యువతీ యువకులు వివాహం చేసుకునే ముందు వివాహం యొక్క ఆదర్శం తెలుసుకోవటం చాలా అవసరం. అసలు ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నారు. దీని లక్ష్య...
ఈ జ్ఞానాన్ని పిల్లలు తల్లితండ్రుల దగ్గర నుండి, స్కూల్లో టీచర్ల దగ్గర నుండి పొందాలి. ఇందువలన భవిష్యత్తులో వీరి వైవాహిక జీవితాలు ఆరోగ్యకరంగా, ఆనందమయంగా ప్రయోజనాత్మ కంగా, ఏకీభావంతో ఉంటాయి. సాధారణంగా వివాహమంటే జీవితం పరిపూర్ణం కావటానికి, వంశవృద్ధి కోసం జాతి మనుగడ కోసం జరిగే స్త్రీపురుమల అనుబంధం అని అభిప్రాయం. కానీ అది ఎంత గురుతరమైన భాధ్యతో వాళ్ళకి తెలియదు.
భూమి మీద ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చి మానవతకు మేలు చేసి, పరిపూర్ణమయిన జాతిగా పురోగమింప జేయగల ఉదాత్తమయిన, ఉన్నతమయిన ఉనికిని తీసుకురావటమే. అంతేకానీ మరొక ధ్యేయంతో బిడ్డను కనటం కాదు. కుందేలు పిల్లల్ని పెట్టినట్టుగా, యాంత్రికంగా సహజప్రవృత్తి ననుసరించి ఈ భూమి మీదకు బిడ్డను తీసుకురావటం ఖచ్చితంగా మాతృత్వం కాదు. నిజ మయిన మాతృత్వం అంటే జాగరూకతతో, చేతనతో ఒక ఉనికిని సృష్టించటం.
తన బిడ్డలందరికీ ఒక ప్రశాంతి, సామరస్యత, ప్రగతి, సౌభాగ్యాలు నిండిన కొత్తయుగాన్ని ఆవిష్కరించగల ఒక వినూత్న మానవజాతి కోసం ఈ పుడమి ఆకాంక్షిస్తుంది. పరిణామ పక్రియ అటువంటి మార్పు కోసమే మనిషి సహకారం కోసం వత్తిడి చేస్తుంది. అతడందుకు విముఖంగా ఉంటే పరిస్థితుల ప్రభావం వలన బలవంతంగానైనా చెయ్యవలసి వస్తుంది. అతని సహకారంలోనే అతని మోక్షముంది. జ్ఞానోదయమైన కొన్ని పవిత్ర క్షణాల్లో అతడు కలలు కన్న సుందరభవిత కూడా అపుడే సాధ్యం. యువతకు వివాహం చేసు కోవటం, బిడ్డకు జన్మనివ్వడం యొక్క నిజధ్యేయాన్ని ప్రతి జంట తెలుసుకోవాలి.
వివాహమంటే...
భౌతిక జీవితాలు ఏకం కావటం, ఒకే విధమైన విషయాసక్తి కలిగి ఉండటం, జీవితంలో సుఖదుఃఖాలని, గెలుపు ఓటములను కలిసి ఎదుర్కోవటమే వివాహం యొక్క పునాది; కానీ, అదొక్కటే సరిపోదు.
ఒకే విధమైన గాఢమైన అనుభూతులు, భావావేశాలు సౌందర్యదృష్టి, సంతోషాలు కలిగి ఉండటం ఒకే రకంగా స్పందించటం, ఒకరికొకరు, ఒకరి ద్వారా ఒకరుగా ఉండటం మంచిది. అవసరమే, కానీ అదీ చాలదు. ఒకే విధమయిన గంభీరమయిన ఉన్నతభావాలు కలిగి, పరస్పరమైన, అనురాగాన్ని మృదుత్వాన్ని కలిగి, జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, అలసట, విసుగు నిరుత్సాహం ఎదురైనా చెదిరిపోని మృదు మధురమైన అనుబంధాన్ని కలిగి ఉండాలి. అన్ని వేళల్లోనూ, అన్ని సందర్భాలలోను కలిసి ఉండటంలో ఆనందాన్ని, అత్యంత ఆనందాన్ని కలిగి ఉండాలి ఏ పరిస్థితులలోనైనా ఇద్దరిలో ఒకరు ప్రశాంతత, నిశ్చలత, సంతోషం కలిగి ఉండటం మంచిది - అది చాలా అవసరం; తప్పనిసరి, అయినా అది కూడా సరిపోదు.
మనసులు మమేకం కావటం సమన్వయమైన సంపూరకమైన భావాలు కలిగి ఉండటం మీ మేధా సంబంధమయిన విషయాలు, పరిశోధనలు ఇంకా క్లుప్తంగా మీ మానసిక కార్యకలాపాల పరిధి ఏకమై పరస్పరం విస్తృతము, సుసంపన్నం కావాలి. అదీ మంచిదే, చాలా అవసరం కూడా, కానీ అదీ సరిపోదు. మన పుట్టుక, దేశకాల పరిస్థితులు (పరిసరాలు) మన విద్య వీటికి భిన్నంగా అతీతంగా, యింకా లోతుగా, కేంద్ర స్థానంలో, శిఖరాగ్రాన మన ఉనికి యొక్క అత్యున్నత సత్యం. ఒక నిత్య కాంతి ఉంది. అదే మూలం, అదే కారణం, అదే మన ఆధ్యాత్మికోన్నతికి గురువు, మన జీవితాలకు శాశ్వతమైన మార్గాన్ని చూపించేది. మన గమ్యాన్ని నిర్దేశించేది అదే. ఆ చేతనలో ఏకం కావటమే వివాహం యొక్క అసలైన పరమార్థం - ఆధ్యాత్మిక మార్గంలో ఆశంశ (ఆకాంక్ష) ఒకే అభిలాష కలిగి ఊర్థ్వగతిలో పయనించటమే కలకాలం మనగలిగే అనుబంధ రహస్యం వివాహం.
No comments