డా।। అంబేద్కర్: వారు ఎవరు? వారి జయంతిని మనం అందరం ఎందుకు చేసుకోవాలి?: డా।। అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యతవల్ల అవమానాలకు గురిఅవ...
డా।। అంబేద్కర్: వారు ఎవరు? వారి జయంతిని మనం అందరం ఎందుకు చేసుకోవాలి?: డా।। అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యతవల్ల అవమానాలకు గురిఅవుతున్న 17శాతం హిందువుల సామాజిక సమానత్వంకోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశాయి. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు – సామాజిక సమానత్వంకోసం జరిగిన ఫ్రెంచి విప్లవంలో, అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి (నీగ్రోల) సమానహక్కులకోసం జరిగిన ఉద్యమంలో, రష్యా, చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షలమంది చనిపోయారు. పెద్ద రక్తపాతం జరిగింది. గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలోను హింసా సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. డా।। అంబేద్కర్ నిర్వహించిన సామాజిక సమానతా ఉద్యమాలలో ఒక్కచుక్క రక్తంకూడా కారలేదు. 17వందల సంవత్సరాలుగా కొనసాగిన అస్పృశ్యత కులఅసమానతలను భారత రాజ్యాంగం ద్వారా వ్యవస్థాపూర్వకంగా నిర్మూలించిన ఘనత వీరిది. ప్రపంచంలోనే డా।। అంబేద్కర్ గొప్ప శాంతియుత ఉద్యమకారులు.
హిందూ సమాజంపట్ల ఆగ్రహించారు – హిందూసమాజ వినాశనాన్ని కోరుకోలేదు: భీమ్‌రావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రికలద్వారా హిందువుల ఆలోచనా ధోరణిని మార్చటానికి ప్రయత్నించారు. నాసిక్ కాలారాం మందిర ప్రవేశంకోసం 18నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. మహారాష్ట్రలోని మహద్ గ్రామంలోని చెర్వులో అందరికి ప్రవేశం ఉందని పంచాయితీ తీర్మానం చేసినా షెడ్యూలు కులాల ప్రజలతో నీటిని త్రాగడానికి వెళితే గ్రామస్థులు భౌతిక దాడులకు దిగారు. డా।। అంబేద్కర్ చేసిన సామాజిక సమతా ఉద్యమాలకు హిందూ సమాజం నుండి ఏమాత్రం సహకారం రాలేదు. (దీనికి మినహాయింపు వీరసావర్కార్, కుర్తికోట శంకరాచార్యులు) హిందూ సమాజంలో కాలానుగుణంగా మార్పురాదని ఆగ్రహించి , నిరాశకు గురై 1933లో ‘‘నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చావను. ఏమతంలో సమానత్వం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తాను.’’ అని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో హిందూ సమాజంలో కొంత కదలిక ఏర్పడింది.డా।। అంబేద్కర్ హిందూవ్యతిరేకా?: కాదు. ‘కులనిర్మూలన’ అనే ప్రసంగంలో కులవిభజనవల్ల , కుల అసమానతలవల్ల, కుల వ్యవస్థవల్ల హిందూ సమాజం సమైక్యంగాలేదు. ఫలితంగా మనం బానిసలు అయ్యాం. విదేశీ పాలనలో అనేకమంది ముస్లిం మతస్థులయ్యారు. వారు వెనక్కిరావాలంటే ఏకులంలోకి రావాలి? వారు ఏకులంలోకి రాగలరు? ప్రపంచంలో ఇస్లాం, క్రైస్తవాలు మతప్రచారం, మతం మార్పిడి చేస్తున్నాయి. ఇతరులను తమమతంలోకి మార్చుకుంటున్నారు. వారి బలం పెరుగుతోంది. ఎవరైనా ఇతర మతస్థులు తమమతం వదిలి హిందూమతంలోకి రావాలంటే నేటి కులవ్యవస్థ వారి ప్రవేశానికి అడ్డుగాఉంది. ఇది హిందూ సమాజానికి పెద్దసమస్య. ఇలా సాగింది వారి ప్రసంగం. వారిమొత్తం ప్రసంగం హిందూ సమాజ హితంకోసమే ఉన్నది. నిజమేకదా!
హిందూ తత్వచింతనలోఉన్న గొప్పతనాన్ని వారు గుర్తించారు. హిందూ తత్వచింతనలో మాత్రమే ‘‘భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే ఆలోచన ఉన్నది. మరెక్కడాలేదు. ఈ ఆలోచనద్వారా సామాజిక సమానత్వం సాధ్యం. కాని హిందూతత్వ చింతనలోని శ్రేష్టత్వానికి – ఆచరణలోఉన్న అసమానతలకు ఈ అంతరమే ప్రధాన సమస్య. ఈ అంతరం పోవాలి’’ అని వారు కోరారు. ఈ అంతరాన్ని తొలగించాల్సింది ఎవరు? మనం తయారుగా ఉన్నామా ?
హిందూ శబ్దానికి విసృత నిర్వచనం: న్యాయశాఖా మంత్రిగా హిందూకోడ్‌బిల్‌ను ఎంతో శ్రమించి వారు రూపొందించారు. ఈ సందర్భంగా హిందూ అంటే ఎవరూ? అని నిర్వచిస్తూ ‘‘ముస్లింలు, క్రైస్తవులు, పారశీకులు కాని భారతీయులందరూ హిందువులే.’’అని వారు నిర్వచించారు. హిందుత్వానికి విస్తృతమైన, సమగ్రమైన నిర్వచనం వారు ఇచ్చారు. కొందరు సిక్కులు ‘‘మేము హిందువులం కాదు అని మాట్లాడగా మీరు హిందువులు ఎట్లాకాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే’’ అని వారు ఎదురుప్రశ్న వేశారు.
1916లో ‘‘భారతదేశంలో కులాల పుట్టుపూర్వోత్తరాలు’’ అనే పరిశోధనాగ్రంథంలో కులఅసమానతలు ఉన్నా ప్రపంచంలోని ఏ సమాజంలో లేని సాంస్కృతిక ఐక్యత హిందూ సమాజంలో మాత్రమే ఉందనివారు విశ్లేషించారు. వేదకాలంలో గల చాతుర్వర్ణ వ్యవస్థలో వర్ణాలమధ్య హెచ్చుతగ్గులు లేవని శూద్రులు ఎవరు అనే గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు. వేదమంత్రాలను దర్శించిన ఋషులు అన్నివర్ణాలలో ఉన్నారని, మహిళలుసైతం ఉన్నారని వారు సోదాహరణంగా వివరించారు. హిందూ సమాజంలో చిచ్చుపెట్టడానికే ఆంగ్లేయపాలకులు ‘ఆర్య – ద్రావిడ’ అనే అభూతసిద్ధాంతాన్ని కల్పించారని వారు వివరించారు. అస్పృశ్యత మధ్యకాలంలో క్రీ।।శ 4-5 శతాబ్దాలలో వచ్చినదని ‘అస్పృశ్యులెవరు?’ అనే గ్రంథంలో నిరూపించారు. 1956 నేపాల్ ప్రపంచ బౌద్ధధర్మ సభలో ‘‘మర్క్సిజంకంటే మానవ సమగ్ర వికాసానికి బౌద్ధధర్మమే మేలుఅని వివరంగా ప్రసంగించారు.
భారత రాజ్యాంగం ద్వారా ఒకే రాష్ట్రంగా భారతదేశం: సాంస్కృతిక సమైక్యతతోపాటు సామాజిక సమైక్యత అవసరమని తెలియజేస్తూ భారత రాజ్యాంగంద్వారా సామాజిక సమానత్వము అనే అమృతాన్ని అందించారు. సాంస్కృతిక భారతితోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారతం అవసరమని భావిస్తూ బలమైన కేంద్రంగల భారతరాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజనుండి – ఒకే రాజ్యం – ఒకే రాష్ట్రంవైపు భారత్ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని డా।। అంబేద్కర్ అందించారు. డా।। అంబేద్కర్ ఈ శతాబ్దపు మేధావి. అనేక రంగాలలో వారు ఎన్నో చదువులు చదివారు. కనుకనే భారతరాజ్యాంగపు నిర్మాతగా వారికి అవకాశం లభించింది.
ఆర్.ఎస్.ఎస్.తో సత్సంబంధాలు: హిందూ సమాజంపట్ల ఆగ్రహంగా ఉన్నా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల ఆహ్వానంమేరకు 12 మే, 1939న పూనాలో ఆర్.ఎస్.ఎస్. సంస్థాపకులు డా।। హెడ్గెవార్‌తో కలిసి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల 40రోజుల శిక్షణా శిబిరంలో ఒకరోజు పాల్గొన్నారు. 425మంది కార్యకర్తలు పాల్గొన్న ఆ శిబిరంలో 100కు పైగా షెడ్యూల్డుకులాల కార్యకర్తలు ఉండడంచూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. తాను ఆశించిన సామాజిక సమానతా కార్యాన్ని ఆర్.ఎస్.ఎస్. మౌనంగా చేస్తున్నదని వారు శ్లాఘించారు. హిందూసమాజ సంఘటన చేస్తున్న ఆర్.ఎస్.ఎస్.పట్ల వారు ఎప్పుడూ ఒక పల్లెత్తుమాట అనలేదు. 1956వరకు దత్తోపంత్ ఠేంగ్డే వంటి కార్యకర్తలు వారితో తత్సంబంధం కలిగిఉన్నారు. డా।। అంబేద్కర్ను డాక్టర్జీ ఒకసారి, గురూజీ ఒకసారి కలిశారు. ఆర్.ఎస్.ఎస్. చేస్తున్న హిందూసమాజ సంఘటనాకార్యం పెరుగుతున్న జనాభా, దేశ సమస్యలు దృష్ట్యా తక్కువ వేగంతో ఉన్నదని వారు అసంతృత్తిని మాత్రం వ్యక్తంచేశారు. ‘‘తన అనుచరులు ఎక్కువకాలం నిరీక్షిస్తూ ఉండలేరని, తాను ఉండగానే వారికి ఒకదారి చూపించాలని’’, డా।। అంబేద్కర్ 1956లో శ్రీ ఠేంగ్డేజీతో అన్నారు.
‘భారతదేశ విభజన – పాకిస్థాన్ ఏర్పాటు’ అనే గ్రంథంలో కోట్లసంఖ్యలోఉన్న ముస్లింలను కలుపుకునే శక్తి హిందూసమాజంలో లేదని కనుక పాకిస్థాన్ ఏర్పడటమే మిగిలిన భారతదేశంలోని హిందువులకు వీలుకలిగిస్తుందని కోరారు. పాకిస్థాన్ ఏర్పడినతరువాత హిందూముస్లిం జనాభాల మార్పిడి జరగాలని వారు కోరారు. పాకిస్తాన్‌లో హిందువులకు, షెడ్యూలుకులాలవారికి ఏమాత్రం రక్షణ ఉండదని వారుచెప్పిన జోస్యం నేడు నిజమైందికదా! జమ్మూ – కాశ్మీర్ రాజ్యానికి 370 అధికరణ ఇవ్వటానికి వారు వ్యతిరేకించారు.
బౌద్ధధర్మాన్నే వారు ఎందుకు స్వీకరించారు?: 1933లో హిందూమతాన్ని వదులుతానని వారు ప్రకటించినా 1956వరకు వారు ఏ నిర్ణయం తీసుకోలేదు. ముస్లిం, క్రైస్తవ వర్గాలనుండి ఎన్నో ఆకర్షణలు లభించినా వారు అటువైపు మొగ్గలేదు. భారతదేశంలోనే జన్మించినా బౌద్ధధర్మాన్ని 1956లో నాగపూర్‌లో స్వీకరించారు. వారి చర్య హిందూ సమాజానికి పరోక్షంగా ఎంతోమేలుచేయలేదా ?
దేశ ప్రయోజనాలకే పెద్దపీట: భారత రాజ్యాంగపు తుది సమావేసం 25నవంబర్, 1949న ప్రసంగిస్తూ ‘‘నేడు మనకు లభించిన స్వాతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మనకులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాలకంటే దేశప్రయోజనాలకు పెద్దపీటవేయాలి’ అని అందరకూ పిలుపునిచ్చారు.
డా।। అంబేద్కర్ జాతీయ నాయకుడు: డా।। అంబేద్కర్ దళితుల ఉన్నతికోసం, సమానత్వం కోసం పనిచేస్తూనే భారతదేశ ప్రయోజనాల కోసం అహరహమూ శ్రమించారు. ఎక్కడా రాజీపడలదు. కనుక వారిని మనం జాతీయనాయకుడుగా గుర్తించి గౌరవించాలి. ఇది మనందరి బాధ్యత.- — శ్యామ్ ప్రసాద్
No comments