Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు ఇదొక జీవన విధానం

హిందూ ధర్మం అనేది ఒక మతం అనే భావన ఈ మధ్యకాలంలో మాత్రమే మొదలయ్యింది. నిజానికి, అంతకు ముందు, అలాంటిదేమీ ఉండేది కాదు. "హిందూ...

హిందూ ధర్మం అనేది ఒక మతం అనే భావన ఈ మధ్యకాలంలో మాత్రమే మొదలయ్యింది. నిజానికి, అంతకు ముందు, అలాంటిదేమీ ఉండేది కాదు. "హిందూ" అనే పదం ముఖ్యంగా "సింధు" అనే పదం నుండి వచ్చింది. సింధూ నది గడ్డపై పుట్టిన వారందరూ హిందువులే. ఇది సంస్కృతితో మరియు భౌగోళిక ప్రదేశంతో ముడిపడిన విషయం. ఇది "నేను ఒక ఇండియన్" అని చెప్పడం లాంటిదే, కానీ ఇది ఇండియన్‍గా ఉండటం కంటే ఇంకా చాలా ప్రాచీన గుర్తింపు. "ఇండియన్ " అనే గుర్తింపు కేవలం డెబ్బై సంవత్సరాల నుండి ఉంది, కానీ "హిందు" అనేది మనకి ఎప్పటినుంచో ఉన్న గుర్తింపు.

హిందువుగా ఉండడమంటే ఏదో ఒక నిర్దిష్టమైన విశ్వాస వ్యవస్థను కలిగి ఉండటం కాదు. ప్రాథమికంగా, ఈ సంస్కృతి అంతా, మనిషి యొక్క పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునే దిశలో ఉండేది. ఈ సంస్కృతిలో మీరు ఏం చేసినా మీరు హిందువే. హిందూ జీవన విధానం ఇదే అని చెప్పగలిగే ప్రత్యేకమైన దేవుడు లేదా సిద్దాంతం అంటూ ఏదీ లేదు. మీరు దేవుడిని లేదా దేవతని పూజిస్తున్నా, ఆవును లేదా చెట్టును పూజిస్తున్నా, మీరు హిందువుగా ఉండచ్చు. మీరు దేనినీ ఆరాధించక పోయినా, హిందువుగా ఉండచ్చు.

ఈ మధ్యకాలంలో మాత్రమే, బయటి పరిస్థితుల ప్రభావాల వల్ల, ఈ ప్రాంతీయ, ఇంకా సాంస్కృతిక గుర్తింపును, హిందూమతం అనే మతపరమైన గుర్తింపుగా మార్చడానికి ప్రయత్నం జరిగింది. 'హిందు' అనేది ఎప్పుడూ "మతం" కాదు, దానిని మతంగా మార్చడానికి చేసే ప్రయత్నం ఇప్పటికీ విజయవంతం కాలేదు. ఎందుకంటే సనాతన ధర్మం లేదా సార్వత్రిక ధర్మంగా సూచించబడే హిందూ జీవన విధానం అన్నీంటినీ అక్కున చేర్చుకుంటుందే తప్ప దేనినీ తిరస్కరించదు. హిందూ జీవన విధానం అంటే కొన్ని నమ్మకాలతో ఏర్పడిన వ్యవస్థ కాదు, అది మోక్షానికి సంబంధించిన ఒక శాస్త్రీయ విజ్ఞానం.

మోక్షానికి సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానం: ప్రపంచంలో సంఘర్షణలు ఎప్పుడూ మంచికీ, చెడుకు మధ్య జరిగే ఘర్షణలుగా చిత్రీకరించ బడ్డాయి. కానీ వాస్తవానికి, ఒక వ్యక్తి యొక్క నమ్మకానికి, మరొక వ్యక్తి యొక్క నమ్మకానికి మధ్య ఉన్న తేడాల వల్లే సంఘర్షణలు జరుగుతాయి. ఇప్పటికన్నా, గతంలో ప్రజలు మతానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. అయినప్పటికీ, ఈ సంస్కృతిలో మతాలకి ప్రాతినిధ్యం వహించే రాజులు, పరిపాలించే రాజ్యాలు ఉండేవి కావు; పాలకుడు తన మతాన్ని అనుసరించేవాడు, ప్రజలకు వారి మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉండేది. ప్రజలు మతాన్ని ఒక నిర్దిష్టమైన ప్రక్రియగా పరిగణించక పోవడం వల్ల ఎటువంటి సంఘర్షణలూ ఉండేవి కావు.

ప్రపంచంలో ప్రతి చోటా, అప్పట్లో ఆచరించే నిర్దిష్టమైన మతం కాకుండా ఎవరైనా ఏదైనా వేరేగా మాట్లాడితే, వెంటనే ప్రజలు వారిని "చంపాలి" అనేవాళ్ళు. యూరోప్‍లో, ప్రజలు తార్కికంగా అర్థం చేసుకోలేని ఇతర రకాల సాధ్యతలు, సామర్థ్యాలు ప్రదర్శించిన కారణంగా వేల మంది స్త్రీలను దహించేశారు. వారిని మంత్రగత్తెలుగా ముద్రవేసి కాల్చి చంపారు. చిత్రహింసలు ఎప్పుడూ ఉంటూనే ఉండేవి. చిత్రహింసలకు గురైన వారిలో మనకి తెలిసిన కొందరు ప్రముఖులు - యేసు క్రీస్తు, మన్సూర్ ఇంకా సోక్రటీస్. వారు కేవలం, అసాధారణమైనవిగా పరిగణించబడే ఇతర రకాల సామర్థ్యాలను కలిగి ఉండటంవల్ల హింసించబడ్డారు.

కాబట్టి, పాశ్చాత్య దేశాలలో ఆధ్యాత్మికత ఎక్కడ ఉన్నా, అది రహస్యంగానే జరిగేది. అది ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా లేదా చిన్న సమూహాలలోనే ఉండేది, ఎప్పుడూ ఒక సమాజంగా ప్రబలేది కాదు. కానీ ఈ సంస్కృతిలో, ఆధ్యాత్మిక వ్యక్తులను హింసించడం అనేది ఎప్పుడూ జరగలేదు. మహా ఐతే, వారిని చర్చకు పిలిచి ప్రశ్నలు అడిగేవారు. సత్యం కోసం చేసే శోధన కాబట్టి, ప్రజలు కూర్చొని తమకు తెలిసినది నిజమా లేదా అవతలి వ్యక్తికి తెలిసినది నిజమా అని వాదించుకునేవారు. అతని సత్యం వీరి కంటే శక్తివంతమైనది అయితే, వీరు అతనితో ఏకీభవించేవారు. వీరి సత్యం అతని కంటే శక్తివంతమైనదైతే, అతను వీరితో ఏకీభవించేవాడు. ఇది చాలా భిన్నమైన శోధన. సత్యాన్ని తెలుసుకోవాలని ప్రజలు శోధించేవారు. వారు కేవలం నమ్మకాలు ఏర్పరుచుకొని, అవే సరైనవని నిరూపించే ప్రయత్నాలు చేయలేదు.

హిందూ జీవన విధానంలో ఎటువంటి నమ్మకపు వ్యవస్థ లేదు. ఒకరు దేవుణ్ణి నమ్ముతారు, మరొకరు నమ్మరు. ప్రతి ఒక్కరికీ తమ స్వంత ఆరాధన విధానం ఇంకా ముక్తి మార్గం ఉండచ్చు. మీ కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఉంటే, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవుడిని పూజించవచ్చు లేదా ఎవరినీ పూజించకుండా కూడా మంచి హిందువుగా ఉండవచ్చు. కాబట్టి మీరు ఏది నమ్మినా, ఏదీ నమ్మకపోయినా హిందువులే.

అదే సమయంలో, వీటన్నింటిలో అంతర్లీనంగా ఒకటే అంశం ఉంది. ఈ సంస్కృతిలో, మానవ జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం మోక్షం లేదా ముక్తి. అంటే, జీవన ప్రక్రియ నుండి, మీకు పరిమితులు అని తెలిసిన అన్నిటి నుండి ముక్తి పొంది, వాటన్నిటికీ అతీతంగా వెళ్లడం. దేవుడిని పరమోన్నతమైనదిగా పరిగణించరు, మోక్షాన్ని చేరుకునే దిశలో దేవుడిని ఒక మెట్టుగా పరిగణిస్తారు. ఇది దేవుడు లేని, భక్తిగల దేశం; ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్టమైన ఆలోచన లేని దేశం. దేవుడు లేని దేశం అని నేను అన్నప్పుడు, మానవులకు వారి దేవుళ్ళను ఎన్నుకునే స్వేచ్ఛను అందించిన ఏకైక సంస్కృతి ఇదే! అంతే కాదు, మీరు అన్వయించుకోగల దేవుడిని మీరే సృష్టించుకోవచ్చు. మీరు ఒక బండను, ఆవును లేదా మీ అమ్మని పూజించవచ్చు - మీకు ఏది అనిపిస్తే దానిని మీరు పూజించవచ్చు - ఎందుకంటే, "దేవుడు మన సృష్టి' అని తెలిసిన సంస్కృతి ఇది. మిగిలిన ప్రపంచమంతా, "దేవుడు మనల్ని సృష్టించాడు" అని నమ్ముతారు. ఇక్కడ, మేమే దేవుడిని సృష్టించామని మాకు తెలుసు, కాబట్టి మేం ఏ దేవుడిని అన్వయించుకోగలమో, ఆ దేవుడిని పూర్తి స్వేచ్ఛతో సృష్టించుకోవచ్చు. ప్రజలు దేనితో అయితే బాగా ఎక్కువగా అన్వయించుకోగలరో, దాన్ని ఆరాధించేవారు. అందులో ఏ ఇబ్బంది ఉండేది కాదు.

దేవుడు లేని దేశం: తూర్పుదేశాలలో, ఆధ్యాత్మికత కానీ, మతం కానీ ఎప్పుడూ వ్యవస్థీకృత ప్రక్రియగా లేవు. వ్యవస్థీకరించడం అనేది ఆధ్యాత్మికతను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచేందుకు మాత్రమే - దేనినో జయించడం కోసం కాదు. ముఖ్యంగా, మతం అనేది మీ కోసం, అది దేవునికి సంబంధించినది కాదు. మతం మీ ముక్తికి సంబంధించినది. అంతిమ ముక్తిని పొందడం కోసం మీరు ఉపయోగించే మరో మెట్టు మాత్రమే దేవుడు. ఈ సంస్కృతి, భగవంతునికిచ్చే ప్రాధాన్యత కంటే, మానవ శ్రేయస్సు ఇంకా స్వేచ్ఛను అత్యంత ప్రాముఖ్యమైనదిగా గుర్తిస్తుంది.. అందువల్ల దేవుడ్ని సృష్టించే పూర్తి సాంకేతికత, వివిధ రకాల శక్తి స్వరూపాలను ఇంకా స్థలాలను ప్రతిష్టించే శాస్త్రంగా మార్పు చెందింది.

'దేవుడు' అనే భావన యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఒక వ్యక్తిలో పూజ్యభావం సృష్టించడం. మీరు దేని పట్ల పూజ్యభావంతో ఉన్నారనేది ముఖ్యం కాదు; పూజ్యభావంతో ఉండటం ముఖ్యం. పూజ్యభావనని మీ గుణంగా మార్చుకుంటే, మీరు జీవితాన్ని మరింత ఎక్కువగా గ్రహించగలుగుతారు. జీవితం మరింత గొప్పగా మారుతుంది. ఈ విషయాలను చాలా అపార్థం చేసుకున్నారు, ఎందుకంటే ఈ సంస్కృతిలో ఒక విధమైన భాషా సంబంధమైన ఆనవాయితీ ఉంది, దాంతో మనం అన్నిటినీ పాట లేదా కథ రూపంలో వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒక విధంగా చెప్పాలంటే, ప్రతి వ్యక్తి తమ మోక్షమే జీవితంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, దాని కోసం ప్రయత్నించే ఆధ్యాత్మికతలో మూలాలు ఉన్న సంస్కృతి ఈ హిందూ సంస్కృతి.

