Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రార్థన - గురుబ్రహ్మ గురుర్విష్ణు: - Prarthana Prayer - guru brahma mantra benefits

ప్రార్థన గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: భావం : గురువే బ్రహ్మ, గురు...


ప్రార్థన

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:

భావం: గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువు స్సాక్షాత్ పరబ్రహ్మయే, అట్టి గురువునకు నమస్కారము. గురువు అనే పదమునకు మొట్టమొదట అర్థము తెలుసుకోవాలి. బోధించువాడు కాదు గురువు, మంత్రమును ఉపదేశించువాడు కాదు గురువు. అజ్ఞానమును నిర్మూలించేవాడే గురువు. ( గురు - గు - అజ్ఞానము ; రు - నిర్మూలించేవాడు ) ఇంక 'గు' కారము గుణాతీత తత్వము "రు" కారము రూప రహితముc- గుణము, రూపము లేనివాడు దైవము ఒక్కడే కనుక "గురు బ్రహ్మ, గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర: " అన్నారు.

కాలేజీలో ప్రవేశించినపుడు లెక్కల టీచరు, ఫిజిక్స్ టీచరు, కెమిష్ట్రి టీచరు వుంటారు. ఇంత మందిని ఎట్లా పూజించడం అవుతుంది? అందుకే ఉన్నది ఒక్కడే గురువు అతడే దైవము. మిగతావారంతా టీచర్సు. గురువు తన గురిని చూపించాలి. గురి అనగా ఆత్మతత్వములో చేర్చాలి అదే గురి. తనను తాను తెలుసుకున్న వాడే నిజమైన గురువు. గురువు శిష్యునిలో కూడా దైవమును దర్శించును. శుక్రాచార్యులు, ద్రోణాచార్యులు నిజ గురువులు కారు, దైవమునకు దానము చేస్తానంటే వద్దని చెప్పేవాడు గురువా? ఇక ద్రోణాచార్యులు, మీకు మాత్రమే ఏకైక గురువును, నా శక్తి అంతా నీకే అర్పితము చేస్తాను అని అర్జునుడుకి మాట ఇస్తాడు.

ఒక సమయంలో ఏకలవ్యుడు వచ్చి స్వామి నాకు విద్య నేర్పమని ప్రార్థిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నేను అర్జునుని గురువును, వేరొకరికి నేర్పించను అని అన్నాడు. గురువు మీద శ్రద్ద, భక్తితో విలువిద్య నేర్చుకున్నాడు. ఆ అద్భుతమైన ఏకలవ్యుని విద్యను చూసి, అర్జునుని గొప్పవానిగా చేయుట కొరకు బొటనా వేలును ఇవ్వమ్మని ఏకలవ్యుని గురుదక్షిణ అడిగెను. ఇది గురువు చేసే పని కాదు. వీరందరూ వ్యవహారిక గురువులే కాని ఆత్మసంబంధమైన గురువులు కారు. అందరికి గురువు ఒక్కడే దైవము. అన్ని దేశముల వారికి దైవము ఒక్కడే. పేర్లు, రూపములు వేరు. మూలాధార తత్వము ఒక్కటే అది గుర్తించాలి.

స్వీట్స్ గులాబ్ జాం, కోవా , లడ్డు ఇలా ఎన్నెన్నో వున్నాయి. అన్నింటిలో ఉన్నది చక్కెర. "మర్మమెరిగిన మరు నిముషములో మనసే వారికి గురువు" అని అన్నారు. దైవము మీ హృదయము నందే వున్నట్లు విశ్వసించాలి. సర్వము నాకు భగవంతుడే అతనే నిజమైన గురువు. ప్రేమను మించిన గురుత్వం లేదు, ప్రేమను మించిన దైవత్వం లేదు.
 
ఉపమన్యుడి కథపూర్వం ధౌమ్యుడు అనే ఋషి దగ్గర శిష్యుడిగా చారడానికి ఉపమన్యుడు  వచ్చాడు. భారీ శరీరం గల ఈ పిల్లవాడిని చూసి గురువు జాలి పడ్డాడు. ఈ పిల్లవాడికి శిష్యుడికి వుండవలసిన లక్షణాలు ఏమీ లేవు. చదువు మీద శ్రద్ధ లేదు. వేదశాస్త్రాలు అర్థం కావు. జ్ఞాపక శక్తి తక్కువ. తిండి మీద ధ్యాస ఎక్కువ. అయితే ఒక్క సుగుణం ఉంది. అది గురువు గారి మీద గౌరవం.
ధౌమ్యుడు ఎంతో సౌమ్యుడు. ఉపమన్యుడిని ఏ రకంగానైనా దారికి తీసుకురావాలనుకున్నాడు. ప్రేమగా దగ్గరికి చేర్చుకున్నాడు. ఆప్యాయంతో ఆదరించాడు. గురువు ప్రేమాభిమానాలు  ఉపమన్యుడిని ఆకర్షించాయి. గురువు కోసం ఏదైనా చేయటనికి సిద్దమే అన్నట్లు తయారయ్యాడు . గురువుగారికి ఇది బాగా అర్థం అయ్యింది. ఉపమన్యుడుని సరిదిద్దటానికి సరైన సమయం వచ్చిందని తెలుసుకున్నాడు.
 
అసలు ఉపమన్యుడిలో సోమరితనానికి కారణం అతిగా తిండి తినటమేనని గురువు గ్రహించాడు. అమితంగా తినటం వలన తమోగుణం అధికమై ఎప్పుడు సోమరిగా మత్తుగా నిద్రపోతూ దేని పట్లా ఉత్సాహం లేకుండా ఉన్నాడు. కనుక మొదట అతిగా తినటాన్ని అరికట్టాలి అని ఒక ఉపాయం ఆలోచించాడు. ఉపమన్యుడిని పిలిచి ఆశ్రమంలోని గోవులను మేతకు అడవికి తీసుకు వెళ్ళమని, సాయంత్రం చీకటి పడే సమయానికి తీసుకురమ్మని చెప్పాడు. గురుపత్ని ఉపమన్యుడికి మధ్యాహ్నానికి భోజనం మూటకట్టి ఇచ్చింది. ఉపమన్యుడు భోజన ప్రియుడు. ఎప్పుడూ తిండి మీదే ధ్యాస. బాగా తినటం అలవాటు. గోవులను తోలుకుని పోతూనే దారిలోనే ఆ భోజనం కాస్త తినేశాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఆకలేసింది. తను తీసుకు వచ్చిన ఆవులు పాలు పితికి సాయంత్రం వరకు ఆకలేసినప్పుడల్లా తాగేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి.

ధౌమ్యుడికి అనుమానం వచ్చింది. ఉపమన్యుడి శరీరంలో ఏమి మార్పులు కనపడలేదు. కట్టి ఇచ్చిన కొద్ది ఆహారంతో ఎలా ఉంటున్నాడు? ఉపమన్యుడిని పిలిచి "నాయనా! నీకు గురుపత్ని ఇచ్చిన ఆహారం సరిపోతున్నదా? ఎలా ఉంటున్నావు?" అని అడిగాడు. ఉపమన్యుడికి ఒక మంచి లక్షణం ఉంది. గురువుగారితో అబద్దాలు చెప్పడు. తను గోవుల పాలు త్రాగుతున్నట్లు చెప్పేశాడు. "నాయనా! యజమాని అనుమతి లేకుండా ఆవుల పాలు త్రాగవచ్చునా? ఆవులు, వాటి పాలు నీ సొంతం కాదు కదా! అది దొంగతనం అవుతుంది. తప్పు - అని చెప్పాడు. ​ఉపమన్యుడు ఇక ముందు అలా చేయనన్నాడు. ఆ మరునాడు గోవులను తోలుకు వెళ్ళిన ఉపమన్యుడికి ఆకలి వేసింది. రోజూలాగానే భోజనం ముందే తినేశాడు. గురువు గారి మాటలు గుర్తు వచ్చాయి. ఆవుల పాలు తాగకూడదు. ఏం చేయాలి అని ఆలోచించాడు. ​చుట్టూ చూశాడు. దూడలు ఆవులు దగ్గర పాలు త్రాగుతుంటే వాటి నోటి కొసల దగ్గర నుంచి పాలు కారుతున్నాయి. అది చూసి వెంటనే ఆ కారిఫొతున్న పాలను దోసిలితో పట్టుకుని త్రాగాడు, తాను పాలు పిండి త్రాగలేదు కనుక ఇది దొంగతనం కాదు. గురువు ఆజ్ఞను మీరినట్లు కాదు అనుకున్నాడు.
 
ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఉపమన్యుడు ఏ మాత్రం బరువు తగ్గలేదని గురువు గుర్తించాడు. మళ్ళీ ఉపమన్యుడిని పిలిచి 'నాయనా ఇంకా ఆకలి వేస్తున్నదా? ఏం చేస్తున్నావు? ' అని అడిగాడు. ఉపమన్యుడు తాను చేస్తున్న పని చెప్పేశాడు. గురువుగారు "అది తప్పు నాయనా అవి ఎంగిలి పాలు. అంతేకాకుండా ఆ ఎంగిలి పాలు తాగితే ఆ దూడలుకున్న జబ్బులు నీకు వస్తాయి. దాని వల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది నాయనా! అని బుజ్జగించాడు. ఇక అలా చేయనని మాట ఇచ్చాడు ఉపమన్యుడు.
 
మరునాడు మళ్ళీ గోవుల వెంట వెళ్ళిన ఉపమన్యుడికి ఆకలి వేసింది. ఆవుల పాలు పిండితే దొంగతనమంట, దూడల పాలు త్రాగకూడదట అవి ఎంగిలట ఏం చేయాలి? చుట్టూ చూశాడు, ఎదురుగా కాయలతో, పళ్ళతో నిండిన ఒక చెట్టు కనపడింది. అవి ఏమిటో తెలియదు. కానీ ఆకలి వల్ల, ఏదో ఒకటి తినడం అలవాటు కావటం వల్ల, ఆ చెట్టు కాయలు కోసుకుని కడుపు నిండా తినేశాడు. అవి పిచ్చి కాయలు. పాపం ఉపమన్యుడికి కళ్ళు పోయాయి, గ్రుడ్డి వాడైపోయాడు. దారి కనపడక నడుస్తూ ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. "రక్షించండి! రక్షించండి ! అని అరవటం మొదలు పెట్టాడు.
 
సాయంత్రానికి ఆవులు వాటంతట అవే ఆశ్రమానికి తిరిగి వచ్చాయి, కానీ ఉపమన్యుడు తిరిగి రాలేదు. ధౌమ్యుడు మిగిలిన శిష్యులతో ఉపమన్యుడిని వెతుకుతూ అడవిలోనికి వెళ్ళారు. వెతకగా వెతకగా ఒక చోట బావిలోంచి "రక్షించండి" అని అరుస్తున్న ఉపమన్యుడు కనిపించాడు. బయటకు తీసి ఆశ్రమానికి తీసుకు వెళ్ళాడు గురువుగారు. ఉపమన్యుడిని చూసి జాలివేసింది. దగ్గర కూర్చో పెట్టుకుని దేవతల వైద్యుడైన అశ్వనీ దేవతలను ధ్యానించమని మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని నేర్చుకుని ఎంతో శ్రద్ధతో ధ్యానం చేయటం మొదలు పెట్టాడు ఉపమన్యుడు. అతని దీక్ష అందరినీ ఆశ్చర్య పరిచింది. ​అశ్వనీ దేవతలు ప్రత్యక్షమై, ఉపమన్యుడికి దృష్టిని ప్రసాదించారు.​తరువాత ఉపమన్యుడు తన అతి ఆకలి, అతి తిండి ఎంత అనర్థాన్ని తెచ్చిందో తెలుసుకున్నాడు. అతని తిండి అతన్ని భౌతికంగానే కాక, మానసికంగా కూడా అంధత్వాన్ని తెచ్చాయి. అజ్ఞానం, మందబుద్ది అతి తిండి వల్లే కలిగాయి. త్వరలోనే మితాహారంతో ఆరోగ్యాన్ని, తెలివితేటలను పెంచుకున్నాడు. శరిరం అతి లావు తగ్గి చురుకుతనం వచ్చింది.
 
ధౌమ్యుడు బ్రహ్మ స్థానంలో ఉండి ఆ పిల్లవాడిలో ప్రేమను, మంచి బుద్ధిని కలిగించాడు. విష్ణు స్థానంలో ఉండి, తన సలహాలతో మంచి ఆలోచనలను జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. అతనిలో ఉన్న దురలవాట్లను ఈశ్వరుడై నశింపచేశాడు. ఆ విధంగా గురువు త్రిమూర్తుల శక్తులతో ఉపమన్యుడిని ఉత్తమ సంస్కారవంతునిగా, విద్యావంతునిగా తయారు చేశాడు.
 
​ఉపమన్యుడు కథ వలన మనం తెలుకోదగిన అంశాలు:

​1. అతిగా తినకూడదు. అతిగా తినటం పిల్లలకు మందకొడిగా, అనారోగ్యంగా తయారు చేస్తుంది. దాని వల్ల తమోగుణం వస్తుంది. పిల్లలలో గ్రహింపు శక్తి నశిస్తుంది. కాబట్టి శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని మితంగా తినాలి చెప్పాలి.
 
​2. అనుమతి లేకుండా ఇతరుల వస్తువులను తీసుకోవటం, వాడుకోవటం దొంగతనం అవుతుంది. వేటినీ చెప్పకుండా తీసుకోకూడదు.
 
3. ఇతరులు తినగా మిగిలినవి, ఎంగిలివి తినకూడదు. మూతలు పెట్టనివి, ఈగలు వ్రాలినివి తినకూడదు.
 
​4. దురాశ దు:ఖానికి చేటు. దేనికోసమైనా అతిగా ఆశపడకూడదు.
 
5. అతిగా లావుగా వుండటం ఆరోగ్యం కాదు. శరీరం బరువు అతిగా పెరిగి పోకుండా కనిపెట్టి వుండాలి.
 
​6. నిజం చెప్పటం, గురువులను, వాళ్ళ మాటలను గౌరవించటం చాలా మంచి గుణాలు. వీటి వల్లనే ఉపమన్యుడు బాగుపడ్డాడు.
 
7. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అర్థం మరియు వారు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అన్నది కొంచం చెప్పాలి.
 
బ్రహ్మ ఏం చేస్తారు: అందరినీ సృష్టిస్తారు. - మరి గురువు మనలో మంచి గుణాన్ని పుట్టిస్తాడు.
 
విష్ణువు ఏం చేస్తారు: అందరినీ పోషిస్తాడు. - మరి గురువు మనలో మంచి గుణాల్ని, మంచితనాన్ని పెంపొందిస్తాడు.
 
మహేశ్వరుడు ఏం చేస్తారు: అందరినీ లయము చేస్తాడు. - అనగా గురువు శివుని రూపంలో మనలోని చెడును దూరం చేస్తాడు. ఈ విధంగా గురువు మనల్ని ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తారు.
 
​కాబట్టి గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే ఎక్కువైన .............. అని అర్థం.

#Prayer #Prarthana

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments