ఉమ్మడి పౌరస్మృతిని గురించి చర్చించే సందర్భంతో, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని భారతదేశంలో బేషరతుగా విలీనం చేయాలనే, 1950 దశకపు ఉద్యమంలోని మహోన్నత...
ఉమ్మడి పౌరస్మృతిని గురించి చర్చించే సందర్భంతో, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని భారతదేశంలో బేషరతుగా విలీనం చేయాలనే, 1950 దశకపు ఉద్యమంలోని మహోన్నత నినాదం ‘ఏక్ విధాన్ (ఒకే రాజ్యంగం), ఏక్ ప్రధాన్ (ఒకే ప్రధానమంత్రి) ఏక్ నిషాన్’ (ఒకే రాష్ట్ర ధ్వజం) గుర్తుకు వస్తుంది. భారత గణతంత్ర దేశమంతటికీ ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాష్ట్ర పతాకం ఉన్నట్లుగా, వివిధ మతాల, ప్రాంతాల సంబంధం లేని ఒకే, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని మన రాజ్యాంగం నాల్గవ భాగం, ఆదేశిక సూత్రాల సమాహారంలో 44వ అధికరణం ఇలా ఉంది; ‘‘భారతదేశంలోని అన్ని ప్రాంతాల పౌరులందరకూ వర్తించే ఏకరూప పౌరశిక్షాస్మృతిని రూపొందించేందుకు ప్రభుత్వం కృషిచేయాలి.’’ (Uniform Civil Code for the Citizents, the state shall endeavour to secure for the citizens at uniform civil code throughout the territory of Inida)
ఇది నిర్దేశిత అభిలాష; దీనిని ఆచరణలోకి తేవడానికి చట్టం చేయాలి. అక్కడే వస్తోంది చిక్కు; జాప్యం. అటు కొన్ని మత సమూహాల నుంచి వ్యతిరేకత. ఇటు దేశ సమైక్యత, సమగ్రత, ఏకాత్మత, సమ న్యాయం, లింగ సమానత్వం, కుటుంబ వ్యవస్థ, స్థిరత్వం కోరేవారిలో ఇంకా కాలపాయన చేయ కుండా చట్టం చేయాలనే పట్టుదల కనబడుతున్నాయి.
మన రాజ్యాంగ నిర్మాణ సమయంలో సభ్యులు మినూ మసానీ (పార్సీ), రాజకుమారి అమృతకౌర్ (సిక్కు), హంసా మెహతా, డా।।అంబేడ్కర్‌లు ఉమ్మడి పౌర శిక్షాస్మృతిని రూపొందించి, విధిగా అమలు జేయవలసిన అంశాలు ఉండే భాగంలో చేర్చాలని గట్టిగా వాదించారు. ముస్లింలను బుజ్జగించడంలో మునిగి తేలే కాంగ్రెస్ పెద్దలు మసానీ ప్రభృతుల ప్రయత్నాన్ని వ్యతిరేకించి రాజ్యాంగ ప్రాథమిక హక్కులో భాగం (మూడు)లో గాక ఆదేశిక సూత్రంగా, ఆకాంక్షగా ఉల్లేఖించారు.
పౌరస్మృతిలో ముఖ్యమైన విషయాలు; వివాహం, (ఏకపత్నియా, బహు భార్యత్వమా), విడాకులు, వారసత్వం, అందులో ఎవరికీ ఎంత భాగాలు, దత్తత, స్త్రీ పురుషుల వాంగ్మూలానికి సమాన విలువ, విడాకులిచ్చిన మహిళకు, సంతానానికి మనోవర్తి ఇత్యాదులు ప్రధానాంశాలు. ఈ విషయాల్లో షరియనే తు.చ తప్పక అనుసరిస్తాం కాబట్టి, తదనుగుణం కాని ఏ ఉమ్మడి పౌరస్మృతిని, నిజానికి అసలు ఏ స్మృతినీ అంగీకరించేది లేదని ముస్లింలు అంటున్నారు.
హిందువులలో ప్రాంతాలనుబట్టి, సంప్రదాయాల నుబట్టి ఏకత్వంలేని ఆచారాలుండేవి. వాటన్నిటినీ సమీక్షించి యావత్ భారతంలో హిందువులందరికీ వర్తించేలా (వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, సంపదలో సమాన విభాగం…) సంస్కరించిన హిందూ శిక్షాస్మృతిని చట్టంగా చేశారు. ముస్లింల స్మృతిని ఎందుకు సంస్కరించలేదు?
సెక్యులరిస్ట్ మహానుభావుడు నెహ్రు ముస్లింల సమ్మతితోనే వారి పర్సనల్ లాను సంస్కరించాలి అన్నారు. ఈ సందర్భంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గట్టి వాదనను వినిపించారు. వందేళ్లకు పైగా ఈ దేశంలో బ్రిటిష్‌వారి పాలనలో చాలా విషయాల్లో ఉమ్మడి స్మృతినే అమలు చేశారు గాని షరియా గాదు. నేరాలు చేసినవారికి కొరడా దెబ్బలు, కాళ్లుచేతులు నరకడం, మెడకాయ కోయడం, రాళ్లతో కొట్టి చంపడం అనే షరియా చట్టాలు అమలవడం లేదు కదా! ఒక్క వర్గానికే ఎందుకు పర్సనల్ లా అమలు చేయాలని, షరియా ఎందుకని అన్నారు.
ప్రపంచంలో 192 రాజ్యాల్లో 130 ముస్లింలే మెజారిటీలుగా ఉన్న రాజ్యాలు కావు. కొన్నిటిల్లో ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. వారందరూ ఆయా దేశాల సివిల్ కోడ్‌కు లోబడే ఉన్నారు. కాని, షరియాకు కాదు. మన గోవాలో పోర్చుగీసుల పాలన నుండి, ముస్లింలతో సహా అన్ని మతస్థులు వారికి ఉమ్మడి పౌరశిక్షాస్మృతే అమలులో ఉంది. కనుక ఉమ్మడి పౌరస్మృతి పట్ల ముస్లింల వ్యతిరేకత రాజకీయ ప్రేరేపితమైందేకాని, సహేతుకం కాదు. దేశ విభజన కోసం రక్తపాతంతో కలహించిన వారు, తామే సృష్టించిన ఇస్లామిక్ పాకిస్తాన్ / బంగ్లాదేశ్‌లకు వెళ్లకుండా ఇక్కడే ఉండి, ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించడం మతాంధ రాజకీయ ఉద్దండత.
ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యాంగ ఉద్దేశించి నట్లుగా, మానవీయతను ఆధారం చేసుకుని, చట్టం చేయండని దేశ అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు ప్రభుత్వానికి సూచించింది. అన్ని మతాల వారిని, దృక్పథాల వారిని సంప్రదించి, కేవలం హిందూ ధర్మం ప్రకారమేగాని సర్వజన కల్యాణకారియైన ఉమ్మడి పౌరస్మృతి రచన తక్షణమే చేపట్టాలి. రాజ్యాంగ రచన సమయంలో కాంగ్రెస్‌లోని జాతీయ ముస్లిం సభ్యులు షరియా నిబంధనలు అమలుకు జాతీయ స్థాయిలో ఒక ఖాజీని నియమించాలని, ముస్లింల బాగోగులు చూడడానికీ, వక్ఫ్ ఆస్తులను రక్షించడానికీ ఒక ముస్లిం మంత్రిని నియమించ డానికి అనువుగా అధికరణలు ఉండాలని కోరారు. ఆ గొంతెమ్మ కోరికలను అదృష్టవశాత్తు రాజ్యాంగ నిర్మాతలు అంగీకరించలేదు.
22వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతిని గురించి చేసే సూచనలను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఇది ప్రభుత్వ సంస్థ కాదు) ఇస్లామిస్ట్ దృక్పథంతో ముస్లిమేతరులు, ముస్లిం వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని వాదిస్తూ, ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా అలజడి రేపుతున్నది. అయినా వీటికి తలవంచక ప్రభుత్వం తగిన చట్టాన్ని దృఢ సంకల్పంతో తీసుకురావాలి. – త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రముఖ సాంకేతిక నిపుణులు.
యునిఫార్మ్ సివిల్ కోడ్ ప్రచారం దృష్ట్యా జాగృతి వార పత్రిక నుండి వ్యాసం తీసుకోవడమైనది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments