Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మన శరీరంలో ఉన్న సప్త చక్రాల గురించి మీకు తెలుసా? - what are chakras in telugu

ప్రతిచోటా ఇప్పుడు ఈ సప్త నాడీ చక్రాల గురించిన చర్చలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, మీరు ఎక్కడికి వెళ్లినా, ఈ ‘చక్రాల సర్దుబాటు ...

what are chakras


ప్రతిచోటా ఇప్పుడు ఈ సప్త నాడీ చక్రాల గురించిన చర్చలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, మీరు ఎక్కడికి వెళ్లినా, ఈ ‘చక్రాల సర్దుబాటు కేంద్రాలు’(wheel alignment centres) దర్శనమిస్తున్నాయి! వాళ్ళు ఈ నాడీ చక్రాలను సర్ది, సరి చేస్తారట. యోగా స్టూడియోల నుంచి, కండరాల నొప్పులు తగ్గించే వాళ్ళ దాకా ప్రతి వాళ్ళూ ఈ రోజుల్లో నాడీ చక్రాల గురించే మాట్లాడుతున్నారు. ఇదో వేలంవెర్రి అయిపోయింది. అందరూ ఏడు నాడీ చక్రాలంటూ మాట్లాడుతున్నారు, కానీ నిజానికి మన శరీరంలో 114 చక్రాలున్నాయి.

ఏమిటీ ఈ ఏడు చక్రాలు?

వీటిని మన శరీరంలో ఉన్న 114 నాడీ కేంద్రాలు అనచ్చు. నాడులంటే మన శక్తి శరీరం (energy body)లో ఉండే శక్తి ప్రవాహ నాళికలు. ఈ నాడీ కేంద్రాలన్నీ ఎప్పుడూ త్రిభుజాకారంగా ఉంటాయి. నాడీ చక్రాలు ఒక్కొక్క స్థితిని దాటి, మరొక స్థితి దిశగా ముందుకు పయనించటానికి ఉపకరిస్తాయి కనక వీటిని ‘చక్రా’లన్నారు. కానీ అవన్నీ నిజానికి త్రిభుజాకారమైనవే.

ఈ 114 చక్రాలలో రెండు భౌతిక శరీరానికి బాహ్యంగా ఉంటాయి. మిగిలిన 112 చక్రాలలో కూడా, 108 చక్రాలను మాత్రమే క్రియాన్వితం (activate) చేయటం సాధ్యమౌతుంది. అలా చేసినప్పుడు, తత్ఫలితంగా, మిగిలిన నాలుగు చక్రాలూ వికసితమౌతాయి. 108 అన్న సంఖ్య మన సౌర కుటుంబ నిర్మాణంలో ప్రత్యేక ప్రాముఖ్యత గల సంఖ్య, కనక ఆ సంఖ్యకు మానవ వ్యవస్థలో కూడా ప్రాధాన్యత ఏర్పడింది. సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం సరిగ్గా సూర్య గోళం వ్యాసాని(diameter)కి 108 రెట్లు ఉంటుంది. చంద్రుడికీ, భూమికీ ఉన్న దూరం సరిగ్గా చంద్రగోళం వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. సూర్య గోళం వ్యాసం భూగోళం వ్యాసానికి సరిగ్గా 108 రెట్లు. అందుకే, 108 సంఖ్యకు వివిధ ఆధ్యాత్మిక సాధనలలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది.

ఈ 112 నాడీ చక్రాలు, ఏడు వర్గాలుగా ఏర్పడి ఉంటాయి. ఒక్కొక్క వర్గంలో 16 చక్రాల చొప్పున. 112 చక్రాలంటే చాలా మందికి మరీ పెద్ద సంఖ్యగా అనిపిస్తుంది. అందుచేత, అవి ఏడు వర్గాలుగా ఎలాగూ ఏర్పడి ఉన్నాయి కనక, వాటిని ఏడు చక్రాలుగా ప్రస్తావించటం జరుగుతుంటుంది. ఏడు వర్గాలు ఏడు నాడీ చక్రాలు కాగా, వాటిలో ప్రతి ఒక్కటీ ఒక్కొక్క యోగ శాస్త్ర శాఖకు ఆధారమౌతున్నది.
 
112 చక్రాల నించి ఏడు చక్రాలకు

మామూలు లౌకిక జీవితమూ, భౌతిక జీవితమూ, సాంఘిక జీవితమూ గడపటానికి మనిషికి తన శరీరంలో కనీసం 21 నాడీ చక్రాలు సక్రమంగా, క్రియాన్వితంగా పని చేస్తే చాలు. ఈ 21 చక్రాలకూ మళ్ళీ ఏడు సంఖ్యతో సంబంధం. పింగళ- ఇడ- సుషుమ్న అనే మూడు శక్తి రూపాలు కలిసి ఒక కట్ట. 21 చక్రాలలో ఇలాంటివి ఏడు కట్టలుంటాయి. అలాంటి 21 చక్రాలు సరిగా పని చేస్తుంటే చాలు, మీరు భౌతికంగా, మానసికంగా, భావోద్రేక పరం(emotional) గా సంపూర్ణులుగా ఉంటారు. కానీ జీవశక్తి పరంగా మాత్రం కొంత అవిటి తనం, అసంపూర్ణతా ఉన్నట్టు లెక్క.

అందుకే, జీవ శక్తిలో అన్ని అంశాలూ జాగృతమై సజీవం కావాలంటే, మిగతా చక్రాలను కూడా క్రియాన్వితం చేయాల్సి ఉంటుంది. తెలివి తేటలు వికసించాలంటే జీవ శక్తి కావాలి. వికసించకుండా నిద్రాణంగా ఉండిపోతే, ఆ తెలివి తేటలు ఉండీ లేనట్టే. కంప్యూటర్ కు విద్యుచ్చక్తి సరఫరా లేకపోతే, అదొక రాతిబండ కింద లెక్కవుతుంది. మానవ వ్యవస్థ కూడా అలాంటిదే. ఇదొక సూపర్ కంప్యూటర్. కానీ చాలా మంది దీన్ని చాలా కనీస స్థాయిలో మాత్రమే వాడుకోగలుగుతున్నారు.

మానవ వ్యవస్థకున్న సామర్థ్యాన్ని మరి కొంత హెచ్చు స్థాయిలో వినియోగించాలంటే, దాన్ని మరింత చురుకుగా (activate) చేయాలి. మానవ వ్యవస్థనంతటినీ చక్కగా సక్రియం చేయగల శాస్త్రం హఠయోగం. దురదృష్టవశాత్తూ, చాలా మంది హఠయోగమంటే అదొక రకమైన శారీరక వ్యాయామం అనో, వ్యాధి చికిత్స మార్గమనో అనుకొంటూ ఉంటారు. యోగ మార్గం కేవలం శరీర వైకల్యాలను చికిత్స చేసే సాధనం కానే కాదు. మనిషికున్న భౌతిక వ్యవస్థను ఎలా సుసంపన్నం, పరిపూర్ణం చేయగలమా అనే మా ప్రయత్నం. ఆ వ్యవస్థ పరిపూర్ణమైతే, ఇక ఏ సమస్యలూ మిగలవు. అప్పుడు, అవసరమైన చికిత్స ప్రక్రియలకు దారి తీసే మార్పు ఒకటి మనిషి వ్యవస్థలో ఎలాగూ సక్రియమౌతుంది.
 
ఈ సప్త చక్రాలు ఎక్కడ ఉంటాయి? వాటి పేర్లేమిటి?

ఈ ఏడు ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధారం. ఇది వెన్నెముక అట్టడుగు పూసకు దగ్గరగా ఉంటుంది. జననాంగానికీ, పురీషనాళానికీ మధ్య ప్రదేశంలో ఉంటుంది. రెండవది, స్వాధిష్ఠానం. జననాంగానికి కొంచెం పైన ఉంటుంది. మూడవది మణిపూరం. అది బొడ్డుకింద ఉంటుంది. నాలుగు అనాహతం. ఇది ఉరఃపంజరంలో పక్కటెముకలు కలిసే ప్రాంతంలో ఉంటుంది. అయిదవ చక్రం విశుద్ధి. అది కంఠం కింద ఉండే గుంట ప్రాంతంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం ఆరవది. అది కనుబొమల మధ్య ఉంటుంది. ఏడవ చక్రం సహస్రార చక్రం. దీన్ని బ్రహ్మ రంధ్రం అని కూడా అంటారు. నడినెత్తి మీద ఉంటుంది. శిశువు జన్మించినప్పుడు ఇది మెత్తటి ప్రాంతంగా ఉంటుంది.

మనం ఈ నాడీ కేంద్రాలను పై తరగతివీ, కింది తరగతివీ అని వర్గీకరణ చేయచ్చు. కానీ అలాంటి వర్గీకరణ అనవసరపు అపార్థాలకు దారి తీస్తుంది. ఒక భవనం పునాదిని ఆ భవనం పై కప్పుతో పోల్చినట్టు. పై కప్పు పునాది కంటే ఉన్నతమైందేమీ కాదు. భవనం నాణ్యతా, అది నిలిచి ఉండే కాల పరిమితీ, దాని స్థిరత్వం, భద్రతా ఎక్కువగా పునాదుల మీదే ఆధార పడి ఉంటాయి గానీ పై కప్పు మీద కాదు గదా! ‘మాట’ వరసకు మాత్రమే కప్పుది పై స్థానం, పునాదిది కింది స్థానం.

మీ శక్తి, మీ మూలాధార చక్రంలో ప్రధానంగా, బలవత్తరంగా ప్రకటితమవుతూ ఉండే పక్షంలో, నిద్రాహారాలు మాత్రమే మీ జీవితంలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. అయితే చక్రాలకు ఒకటి కాదు, అంతకంటే ఎక్కువ కోణాలు ఉండచ్చు. ఒక కోణం వాటి భౌతికమైన ఉనికి. వాటికి భౌతికాతీతమైన మరొక కోణం ఉంటుంది. వాటి ద్వారా ఆ చక్రాల లక్షణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సరయిన జ్ఞానం లభిస్తే, నిద్రాహారాలను మాత్రమే వాంఛించే మూలాధార చక్రం, నిద్రాహారాలకు సంబంధించిన ప్రక్రియలన్నిటినుంచీ సంపూర్ణంగా విముఖమై వేరుపడేలా చేసుకోవచ్చు.
 
సప్త చక్రాల సూక్ష్మ తత్వం

ఈ చక్రాలన్నిటికీ శరీరంలో ఒక స్థూల రూపం ఉంటుంది. దానితో పాటు ఒక సూక్ష్మ రూపమూ ఉంటుంది. ఈ సూక్ష్మ రూపాలను ‘క్షేత్రాలు’ అంటారు. క్షేత్రం అంటే మనిషి నివాస స్థానం లాంటిది. మీ నివాసం ఒక చోట ఉండి, మీ కార్య స్థానం మరొక చోట ఉండచ్చు. అలాగే ఈ క్షేత్రాలలో కూడా శరీరానికి బాహ్యంగా ఉండే బాహ్య క్షేత్రాలూ, శరీరాంతర్గతంగా ఉండే అంతర్ క్షేత్రాలూ ఉండచ్చు. మనిషికి ఒక ఇల్లు ఉండి, దానితోపాటు, ఒక సెలవు వసతి (holiday home) కూడా వేరే ఉన్నట్టు.

మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. అప్పుడు మామూలు దైనందిన వ్యవహారాలలో ఎక్కువ కాలం గడుపుతుంటారు. వంటావార్పూ, ఇంటి శుభ్రతా, గృహ నిర్వహణా, వస్తువుల మరమ్మత్తులూ, ఇలాంటి కార్యక్రమాలలో ఎక్కువ సమయం గడుపుతారు. ‘హాలిడే హోం’ కు వెళితే, అక్కడా వంటా, ఇల్లు శుభ్రం చేసుకోవటమూ, మొదలైన పనులు ఉంటాయి కానీ సమయమంతా, సామాన్యమైన దైనందిన కార్యక్రమాలలోనే గడిపేయరు. అక్కడి జీవితం ఇంటి జీవితం కంటే హుషారైన, సుసంపన్నమైన జీవితం.

ఆ హాలిడే హోం చల్లని పర్వత ప్రాంతాలలో ఉంటే, ఆ జీవితం మరింత ఉత్సాహభరితమైన సమృద్ధ జీవితం. అయితే, నిజానికి అలాంటి పర్వత ప్రాంతాలలో జీవించటంలో, ఇంటి జీవితంలో కంటే శ్రమ ఎక్కువ. ఎలాగయినా ఇంటి దగ్గర ఉండటం కొంత తేలిక. అందుకే చాలా మంది ఇలాంటి బయటి జీవితం అనే విషయం వదిలేశారు. దాని మాటే మరిచిపోయారు. ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. అదే సులభం కనక. కానీ అసలు మీరు మీ ఇల్లు వదిలి మరో హాలిడే హోంకు వెళదామని ముందు అనుకోవటానికి కారణం ఏమిటి? అది మీ సొంత ఇల్లు లాగానే హాయిగా ఉంటుందని కదా! మీకు హోటళ్లలో ఉండటం ఇష్టం ఉండదు. దానికంటే అర్థవంతమైన, సుసమృద్ధమైన జీవితం మీకు కావాలి.
సృష్టికర్త మీ కోసం ఆ ఏర్పాటంతా చేసే ఉన్నాడు. మీరు కోరుకొంటే మీ అంతర్ క్షేత్రంలో ఉండచ్చు. సొంత ఇంట్లోలాగా, సీదా సాదాగా, ప్రత్యేకమైన ఉత్సాహమేమీ లేకుండా, దాదాపు నిద్ర మత్తులో లాగా. లేదంటే మీరు మీ బాహ్య క్షేత్రంలో నైనా ఉండచ్చు. అక్కడి నుంచి ఎప్పుడు వెనక్కి వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లిపోవచ్చు. అదొక సమస్య కాదు. ఒక్క అడుగు వెనక్కు తీసుకోవటమే కదా!

ఇందాక అనుకొన్నాం, చక్రాలకు ఒకటే కాదు, అంతకంటే ఎక్కువ కోణాలు ఉండచ్చు. ఒక కోణం వాటి భౌతికమైన ఉనికి. అది కాక వాటికి భౌతికాతీతమైన మరొక కోణం ఉండచ్చు. దాని ద్వారా ఆ చక్రాల లక్షణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. మీ జీవ శక్తులు మూలాధారంలో బలవత్తరంగా ప్రకటితమౌతుంటే, నిద్రాహారాలు రెండు మాత్రమే మీ జీవితంలో ముఖ్యాంశాలుగా ఉంటాయనుకొన్నాం. అయితే, సరయిన జ్ఞానం లభిస్తే, నిద్రాహారాలను మాత్రమే వాంఛించే మూలాధార చక్రాన్ని, నిద్రాహారాలకు సంబంధించిన ప్రక్రియలన్నిటి నుంచీ విముఖమై పూర్తిగా వేరుపడేలా చేసుకోవచ్చు.
 
రెండో చక్రం స్వాధిష్ఠాన చక్రం. మీ జీవ శక్తులు స్వాధిష్ఠానంలో బలవత్తరంగా ఉంటే మీ జీవితంలో సుఖ లాలసత బలవత్తరమైన ముఖ్యాంశంగా ఉంటుంది. మీరెప్పుడూ సుఖాలనే అభిలాషిస్తారు. భౌతిక ప్రపంచపు విశేషాలనన్నిటినీ మీరు ఆసక్తితో అనుభవిస్తారు.

మీ శక్తులు మణిపూర చక్రంలో బలవత్తరంగా ఉన్న పక్షంలో మీరు కార్య శూరులుగా ఉంటారు. మీరు ఈ ప్రపంచంలో ఎన్నో ఘనకార్యాలు చేయగలుగుతారు. మీ శక్తులు అనాహత చక్రంలో బలవత్తరంగా ఉంటే, మీరు మంచి సృజనాత్మక శక్తులు కలిగి ఉంటారు. మీ శక్తులు విశుద్ధి చక్రంలో బలవత్తరమైతే, మీరు గొప్ప అధికారాలు కలిగి ఉంటారు.
అవే ఆజ్ఞా చక్రంలో బలంగా ఉంటే, లేదా మీరు ఆజ్ఞా చక్రాన్ని చేరగలిగితే, మీకు బుద్ధి పరమైన జ్ఞానం విశేషంగా ఉంటుంది. ఇలాంటి జ్ఞానం మనశ్శాంతినిస్తుంది. అనుభవ పూర్వకంగా అయితే, మీరు ఆ జ్ఞానాన్ని అనుభూతి చేసుకోలేక పోవచ్చు. కానీ బుద్ది పరంగా మాత్రం అదేమిటో మీకు తెలిసి వస్తుంది. దీని వలన బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతున్నా సరే, మీ లోలోపల మాత్రం శాంతి, స్థిరతా ఒక స్థాయిలో నెలకొని ఉంటాయి.

మీ శక్తి ప్రవాహం సహస్రారాన్ని తాకిందంటే మాత్రం, ఇక మీరు పరమానందంలో ఉరకలు వేస్తారు. బయటినుంచి ఏ ఉత్ప్రేరక పదార్థమూ సేవించకుండానే, ఏ ప్రత్యేక కారణమూ లేకుండానే, మీరు పరమానందస్థితిలో ఉంటారు. అందుకు కారణం కేవలం మీ శక్తులు ఒక శిఖరాగ్రాన్ని తాకటమే.
 
ఏడు చక్రాలు, ఏడు స్థాయిల తీవ్రత

మౌలికంగా ఏ ఆధ్యాత్మిక ప్రస్థానమైనా, మూలాధారం నుంచి సహస్రారం దాకా చేసే ప్రయాణమే. ఈ ప్రయాణంలో జరిగేదల్లా, ఒక స్థాయి నుండి మరొక స్థాయికి క్రమమైన పరిణామాత్మకమైన ఆరోహణ. ఆయా స్థాయిల్లో ఉండే తీవ్రత బట్టి ఈ ఏడు చక్రాలూ ఆ ఆరోహణలో ఏడు దశలన్నమాట.

మీ శక్తి ప్రవాహాన్ని మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం దాకా తీసుకెళ్ళేందుకు అనేక రకాలయిన ఆధ్యాత్మిక సాధనలున్నాయి. కానీ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి చేరేందుకు మాత్రం ఒక మార్గమంటూ లేదు. ఫలానా ఉపాయమంటూ చెప్పేందుకు ఏదీ లేదు. మీరు దూకితే దూకచ్చు. లేదా జర్రున జారిపోయి, లోతే తెలియని అగాధంలో పడిపోవచ్చు. దాన్ని ‘ఊర్ధ్వ ముఖ పతనం’(falling upward) అంటారు.

యోగాచరణలో, మీరు అలా ఊర్ధ్వ దిశగా పడిపోవటానికి సిద్ధమైతే తప్ప, గమ్యం చేరలేరు అంటారు. అందుకే ఆధ్యాత్మిక వేత్తలనబడే వాళ్ళు చాలా మంది శాంత స్థితిని చేరటమే అత్యున్నత లక్ష్యం అనే నిశ్చయంలో ఉండిపోతారు. అంటే, వాళ్ళు ఆజ్ఞా చక్రం దాకా వచ్చి, అక్కడ ఆగిపోయారన్నమాట. శాంతి మాత్రమే సర్వోన్నత లక్ష్యం కాదు. మీరు అందుకోగల పరమానంద స్థితి ఒకటి ఉన్నది. దాన్ని అందుకొంటే, అప్పుడు మీరున్న ఆనంద స్థితి ముందు ఈ ప్రపంచమంతా మీ అనుభవానికీ, అవగాహనకీ ఒక ప్రహసనంలా కనిపిస్తుంది. అందరికీ అతి గంభీరంగా తోచే విషయాలు, మీకు మాత్రం హాస్య విషయాలుగా కనిపిస్తాయి.

అయితే, వాళ్ళు అలా ఆజ్ఞా చక్రం దాకా చేరి, అక్కడ చాలా కాలం ఆగిపోవటానికి ఒక కారణం ఉంది. అక్కడ ఆగి ఉన్న సమయంలో, వాళ్ళు, తరవాతి పెద్ద గంతు వేసేందుకు కావలసిన మానసిక సన్నద్ధతను క్రమంగా పెంచుకొంటారు.
అందుకే ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఎప్పుడూ గురు శిష్య పరంపరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మీరు ఆ పెద్ద గంతు వేయాలంటే, మీకు మీ గురువు మీద అపారమైన విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం లేకపోతే, 99.9 శాతం మంది అలా దూకేయలేరు. అందుకే గురు శిష్య సంబంధం అంత ముఖ్యమైందని చెప్పేది. గురువును నమ్మని వాడు దూకలేడు.

వివేకం, తెలివితేటలు

ఈ సప్త చక్రాలూ, లేక సప్త దశలూ, ఒక తాత్త్విక శాస్త్రం కాదు. ఇది కేవలం ఒక వర్గీకరణ. నిజానికి, మౌలిక దృష్టితో చూస్తే జీవితానికి సంబంధించిన ఏ వర్గీకరణ అయినా తప్పే అవుతుంది. ఈ ఏడు చక్రాలనూ ఏడు పూర్తిగా విభిన్నమైన అంగాలుగా అర్థం చేసుకోకూడదు. జీవనం అంతా ఒకే సమగ్రమైన ప్రక్రియ. కానీ మనిషి బుద్ధికి ఇలాంటి వర్గీకరణలు కావాలి. అలా వర్గ విభజన చేయకపోతే, బుద్ధికి విషయాలు అర్థం కావు. బుద్ధి లక్షణం సూక్ష్మ వివేచన(discernment). ఆ సూక్ష్మ పరిశీలన శక్తి లేకపోతే, బుద్ధి అనేది పనికిరాని పరికరమే అవుతుంది.

ఈ ప్రపంచంలో బతికి బట్ట కట్టాలంటే, సూక్ష్మ పరిశీలన అవసరం. కానీ మీ లక్ష్యం ఈ బ్రహ్మాండాన్నే మింగేసేయటం అనుకోండి. అప్పుడు ఈ సూక్ష్మ పరిశీలనా, విశ్లేషణా పనికి వచ్చే అంశాలే కావు. బ్రహ్మాండాన్నిమొత్తం మొత్తంగా మీలో భాగం చేసుకొని, ఇముడ్చుకోవాలని మీరు అనుకొంటున్నప్పుడు, మీరు వివేచన చేసి, ఫలానా గ్రహాలను మింగుతాను, ఫలానా వాటిని వదిలేస్తాను అని ఎలా నిర్ణయిస్తారు? సూక్ష్మ వివేచన అంటే, నాకు ఇది ఇష్టం - ఇది ఇష్టం కాదు అని నిశ్చయం చేసుకోవటం. ఇది కావాలి - ఇది అక్కర్లేదు, ఇది మంచి - ఇది చెడూ, ఇది ఉన్నతం - ఇది అధమం, ఇది దివ్యత్వం - ఇది రాక్షసత్వం అని విచక్షణ చేయటం.

జ్ఞాన ప్రాప్తి (enlightenment) అంటే, మీరు ప్రతి విషయం మీదా జ్ఞానమనే వెలుగు ప్రసరింపజేయటం వల్ల అన్ని విషయాలూ మీకు ఒకటిగానే కనిపిస్తున్నాయని అర్థం. మీరు వేటి పట్లా వివక్షా, మంచీ- చెడూ అన్న భేద భావనా చూపరు. చీకటయినా, వెలుతురయినా మీకు ఒకే రకమైన అనుభవంగా కనిపిస్తుంది. మీకు భేద భావనే లేదు. జ్ఞానం అంటే, మీకు అంతర్గతంగా లభిస్తున్న ప్రకాశం కారణంగా ఎక్కడా మీరు అంధకారాన్ని చూడలేని స్థితి.
 
రంగులకు అతీతం

మనం ఇప్పుడు మాట్లాడుతున్నది , విభజించ దగిన అంశాలంటూ లేని, అవిభాజ్యమైన విషయం గురించి. కానీ బుద్ధికి అనువుగా ఉండటం కోసం దాన్ని ఏవేవో భాగాలుగా చేస్తున్నాం.

మీరు ఏదో ఒక వర్గంలో చేరిపోయే పొరపాటు అసలు చేయకూడదు. అంటే, ‘నేను అనాహత తత్త్వం వాడిని!’, ‘నేను విశుద్ధి చక్రం మనిషిని’ అనకూడదు. ఇదేదో, ‘నేను కాఫీ జీవిని’ , ‘నేను టీ జీవిని’ అని చెప్పుకొన్నట్టు కాదు. లేదంటే, పొద్దునే లేవగానే కొందరు ‘నేను ఉదయం తత్త్వం వాడిని’ (‘I am a morning person!’) అని చెప్పుకొంటారే, ఇది అలాంటిదీ కాదు. ఇది మనం మనకో ప్రత్యేకమైన గుర్తింపు కోసం వెతుకులాడే సందర్భం కాదు. మీరు కొన్ని రకాలైన పనులు చేయటానికి కొన్ని విధాలైన సూక్ష్మ వివేచన అవసరమౌతుంది. కానీ, మీరు జీవనమనే విషయం అసలు తత్త్వం గ్రహించాలంటే, అందుకు, ‘వైరాగ్యం’, లేక ‘విరాగం’ అనే లక్షణం అవసరమౌతుంది. ‘వై’ అన్న పదం దూరాన్ని సూచిస్తుంది. ‘రాగం’ అంటే రంగు. రాగానికి అతీతమైంది రంగు లేని పదార్థం. ఇంగ్లీషులో అయితే, రంగు లేకపోవటం అంటే, ‘వివర్ణం’, ‘జడపదార్థం’ అనే నకారాత్మకమైన అర్థాలు స్ఫురిస్తాయి. వైరాగ్యం అలాంటిది కాదు.

ఇక్కడ రంగు లేక పోవటమంటే అన్ని వర్ణాలకూ అతీతమైన స్థితి అన్నమాట. ఏ రంగూ లేని పదార్థం పారదర్శకంగా ఉంటుంది. పారదర్శకత ఉంటే దాని గుండా మీరు చూడగలరు. ఏ రంగూ ఎరగని గాలి మీకు జీవనాధారం. గాలి ఏ నీలి రంగుకో మారిపోయిందనుకోండి. మనకిక ఏదీ కనిపించదు. కొంచెం సేపు ఆ నీలం రంగు మీకు బాగుంటే బాగుంటుందేమో, కానీ ఆ తరవాత మాత్రం, అదంతా పోయి మళ్ళీ మామూలుగా చూడగల స్థితి రావాలనే కోరుకొంటారు. వర్ణ రహితం, వర్ణాతీతం కావటం అంటే స్పష్టమైన దృష్టి కలిగి ఉండటం. మీ దృష్టి వివిధమైన రంగుల వల్ల ఏ మాత్రం ప్రభావితం కాలేదన్నమాట.

ప్రపంచంలో ఎన్నో పదార్థాలను వాటి రంగులను బట్టి పేర్కొంటూ ఉంటాం. ఉదాహరణకు, నదులలో నీలి నైలు నదీ, ఎర్ర నదీ, పసుపు పచ్చ నదీ, ఇవన్నీ ఉన్నాయి. అంటే, ఆ నదులలో నీళ్ళు నీలంగా, పచ్చగా, ఎర్రగా ఉంటాయని కాదు. ఆ నీటి అడుగున ఉన్న మన్ను రంగు వల్ల ఆ నీళ్ళు అలా రంగు నీళ్ళలా కనిపిస్తాయి.

మీరు వర్ణాతీతులైపోతే, ఇక ఎక్కడైనా చక్కగా ఇమిడి పోగలరు. మీకంటూ ఏ వర్ణమూ, ఏ లక్షణమూ ఉండదు. నేపథ్యం నీలంగా ఉంటే, మీరు నీలంగా కనిపిస్తారు. ఎర్రగా ఉంటే ఎర్రగా కనిపిస్తారు. మీరు దేనినీ నిరోధించరు. ఏ సమయంలో, ఏ నేపథ్యం లభించినా మీరు అందులో పరిపూర్ణంగా లీనమైపోతారు.

ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏడు చక్రాలూ ఏడు వర్ణాల లాంటివి. కాంతిని విశ్లేషించి, వక్రీభవించేట్టు చేసి, ఏడు రంగులుగా చూస్తే తప్పేమీ లేదు. కానీ మీరు ఎప్పుడూ అలా వక్రీభవించిన కాంతి కిరణాలతో చూస్తుంటే, జీవితం పట్ల మీ దృష్టి కూడా వక్రీభవనకు లోనవుతుంది. సద్గురు జగ్గీవాసుదేవ్.

Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు? International Day of Yoga

No comments