Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అనుకుల్ ఠాకూర్ జీవిత చరిత్ర - About anukul chandra thakur

అనుకుల్ ఠాకూర్ (ఠాకూర్ అనుకుల్ చంద్ర మరియు అనుకుల్ చంద్ర చక్రవర్తి అని కూడా పిలుస్తారు) ఆధ్యాత్మిక సంపన్నులు. బెంగాల్‌లోని ఆధ్...

అనుకుల్ ఠాకూర్ (ఠాకూర్ అనుకుల్ చంద్ర మరియు అనుకుల్ చంద్ర చక్రవర్తి అని కూడా పిలుస్తారు) ఆధ్యాత్మిక సంపన్నులు. బెంగాల్‌లోని ఆధ్యాత్మిక గురువులలో ముఖ్యులు. సత్సంగం ద్వారా దేశ ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యానికై పాటుబడ్డారు.

అనుకుల్ ఠాకూర్ జీవిత చరిత్ర: 1888 సెప్టెంబర్ 14న అవిభక్త భారతదేశంలో, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న బెంగాల్‌లోని పాబ్నా జిల్లాలోని హేమాయేత్‌పూర్ గ్రామంలో జన్మించారు. అనుకుల్ చంద్ర తండ్రి శివచంద్ర, తల్లి మనోమోహినీ దేవి. ఆధ్యాత్మికత కలిగిన కుటుంబం. మనోమోహినీ దేవి గర్భం దాల్చిన 12వ నెలలో జన్మించారు అనుకుల్ చంద్ర. ఊరు ఊరంతా అది తెలిసి తండోపతండాలుగా వెళ్ళి చూసొచ్చారు. బాల్యం హేమాయేత్‌పూర్ గ్రామంలోనే గడిచింది. అనుకుల్ తల్లి పట్ల అపారమైన భక్తి భావన కలిగి ఉండేవారు, తనకు తల్లే మొదటి ఆధ్యాత్మిక గురువు గా దీక్ష పొందారు. అనుకుల్ ఉత్తర భారతదేశానికి చెందిన యోగా అభ్యాసకులు శ్రీ శ్రీ హుజూర్ మహారాజ్ శిష్యులు కూడా. హేమాయేత్‌పూర్‌లో చదువు పూర్తి చేసిన తర్వాత, పాబ్నా ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. కొందరు స్నేహితులు అనుకుల్ ని ‘ప్రభు’ అని పిలిస్తే మరికొందరు ‘రాజా భాయ్’ అని పిలిచేవారు. అనుకుల్ చంద్ర పాబ్నా నుండి నైహతి హైస్కూల్‌కు వెళ్ళారు. తల్లి కోరికను తీర్చేందుకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు.

అకస్మాత్తుగా తండ్రి అస్వస్థతకు గురయ్యారు, దాంతో కోల్‌కతాలోని అనుకుల్ చంద్ర విద్యా జీవితానికి ఆటంకం ఏర్పడింది. డబ్బు లేకపోవడంతో సరిగ్గా భోజనం చేసేవారు కాదు. కొన్నిసార్లు రోడ్డు పక్కన కుళాయిలో నీళ్లు తాగాల్సి వచ్చేది. అనుకుల్ పడుతున్న ఇబ్బందులు చూసిన తోటి  వైద్య మిత్రుడు హేమంత్ కుమార్ ఛటర్జీ మందులతో కూడిన ఒక మెడికల్ బాక్స్‌ కిట్ ని బహుమతిగా ఇచ్చాడు. అనుకుల్ చంద్ర ఆ మందులతో రోగులకు చికిత్స ప్రారంభించారు. అలా వచ్చిన ధనంతో తన ఆర్ధికపరిస్థితులను అధిగమించారు.

కోల్‌కతాలో ఉన్నప్పుడు, అనుకుల్ చంద్ర అప్పుడప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని ధ్యానం చేసేవారు. హేమాయెత్‌పూర్‌లో హోమియోపతి డాక్టర్‌గా వారి జీవితం ప్రారంభమైంది. ఇది వారికి అపూర్వ విజయాన్ని అందించింది. అయినప్పటికీ, రోగి యొక్క శరీరానికి మాత్రమే కాకుండా, మనస్సుకు కూడా చికిత్స చేయడం ప్రారంభించారు. మానవుని బాధలను శాశ్వతంగా నిర్మూలించాలంటే మూడు రకాల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాధులకు చికిత్స అవసరమని ఆయన గ్రహించారు.

నిస్సహాయులు, నిర్లక్ష్యం చేయబడినవారు అనుకుల్ స్నేహితులు. కొంత మంది చదువుకున్న యువకులు కూడా అప్పట్లో ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. అనుకుల్ చంద్ర వారితో సత్సంగం నిర్వహించారు. అప్పటి నుండి అనుచరులు డాక్టర్ అని కాకుండా ఠాకూర్ అని సంబోధించారు. ఠాకూర్ అనుకుల్ చంద్ర వివిధ వ్యక్తులతో చేసిన విలువైన సంభాషణలు, ఆయన చెప్పిన సూక్తులు మరియు లేఖలను సంకలనం చేసి పుస్తకాలుగా ప్రచురించారు. వీటి సంఖ్య దాదాపు 46. వీటిలో ప్రముఖమైనవి సత్యానుసారం, పుణ్యపుతి, అనుశ్రుతి (6 సంపుటాలు), చలార్ సాతి, శాశ్వతి (3 సంపుటాలు), సమాజ్ సందీపన్, యతి అభిధర్మ మొదలైనవి. ఠాకూర్ అనుకుల్ చంద్ర తన విలువైన సూక్తులు ద్వారా తన అనుచరులకు అనేక సలహాలు ఇచ్చారు. ఠాకూర్ యొక్క భక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అతని సూక్తులను అనుసరిస్తారు.

వివాహం: 1906వ సంవత్సరంలో 18 సంవత్సరాల వయస్సులో పాబ్నా పట్టణంలో నివసిస్తున్న ధోపదహ గ్రామానికి చెందిన రాంగోపాల్ భట్టాచార్య కుమార్తె అయిన 11 సంవత్సరాల వయస్సు గల సొరాశిబాలతో వివాహం జరిపించారు.

అనుకుల్ ఠాకూర్ మరియు సుభాష్ చంద్రబోస్: అనుకుల్ ఠాగూర్ శిష్యులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తండ్రి జానకీనాథ్ బోస్ మరియు తల్లి ప్రభావతి దేవి అని చాలా మందికి తెలియదు. సుభాష్ చంద్రబోస్ ఠాకూర్‌ను అనేకసార్లు కలిశారు. 1902లో, జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దేవి కొడలియా గ్రామంలో ఉన్మత్త ఠాకూర్ అని పిలువబడే శాక్త ఆధ్యాత్మిక గురువు శ్యామ్‌నాథ్ భట్టాచార్య నుండి దీక్ష తీసుకున్నారు. అతని (శ్యామ్‌నాథ్ భట్టాచార్య) మరణానంతరం, వారు ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని పబ్నాలోని హేమాయెత్‌పూర్ నివాసి అనుకుల్ ఠాకూర్‌కి శిష్యులు అయ్యారు. “అనుకుల్ ఠాకూర్ ని చివరిసారిగా నేతాజీ 1936లో కలిశారు. సుభాష్ చంద్రబోస్ పాబ్నాకు వెళ్లారు. అనుకుల్ ఠాకూర్ అతనికి కూర్చోవడానికి కుర్చీ తెచ్చారు. అప్పుడు నేతాజీ ‘నా తల్లిదండ్రులు మీ శిష్యులు. నేను మీ పక్కన ఎలా కూర్చోవాలి? బదులుగా, నేను నేలపై కూర్చుంటాను.’.....” అని అన్నారు.

హేమాయేత్‌పూర్ సత్సంగ్ ఆశ్రమం ఆలయం: శ్రీ శ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్ర యొక్క హేమాయేత్‌పూర్ సత్సంగ్ ఆశ్రమ దేవాలయం పాబ్నాకు సమీపంలోని హేమాయేత్‌పూర్  గ్రామంలో ఉంది. బంగ్లాదేశ్‌లోని ప్రముఖ హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. శ్రీ శ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్ర పూజా మందిరం, ఆలయం పక్కనే ఉంది. సత్సంగ్ ఆశ్రమ దేవాలయం శ్రీ శ్రీ అనుకూల్ చంద్ర తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించారు. ఆలయం ముందు ఉన్న రాజభవనం లోని రాతిపై ‘స్మృతి మందిర్’ అని చెక్కబడి ఉంది. అనుకుల్ చంద్ర ‘సత్సంగ’ను ప్రజా సంక్షేమ సంస్థగా స్థాపించారు. అనుకుల్ చంద్ర మానవ సంక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. శ్రీ శ్రీ అనుకూల్ చంద్ర జయంతి మరియు వర్థంతి సందర్భంగా ఇక్కడ ఒక గొప్ప వేడుక నిర్వహించబడుతుంది. ఆ సమయంలో చాలా మంది ప్రజలు/అతిథులు ఇక్కడ జరిగే సత్సంగాలలో పాల్గొంటారు.

దేవఘర్ సత్సంగ్ ఆశ్రమం: 1946లో అనుకుల్‌చంద్ర జార్ఖండ్‌లోని డియోఘర్‌కు వచ్చి అక్కడ కూడా ఆశ్రమాన్ని స్థాపించారు. భారతదేశ విభజన తర్వాత పబ్నాకు తిరిగి వెళ్ళలేదు, శాశ్వతంగా డియోఘర్‌లో నివసించడం కొనసాగించారు, 26 జనవరి 1969న కన్నుమూశారు. దియోఘర్ సత్సంగ్ ఆశ్రమం సత్సంగ్ ఆధ్యాత్మిక ఉద్యమానికి ప్రధాన కార్యాలయంగా మారింది. ఈ ఆశ్రమ పరిసరాలలో ఆసుపత్రి ఉంది. బాలుర మరియు బాలికల పాఠశాలలు, ఔషధ తయారీ కేంద్రం (ఠాకూర్ అనుకూల్‌చంద్ర రూపొందించిన మందులు), ఏడు అంతస్తుల ఉచిత ఆనందబజార్ భవన్, నివాస ప్రాంతాలు మొదలైనవి. దియోఘర్ సత్సంగ్ ఆశ్రమం జార్ఖండ్‌లోని పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటి.

No comments