మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే, దానికి కారణం మన నదులే. ప్రధానంగా భారతదేశ అభివృద్ధి అంతా మహానదుల తీరాలలోనే జరిగింది. మొహెంజొదారో, హరప్పా వంటి మన ప...
ఈ రోజుల్లో మన నదీ ప్రవాహాలు ఎంతగా క్షీణిస్తున్నాయంటే,ఇదే పద్ధతిలో అవి తరిగిపోతూ ఉంటే అవి మరో ఇరవై ఏళ్లల్లో వర్షాకాలపు నదులుగా మారిపోతాయి. గత పది పన్నెండేళ్లలో, కేవలం ఒక్క తమిళనాడులోనే డజన్ల కొద్దీ నదులు ఎండిపోవడం చూశాము. దక్షిణ భారతదేశంలో ప్రముఖ నదులైన కావేరి, కృష్ణ, గోదావరి, ఇప్పుడు సంవత్సరంలో కొద్దినెలలు మాత్రమే సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి.
నాణానికి మరోవైపు - అతివృష్టి: భూగోళ కవోష్ణత (గ్లోబల్ వార్మింగ్) వల్ల ఉష్ణోగ్రత పెరగ్గా, దక్షిణ ద్వీపకల్పంలో (Southern Peninsula) - రెండు వైపులా మహాసముద్రాలతో - సహజంగానే అతివృష్టి సంభవిస్తుంది. ఋతుపవనాల సమయంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు తరచుగా నీట మునుగుతూ ఉండడం చూస్తున్నాం. చెన్నైలో డిశంబరు లో వచ్చిన వరదలు చూసి ప్రజలు వర్షమంటేనే భయపడుతున్నారు. చెన్నైలో కేవలం రెండు రోజులు వర్షం కురిస్తే చాలు, ప్రజా రక్షణ కోసం వీథుల్లో పడవలు తిరాగాల్సిన పరిస్థితి వచ్చింది.
అనావృష్టి కంటే కూడా అతివృష్టే దక్షిణ ద్వీపకల్పాన్ని వేగంగా ఎడారిగా మార్చగలదు. అది భూమినంతా పీల్చి పిప్పి చేసి కాలక్రమంలో వ్యవసాయానికి పనికి రాకుండా చేస్తుంది - ఇది తమిళనాడులో ఇప్పటికే అతి వేగంగా జరుగుతూ ఉంది. ఇదివరకు రెండు వందల అడుగులు తవ్వితే నీళ్ళు పడే బోరుబావులకు, ఇప్పుడు 1000 అడుగులు తవ్వవలసి వస్తోంది, అయినా నీళ్లు పడడంలేదు.
నీటి రైళ్లు, ట్రక్కులతో ఎంతకాలం ఈ దేశాన్ని నడపగలం? రైళ్లతోనూ, లేదా పైపు లైన్లతోనూ దేశంలో ప్రజల దాహాన్ని తీర్చడం సాధ్యం కాదు. మిమ్మల్ని భయపెట్టడం మా ఉద్దేశం కాదు, కాని ఇవ్వాళ నదుల పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు, దానివల్ల కలుగుతున్న సమస్యల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి తీరాలి. వందకోట్ల పైగా జనాభా ఉన్న దేశం మనది. నదులు ఎండిపోతే, ప్రజలు ఏం చేస్తారు..? ఒకళ్లనొకళ్లు చంపుకొని రక్తం తాగలేరు కదా...?
మనం హిమాలయాలలో పుట్టే నదులను, వెంటనే పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఎందుకంటే, అది మంచు కురవడం మీద, ఎంత మంచు పడిందన్న దానిమీద ఆధారపడి ఉంటుందది. కాని అడవుల్లో పుట్టే నదులలో మనం జీవం నింపవచ్చు కదా. ప్రజలు అన్నిటికీ తక్షణ పరిష్కారాలు కావాలనుకుంటారు.
ప్రాణం ఇచ్చేవి వృక్షాలు: మనం ఇప్పుడు మన నదులను ఏం చేస్తున్నామో, దానికి బదులుగా ఏం చేయాలో ప్రజల్లో చైతన్యాన్ని కల్గించాలి. ఇలా చెయ్యడం ద్వారా ఒక దీర్ఘకాల పరిష్కారం లభిస్తుంది. కేవలం ప్రజల్లో స్ఫూర్తిని నింపి వాళ్లను కార్యశీలులుగా చేస్తే సరిపోదు. వారికి లాభదాయకమైన పరిష్కారాలను అందించినప్పుడు మాత్రమే, వాళ్ళు ఈ ప్రయత్నానికి ముందుకు వస్తారు. మనం ఒక లక్షమందిని నియమించి మొక్కలు నాటించి, తరువాతి పది సంవత్సరాలలో వాటిని సంరక్షిస్తే, మరింత భూభాగాన్ని అటవీ ప్రాంతంగా మార్చవచ్చు. ఆ విధంగా ఋతు పవనాలు మరింత క్రమబద్ధంగా వచ్చేటట్లు చేయవచ్చు, భూమిని క్షయం కాకుండా ఆపవచ్చు.
నదులకి రెండు వైపులా, కిలోమీటరు దూరం వరకు వ్యవసాయం చేయకూడదు. ఎందుకంటే మనం వాడే ఎరువులు, క్రిమిసంహారక మందులు నీటిలో కలిసి ప్రజాజీవనానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. మన నదులన్నిటి వద్ద చెట్లను నాటడానికి కొంత అదనపు ప్రాంతాన్ని ఏర్పరచాలి. ప్రభుత్వ భూముల్లో అడవులు పెంచాలి. ప్రైవేటు భూముల్లో ఉద్యానవనాలు పెంచాలి. ఇలా చేయడానికి, ప్రభుత్వాలు శిక్షణనందించాలి. ఈ ప్రయత్నాలకు రాయితీనివ్వాలి. మూడు నుండి ఐదేళ్ల వరకు రాయితీలిచ్చి, రసాయనిక ఎరువులు వాడకుండా, ఉన్నత ప్రమాణాలలో ఉండే ఉద్యాన వనాలను అభివృద్ధి చేయడానికి వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఇలా ప్రభుత్వం సహకారాన్ని అందిస్తే, రైతులు తాము సాధారణంగా వేసే పంటలు వదులుకోవడానికి అభ్యంతరం పెట్టరు. ఎందుకంటే వాళ్ల భూమి వాళ్లకు ఉపాధిని ఇస్తూనే ఉంటుంది - వాస్తవానికి వాళ్లు సామాన్యంగా వేసే పంటల కంటే మెరుగైన ఆదాయాన్నిస్తుంది. అందుకని వారు ఆర్ధిక వల్ల, అయిష్టంగా మరో ఉపాధి వెతుక్కోవడానికి నగరాలకు తరలి వెళ్ళవలసిన అవసరం లేదు.
ప్రభుత్వ విధానాలు నదుల సంరక్షణకు అనుకూలంగా ఉండే తయారుచేయాలి. ఈ దిశలో ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వ్యవసాయం కంటే ఈ విధానంలో సాగు చయ్యడం అధిక లాభదాయకమని, భారత ప్రభుత్వానికి తెలియజేయడంకోసం మేమిప్పుడు ఒక ప్రాజెక్టు నివేదికను తయారుచేస్తున్నాం.
ఈ రోజుల్లో, చాల మంది నిరాశావాదులుగా తయ్యారవుతున్నారు. వాళ్ళు ఏం చేసినా, ఎందులోనూ ఏమీ మార్పురాదని వాళ్ల నమ్మకం. కాని మార్పు తేవలసిన సమయం ఇది. పదేళ్ల తర్వాత అయితే చాలా ఆలస్యమయిపోతుంది. ఈ భూమి, ఈ నదులే మనకు జీవితాన్నిస్తున్నాయి. ఈ విషయం మన అత్యాశవల్లో, ఆర్థిక ప్రలోభంవల్లో మనం మరచిపోగూడదు. ఎన్నో లక్షల సంవత్సరాల నుండి మన నదులు ప్రవహిస్తున్నాయి. మన తరంలో వాటిని నాశనం చేసుకోకూడదు.
మనలో ప్రతి ఒక్కరు ఒక మొక్కని నాటి, దాన్ని రెండేళ్లు పటు సంరక్షించి, ఆ రెండేళ్ల తర్వాత మరో మొక్క నాటితే - ఇలా మనమో అద్భుత ఉద్యమాన్ని సాగించగలం. మనం అది చేయగలమా లేదా అన్నది ప్రశ్నకాదు. మనం అది చేయదలచుకున్నామా లేదా అన్నది మాత్రమే ప్రశ్న. అలా జరిగేటట్లు మనం చేద్దాం.
No comments