భారతదేశంలో మార్మికతను పరిశీలిస్తే, అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక నమ్మకపు వ్యవస్థ నుండి రాలేదు. భౌతికతకు మించిన అంశాలను అన్వేషించడానికి ఇది ఒక శాస్త్రీయ సాధనంగా ఉపయోగ పడుతుంది. భారతదేశాన్ని అధ్యయనం చేయలేము, ఇది అనేక రకాల సాంస్కృతిక, జాతి, మత, భాషల సంకలనం ఐనప్పటికీ, ఇక్కడ ఎన్నో విశిష్టమైన సాధ్యాతలున్నాయి. సత్యాన్ని తెలుసుకోవాలనే ఒకే ఒక అంశం అందరినీ ఏకం చేస్తుంది. జనన మరణ ప్రక్రియ నుండి ముక్తి పొందాలనే బలమైన కోరికని, చిన్నప్పటి నుంచే పెంచి పోషిస్తారు. భారతదేశాన్ని అధ్యయనం చేయలేము, మహా అయితే దానిని ఆస్వాదించవచ్చు లేదా ఇంకా ఉత్తమమైనదేంటంటే, అందులో విలీనం కావడం. అదొక్కటే మార్గం. దీనిని అధ్యయనం చేయడం సాధ్యం కాదు, భారతదేశం గురించి పాశ్చాత్య విశ్లేషణ, యదార్ధానికి చాలా దూరంగా ఉంటుంది. సహజమైన, ఉత్సాహభరితమైన గందరగోళాన్ని ఆనందిస్తూ, అందులోనే అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని కేవలం కొన్ని లక్షణాల ఆధారంగా విశ్లేషించటం తప్పుడు అభిప్రాయాలకు దారి తీస్తుంది.

ఈ భూమిపై ఉన్న ఈ అత్యంత ప్రాచీన దేశం, ఇక్కడి పౌరుల ఆదర్శాలు లేదా నమ్మకాలు లేదా ఆశయాల చేత నిర్మించబడలేదు. ఇది సాధకుల దేశం, ఇక్కడ సంపద లేదా శ్రేయస్సును కాదు కోరుకునేది, ముక్తిని కోరుకుంటారు. ఆర్థిక లేదా రాజకీయ విషయాల నుండి ముక్తి కాదు, అంతిమ ముక్తి.

జ్ఞానోదయానికి ఎన్ని మార్గాలున్నాయి అని ఆదియోగిని అడిగినప్పుడు, మీరు మీ భౌతిక వ్యవస్థ పరిధిలోనే ఉంటే 112 మార్గాలు మాత్రమే ఉన్నాయి, కానీ మీరు భౌతికతని అధిగమిస్తే, విశ్వంలోని ప్రతి అణువు ఒక ద్వారం అవుతుంది అని చెప్పారు. "భారత", అని ఎన్నో వేల సంవత్సరాల నుంచి పిలవబడుతున్న ఈ దేశం, విభిన్న ఆధ్యాత్మిక సంభావ్యతలతో కూడిన క్లిష్టమైన సమ్మేళనం. మీరు మహాకుంభ మేళాకు వెళ్లిన్నట్లయితే, ఇది అక్కడ బాగా వ్యక్తమవుతుంది. భారతదేశాన్ని సందర్శించిన తర్వాత మార్క్ ట్వైన్ ఇలా అభినందించారు, "నాకు తెలిసినంత వరకు, సూర్యుడు సంచరించే దేశాల్లోనే, భారతదేశాన్ని అత్యంత అద్భుతమైన దేశంగా మార్చడానికి, మానవులు గానీ, ప్రకృతి గానీ, దేన్నీ వదిలిపెట్టలేదు. చేయాల్సిందల్లా చేసేశారు. ఏదీ మర్చిపోలేదు, దేన్ని విడిచిపెట్టలేదు".

భారత: ఎవరికైనా 'తెలుసుకోవాలనే బలమైన కోరిక' కలగడానికి మూల కారణం, వారు తమకి 'ఏమీ తెలియదు' అని గ్రహించడం, తమ జీవం యొక్క అసలు స్వభావం తెలియకపోవడం. ఏదో సంస్కృతి పరంగా అనుకూలమైన విశ్వాసాన్ని ఏర్పరుచుకొని, అదే నమ్మి ఉండిపోకుండా, మొత్తం ప్రజానీకం తమ అసలు స్వభావం గురించిన సత్యాన్ని అన్వేషించడానికి ధైర్యం ఇంకా నిబద్ధతను కలిగి ఉండడమే, భారత అని పిలువబడే ఈ దేశానికి ఆధారం. "భా" అంటే స్పందనలు; అదే అన్నీ అనుభవాలకు, వ్యక్తీకరణకు ఆధారం; "ర" అంటే రాగం; జీవితం యొక్క రాగం ఇంకా నిర్మాణం; "త" అంటే తాళం; అంటే, జీవితం యొక్క లయలు, ఇందులో మానవ వ్యవస్థ ఇంకా ప్రకృతి లయలు, రెండూ కలిగి ఉంటాయి.

భారతదేశం యొక్క ప్రాథమిక ధర్మాలను భద్రపరచడం, సంరక్షించడం, ఇంకా పెంపొందించడం, వారసత్వంగా వచ్చిన జ్ఞానం ఇంకా జీవితం గురించి అంతులేని అన్వేషణ, ఇదంతా మొత్తం మానవాళికి నిజమైన బహుమతి. ఈ తరం వారిగా, ఇది మనం నిర్వర్తించవలసిన ముఖ్యమైన బాధ్యత. ఈ దేశ ఋషులు అన్వేషించిన, తెలియచేసిన అపరిమిత సాధ్యతలను మతపరమైన దురభిమానంతో, తెలివితక్కువ సిద్ధాంతాలతో పోగొట్టుకోవద్దు.

ఇది ఒక సనాతన ప్రదేశం. మనిషి, తన జీవితపు పోకడలను, ఈ విశాల విశ్వాన్ని నియమించే ఆధార సూత్రాల నుంచి దూరంగా జరిగి ఎగిరిపోకుండానే నింగి దాకా ఎదగడం నేర్చుకున్న ప్రదేశం. తన స్వార్థపుటాశలను తీర్చుకోవాలని ఆత్రపడక భగవంతుని ఆదేశాల్ని నెరవేర్చడానికి పాటుపడే మానవులు నడయాడిన పుణ్యభూమి. మేధా శక్తిలో, భావోద్వేగాలలో ఉత్సాహపుటంచులు అందుకోగల స్థాయికి ఎదగడం నేర్చుకుంటూ పెరిగాడు. సృష్టి మూలాల లోతులను కొలిచాడు. ఆద్యంతాల రహస్యాలను భేదించాడు. అనాది నాద సంజనిత సంగీత మాధుర్యాన్ని, లయ, తాళ గతుల విన్యాసాలను, ఒడిసి పట్టాడు; పారంగతుడయ్యాడు. అన్నింటినీ మించి, ముక్తి ద్వారాలను కనుగొన్నాడు
ఆపైన అంతిమ స్వేచ్ఛ తథ్యమని ఎరుక కలిగి తేలికపడి, జీవితమొక బరువు కాదు బహుమతి అని భావించే అందమైన స్థితిని అందుకున్నాడు. శాంత చిత్తాలతో, వెలుగులీనుతూ తేజోమయ మూర్తులెందరో ఇంతకింతగా ఈ భూమి మీద ఉదయించారు. ఆశలీడేరిన సంతృప్త చిత్తాలతో స్త్రీ, పురుష తత్వాలు, అతీత చేతనా స్థాయికి ప్రయాణమయ్యాయి. ఆవలి వైపు నుండి వచ్చే కిరాతక శక్తులకు వారు సులభమైన ఎర అయ్యారు...… సద్గురు జగ్గీవాసుదేవ్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments