జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆధునిక ప్రపంచానికి యోగాభ్యాసాన్ని అనుగ్రహిచిన భారత్ మరొకసారి తన జగద్గురు స్థానాన్ని నిరూపించుకు...
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆధునిక ప్రపంచానికి యోగాభ్యాసాన్ని అనుగ్రహిచిన భారత్ మరొకసారి తన జగద్గురు స్థానాన్ని నిరూపించుకున్నది. మానవాళి శ్రేయస్సుకు తన సనాతన ఆరోగ్య విధానాన్ని అందించడం, విశ్వం అందుకోవడం భారతీయులు గర్వించదగిన విషయం. ఐక్యరాజ్యసమితి వేదికగా 27 సెప్టెంబర్ 2014న భారత ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పిలుపునిచ్చారు. 11 డిసెంబర్ 2014న దానికి 193 సభ్య దేశాలలో 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచ మానవాళి పరిపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసం ఉపయోగపడుతుందని మరొక తీర్మానం కూడా ఆమోదించారు.
యోగ: అష్టాంగమార్గం
‘యోగా యుజ్యతే అనేన ఇతి యోగః’ అని పతంజలి సూత్రం. ఆత్మను పరమాత్మలోనూ, శరీరం, మనసును, శ్వాసను కలిపేది యోగ అని పెద్దలు నిర్వచించారు. యోగాలో 8 అంగాలు ఉంటాయి అవి : యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.
కానీ ఈ రోజుల్లో యోగ అంటే ఆసనంగా, కొంతవరకూ ప్రాణాయామంగా పేరు పొందింది.
యమములు: అంటే చేయకూడనివి. హింస చేయకూడదు కాబట్టి అహింస, అబద్ధం చెప్పకూడదు కాబట్టి సత్యం, అస్తేయం, అపరిగ్రహం.
నియమములు: అంటే శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం.
ఆసనం: సుఖంగా, స్థిరంగా ఉండేదే ఆసనం. ఇది కూర్చుని, నుంచుని, తలక్రిందులుగా వేయవచ్చును. ఆసనం మనుషులక• సరళత్వం, దార్ధ్యం, సంతులనాలను ఇవ్వడమే కాక, చాలా అనారోగ్య సమస్యలతో పాటు, ఉబ్బస వ్యాధి, మధుమేహం, రక్తపోటు, వెన్నునొప్పి లాంటి వాటిని నిశ్శబ్దంగా తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
ప్రాణాయామం : ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను నియంత్రించటం ద్వారా మన శరీరంలో పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలతో కూడి ఉన్న ప్రాణశక్తిని సంతులనం చేసి, అన్ని అంగాలకు అందేటట్లు చేస్తుంది. మనసుని శాంత పరుస్తుంది.
ఇవన్నీ బహిరంగ యోగ పద్ధతులు. అంతరంగ యోగం కూడా ఉంది.
ప్రత్యాహారం : ఇంద్రియాల నుండి మరల్చడం, అంతర్ముఖం చేయడం దీనివల్ల అనవసరమైన విషయాల మీద వెంపర్లాట ఉండదు. మన కళ్లు, చెవులు, నాలుక, చర్మం, ముక్కు, అనవసరమైన వాటి కోసం అర్రులు చాస్తాయి. వాటిని సక్రమంగా ఉంచాలి.
ధారణ : ఏకాగ్రత. ఏకాగ్రత లేకపోతే మనం మన శక్తియుక్తుల్ని వృధా చేస్తాం.
ధ్యానం : లక్ష్యంపై మనసు నిలిపి తదేక దీక్షతో నుండడం. ఒక మహత్వం గురించి ఎదురు చూస్తున్న స్థితి. లక్ష్యంతో లీనం కావడం.
సమాధి : సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి. నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
పైన వివరింపబడిన అష్టాంగ యోగా సూత్రాలను పాటించినట్లయితే అందరమూ ఆనందముగా జీవించవచ్చు..
Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు? International Day of Yoga
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments