల వ్యక్తి. ఆయనను అందరూ ప్రేమగా 'భాయ్ చితాలే' గా పిలుచుకునేవారు. ఆయన 1906 జనవరి 4న మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైనప్పటికీ భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న జాతీయవాది. స్వాతంత్య్ర సమరంతోపాటు రైతులు-కూలీల ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమించడమే కాకుండా మహాత్మాగాంధీ నేతృత్వాన ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు.

నిర్భీతికి నిలువుటద్దమైన చితాలే మార్క్సిస్టు సాహిత్యంతో ప్రభావితులై కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నా ఆ పార్టీ విధానాన్ని గుడ్డిగా అనుసరించలేదు. ఆ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు భారత జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం అనిపించినపుడు బహిరంగంగా వ్యతిరేకించడానికీ ఆయన వెనుకాడలేదు. ఆ మేరకు 1942నాటి 'క్విట్ ఇండియా' ఉద్యమాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించినా భాయ్ చితాలే మద్దతిచ్చారని చెబుతారు. ఈ కారణంగా పార్టీ ఆయనను బహిష్కరించినా తిరిగి 1951లో మళ్లీ చేర్చుకుంది.

అలాగే భారత్ పై చైనా దండయాత్ర సమయంలోనూ ఆయన కమ్యూనిస్టులతో. సైద్ధాంతికంగా విభేదిస్తూ మాతృభూమికి మద్దతు పలికారు. అంతేకాకుండా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడంతోపాటు గోవా విముక్తి ఉద్యమంలోనూ ఆయన చురుగ్గా పాలు పంచుకున్నారు. ఆ సందర్భంగా పోర్చుగీసుల పాలకుల తూటాలకు ఎదురొడ్డి 1000 మందితో గోవా సరిహద్దుకు చేరుకున్నాడు.


తిల్కా మాంఝి స్వేచ్ఛా పిపాస బ్రిటిష్ పాలకును వణికించింది: బ్రిటిష్ పాలనపై తొలి సాయుధ తిరుగుబాటు 1784లో జరిగిందని పరిగణిస్తారు. ఆ మేరకు 1784 జనవరి 13న ఓ యువకుడు విషపూరిత బాణంతో ఈస్టిండియా కంపెనీ పాలకవర్గంలో ఒకరైన ఆగస్టస్ క్లీవ్ల్యాండ్ ను తీవ్రంగా గాయపరిచాడు. ఆ యువకుడే తిల్కా మాంఝి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మాట కూడా వినిపించని రోజుల్లో అతడు వారితో యుద్ధానికి దిగారు. ఈ సంఘటన అనంతరం బ్రిటిష్ వారు, అతడి స్థావరమైన తిలక్పూర్ అడవిని చుట్టుముట్టారు. కానీ, అతడు, అతడి అనుయాయులు చాలా వారాలపాటు వారిని నిలువరించారు. చివరకు అతడు పట్టుబడగా గుర్రపు తోకకు కట్టి బీహార్లోని భాగల్పూర్లో గల కలెక్టర్ నివాసం దాకా ఈడ్చుకెళ్లారు. అటుపైన అక్కడ జనవరి 13న మర్రి చెట్టు కొమ్మలనుంచి ఉరితీశారు.

ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు తిల్కా మాంఝి నుంచి స్ఫూర్తి పొంది. "హనీ.. హసీ.. చడ్ గో ఫాసీ' (నవ్వుతూ నవ్వుతూ ఉరిని వరించిన వీరుడా) అంటూ పాటలు పాడారు. తిల్కా మాంఝి కొండజాతికి చెందిన వీర సైనికుడు. బీహార్లోని భాగల్పూర్ పరిధిలో సుల్తాన్గం గల తిలక్పూర్ గ్రామంలో సంధాల్ కుటుంబంలో 1750 ఫిబ్రవరి 11న జన్మించిన తిల్కా మాంఝి అసలు పేరు జబ్రా పహాడియా. అతనికి 'తిల్కా' అనే పేరు రావడం వెనుకగల వృత్తాంతం కూడా ఆసక్తికరమైనదే.

