మనం గుడికి వెళ్ళినవెంటనే ముందుగా మనకు కనపడేది ధ్వజస్థంభం, ఆ ధ్వజస్థంభానికి పైన చిన్న చిన్న గంటలు వేలాడుతుంటాయి, గుడిలోకి వెళ్ళగా...
మనం గుడికి వెళ్ళినవెంటనే ముందుగా మనకు కనపడేది ధ్వజస్థంభం, ఆ ధ్వజస్థంభానికి పైన చిన్న చిన్న గంటలు వేలాడుతుంటాయి, గుడిలోకి వెళ్ళగానే దేవుని ఎదురుగా చేతికి అందేవిధంగా ఒక గంట వుంటుంది, దాన్ని చూడగానే మనకు ముందు గంట కొట్టాలనిపిస్తుంది, ప్రతి హిందువుకి గుళ్ళొ గంట కొట్టడం అంటే అంత ఇష్టం, చిన్నపిల్లలకైతే మరీ ఇష్టం నాన్నా ఎత్తుకో, అమ్మా ఎత్తుకో అని గంట కొట్టించే వరకు ఊరుకోరు అంత ఇష్టం మరి. మన పూర్వీకులు చేసిన ప్రతి పనికి ఏదో ఒక శాస్త్రీయత, ప్రయోజనం తప్పనిసరిగా ఉంటాయి అవేంటో తెలుసుకుందాం.
పూర్వం రోజుల్లో గంటను సమయం తెలిపే దానిగా కూడా ఉపయోగించేవారు, పూజారి గారు ఉదయాన్ని గంట మోగిస్తే పలానా సమయం, మద్యాహ్నం, అలాగే సాయంత్రం కూడా ఒక సమయాన్ని తెలిపేది.
ఇంట్లో లేక గుడిలో పూజ చేస్తున్నప్పుడు, హారతి ఇచ్చే సమయం లో గంట కొడుతారు. ఆలయం లో ఉన్న గంటలలో అర్దాలు చాలానే ఉన్నాయి . దేవాలయం వెళ్ళినప్పుడు గంటకోడితే మనసుకి ఆధ్యాత్మిక, ఆనందం కలగడమేకాక,సకల శుభాలు కలుగుతాయి.
గంట నాలుక లో సరస్వతీ మాత కోలువై ఉంటుందట. గంట ఉదర భాగం లో మహా రుద్రుడు,బ్రహ్మ దేవుడు ముఖ భాగం లోను, కొన భాగం లో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుంది, అని పురాణాలు మనకు తెలియజేస్తాయి . అందుకే గంటను పవిత్రం గా భావించి దైవం గా పూజించాలి. గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే “ఓంకార” శబ్దం వలన దుష్ట శక్తులు దూరంగా పోయి, మన బాధలు తొలగుతాయని “కర్మ సిద్దాంతం” మనకు తెలుపుతుంది.
మనం ఒకసారి గంట మోగిస్తే సుమారు అది 7 సెకన్ల వరకు ప్రతిధ్వనిస్తుంది, ఈ ఏడు సెకన్ల సమయం మన శరీరంలో 7 చక్రాలను ఆ ధ్వని తట్టిలేపుతుంది. మనస్సు హాయిగా ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
సాధారణంగా దేవాలయాల్లో కంచు, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గంటలు వాడుతుంటారు. కంచుతో తయారు చేసిన గంటను కొడితే “ఓం” అనే స్వరం వినిపిస్తుంది. కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులు, గుత్తులుగా ఒకే తాడుకి కట్టి తగిలిస్తారు. ఈ మద్య గంటలను మోగకుండా కడుతున్నారు, ఎందుకు అనేది మీరు ఈసారి అలా మోగకుండ కట్టిన గంట చూస్తే పూజారిని అడగండి ఏమి సమాదానం చెబుతాడో చూద్దాం..
పూజ ఆరంభములో ఇలా చెబుతూ గంటను మ్రోగించాలి:
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాంకురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
భావం : దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దాని వలన సద్గుణ దైవీపరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాల నుండి వైదొలగుగాక.... నాకు కలిగే నరపీడ దోషాలను హరించాలని మనస్సులో అనుకొని గంటను మ్రోగించాలి..
No comments