రాజమాత ( ahilyabayi holkar ) అహల్యాబాయి హోల్కర్ త్రి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని స్మరించుకుందాం: మహారాష్ట్ర ప్రాంతంలోని...
రాజమాత ( ahilyabayi holkar ) అహల్యాబాయి హోల్కర్ త్రి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని స్మరించుకుందాం: మహారాష్ట్ర ప్రాంతంలోని పాథర్టీ గ్రామంలో అహల్యాబాయి 1735లో జన్మించింది. ఆమె తండ్రి పేరు మన్కోజీ సింధియా. ఆయనో సాధారణ గృహస్థు. ఒకసారి ఇండోర్ మహారాజు మల్హారరావు హోల్కర్ పూణే వెళ్తూ యాదృచ్చికంగా ఈ గ్రామంలోని శివాలయంలో విడిది చేశాడు. అక్కడ ఈ సుగుణవంతురాలైన బాలికను చూశాడు. ఆమె ఎంతగానో నచ్చడంవల్ల మన్కోజీ సింధియాను పిలిపించి "నేను ఈమెను నా కోడలిగా చేసుకోదలచాను” అని చెప్పాడు. మన్కోజీ కూడా అందుకు సిద్ధంగానే ఉండటంతో మల్హారరావు ఆమెను ఇండోర్ తీసుకువెళ్లి తన కొడుకు ఖండేరావుతో ఆడంబరంగా వివాహం జరిపించాడు.
అహల్యాబాయి పెద్ద అందగత్తె కాకపోయినా ఆమె శరీర వర్ణం చామనచాయలో ఉండి నిండుగా కనిపించేది. అయితే, ఆమెలో కనిపించిన కొన్ని లక్షణాలనుబట్టి మల్హారరావు అహల్యను తన కోడలిని చేసుకున్నాడు. అత్తగారింట అడుగుపెడుతూనే అహల్యాబాయి భర్తకు, అత్తమామలకు సేవ చేయడం ప్రారంభించింది. తన సేవలతో అత్తమామలకు బాగా సన్నిహతురాలైంది. ఇంటి పనులు ఎంత సమర్థంగా చేసేదంటే మల్హారరావు రాజధాని నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని రాజకార్యాలను కూడా ఆమెకు అప్పగించేవాడు. తాను తిరిగొచ్చేసరికి అన్ని పనులనూ అహల్యాబాయి చక్కగా పూర్తిచేయడం చూసి మామగారు సంతోషంతో పొంగిపోయేవాడు. కొంతకాలానికి అహల్యాబాయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో కొడుకు పేరు మాలీరావు కాగా, కుమార్తె పేరు ముక్తాబాయి. ఈ విధంగా అహల్యాబాయి అత్తమామలు, భర్త, పిల్లలతో తొమ్మిదేళ్లపాటు హాయిగా జీవించింది. ఈ తొమ్మిదేళ్లు మాత్రమే ఆమె జీవితంలో సంతోష దినాలు కావడం గమనార్హం. ఆ తర్వాత ఒక దానివెంట మరొకటిగా కష్టాలు ఆమెను వెన్నాడాయి. అయినప్పటికీ ఈ బాధలను దిగమింగి తన కర్తవ్యాన్ని ధైర్యసాహసాలతో ఎంతో సమర్థంగా నెరవేర్చింది. ఈ కారణంగానే అహల్యాబాయి పేరు కూడా భారత సాహస నారీమణుల జాబితాలో చేరి అమరమైంది.ఆ రోజుల్లో మరాఠాల పాలన నడుస్తుండగా పీష్వా నాయత్వంలో రాజ్యం బాగా విస్తరించ సాగింది. భారతదేశంలోని అన్ని రాజ్యాల నుంచి మరాఠా పాలకులు కప్పం వసూలు చేసేవారు. అయితే, భరత్పూర్ సమీపంలోని జాట్ రాజులు కప్పం కట్టేందుకు నిరాకరించడంతో పీష్వా ఆజ్ఞ మేరకు మల్హారరావు తన కొడుకు ఖండేరావు సమేతంగా భరత్పూర్ను చుట్టుముట్టాడు. ఆ మేరకు దీగ్ సమీపంలోని కుంభేర్ దుర్గాన్ని వారు ముట్టడించారు. ఈ యుద్ధంలో ఖండేరావు మరణించగా, ఆ సమాచారం విన్న మల్హారరావు యుద్ధక్షేత్రంలోనే మూర్ఛపోయాడు. వీర సిపాయీలు అతడిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత అహల్యాబాయి పతీవియోగంతో దుఃఖించడం చూసిన ఆయన, పుత్ర వియోగ బాధను మరచి, కోడలికి ధైర్యం చెప్పాడు. “తల్లీ నువ్వే నాకు తోడు... నువ్వు కూడా లేకపోతే నేను ఈ రాజ్యభారాన్ని ఎలా మోయగలనమ్మా?" అంటూ నచ్చజెప్పి భర్త మృతదేహంతో సహగమనం చేయకుండా అహల్యాబాయిని ఆపగలిగాడు. ఆయన మాటలతో తేరుకున్న ఆమె, భర్తతో చితిలో కాలిపోవడంకన్నా ప్రజలకు సేవ చేయడం పుణ్యకార్యంగా భావించింది. మామగారి ఆజ్ఞమేరకు రాచకార్యాలను చక్కబెట్టడం ప్రారంభించింది.
పానిపట్ యుద్ధంలో పరాజయంతో ఉత్తర భారతంలో మరాఠాల ప్రభావం క్షీణిస్తూ వచ్చింది. దీంతో తమ ప్రాభవ పునరుద్ధరణ కోసం వారు ఉత్తర భారతదేశం వైపు మళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ దళంలో మల్హారరావు కూడా ఉన్నాడు. కానీ, కొడుకు మరణంవల్ల అప్పటికే చాలా దుఃఖంలో ఉన్న ఆయన, గ్వాలియర్ వద్ద ఆలంపురాలు ఆగినపుడు తీవ్రమైన చెవి నొప్పితో కన్నుమూశాడు. ఒకవైపు భర్త మరణం కుంగదీయగా, కొద్దికాలమైనా గడవకుండానే సంభవించిన మామగారి మృతి కలవరపెట్టినా అహల్యాబాయి ఆ పరిస్థితిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంది. అక్కడ 30వేల రూపాయల వ్యయంతో మామగారి పేరిట ధర్మశాలను నిర్మించింది.
అహల్యాబాయి కుమారుడు మాలీరావు సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు చాలా క్రూరుడు, దుష్టుడు. ప్రజలతో అత్యంత కఠినంగా వ్యవహరించేవాడు. దాంతో అహల్యాబాయి చాలా బాధపడేది. అయితే, తొమ్మిది నెలల పాలన తర్వాత మాలీరావు కూడా మరణించాడు.. అహల్యాబాయి అన్ని దుఃఖాలనూ దిగమింగుకుని, మామగారు తనకు అప్పగించిన ప్రజా సేవా కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. పీష్వా సలహా మేరకు గంగాధరరావును తన మంత్రిగా నియమించింది. కానీ, గంగాధర రావు స్వార్ధపరుడు, కుటిలుడు. తనను ఆ పదవిలో నియమించిన అహల్యాబాయినే ఇక విశ్రాంతి తీసుకుని, దైవసేవలో కాలం గడపాల్సిందిగా సూచించాడు. ఎవరైనా బాలుణ్ని దత్తత తీసుకుని రాజ్యాన్ని అతడికి అప్పగించమని సలహా ఇచ్చాడు. అహల్యాబాయి అందుకు అంగీకరించలేదు. పాలనలో ఎవరైతే బాగా సమర్థత ప్రదర్శిస్తారో వారికే తన మరణానంతరం రాజ్యాన్ని అప్పగించాలన్నది ఆమె నిర్ణయం. దీంతో పీష్వా పినతండ్రి రఘునాథరావును ఇండోర్ మీద దాడికి గంగాధరరావు ఉసిగొలిపాడు. మొత్తం మీద వీరిద్దరి లక్ష్యం రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడమే. దీంతో అహల్యాబాయి తన సైన్యాధికారులతోపాటు ప్రతి గ్రామపెద్దను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అహల్యాబాయి పాలన వ్యవహారాలు చూసుకోవాలని, రఘునాథరావు దాడిచేస్తే పోరాడాలని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అహల్యాబాయి సేనాపతిగా ఉన్న తుకొజీరావ్ హోల్కర్ సైన్యంతో కృష్ణా నదీతీరాన తిష్టవేశాడు. నదికి అవతలి ఒడ్డున రఘునాథరావు సేనలున్నాయి. బాగా ఆలోచించుకుని నది దాటి రావాల్సిందిగా తుకోజీరావ్ అతడికి సందేశం పంపాడు. దీంతో రఘునాథరావు భయపడి వెనుదిరిగాడు.
ఒక కష్టం తప్పింది... కానీ, రాజ్యానికి మరొక సమస్య వచ్చిపడింది. గ్రామాల్లో, నగరాల్లో ప్రజలకు దొంగలు, దోపిడీదారుల బెడద పెరిగిపోయింది. అహల్యాబాయి మరో సమావేశం ఏర్పాటు చేసి, దుండగుల బారినుంచి ప్రజలను రక్షించడంపై చర్చించింది. అంతేకాకుండా తన రాజ్యంలోని యువకుడెవరైనా దుండగుల పీచమణచి ప్రజలకు రక్షణ కల్పించగలిగితే అతడికి తన కుమార్తె ముక్తాబాయినిచ్చి వివాహం చేస్తానని కూడా ఆ వీరనారి సభాముఖంగా ప్రకటించింది. అప్పుడు ఒక మరాఠా నవ యువకుడు లేచి “నాకు సైనికులను, తగినంత ధనాన్ని సమకూరిస్తే దుండగులను అంతం చేస్తాను” అని ప్రతిపాదించాడు. అహల్యాబాయి అతడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ నవయువకుడి పేరు యశ్వంత్ రావు ఫణశే. అతడు తానిచ్చిన మాట ప్రకారం రెండేళ్ల వ్యవధిలో పరిస్థితిని చక్కదిద్దాడు. దాంతో తన వాగ్దానం మేరకు అహల్యాబాయి అతడితో తన కుమార్తె ముక్తాబాయికి వివాహం జరిపించింది.
ఇండోర్లో దొంగతనాలు, దోపిడీల బెడద తగ్గసాగింది. దీంతో ఇతర రాజ్యాల నుంచి సంపన్నులు, షావుకారులు, వ్యాపారులు ఇండోర్లో నివాసాలు ఏర్పరచుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా ఇండోర్ ఓ పెద్ద నగరంగా విస్తరించడంతోపాటు వ్యాపార లావాదేవీలు కూడా బాగా పెరిగాయి. రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించసాగారు. ఇక అహల్యాబాయి రాజ్యాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. రాజ్యమంతటా పెద్ద పెద్ద రోడ్లు, ఆలయాలు, ధర్మశాలలు కట్టించడంతోపాటు బావులు తవ్వించింది. తన రాజ్యం వెలుపలగల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కూడా ఆలయాలు, ధర్మశాలలు నిర్మించింది. తమ రాజ్యంలోనివారే కాకుండా ఇతర రాజ్యాలవారికీ వసతులు కల్పించింది. వేసవిలో శ్రామికులు, జంతువుల దాహం తీర్చేందుకు వివిధ ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించేది.
అహల్యాబాయి రాజ్యంలో సంతానం లేనివారు ఇతరుల పిల్లలను దత్తత తీసుకోవచ్చు. తమ ధనాన్ని తమకు ఇష్టమున్నవారికి ఇచ్చుకోవచ్చు. వితంతు మహిళలు తమ భర్తకు చెందిన ధనాన్ని పొందవచ్చు. ఒక సందర్భంలో దేవీచంద్ అనే ధనవంతుడైన షావుకారు మరణించాడు. రాజ్యంలోని చట్టాల మేరకు అతడి ధనాన్ని ఖజానాకు జమ చేయాలని తుకోజీరావు భావించాడు. అయితే, వితంతువైన దేవీచంద్ భార్య తన భర్త సంపద మొత్తం తనకే చెందాలని అహల్యాబాయిని ఆశ్రయించింది. దీంతో తుకోజీరావును వారించి, ఆ సంపద మొత్తాన్నీ దేవీచంద్ భార్యకు ఇప్పించింది అహల్యాబాయి. ఆమె న్యాయపాలనకు సంబంధించి ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. ఆమె చాలా సాధారణ జీవనం గడిపింది. అవసరాల మేరకు మినహా అదనంగా ఒక్క పైసా కూడా తనకోసం ఖర్చు చేసేది కాదు. కోశాగారానికి చేరే సొమ్మునంతటినీ ప్రజోపయోగ కార్యక్రమాలకే వినియోగించేది. ఆత్మస్తుతికి, పొగడ్తలకు చాలా దూరంగా ఉండేది. ఓ సారి ఒక బ్రాహ్మణుడు ఆవిడను ప్రశంసిస్తూ పుస్తకం రచించి తీసుకురాగా, అహల్యాబాయి దాన్ని నీళ్లలో పడవేయించింది.
ఇటువంటి పుణ్యమూర్తికి పదేపదే కష్టాలు ఎందుకొస్తాయో అర్థం కాదు భర్త, మామగారు, కుమారుడు ఆమె కళ్లముందే మరణించారు. ఆ తర్వాత అహల్యాబాయి కుమార్తె ముక్తాబాయి పదహారేళ్ల కొడుకు, తనకెంతో ప్రియమైన మనవడు, మరో ఏడాదికి అల్లుడు కన్నుమూశారు. ముక్తాబాయి కూడా తన కుమారుడు, భర్త చనిపోవడంతో కుంగిపోయింది. భర్త మృతదేహంతో సహగమనం చేసేందుకు అహల్యాబాయి అనుమతి కోరింది. అయితే, “తల్లీ ఇప్పుడు నువ్వే నాకు తోడు. నువ్వు కూడా లేకపోతే నేనెలా బతకాలి?" అంటూ వారించింది.
అప్పుడు ముక్తాబాయి- “అమ్మా నువ్వన్నది నిజమే... కానీ, కొంచెం ఆలోచించు. నీవు జీవిత చరమాంకంలో ఉన్నావు. నేను మరికొంత ఎక్కువ కాలం జీవించి ఉంటానేమో! నీ తర్వాత నాకెవరు తోడుంటారు? నా మరణం తర్వాత నువ్వు కొంతకాలం మాత్రమే జీవిస్తావు. కానీ, ఇప్పుడు సహగమనం చేయకపోతే అటుపైన ఎప్పటివరకు జీవిస్తానో, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు" అన్నది.
ఎంత నచ్చజెప్పినా ముక్తాబాయి పట్టు వీడకపోవడంతో కుమార్తె సతీ సహగమనానికి అహల్యాబాయి అనుమతినిచ్చింది. అలా ఆఖరుకు కన్నకూతురు కూడా తన కళ్లముందే ఆహుతైపోవడం చూసి, ఆమెకు కలిగిన దుఃఖాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. చివరకు 60 ఏళ్ల వయసులో అహల్యాబాయి కన్నుమూయగా, అప్పటివరకూ పాలనలో ఆమెకు తోడునీడగా నిలిచిన తుకోజీరావు హోల్కర్ రాజ్యపాలన చేపట్టాడు. ఆ తర్వాత ఆయన ఇండోర్, ప్రయాగ, నాసిక్, గయ, అయోధ్య, మహేశ్వర్ నగరాలలోని ఆలయాల్లో అహల్యాబాయి విగ్రహాలను ఏర్పాటు చేయించాడు. తుకోజీ తర్వాత సింహాసనం అధిష్టించిన ఆయన కుమారుడు యశ్వంతరావు హెూల్కర్ మహేశ్వరంలో అహల్యాబాయి స్మృతిచిహ్నం నిర్మించాడు. దీని నిర్మాణానికి 35 ఏళ్లు పట్టగా అప్పట్లో కోటిన్నర రూపాయలు ఖర్చయ్యాయి. ఈ కట్టడాన్ని మధ్య భారత మధ్యభారత 'తాజ్మహల్'గా పేర్కొనవచ్చు. -నన్నపనేని రాజశేఖర్.
No comments