తిల్కా మాంఝి 1771 నుంచి 1784 దాకా సుమారు 13 సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడటంతో పాటు స్థానిక వడ్డీ వ్యాపారులు, భూస్వామ్య శక్తులనూ తీవ్రంగా ఎదిరించారు. ప్రసిద్ధ 'సంథాల్ తిరుగుబాటు' కూ -నాయకత్వం వహించారు. భాగల్పూర్లోని విశ్వవిద్యాలయం అతడి పేరిటే ఏర్పాటైంది. తిల్కా మాంఝి జీవితం, తిరుగుబాటుపై ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతా దేవి బెంగాలీలో 'షల్గిరార్ డాకే' నవలను రచించారు, ఇది హిందీలో 'షెల్లిరా కీ పుకార్ పర్' గా ప్రచురితమైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాముఖ్యం, వారికి నివాళి అర్పించడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నవంబర్ 15 తేదీని 'గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం"గా ప్రకటించి శ్రీకారం చుట్టింది.


మహాత్మాగాంధీ వ్యక్తిగత 'కార్యదర్శి' మహదేవ్ దేశాయ్: మహదేవ్ దేశాయ్ మహాత్మాగాంధీ వ్యక్తిగత 'కార్యదర్శి'. వయసు రీత్యా వారి మధ్య దాదాపు 24 ఏళ్ల అంతరం ఉన్నప్పటికీ ఇద్దరి అనుబంధం చాలా గౌరవంగా ఉండేది. అందుకే మహదేవ్ దేశాయ్ ను అందరూ మహాత్మాగాంధీ నీడగా అభివర్ణించేవారు. అంతేకాదు గాంధీజీ అవసరాలన్నిటినీ కనిపెట్టి ఉండే ఆయన కుడి భుజం గానూ కొందరు పరిగణించేవారు. ఆయన మహాత్మా గాంధీకి అనువాదకుడు, సలహాదారు కాకుండా మరెన్నిటిలోనో దిట్టగా విశ్వసించేవారు. చివరకు పాక ప్రవీణుడు గానూ గాంధీ నుంచి ప్రశంసలందుకున్నారు. ఆ మేరకు ఆయన తయారు చేసిన కిచిడీని గాంధీజీ ప్రత్యేకంగా మెచ్చుకునే వారు.

దేశాయ్ పై అభిమానం వల్లనే మహాత్మాగాంధీ, కస్తూర్బా దంపతులు ఆయనను తమ బిడ్డగా భావించేవారు. మహాత్మా గాంధీ 1917లో దేశాయ్ ను తొలిసారి కలిసినపుడే ఆయనలోని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తనతో కలిసి పనిచేయాలని కోరారు. అలా మొదలైన వారి అనుబంధం 1942 ఆగస్టు 15న దేశాయ్ తుదిశ్వాస విడిచేదాకా కొనసాగింది. మహాత్మాగాంధీ 1942 ఆగస్టు 8న ముంబైలో తన చరిత్రాత్మక ప్రసంగం సందర్భంగా 'చావో రేవో' అంటూ నినదించారు. మరునాటి ఉదయం మహాత్మాగాంధీ, మహదేవ్ దేశాయ్ తదితరులను బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసి, పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ లో నిర్బంధించారు. ఈ జైలులోనే ఆగస్టు 15 మహదేవ్ దేశాయ్ గుండెపోటుతో మరణించారు.మహదేవ్ తన యాభయ్యేళ్ల జీవితంలో వందేళ్ల పనిచేసేశారన్న గాంధీజీ వ్యాఖ్య అక్షరసత్యం.

మహాత్మా గాంధీ కోరిక ప్రకారం దేశాయ్ కి ఆగాఖాన్ ప్యాలెస్ లోనే సమాధి నిర్మించారు. అటుపైన ఏడాది తర్వాత కస్తూర్బా గాంధీ మరణించినప్పుడు మహదేవ్ దేశాయ్ సమాధి సమీపంలోనే ఆమెకూ సమాధి నిర్మించారు. మహదేవ్ దేశాయ్ సూరత్లోని ఒక గ్రామంలో 1892 జనవరి 1న జన్మించారు. గ్రాడ్యుఏషన్ పూర్తిచేసిన తరువాత న్యాయశాస్తం అభ్యసించారు, అనంతరం న్యాయవాద వృత్తి చేపట్టారు. మహాత్మాగాంధీ ఆత్మకథ 'మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ' ను దేశాయ్ ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన చాలాకాలం పాటు దినచర్య పుస్తకం రాస్తూ వచ్చారు. మహాత్మాగాంధీ జీవనశైలి, ఆయన కార్యకలాపాలు తదితరాల గురించి ఈ పుస్తకం విశదీకరిస్తుంది. గాంధీజీ వ్యక్తిత్వం, ఆలోచనలు, సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలో ఈ డైరీని నేటికీ ముఖ్యమైన పత్రంగా పేర్కొనవచ్చు.



స్వాతంత్య్ర సమర యోధుడు జలియన్ వాలా బాగ్ సాహసి డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ: అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ పేరు వినని వారెవరైనా ఉంటారా? బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఆదేశాలతో సాయుధ సిబ్బంది. వందలాది మందిని కాల్చి చంపిన ప్రదేశం ఇదే. ఈ అమానుష కాండలో 1,000 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారని ఆనాటి అంచనా. ఆ రోజున జలియన్ వాలా బాగ్ కు జనం భారీ సంఖ్యలో తరలిరావడానికి ఇతర సమస్యలేవీ కారణం కాదు ప్రజాదరణగల నాయకుడు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూను బ్రిటిష్ వారు అరెస్టు చేసినందుకు నిరసన తెలపడం కోసమే.

డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ ముందువరుసలోని స్వాతంత్య్ర సమర యోధుడు మాత్రమేగాక హిందూ-ముస్లిం ఐక్యతకు మద్దతుదారు, న్యాయవాది. బ్రిటిష్ వారు 1919లో తెచ్చిన రౌలట్ చట్టంపై నిరసనకు ఆద్యుడుగా ఆయనను పేర్కొంటారు.

బ్రిటీష్ ప్రభుత్వం 1919లో రౌలట్ చట్టం తెచ్చినపుడు దీనిపై వృత్తిరీత్యా న్యాయవాది, హిందూ-ముస్లిం ఐక్యతకు గట్టి మద్దతుదారైన డాక్టర్ కిచ్లూ బలంగా గళమెత్తారు. వాస్తవానికి ఈ చట్టం ప్రాతిపదికగా ప్రభుత్వం వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. దీంతో సదరు చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. ఆ మేరకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె, అహింసాయుత సత్యాగ్రహంలో పాల్గొనాలని కిచ్లూ ప్రజలకు పిలుపునిచ్చారు. తదనుగుణంగా 1919 మార్చి 30న దాదాపు 30,000 మంది ప్రజలు బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన శక్తిమంతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత 1919 ఏప్రిల్ 9న అమృత్సర్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకు డాక్టర్ కిచ్లూ తోపాటు డాక్టర్ సత్యపాల్ నాయకత్వం వహించారు. దీంతో ఈ నాయకులిద్దరినీ ప్రభుత్వం అరెస్ట్ చేసి, ధర్మశాలలో గృహనిర్బంధంలో ఉంచింది.

డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ 1888 జనవరి 15న అమృత్ సర్ లో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఆయన జర్మనీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డి పట్టా పొందారు. భారత స్వాతంత్య్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కిచ్లూ మహాత్మాగాంధీ నాయకత్వాన సాగిన సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాలుపంచుకున్నారు. అంతేకాకుండా ఖిలాఫత్ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని 'జామియా మిలియా ఇస్లామియా' వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. భగత్ సింగ్ నౌజవాన్ భారత్ సభ'ను స్థాపించడంలో మార్గదర్శక పాత్రను పోషించారు. స్వాతంత్ర్యానంతరం ఆయన శాంతి పునరుద్ధరణతోపాటు సోవియట్-భారత్ సంబంధాలకు కొత్తరూపం ఇవ్వడం కోసం నిరంతరాయంగా కృషిచేశారు. ఆయన 1952లో లెనిన్ శాంతి బహుమతి పొందిన తొలి భారతీయుడుగా నిలిచారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments