మన స్వాభావిక కర్తవ్యం: మన సమాజంలో ఏకాత్మ భావనను బలపరచడం జన్మతః మన అందరి కర్తవ్యము. అది అతి సహజమైన కార్యము. అటువంటి సహజమైన కార్యము దోషముగా అ...
సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్ (భగవద్గీత 18/48)
సహజకర్మలు దోషముతో కూడుకున్నవైనప్పటికీ వాటిని వదిలిపెట్టకూడదు. ప్రస్తుత సమాజంలో ఉన్న భేదభావాలు, వివక్ష సమాజం యొక్క జీవశక్తిని క్షీణింప చేస్తున్నాయి. వీటిని నిర్మూలించి సంపూర్ణ సమాజాన్ని పునః సంఘటితం చేసి సామరస్య పూర్ణమైన వాతావరణాన్ని నెలకొల్పడం మనందరి సర్వోత్కృష్టమైన కర్తవ్యం.
నేటికీ కొన్ని రాజకీయ సంస్థలు పరస్పరం విరుద్ధంగా పోరాడుతూ అనేక వ్యూహరచనలు చేస్తున్నాయి. ఈరోజు ప్రజా మద్దతు కూడగట్టుకున్న ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు. రేపు ఇంకొక పార్టీకి ప్రజల మద్దతు లభించవచ్చు. రాజకీయ అధికారం అశాశ్వతము. కానీ సమాజము శాశ్వతము అజరామరము. ఎంతమంది రాజులు, రాజవంశాలు అనేక ప్రభుత్వాలు పరిపాలన విధానాలు గత వేల సంవత్సరాల నుంచీ వస్తున్నాయి పోతున్నాయి. కానీ చరిత్ర మరియు రక్తం అనే బంధముతో ముడిపడి ఉన్న మన సమాజం ఎప్పుడూ ఒకటిగా, సంపూర్ణంగానే ఉన్నది. ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనే విషయాన్ని మనం వివేకంతో ఆలోచించాలి. ఏది శాశ్వతమో దానిని మనం ఆశ్రయించాలి. అయితే తాత్కాలికమైనవి శాశ్వత మార్గంలో వచ్చినప్పటికీ వాటిని త్యజించాలి.
యో ధృవాణీ పరిత్యజ్య అధృవం పరిషేవతే
ధృవాణి తస్య నశ్యంతి అధృవం నష్టమేవహి (పంచతంత్రం మిత్ర సంపత్తి, 142)
ఎవరైతే శాశ్వతమైనవి వదిలి అశాశ్వతమైన వాటి వెంట పరుగులు తీస్తారో వారి వద్ద ఉన్న శాశ్వతమైన వస్తువులు కూడా నాశనం అవుతాయి, అశాశ్వతమైనవి నాశనం కావడం ఎలాగూ నిశ్చయం. సమాజము ధృవము (శాశ్వతము) రాజకీయాలు అధృవము(అశాశ్వతము). రాజకీయ లబ్ధి కోసం మనం సమాజాన్ని విస్మరించి దాని ఆంతరిక ఏకాత్మతకు విఘాతం కలిగిస్తే మనము మన స్వాభావిక కర్తవ్యానికి విరుద్ధంగా పని చేస్తున్నట్లే.
(స్వార్థపు పొరలన్నీ చీల్చి, సంస్కారం రూపుదాల్చి
మొద్దు నిదుర మత్తు వదిలి, ముందుకు పోదాము తరలి)
No comments