Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వెలుగురేఖ - మందికొండ మోహనరావు - About Mandikonda Mohan Rao

వరంగల్ నగరం ఎటుచూసినా జనసమూహంతో మహాకోలాహలంగా ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి, నగరంలోని మారుమూల ప్రాంతాల నుండి కాజీపేట, హనుమకొండ, మొదలైన ...



వరంగల్ నగరం ఎటుచూసినా జనసమూహంతో మహాకోలాహలంగా ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి, నగరంలోని మారుమూల ప్రాంతాల నుండి కాజీపేట, హనుమకొండ, మొదలైన ప్రధాన కేంద్రాల నుండి ఎంతో మంది వచ్చారు. పైడిపల్లి, కొండపర్తి, శాయంపేట, తరాలపల్లి, భట్టుపల్లి, దేశాయిపేట మొదలైన గ్రామాల్లో ఉత్సాహం ఉరకలు వేసింది.

ఇజాలకు, రాజకీయాలకు, గ్రూపులకు, ముఠాలకు వర్గాలకు, కులాలకు అతీతంగా మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం అని, తరతరాలుగా భారతీయ సమాజంలో ఉపేక్షింపబడ్డ హరిజనులు అక్కడ ఏకమయ్యారు. హఠాత్తుగా అక్కడ అంతమంది కలవడానికి ముందు పూర్వరంగం కొంతవుంది.

ప్రజాస్వామ్యం, సమసమాజం, లౌకికరాజ్యం మొదలైన కొన్ని నినాదాల మీద జరుగుతున్న వ్యాపారం కొంతమంది కళ్ళు తెరిపించింది.

అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి. ఎన్నుకోబడ్డ వాడు ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో-పార్లమెంటులో కూర్చుంటాడు. తనను ఎన్ను కొన్న నియోజక వర్గానికి ప్రతినిధిగా అతడు వ్యవహరిస్తాడు. ఆ నియోజక వర్గంలో విద్య, వైద్యం, రక్షణ, రోడ్డురవాణా సౌకర్యాలు, విద్యుచ్ఛక్తి, ఎరువులు, విత్తనాలు, వ్యావసాయిక పరికరాలు, గృహవసతి, నీటి పారుదల సౌకర్యాలు ఇవన్నీ సజావుగా అన్నిగ్రామాలకు అందుతున్నాయా అని పరిశీలిస్తూ, అందుబాటులో లేకపోతే అందరికి అందేమార్గాల్ని అన్వేషిస్తూ ఆచరణలోకి తెస్తూ తలలో నాలుకలాగా ప్రజాప్రతినిధి మెలగాలి. కాని ప్రజా స్వామ్యంలో ఇలా మెలగాల్సిన ప్రజాప్రతినిధికి శిక్షణయిచ్చే సంస్థలు లేవు. ఆ కారణాన్నే ఆ ప్రతినిధి ఒక వర్గానికి, ఒక వృత్తికి, ఒక గ్రూపుకు, ఒక పార్టీకి చెందినవాడవుతున్నాడు. ఆవృత్తి, ఆ వర్గం, ఆ గ్రూపు, ఆ పార్టీ చుట్టే అతని ఆలోచనలుంటున్నాయి. ఆ కారణాన్నే ప్రజాస్వామ్యం అందించే ఉత్తమ ఫలితాలు అదృశ్యమైపోతున్నాయి.

సమసమాజం పేరిట నినాదాలు దంచబడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో భూమి పంపిణీ ద్వారా, అందరికి అన్ని వనరులు కలిగించటం ద్వారా సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని "బ్యాలెట్ మీద నమ్మకమున్న కాంగ్రెస్ (ఐ, జె, డి), జనత, భారతీయ జనత, కమ్యూనిస్టు, తెలుగుదేశం మొదలైన పార్టీలు ఓ క్రమపరిణామంలో సాధించడానికి ఇంతో అంతో కృషి చేస్తున్నాయి. అయితే వేటిపరిధులు వాటికున్నాయి. సమసమాజానికి వేటికవే గిరులు గీసుకొని భాష్యాలు రాసుకున్నాయి. ఇక కమ్యూనిస్టుల్లో తీవ్రవాదులైన మార్క్సిస్టు లెనినిస్టులు, అన్నిరకాల నక్సలైట్లు "బుల్లెట్" మీదనే తమ నమ్మకముంచి, భూస్వామ్య వర్గాన్ని 'ఖతం' చేసి సమసమాజాన్ని స్థాపిస్తామంటూ అక్కడక్కడ హత్యలు చేస్తున్నారు. ఈ హత్యలు డబ్బుకొరకు జరిగాయి, పాతపగలతో జరిగాయి, అక్రమ సంబంధాలవల్ల జరిగాయి, తమ గ్రూపులో చేరకపోతే జరిగాయి, చేరి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే జరిగాయి, పోలీసులకు సమాచారం అందిస్తే జరిగాయి, తమకు ప్రత్యామ్నాయంగా మరోశక్తి ఆవిర్భవిస్తుంటే అప్పుడు పరస్పరం జరిగాయి, "మారణ హోమం ద్వారా సమసమాజం, తుపాకీ గొట్టంద్వారా రాజ్యాధికారం" మనుషుల్ని పీక్కుతినే రాబందుల నినాదాలు పరిణమించాయి.

లౌకికరాజ్యం నినాదం, ప్రతిపార్టీ-గ్రూపు వల్లిస్తోంది. కానీ ఓట్ల కొరకు ఆశలు చూపించి, కోరికల్ని రెచ్చగొట్టి మతానికీ మతానికి మధ్య చిచ్చు బెట్టి తమ పబ్బం గడుపుకోడానికి అన్ని వర్గాలు యత్నిస్తున్నాయి. ఆఖండ భారత జాతీయదృష్టి వ్యక్తి వ్యక్తిలో నిర్మాణం చేయడానికి మారుగా మత ప్రాతిపదిక మీద మనిషి ఆలోచించే పరిస్థితులు సృష్టింపబడుతున్నాయి. పైగా ప్రజాస్వామ్యం ఎప్పుడూ మెజార్టీ వర్గానిదే అని నమ్మిన ఇస్లాం, క్రైస్తవ మతాలు రెండూ మతాంతరీకరణలు మొదలుపెట్టాయి. ఈ దేశంలో పుట్టి పెరిగిన హిందూత్వ అస్థిత్వానికే ప్రమాదకర పరిస్థితులేర్పడ్డాయి. హిందువుల్లో శతాబ్దాలుగా కొంతమంది కుత్సిత స్వార్థ సంకుచిత స్వభావాల కారణంగా ఉపేక్షితులుగా చూడబడ్డ హరిజనుల్ని తమలో కలుపుకొని భారతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని క్రైస్తవ సామ్రాజ్యవాద దేశాలు, ఇస్లాం మతోన్మాద సామ్రాజ్యవాద దేశాలు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తుండడంతో లౌకిక రాజ్య నినాదం బూటకంగా పరిణమించింది.

ఈ నేపథ్యం వెన్నుతట్టి లేపగా గాంధీజీ అంబేద్కర్ జీ లాంటి మహనీయుల బోధనలు ప్రేరణలివ్వగా "అఖిలభారత అనుసూచి జాతిపరిషత్" అనే సంస్థ ఆవిర్భవించింది. ఏ రాజకీయపు చదరంగంలో తాము పావులు కాకుండా, హరిజనులపై మొసలి కన్నీరు కార్చే స్వార్ధపూరిత వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకుండా, తమ కాళ్ళమీద తాము నిలబడుతూ, అంటరానితనాన్ని రూపుమాపుతూ, విద్యా సాంస్కృతిక ధార్మిక రంగాలో ఔన్నత్యాన్ని సాధిస్తూ, తమలో ఇతరుల్లో వెనుకబడ్డ సోదరులకు చేయి అందిస్తూ, దేశప్రగతిలో భారత జాతి అభ్యుదయంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగాలనే దీక్షతో ఈ పరిషత్ కృషి చేస్తోంది. అఖిలభారత స్థాయిలో క్రియాశీల కార్యకర్తలున్న ప్రతిచోట ఈ పరిషత్ కార్యక్రమాలు పుంజుకున్నాయి.

ఈ అఖిలభారత అనుసూచి జాతి పరిషత్ వరంగల్లులో 9 జూన్ 1984 నాడు ఏర్పాటుచేసిన జిల్లా మహాసభల కోలాహలమే ఇది. నాలుగు వేలమంది ఉపేక్షిత సోదరులిక్కడ కలిశారు.

చర్చలు పల్లవించాయి. మానసిక వికాసాన్ని కలిగించాయి. ఉపన్యాసాలు పరుగులు పెట్టాయి. బుద్ధికి పటుత్వాన్నిచ్చాయి.

ఏయే దృక్పథాలతో ఏయే గ్రూపులు, ఏయే సంస్థలు తమ నామ జపాన్ని నిరంతరం చేస్తున్నాయో కొంతలో కొంత కొందరికి అర్థమైంది. మరి కొంతమంది ఆలోచనలకు పదునుపెట్టారు.

మొత్తంమీద మహానందంతో మహాసభలు ముగిసాయి.

ఈ మహాసభలు ఇంత దిగ్విజయంగా ముగియడానికి సూత్రధారి, కర్త మందికొండ మోహన్ రావు. వరంగల్లు కోర్టులో క్లర్కు, వరంగల్లు మునిసిపల్ పరిధిలోని శివనగర్లో చిన్న ఇల్లు- ఈ చిన్న ఉద్యోగం తప్ప మరే ఆస్తిపాస్తులు లేనివాడు. సమాజంలో ఉపేక్షితులుగా పూర్వం చూడబడ్డ హరిజనుల సముద్ధరణకు కంకణం కట్టుకున్నాడు. తమలో కొందరు ఉన్నత స్థానాల్లో ఉండి, ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాల్ని అనుభవిస్తూ తమ సోదరులకే సరిగ్గా అందకుండా అడ్డుపడుతుండడాన్ని అసహ్యించుకునేవాడు. తన ఉద్యోగం చూసుకొంటూ, సాంసారిక జీవితంలో సహధర్మచారిణి అయిన శ్రీమతి సుగుణ అండదండలు పూర్తిగా ఉండగా కూతురు శ్రీదేవిని (19) పదవతరగతి చదివించాడు, కొడుకు రవికాంత్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. మరో అబ్బాయి శ్రీకాంత్ (18) ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. శ్రీలత (15) పదవ తరగతి చదువుతోంది. శ్రీధర్ (13) ఏడవ తరగతి చదువుతున్నాడు, శ్రీవల్లి (10) నాల్గవ తరగతి చదువుతోంది. సంసారం పెద్దదే. ఆరుగురు పిల్లలు, ఇద్దరుతాము ఏ వ్యసనాలు లేకుండా ఆదర్శవంతమైన జీవితం గడుపుతుండడంతో వచ్చిన జీతమే సరిపోయేది. గొంగడున్నంతనే కాళ్ళు పారజాపుకోవాలనే ఆలోచన ఉండడంతో అదీ ఇదీ కావాలనీ, అందుకొరకు అడ్డదారులు తొక్కాలని ఏనాడూ ఆనుకున్న వాడుకాదు.

వరంగల్లు, కాజీపేట, హనుమకొండల్లోని హరిజన సోదరుల్ని సమీకరించాడు. తమ అభ్యుదయం కొరకు తామెలా పాటుబడాలో తెలియజేశాడు. కొంతమంది మిత్రులతో కలిసి దేశాయిపేట, బట్టుపల్లి, తరాలపల్లి, శాయంపేట, కొండపర్తి, పైడిపల్లి గ్రామాల్లో తిరిగి AKHILA BHARATH ANUSUCHI JATI PARISHAD సంస్థయొక్క ఉద్దేశ్యాల్ని బోధించాడు. ఏ పార్టీ గుప్పిట్లో మనం ఇరుక్కున్నా ప్రయోజనం లేదన్నాడు. తేనెపూసిన కత్తులు, గోముఖ, వ్యాఘ్రాలు, పయోముఖ విషకుంథాలు కొన్ని తమ పబ్బంగడుపుకోడానికి యత్నం చేస్తున్న తీరుతెన్నుల్ని అర్థం చేసుకోండని విశదీకరించాడు.

ఒక గ్రామంలో కమ్యూనిస్టులు-నక్సలైట్లు కల్లుసారాల రేట్లు తక్కువ చేయడానికి సమ్మెచేయాల్సిందిగా పిలుపిచ్చారు. మరోగ్రామంలో కూలీరేట్ల పెంచాల్సిందిగా సమ్మెకు పిలుపిచ్చారు. ఆ సందర్భంలో హరిజన సోదరులతో మోహనరావు చర్చించాడు. కల్లుసారాలు తాగి ఇళ్ళూ- ఒళ్ళూ పాడు చేసుకోడంకన్నా ఆ మత్తుపదార్ధాల్నే బహిష్కరించాలన్నాడు మోహనరావు అయిదారెకరాలున్న హరిజన సోదరులు మనలోకూడా ఉన్నారు వారి దగ్గరకి కూలీనాలీకి వెళ్ళేవాళ్ళుకూడా ఉన్నారు. వాళ్ళతో వీళ్ళతో మనం చర్చించి యెంత కూలీ సమంజసమో తెలియజేద్దాం. చీటికిమాటికి సమ్మెలవల్ల ఎన్నో అనర్ధాలు కలుగుతున్నాయి అన్నాడు. ఈ సమన్వయ ధోరణిలో పదిమందిని ఒప్పించడమే కాకుండా అప్పుడప్పుడు అంబేద్కర్ గారి బోధనలకు వ్యాఖ్యానం చేసేవాడు మోహనరావు,

"కమ్యూనిస్టు నాయకుడేదైనా కార్మిక సంఘాన్నేర్పాటు చేశాడంటే తాను మొట్టమొదట ఆలోచించేది సమ్మెను గూర్చే! ఈ సమ్మెద్వారా కార్మిక సమస్యలు పరిష్కరించే మాటెలా ఉన్నా తన స్వార్థప్రయోజనాన్ని మాత్రం చక్కగా సాధించుకుంటాడు". అంబేద్కర్ గారు అన్న ఈ మాటల్ని మోహన్ రావు పదే పదే చెబుతుండేవాడు. ఏ వ్యక్తి యే పార్టీ యెందుకు పెట్టాడో ఆలోచించండి. అనేవాడు.

"సాంఘిక పరిణామం జరగందే రాజకీయ పరిణామం జరుగదు. మన విజయం మన సంఘటిత శక్తిపైనే ఆధారపడి ఉన్నది" - అన్న అంబేద్కర్ గారి సూక్తుల్ని మాటిమాటికి వల్లించేవాడు.

హరిజనుల్లో ఒక సాంఘిక చైతన్యం నిర్మాణం చేయడానికి సంయమనంతో, దీక్షతో, పట్టుదలతో నిరంతరం కృషిచేస్తున్నాడు మందికొండ మోహనరావు. ఆయనో కాంతిపుంజం.

కాని ఆ కాంతిపుంజం వెలుతురుల్ని నక్సలైట్లు కప్పేశారు. శరీరాన్ని నరికేశారు, ప్రాణ జ్యోతిని ఆర్పేశారు.

ఆ దురదృష్ట దినం 6 సెప్టెంబర్-1984 ఉదయం 9:30 గం.కు హంటర్ రోడ్డుగుండా కోర్టుకు వస్తున్నాడు మోహనరావు. నక్సలైట్ల సెంట్రల్ ఆర్గనైజింగ్ కిమిటీ సభ్యుడైన 'పులి అంజయ్య' నాయకత్వంలో ఎనిమిదిమంది మోహనరావు మీద దాడిచేసి నడిరోడ్డులో క్రూరాతి క్రూరంగా హత్య చేశారు. హత్యకు ముందు. రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి ఆయిన 'శ్యాం' కోర్టుకు ఏ దారిగుండా మోహన్ రావు వెళుతున్నాడో కనుక్కొని వెళ్లాడు. హత్య జరిగిన తర్వాత పది ప్రాంతాలలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రచారం చేశారు. అలాగే మీభర్త హంటర్ రోడ్డులో పడిఉన్నాడని శ్రీమతి సుగుణకు చెప్పి వెళ్లారు.

అఖిలభారత అనుసూచి జాతిపరిషత్ ఉపాధ్యక్షుడు, హరిజనుల సముద్ధరణకూ సంక్షేమానికి పాటుబడడం అందులోనే పుట్టిన తన బాధ్యతగా “భావించి నిరంతరం పరిశ్రమించిన పారిశ్రామికుడు మందికొండ మోహన్ రావును నక్సలైట్లు ఎందుకు హత్య చేశారు ?

అతను భూస్వామి కాడే! ధనస్వామి కాడే! నక్సలైట్లలో కొంతకాలంపాటు తిరిగి బయటకు వచ్చినవాడు కాడే! నక్సలైట్ల సీక్రెటు స్థావరాలు తెలిసినవాడు కాడే! పోలీసు ఇన్ఫార్మర్ గా పనిచేసిన వాడు కాడే? ఏదో ఒక రాజకీయపార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాడే! నక్సలైట్లలోని 24 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపును అభిమానించి మరో గ్రూపును వ్యతిరేకించేవాడు కాడే! ఆవినీతి మార్గాన్ని అనుసరిస్తున్నవాడు కాడే! చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే కుహనా వ్యక్తిత్వం ఉన్నవాడు కాడే!

అతడు కేవలం హరిజన సంక్షేమానికి, హరిజన సముద్ధరణకు పాటుబడుతున్నవాడు !!!

అదే అతని పాలిటి మృత్యువయ్యింది. డబ్బు సంపాదించుకోడానికి, తుపాకి గొట్టం ద్వారా అధికారం సంపాదించుకోడానికి నక్సలైట్లు, వారి నాయకులు, వారి సిద్ధాంత ప్రవక్తలూ తమనెలా వాడుకుంటున్నారో చాలా గ్రామాల్లోని హరిజనులకు అర్థమైంది. వరవరరావు, బాలగోపాల్ మొదలైనవారు నక్సలైటు సిద్ధాంత ప్రవక్తలు కాగా కొండపల్లి సీతారాంరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, పైలా వాసుదేవరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రవూఫ్ తదితరులు కార్య క్షేత్రంలో అధినేతలుగా వ్యవహరిస్తుంటారు. వీళ్ళంతా ఎవరు! వీళ్ళెక్కడి నుండి వచ్చారు! పుట్టుపూర్వోత్తరాలేంటి! వీళ్ళ సంపాదన లెక్కడికిపోతున్నాయి. సంసారాలెక్కడెక్కడ ఉన్నాయి. వీళ్ళ సంతానం ఏమేం చేస్తుంది, వీళ్ళకు పూర్వపు ఆస్తిపాస్తులేంటి! ఇప్పుడున్న ఆస్తిపాస్తులేంటి! ఈ ఆస్తులు ఎవరెవరి పేర్లమీద ఉన్నాయి! వీళ్ళు హరిజనులనే అధికంగా ఆకర్షించడానికి యెందుకు ప్రయత్నిస్తున్నారు!

ప్రశ్నల తేనెతుట్టె జుబ్బున లేచింది. మబ్బులు విచ్చిపోడం మొదలెట్టాయి. వరంగల్ చుట్టుపక్కల్లో నక్సలైట్ల ఉక్కుపిడికిళ్ళలో ఉన్న అనేక గ్రామాల హరిజనులు వారికి దూరం కాసాగారు. తమకు కంచుకోటలనుకున్న గ్రామాల్ని ఒక సాత్త్విక శక్తి జయిస్తోంది. ఆ సాత్త్వికశక్తి యొక్క మూలాన్ని విచ్ఛేదం చేయాలి. ప్రణాళిక వేయబడింది.

కత్తులు పొడిచాయి-గొడ్డళ్ళు నరికాయి.

అజ్ఞానపు చీకట్లు అలుముకున్న జనారణ్యంలో ఒక చావుకేక. మందికొండ మోహనరావు వెలుగురేఖ. వందేళ్ల కమ్యునిజం. (నన్నపనేని రాజశేఖర్).

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments