ప్రార్థన కరాగ్రే వసతే లక్ష్మీ , కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం భావము : కరము అంటే చేయి. వేళ్ళ చివర...
ప్రార్థన
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం
భావము : కరము అంటే చేయి. వేళ్ళ చివర సంపద దేవతయైన (క్రియాశక్తి - లక్ష్మి) నివశించును. అరచేతి మద్యలో విద్యాదేవత అయిన సరస్వతి నివసిస్తుంది. చేతి మొదట పవిత్రమైన ఆలోచనలకు, శుభములకు, శక్తికి దేవత అయిన గౌరి ఉన్నది. అటువంటి పవిత్రమైన ముగ్గురు అమ్మలు ఉన్న చేతిని ఉదయమే దర్శిస్తున్నాము.
భావము : కరము అంటే చేయి. వేళ్ళ చివర సంపద దేవతయైన (క్రియాశక్తి - లక్ష్మి) నివశించును. అరచేతి మద్యలో విద్యాదేవత అయిన సరస్వతి నివసిస్తుంది. చేతి మొదట పవిత్రమైన ఆలోచనలకు, శుభములకు, శక్తికి దేవత అయిన గౌరి ఉన్నది. అటువంటి పవిత్రమైన ముగ్గురు అమ్మలు ఉన్న చేతిని ఉదయమే దర్శిస్తున్నాము.
విశేశాలు : లక్ష్మి, సరస్వతి, పార్వతి మన చేతుల్లోనే ఉన్నారు. భక్తి విశ్వాసాలతో ప్రొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మన చేతులను చూసుకుని ధ్యానిస్తూ ఈ ప్రార్థన చేయాలి. మన పెద్దలు ఏ ప్రార్థన అయినా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి చెప్తారు. మన చేతిలో లక్ష్మి వుంది ఎలా? నీవు పని చేస్తే డబ్బు వస్తుంది. మరి మన చేతిలో లక్ష్మి వున్నట్లే కాదా, మధ్యలో సరస్వతి వుంది. మనము చేయి మధ్యకు వంచి వ్రాస్తుంటాము. చేయి నిటారుగా ఉంచి వ్రాయలేము కదా. కనుక సరస్వతి వుంది. ఇక మూల పార్వతి వుంది అనగా పార్వతి శక్తి. శక్తి లేకుండా మన చేయి పని చేయలేదు.
మనకు ప్రతి నిత్యం ముగ్గురూ కావాలి. ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి, ఆ పని చక్కగా చేయడానికి తెలివి వుండాలి, శక్తి వుండాలి. అందుకే రోజూ ముగ్గురికీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయునపుడు రూపమును కూడా తలుచుకోవాలి. మంచి పనులు చేసేలా ఆశీర్వదించమని కోరాలి. ఇంకా ఈ చేతులతో నీవు మంచి పనులను చేస్తే నీకు మంచి జరుగుతుంది. మంచి పేరు వస్తుంది. మళ్ళీ జన్మ మంచిగా వస్తుంది. దాని కోసం చేతులతో దానం చేయాలి, సేవ చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మానవ సేవయే మాధవ సేవ. సేవ ఎవరికి చేసినా దేవుడికి చేసినట్లే. ఎలా అనగా అందరిలో భగవంతుడు వుంటాడు కాబట్టి.
చేతి వేళ్ళు అన్ని కలిసి పని చేస్తాయి. అంటే అవి మనకు ఐకమత్యం బోదిస్తాయి.
దేవతలు ఉండే స్థలం పవిత్రంగా ఉంచుతాము కదా! అలాగే మన చేతులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దాని వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే లక్ష్మి. గోళ్ళు, చేతులను శుభ్రంగా వుంచుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. లేకపోతే మనం తినే ఆహారం కలుషితమవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే మిగతా సంపదలన్నీ ఒకొకటి అవే వస్తాయి. ఇదే లక్ష్మీ కటాక్షం. ఆరోగ్యంగా ఉంటే క్లాస్ లో పాఠాలు బాగా చదివి తెలివిని, జ్ఞానాన్ని పెంచుకోగలరు. అంటే సరస్వతీ కటాక్షం పొందగలమన్న మాట. భాగ్యం, జ్ఞానం లభించాక విచక్షణా శక్తి పెరిగి, శరీర బలము, సంకల్ప బలము కలుపుకుని అన్నీ మంచి పనులు చేస్తాము. అదే గౌరీ కటాక్షం. ఈ విధంగా మన చేతులలోనే నివసిస్తూ మనల్ని రక్షించే ముగ్గురు తల్లులను భక్తి శ్రద్దలతో ఉదయం లేవగానే ప్రార్థించడం మన ధర్మం.
అందమైన చేతుల కథ:
ఒకసారి దేవుడు తనదూతలలో ఒకరిని పిలిచి, అందరికన్న అందమైన చేతులుగల వ్యక్తిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. 'చిత్తం దేవా' అని వినయంగా నమస్కరించి ఆ దేవదూత భూలోకానికి వచ్చాడు. "అవునూ! అందమైన చేతులంటే, అవి ఎవరికి ఉంటాయి? చాలా చక్కగా, సున్నింతంగా, మెత్తగా ఉన్న చేతులు ఎన్నడూ పని చేయని వారికి కదా ఉంటాయి.! అందంగా అంటే బాగా సెంట్లు, క్రీములు పూసుకుని, గోళ్ళు పెంచుకుని రంగు వేసుకుంటే ఆ చేతులు చాలా బాగుంటాయి. మరి అలాంటి చేతులు ధనవంతులకు కదా ఉంటాయి! అందరిలోకి ధనవంతులు రాజు, రాణీలు కదా. అందులో రాణీగారి చేతులైతే సున్నింతంగా, సుకుమారంగా ఉంటాయి. కాబట్టి రాణీ గారే దేవుడడిగిన వ్యక్తి" అని నిర్ణయించుకుని దూత రాజు గారి అంత:పురమునకు దారి తీశాడు. పగలు రాణీ చేతులు కష్టం అవుతుంది. అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అయితే ఎవరికి తెలియకుండా పని చేసుకోవచ్చును అని నిర్ణయించుకుని అర్థరాత్రి అంత:పురంలో ప్రవేశించాడు దేవదూత. నెమ్మదిగా రాణీగారి పడకగదిలో దూరాడు.
రాణి తన హంసతూలికా తల్పంపై పడుకుని గాఢంగా నిద్రపోతున్నది. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆమె పడకను సమీపించాడు. ఇంతలో చెడ్డవాసన వచ్చింది. "అబ్బ! ఏమిటీ వాసన? ఎక్కడనుంచి వస్తోంది? ఛీ భరించలేని చెడు వాసన; అదిగో రాణి గారి చేతుల నుంచే వస్తుంది. ఇదేమిటి? ఆమె చేతులెంతో బాగుంటాయి అని అనుకున్నానే. ఛీ ఈ చెడువాసన వచ్చే చేతులు గల వ్యక్తిని దేవుని దగ్గరకు ఎలా తీసుకెళ్ళడం?" దేవదూత నిరాశగా వెనక్కి తిరిగాడు. "పోనీ రాజుగారి చేతులు బాగుంటాయోమో" అని రాజు గారి పడకను సమీపించాడు. ఉహూ! లాభం లేదు. ఆయన చేతులూ వాసనే! సరే వరుసగా మంత్రిగారి చేతులూ, సేనాపతి చేతులూ, ఇంకా దేశంలోని ముఖ్యమైన వారివీ, ధనవంతుల చేతులన్నీ పరీక్ష చేయడం పూర్తి చేశాడు. ఏవీ దేవదూతకు నచ్చ లేదు.
పోనీ నిత్యం దైవాన్ని పూజించే వారి చేతులు బాగుంటాయోమోనని దేవాలయానికి వెళ్ళి పూజారి చేతులు పరిక్షించాడు. అవీ బాగా లేవు. "ప్చ్! రాత్రంతా అయిపోతుంది ఒక్కరి చేతులు కూడా దైవానికి సమర్పించే స్థాయిలో లేవు. ఇంక దేవుడిచ్చిన పనిపూర్తి చేయలేకపోతానేమో" అని చింతిస్తూ అలిసిపోయి ఊరి చివర పొలాలకు దగ్గరగా చెట్టు క్రింద కూర్చున్నాడు దేవదూత. అంతలో దూరంగా ఎక్కడినుంచో పొలాల మధ్య నుంచి ఒక మంచి పరిమళం వచ్చింది. "అబ్బ! ఎంత మంచి వాసన! ఎక్కడ నుంచి వస్తుందబ్బా!" అని లేచి ఆ వైపుగా వెళ్ళాడు. పొలాల మధ్యలో ఒక పూరి గుడిసె కనబడింది. దానిలో చింకి చాపపైన ఒక రైతు పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. అతని చేతులు ధగ ధగ వింత తేజస్సుతో మెరిసి పోతున్నాయి. ఆ చేతులనుండే మంచి సుగంధం వస్తోంది.
"ఓహో! ఇతడన్న మాట! దైవం తీసుకురమ్మన్న మనిషి" అని అనుకుని దూత ఆ రైతుని తీసుకుని దైవం దగ్గరకు వెళ్ళాడు. దేవుడు ఆ వ్యక్తిని చూడగానే సంతోషించి "భేష్! సరైన వ్యక్తిని తీసుకువచ్చావే!" అని దూతను మెచ్చుకున్నాడు. "దేవా! నాకిది అర్థం కాలేదు. ఎన్నడూ ఏ కష్టమూ ఎరుగని, సుగంధ పరిమళాలు పూసుకుని ఉన్న రాణి గారి చేతులు చెడువాసన కొట్టాయి.
ధనవంతుల చేతులన్నీ చెడు వాసనే వేశాయి. చివరికి పూజారి చేతులు కూడా అంతే. కానీ ఈ రైతు చేతులు కష్టం చేసి బండబారి ఉన్నాయి. అయినా ఇవి తేజోవంతంగా మెరుస్తూ, పరిమళంతో ఉన్నాయి. ఎదేమి వింత!" అని అడిగాడు దూత.
"పిచ్చివాడా! భగవంతుడు చూసేది పై మెరుగులు కాదు. చేతులను ఇచ్చినదెందుకు! వాటికి సెంట్లు పూసి, గోళ్ళను పెంచి రంగు వేసి అలంకరించుకుని చూసి మురిసిపోవడానికా? కాదు. కాదు. భగవంతుడు చేతులను పనిచేయడానికిచ్చాడు. మంచి పనులు చేయడానికి, ఇతరులకు సేవలు చేయడానికి, భగవంతుని పుజించడానికి, నమస్కరించటానికి చేతులను ఉపయోగించాలి. ఈ రైతు తన చేతులను పుర్తిగా మంచిపనులకు ఉపయోగించాడు. పగలంతా కష్టం చేసి, పంటలు పండించి, ఆ పండిన పంటలో బీదసాదలకు దానం చేయగా మిగిలినది తన కోసం ఉపయోగించాడు. దీనులకు సేవ చేశాడు. ప్రతి రోజు దైవానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు. రాణి, రాజు ఇతరులతో సేవలు చేయించుకుని తమ చేతులను ఏ విధంగానూ ఉపయోగించలేక పోయారు. మామూలు దృష్టికి వారు చేతులు అందంగా అలకరింపబడినవిగా కనబడినా, దైవానికి మాత్రం అవి ఇష్టం లేదు. పూజారి కూడా త్రికరణ శుద్ధిగా దైవాన్ని పుజించలేదు. ప్రజలిచ్చే ధనానికి ఆశించి పూజలు చేస్తున్నాడు. అందుకే అతని చేతులు కూడా చెడు వాసన వచ్చాయి. అర్థం అయిందా?" అన్నాడు దేవుడు.
దూత, "దేవా! ఎంత సత్యం యిది! నోటితో నామస్మరణ, చేతితో మానవ సేవ చేస్తే, నీ దగ్గరికి సులభంగా చేరగలం అన్నమాట. ధన్యుడిని స్వామీ! " అని ఆనందంతో నమస్కరించాడు.
చుశారా! బాలలూ! చేతులకెంత గొప్పతనము ఉందో! వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాదు. ఆ చేతుల నిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి కార్యాలకు ఉపయోగించాలి.
మనకు స్వామి ఎపుడు చెపుతారు. నోటితో నామస్మరణ, చేతులతో దీనజన సేవ చేయండి అని. కనుక చేతులను పరిశుభ్రంగా వుంచుకోవాలి. మన పనులను మనమే చేసుకోవాలి. దేవతలు వుండే స్థలము మనము పవిత్రంగా వుంచుతాము. కనుక మన చేతులలో లక్ష్మి, సరస్వతి, పార్వతి వున్నారు కనుక మన చేతులను పవిత్రంగా, పరిశుభ్రమగా ఉంచుకోవాలి. మంచి పనులే చేయాలి. మన చేతులలో నివసిస్తూ, మనలను రక్షించే ముగ్గురు తల్లులను భక్తి, శ్రద్ధలతో ఉదయం లేవగానే ప్రార్థిచడం మన ధర్మం.
No comments