Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జాతీయతను జాగృతపరిచే రచన "సన్యాసి విప్లవం" - సామల కిరణ్, ఉపాధ్యాయుడు - Sanyasi Viplavam - Book Review

గతం నాస్తి కాదు అనుభవాల ఆస్తి అంటారు చేతన వర్తన కవులలో ఒకరైన వేనరెడ్డి. గతమంతా బానిసత్వమే అని కొందరు అనుకుంటే అదే గతమంతా స్వాభిమాన పోరాట చరి...

Book Review


గతం నాస్తి కాదు అనుభవాల ఆస్తి అంటారు చేతన వర్తన కవులలో ఒకరైన వేనరెడ్డి. గతమంతా బానిసత్వమే అని కొందరు అనుకుంటే అదే గతమంతా స్వాభిమాన పోరాట చరిత్ర అని మరికొందరి అభిప్రాయం. చరిత్ర విదేశీ కళ్ళతో కాకుండా భారతీయ మెదడుతో చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మన పూర్వీకుల బలిదానాలు, త్యాగాలు మనలను బానిస మత్తు నుండి మేలుకొలుపుతాయి . మాతృభూమి పట్ల మన కర్తవ్యం బోధపడుతుంది. ఇదే లక్ష్యాన్ని నెరవేర్చే రచన సన్యాసి విప్లవం. కుల, మత, వర్గ, ప్రాంత భాషా విభేదాలకు అతీతమైన భారతీయతను తట్టి లేపుతుంది.

21వ శతాబ్దంలో భారతీయ ఆలోచన ధార విశ్వవ్యాప్తము కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో మెగా మైండ్స్ మీడియా నిర్వాహకులు శ్రీ నన్నపనేని రాజశేఖర్ గారి కలం నుండి వచ్చిన ఈ రచన ఆద్యంతం ఆసక్తిదాయకం, పాఠకులకు ప్రేరణదాయకం. మెగామైండ్స్ ద్వారా ఇప్పటికే స్వయంగా రెండు పుస్తకాలు అందించిన రాజశేఖర్ ది ఇది మూడవ పుస్తకం. మెగా మైండ్స్ ఇప్పటికీ మొత్తము 10 పుస్తకాలు ప్రచురించింది. జాతీయ భావసాహిత్యమే పరమావధిగా ప్రచురణలను అందిస్తున్న మెగా మైండ్స్ వరసలో మేలి రచనగా ఈ సన్యాసి విప్లవం నిలబడుతుందని ఆశిద్దాం. శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ తమ పీఠికను అందించి ఈ గ్రంథ నామానికి సార్ధకతను కలిగింపజేశారు. సన్యాసులు అంటే "సర్వసంగ పరిత్యాగులే తప్ప, సర్వ సంఘ పరిత్యాగులు కారు, సర్వ సంఘ సముద్ధరణా చేతనలు" అని సన్యాసికి కొత్త నిర్వచనాన్ని స్వామీజీ అందించారు.

వేయి సంవత్సరాల కాలంలో సన్యాసులు జాతి హితము కొరకు ఎలా ఉద్యమించారో వివరించే పుస్తకము ఇది అంటారు పీఠికలో స్వామీజీ. మరుగునపడిన చరిత్రను అందించడంలో శ్రీ రాజశేఖర్ కృతకృతులయ్యారని స్వామీజీ తమ ఆశీస్సులను అందించారు. పాల్ఘర్ సాధువుల హత్యోదంతం ఈ గ్రంథ రచనకు తనను పూనుకునేలా చేసినట్లు రచయిత శ్రీ రాజశేఖర్ తన మాటలో చెప్పుకున్నారు. మస్తిష్కాలను ఆలోచింపజేసే శీర్షికతో ఆకర్షణీయమైన ముఖచిత్రముతో ఉన్న ఈ పుస్తకంలో ఏముందో సంక్షిప్తంగా అవలోకిద్దాం.....

సంఖ్యా శాస్త్రం ప్రకారం 16 ఆధ్యాత్మిక భావజాగరణను కలిగిస్తుంది అని రచయితకు తెలుసో తెలియదో కానీ ఈ గ్రంథంలో 16 భాగాలుగా ఆసాంతం అంతఃప్రేరణను కలిగించి ధర్మరక్షణలో మోక్షం వైపుకు మనల్ని నడిపిస్తుంది. 16 భాగాల్లో రాయబడ్డ ఈ సన్యాసి విప్లవం పుస్తకం శీర్షికల ద్వారానే విషయము మనకు అవగతం అవుతుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరులు మొదలుకొని నేటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ, స్వయం సేవకుల "మాతృదేశ ఆరాధన" ను రచయిత వివరంగా ఇందులో తెలియచేశారు.

'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' అన్న భగవాన్ శ్రీరాముని మాటలలోని మాతృభూమి గొప్పతనం తెలియజేశాడు రచయిత మొదటి భాగంలోనే. దశావతారాల లక్ష్యమే భూ ప్రకృతి సంరక్షణగా రచయిత భావన ఉత్తమోత్తమమైనది. వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, భరద్వాజ, రాజర్షి జనకుల పరంపరను రచయిత ఇక్కడ తెలియజేశారు. రెండవ భాగంలో సాందీపునుల ప్రేరణతో ధర్మరక్షణ గావించిన జగద్గురువు శ్రీకృష్ణుడి అవతార ఉద్దేశాన్ని వివరించారు. పాషాండ నాస్తిక మతాల వేర్లను ఖండించి సనాతన ధర్మ రక్షా శంఖము పూరించిన ఆదిశంకరుల సన్యాసిత్వము మూడవ భాగంలో ఆవిష్కరించబడింది. ఆదిశంకరులు స్థిరపరచిన అద్వైత, పాంచాయతన సిద్ధాంతాలే ప్రామాణికమై నేటికీ నిలిచి ఉన్నట్లు వివరించబడింది. నాగసాధువులను ఏకత్రాటి మీదికి తీసుకువచ్చి సైన్యంగా తీర్చిదిద్దినది ఆదిశంకరులే అనే చారిత్రక సత్యాన్ని రచయిత వెలికి తీయటం అతని పరిశోధన దృష్టికి నిదర్శనం. నాగ సాధువుల చరిత్రను క్లుప్తంగా మరో అధ్యాయములోనూ రచయిత అందించాడు.

సన్యాసుల తీర్థ స్థలాలు క్షేత్రాలు అనే భాగం ద్వారా కుంభమేళా ప్రాశస్త్యాన్ని రచయిత వివరించారు. మొగలుల పాలనలో రాణా ప్రతాప్ వెంట నిలబడిన వారు, ఔరంగజేబు సైన్యాన్ని సమూలంగా సంహారం చేసిన వారు నాగసాధువులేనన్న అంశం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే సమయంలో సమర్ధ రామదాస స్వామి హనుమాన్ వ్యాయామ శాలల ద్వారా యువతను దేశ ధర్మ సంరక్షకులుగా తీర్చిదిద్దారు. ప్లాసీ మరియు బాక్సర్ యుద్ధాల తర్వాత ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా మొదలైనది సన్యాసి విప్లవం. 40 ఏళ్ల పాటు కొనసాగిన సన్యాసి విప్లవం జాతిలో మేలుకొల్పిన జాతీయతను రచయిత పలు భాగాల్లో వివరించారు.

పంజాబులో కూకాల పోరాటం, మహారాష్ట్రలో చాపేకరు సోదరుల బలిదానం, స్వామి వివేకానందుని మాతృభూమి శంఖారావం, లాల్ బాల్ పాల్ ల వందేమాతర ఉద్యమం, అనుశీలన సమితి విప్లవోద్యమం, చిట్టగాంగు వీర కిశోరుల బలిదానం, కేశవ బలిరాం హెడ్గేవార్ ద్వారా ఆర్.ఎస్.ఎస్. స్థాపన... అన్నింటి వెనుక గల "సన్యాసీ విప్లవ ప్రేరణ"ను సోదాహరణంగా రచయిత ఈ గ్రంథంలో చెప్పుకొచ్చారు. ఆర్.ఎస్.ఎస్. నిర్మాత దాక్టర్జీ తర్వాత వచ్చిన గురూజీ అత్యంత ధార్మిక సంపన్నులు, హిందుత్వ శ్రోతస్సు. వారి ద్వారా కొనసాగిన సన్యాసి పరంపర నేటికీ అఖండంగా దేశంలో ప్రవహిస్తుంది. దేశం, ధర్మం కోసం పని చేసే ప్రతి ఒక్కరూ సన్యాసియే అని రచయిత అనటంలో అతిశయోక్తి, సాపేక్ష సత్యం అని నాకు అనిపిస్తుంది. అయినా సన్యాసి పరంపర భవిష్యత్తులో కొనసాగటం శాశ్వత సత్యం.

చివరి భాగం మాతృభూమి సంకల్పంలో చైతన్యం, వీరత్వం జాతికి కావాలని రచయిత అభిలాష. రచయిత సంకల్పం కూడాను మాతృ భూమి సక్రియ ఆరాధకుల సంఖ్య పెరగాలని. గ్రంథం చదివిన ప్రతి పాఠకుని అంతరంగంలో దేశభక్తి, ధర్మానురక్తి తీవ్రం అవుతుందని ఘంటాపథంగా చెప్పగలను. రచయిత నన్నపనేని రాజశేఖర్ కి మరో మారు అభినందనలు తెలుపుతూ, పాఠకులు ఈ రచనను ఆదరించాలని కోరుకుంటాను.

చివరగా:  జాతీయతను జాగృతపరిచే రచన "సన్యాసి విప్లవం"

ప్రతులకు: మెగా మైండ్స్ మీడియా
వెల: 150/- ఒక పుస్తకం తీసుకున్నట్లయితే పోస్టల్ చార్జీలు 30/- రూ అదనం.


ఈ పుస్తకం కోసం ఈ 8500581928 నెంబర్ లేదా ఇమేజ్ పై క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా సంప్రదించండి


No comments