Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు - 1975 లో ఎమర్జెన్సీ ఎందుకు విధించబడింది? 50-yrs-of-emergency

స్వేచ్ఛా భారతంలో చీకటి రోజులు: అర్ధరాత్రి నుంచి 21 మాసాలు భారతదేశం అక్షరాలా బందిఖానాను మరిపించింది. ఇలాంటి చేదు అనుభవాన్ని నాటి...

స్వేచ్ఛా భారతంలో చీకటి రోజులు: అర్ధరాత్రి నుంచి 21 మాసాలు భారతదేశం అక్షరాలా బందిఖానాను మరిపించింది. ఇలాంటి చేదు అనుభవాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి రుచి చూపించారు. స్వాతంత్య్ర పోరాట సంస్థగా భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉన్న మూలాల మీద, ఇందిరకు ఉందని చెప్పుకుంటున్న నెహ్రూ వారసత్వం మీద దేశ ప్రజలకు భ్రమలన్నీ పటాపంచలైపోయిన రాత్రి అదే. జూన్‌ 25, 1975. ఆ రాత్రి విధించిన ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) కి మంగళవారంతో (25-06-2024) 50 ఏళ్లు.

కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో దేశంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జూన్ 25, 1975 నుండి మార్చి 21, 1977 వరకు 21 నెలల కాలానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎమర్జెన్సీని విధించారు. ఎమర్జెన్సీ సమయంలో, ఇందిరా గాంధీ డిక్రీ ద్వారా పాలించే అధికారాన్ని తనకు ప్రసాదించుకున్నారు. కొంతమంది సన్నిహిత పార్టీ సభ్యులు మరియు ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీతో సంప్రదించి ఆమె నిర్ణయం తీసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 28 ఏళ్లకే ఈ దేశం మీద కాంగ్రెస్‌ అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని రుద్దింది.

ఎమర్జెన్సీ ఎందుకు విధించారంటే: 1971 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికలలో ఆమె ప్రత్యర్థి, సోషలిస్టు నాయకుడు రాజ్‌ ‌నారాయణ్‌. ఈ ఎన్నికలలో ఇందిర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు. 1971 సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల మోసం మరియు సామూహిక అవినీతిని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడంలో ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషించారు. భారత ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అని చెప్పదగిన ఎన్నికలలో జరిగిన తప్పిదాన్ని సవరించడానికి అలహాబాద్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌జగ్‌ ‌మోహన్‌లాల్‌ ‌సిన్హా తన తీర్పు ద్వారా చేసిన ప్రయత్నాన్ని నాటి అధికార పార్టీ, ప్రధానమంత్రి మొత్తంగా ప్రజాస్వామ్యం హత్యకు ఉపయోగించుకున్న వైనం ఆ పరిణామంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎన్నికల తప్పిదానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నదీ, విచారణ జరుగుతున్నదీ సాక్షాత్తు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీయే. కాంగ్రెస్‌లో, దేశంలో తిరుగులేని నాయకురాలిగా వెలిగిపోతున్నప్పటికీ చట్టం ముందు అంతా సమానులే అన్న సిద్ధాంతాన్ని ఇందిర కేసులో జస్టిస్‌ ‌సిన్హా మహా సాహసంతో ఆచరించి చూపారు. ఈ కోర్టు కేసు జూన్ 12 1975 వరకు విచారణ జరిగింది.

1971 నాటి లోక్‌సభ, 1972 నాటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామం. అప్పటికి ఇందిర తిరుగులేని నాయకురాలు. లోక్‌సభలో కాంగ్రెస్‌దే మెజారిటీ.. అసెంబ్లీలలో కూడా ఆ పార్టీదే హవా. 1972లో దేశ వ్యాప్తంగా 3754 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్‌ ‌పార్టీయే 2237 స్థానాలు గెలిచింది. వ్యవస్థా కాంగ్రెస్‌ (‌దీనినే పాత కాంగ్రెస్‌ అనేవారు) 104, భారతీయ జనసంఘ్‌ 153, ‌సీపీఐ 67, సీపీఐ (ఎం) 147 గెలుచుకున్నాయి. అయినా నియంత పోకడలకు పోయిన ఇందిర రాజకీయ అస్థిరతకు బాటలు పరిచారు. 1973 - 1974 సంవత్సరాలలో బీహార్, గుజరాత్ లలో మోరార్జీ దేశాయ్, జె.పిలు చేసిన ఉద్యమాల కారణంగా అక్కడ రాజీనామాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో గుజరాత్ లో ఇంజినీరింగ్ విధ్యార్థుల ఫీజుల ఉద్యమంలో పోలీసు కాల్పులలో 48 మంది చనిపోయారు. అప్పుడు అది అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చి, అంతిమంగా గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి చిమన్‌భాయ్‌ ‌రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ‌కేంద్రబిందువుగా ఉద్యమం ఊపందు కుంది. మొరార్జీ విద్యార్థులకు అండగా నిలిచి, అసెంబ్లీ రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిరాహార దీక్ష చేశారు. చివరికి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరపవలసి వచ్చింది. జూన్‌ 12, 1975 ‌ఫలితాలు వెలువడినాయి. చిమన్‌భాయ్‌ ‌నాయకత్వం లోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఓడిపోయింది. జనమోర్చా కూటమి అధికారంలోకి వచ్చింది. ఉదయం అలహాబాద్‌ ‌కోర్టులో ఓటమి. సాయంత్రం గుజరాత్‌ ఎన్నికల ఫలితాలలో ఓటమి.

అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు మీద స్టే కోసం సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఈ కేసులో ఇందిర తరఫున వాదించిన నానీ ఏ పాల్కీవాలా సలహా ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టులో వెకేషనల్‌ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ‌వీఆర్‌ ‌కృష్ణయ్యర్‌ ‌షరతులతో కూడిన స్టే మాత్రమే మంజూరు చేశారు. ఎందుకంటే, ప్రధాని పదవి కాబట్టి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కీలకం కాబట్టి. అంటే ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. లక్ష ఓట్లతో ఓడిన రాజ్‌నారాయణ్‌, ‌కోర్టులో మాత్రం ఘన విజయం సాధించారు. ఇందిర మరో ఆరేళ్ల పాటు ఏ ఎన్నికలలో పోటీ చేయరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది కూడా. పుండు మీద కారం చల్లడం అంటే అక్షరాలా ఇదే. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చు. పార్లమెంట్‌ ఉభయ సభలలోను పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. కానీ ఓటు హక్కు ఉండదు. ఈ రెండు తీర్పులను కూడా ఇందిరా గాంధీ గౌరవించలేకపోయారు. ఈ గడ్డు సమస్య నుంచి బయటపడడం ఎలాగో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే, ప్రతిపక్షాలు ఇందిర రాజీనామాకు పట్టు పట్టాయి. కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాలలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారామె. రాజ్యాంగంలోని 352 అధికరణం మేరకు ‘దేశంలో కల్లోల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందితే’ సంతకం చేయవచ్చు. ఈ ఆధికరణను వాడుకొని అత్యయిక పరిస్థితి ని ప్రకటించారు.

ఆ అర్ధరాత్రి దేశంలో జరిగిన స్వైర విహారం సైనిక పాలనలోకి పోతున్నామన్న అనుమానాన్ని కలిగించింది. రక్త సహిత అధికార మార్పిడి ఏదో జరిగిపోతున్నదన్న భయాందోళనలు రాజ్యమేలాయి. ఎమర్జెన్సీ సమయంలో, సంజయ్ గాంధీ తన తల్లికి అన్ని రంగాలలో సలహాలు ఇస్తూ రాజకీయ నాయకుడిగా ప్రాముఖ్యతను పొందారు. ఎటువంటి ఆరోపణలు లేకుండా ప్రజలను నిర్బంధించడం, ఖైదీలు మరియు రాజకీయ ఖైదీలను హింసించడం మరియు పెద్ద ఎత్తున మరియు చట్టవిరుద్ధమైన చట్టాలను రూపొందించడం వంటి ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (MISA) చాలా దుర్వినియోగం చేయబడిన శాసనం.

ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టడం, పౌర హక్కులను పూర్తిగా నిలిపివేయడం, ప్రాథమిక హక్కులను తగ్గించడం, సెన్సార్‌షిప్‌తో సహా పత్రికా స్వేచ్ఛపై క్రూరమైన ఆంక్షలు మరియు ఇందిరా గాంధీ నేతృత్వంలోని నిరంకుశ మరియు నియంతృత్వ వర్గం చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం అత్యంత ఆందోళనకరమైన అంశం. అయితే, ఈ సమయంలో, దుర్మార్గపు పోకడలతో మరింత సంక్లిష్టత ఉద్భవించింది. 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. అధికారులు పోలీసుల సాయంతో గ్రామాలను ముట్టడించి మరీ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను బలవంతంగా చేసేవారు. ఇందులో బాలలు, ఎనభయ్‌ ఏళ్ల వృద్ధులు కూడా ఉండేవారు. రకరకాలుగా బెదిరించి 25,000 మంది ప్రభుత్వోద్యోగులకు కూడా కు.ని. శస్త్ర చికిత్సలు చేశారు. ఇలాంటి ఎన్నో ఘోరాలు 21 నెలల పాటు దేశప్రజలు చూడాల్సివచ్చింది.

1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మరియు సీనియర్ ప్రతిపక్ష నాయకుల అరెస్టులో సంజయ్ గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారు. మార్చి 21, 1977న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ఉపసంహరించుకుని సార్వత్రిక ఎన్నికలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించి, మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. మొరార్జీ దేశాయ్ భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధాని అయ్యారు.

50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షిద్దాం.. - రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. ఆచీకటిరోజులను ఆనిరంకుశప్రభుత్వపాలనను ఇంకా మరిచిపోలేదు. వాడెవడో బారువా ఇందిరా ఈజ్ ఇండియా - ఇండియా ఈజ్ ఇందిరా ఆనటం ఎలా మరిచేది.

    ఆకుటుబం ఇప్పటికీ ఇదే రాజరిక పోకడలను కొనసాగిస్తోంది.

    రాజ్యాంగాన్ని చిత్థుపుస్థకంలా విసిరేసిన ఆపారీ తామే రాజ్యాంగ రక్షకులం అంటున్నారు తమాషాగా.

    ReplyDelete