Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అమ్మ - ప్రతి తల్లి ఒక పరిపూర్ణ శిశువుకు జన్మనివ్వగలిగిన శక్తి కలిగి ఉంటుంది - garba samskar in telugu

అమ్మ  ప్రతి తల్లి ఒక పరిపూర్ణ శిశువుకు జన్మనివ్వగలిగిన శక్తి కలిగి ఉంటుంది. శిశువు పరిపూర్ణ వికాసానికి కావలసిన బీజం తల్లి గర్భంల...


అమ్మ 

ప్రతి తల్లి ఒక పరిపూర్ణ శిశువుకు జన్మనివ్వగలిగిన శక్తి కలిగి ఉంటుంది. శిశువు పరిపూర్ణ వికాసానికి కావలసిన బీజం తల్లి గర్భంలో ఉన్నప్పుడే పడాలి. బిడ్డ శారీరకంగా తరువాత చక్కగా ఎదగాలంటే తల్లి చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. బిడ్డ తెలివైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటే తల్లి చక్కటి ఆలోచనలు, భావాలను గ్రహించాలి. తల్లికున్న సత్సంస్కారమే బిడ్డ పాలిటి వరం అవుతుంది.

తల్లి ఆలోచనలు, చేసే పనులు, మాట్లాడే మాటలు, మానసిక స్థితి - ఇవన్నీ కూడా శిశువును ప్రభావితం చేస్తాయి.

"శిశువు ప్రపంచంలోకి రాకముందు ఉన్న పరిస్థితులే తరువాత శిశువు వ్యక్తిత్వాన్ని, గుణసంపదను నిర్ణయిస్తాయి. మంచి విద్యాశాలల్లో చదవడం కన్నా, వేలకొద్ది గ్రంథాలను బట్టీపట్టడం కన్నా, ప్రపంచంలోని మేధావులందరి సాంగత్యం కలిగి ఉండటం కన్నా పుట్టుకతోనే ఉత్తమ సంస్కారంతో పుట్టడం మేలు", అంటారు స్వామి వివేకానంద. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు తల్లి ద్వారా ఉత్తమ సంస్కారాన్ని పొందితే మేలు, పై పేర్కొన్న వాటన్నిటితో పొందే వాటికన్న వందరెట్లు ఎక్కువ మేలు ఉంటుంది.

ఈ రోజు ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేనటువంటి స్థాయిలో జీవితం ఒత్తిడితో కూడుకుని ఉంది. సమస్యలను ఎదుర్కోలేక మనిషి సతమతమవుతున్నాడు. నైతిక జీవనాన్ని అలవరచుకొని ధార్మిక విలువలను పరిరక్షించుకో లేకపోతున్నాడు. బిడ్డ పుట్టుకతోనే సంస్కార సిరిని, జ్ఞానసంపదను అందిపుచ్చుకునేలా చేయగలిగితే జీవితం సాఫీగా సాగుతుంది. పుట్టిన తరువాత చదువు ద్వారా విలువలు, మంచి సంస్కారాలను పెంపొందించుకోవడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. మనిషి పుట్టుకతోనే దైవీసంపదతో గానీ, అసురసంపదతో గానీ పుడతాడంటారు స్వామి వివేకానంద. ప్రార్థనతో పుడితే దైవం, ప్రార్థన లేకుండా పుడితే దానవుడిగా అవతరిస్తాడని ఆయన వాక్కు.

గర్భస్థ శిశువులు చాలా ఎరుకతో ఉంటారు. గర్భంలో ఉన్న బిడ్డ కేవలం ఒక అచేతనమైన మాంసఖండం కాదు. చుట్టూ ఉండే పరిస్థితులు ముఖ్యంగా తల్లి ఆలోచనలు, భావోద్వేగాలు బిడ్డను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. నిజానికి తల్లుల భావసంపద శిశువులకు దాచిపెట్టబడిన నిధి లాంటిది. గర్భములో పిండముగా ఉన్నపుడే జ్ఞానపరమైన అభివృద్ధి జరుగుతుంది. శిశువును మంచి వ్యక్తిగా తయారు చేయటం, కావలసిన విధంగా పెంచటం అంతా తల్లి చేతిలోనే ఉంటుంది. బిడ్డ సమగ్ర వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి తల్లి ఆలోచనలు, ఆశలు, భావాలు చాలా విధాలుగా తోడ్పాటు కలుగజేస్తాయి. అందువలన బిడ్డ శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా, ఆరోగ్యముగా ఉండాలంటే తల్లి పవిత్రమైన, గొప్పవైన ఆశయాలు కలిగి ఉండాలి.

తల్లి యొక్క భక్తి విశ్వాసాలపైనే శిశువుకు సంక్రమించే సంస్కారం ఆధారపడి ఉంటుంది. ఆ సంస్కారం శిశువు పూర్ణవికాసానికి దోహదపడుతుంది.

తల్లి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఆమెలో ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండరాదు. ఒత్తిడి ఇద్దరికీ.. తల్లికి, బిడ్డకు కూడా మంచిది కాదు. తల్లిలోని నకారాత్మక భావాలు, ఆందోళన శిశువు శారీరక, మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయి.

ఒకవేళ తల్లి మనోశరీరాలపై వ్యతిరిక్త ప్రభావాలు కలిగించే విధంగా పరిసరాలు, ఆహారము, కుటుంబ వ్యవస్థ ఉంటే అవన్నీ గర్భస్థ సమయములో పిండము మీద ప్రభావం చూపి బిడ్డ ఎదుగుదలకు ఆటంకాలౌతాయి. ఈ వ్యతిరిక్తత తొలగించుకోవడానికి తల్లి మధురమైన, మార్దవమైన సంగీతాన్ని వినాలి; సమతుల ఆహారము, యోగాసనాలు శరీరాన్ని చక్కగా ఉంచుతాయి. మనస్సు ప్రశాంతముగా ఉండడానికి ధ్యానము, ప్రార్ధన, మంచి ఆలోచనలు, నిస్వార్ధకర్మలు లాంటి ప్రక్రియలు దోహదపడతాయి.

బిడ్డను కనబోతున్న స్త్రీ ఉత్తమమైన తల్లిగా రూపుదిద్దుకొని గర్భంలో ఉన్న శిశువు సర్వ సద్గుణ సంపన్నుడుగా/సంపన్నురాలిగా పుట్టేటట్లు చేయాలి. గొప్ప మాతృమూర్తుల ద్వారానే గొప్ప సమాజాన్ని నిర్మించటం సాధ్యమవుతుందని స్వామి వివేకానంద నొక్కి వక్కాణించారు. బిడ్డ యొక్క సమగ్ర వికాసం శిశువు గర్భంలో ఉండగా తల్లి నుండి అందిన సంస్కార సంపదపైననే ఆధారపడి ఉంటుంది.

చరిత్రలో ఉన్నతులైన వ్యక్తులను చూసినప్పుడు వారి తల్లులు అందరూ గొప్ప వ్యక్తిత్వము కలిగి ఉన్నవారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది - ఆ తల్లులు దైవంపట్ల భక్తిప్రపత్తులు కలిగినవారు. గర్భస్థ శిశువుకు దైవీసంస్కారమందించగలిగిన తల్లికి మాత్రమే శ్రేష్ఠమైన శిశువులు జన్మిస్తారు. శిశువు తన గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని పట్ల కొద్దిగా భక్తి కలిగి, ప్రార్థనామయ జీవితాన్ని గడిపితే ఆ స్త్రీ సంస్కారవంతులైన బిడ్డలకు తల్లి అవగలుగుతుంది.

ఉద్యోగాలతో తీరుబడిలేకుండా ఉండి, ఉరుకుల పరుగుల మధ్యలో యాంత్రికంగా బిడ్డలను కని, తరువాత వారిని మంచి పాఠశాలల్లో వేసి బాగా చదువు చెప్పించాలని తపన పడటంకన్నా తల్లి భగవద్భక్తి కలిగి, ప్రార్థన, జపంలాంటి అనుష్ఠానాలతో ఉత్తమ సంతానానికి జన్మనివ్వటం మేలు. అలా తల్లి చేసిన దైవప్రార్థనల ఫలంగా పుట్టిన శిశువులు మాత్రమే అద్భుతమైన సామర్థ్యాన్ని, పవిత్రతను కలిగి అన్నింటినీ సాధించగలుగుతారు. వారు ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొని జీవితంలో పైకి రాగలుగుతారు.

గర్భిణీ స్త్రీ ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉండాలనేది చాలా ముఖ్యం. ఆమె సాత్వికమైన, పవిత్రమైన, దైవపరమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లైతే శిశువు కూడా సాత్వికంగా పుడుతుంది. శిశువు తల్లిదండ్రులు శారీరకంగా బలహీనులైనప్పటికీ, విద్యావిహీనులైనప్పటికీ ఫర్వాలేదు. తల్లిదండ్రులు ఆధ్యాత్మిక సంస్కృతి కల్గిన వారైతే వారు మంచి శిశువుకు జన్మనివ్వగలుగుతారు.

garba samskar
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments