మెగామైండ్స్ ప్రచురణల నుండి నవంబర్ 2024 లో కుందమాల పుస్తకం విడుదలయ్యింది. ఈ పుస్తకం 1923 లో తెలుగులో మొదటగా ముద్రణ జరిగింది. ఆ తర...
దిఙ్నాగుని ‘కుందమాల’ శ్రీరాముని వియోగాగ్నిజ్వాల: రామాయణ సంస్కృత నాటక వాఙ్మయంలో దిఙ్నాగుని ‘కుందమాల’ నాటకానికి ఒక విశిష్ట స్థానముంది. గోమతీ నదీతీరంలో శ్రీరామునికి కుందమాల ఒకటి కనబడి అది సీతా సంబంధితమని, సీతా విషయక స్మరణ కలిగి అతడు ఆమె పాదముద్రల ననుసరించి వాల్మీకి ఆశ్రమంలో సీతను చేరటం వలన ఈ నాటకానికి ‘కుందమాల’ అని పేరు వచ్చింది. దీని ఇతివృత్తం సీతను అరణ్యంలో దిగవిడిచినప్పటి నుండి, కుశ లవుల పట్టాభిషేకము వరకు గల ప్రఖ్యాత సీతారామ చరిత్ర రామయణోత్తరఖండ భాగాన్ని రసవంతంగా దిఙ్నాగుడు సాహితీ జగతికి సమర్పించాడు.
ఈ నాటకంలో సీత శీలం ప్రధాన అంశము. సీత విరహంలో, బహిష్కృత సమయంలో తన నేరమేమిలేనప్పుడు, తన్నట్లు విడిచివేసిన భర్త విషయంలో తనకు గల ఉత్తమ భావాలను వెలువరిస్తూ అత్యుత్తమ భారత నారీ హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఆదర్శ నారీ శిరోమణి అవుతున్నది. నాటకకర్త దిఙ్నాగుడు సీతారాముల సూక్ష్మమైన సున్నితమైన మనోభావాలను కూడా అత్యంత రసవత్తరంగా చిత్రించాడు.
శ్రీరాముని సీతా వియోగ దు:ఖాన్ని మరల్చటానికి లక్ష్మణుడు గోమతీ తీరానికి అతణ్ణి తీసుకు వెళ్ళాడు. గోమతీ తీర వాయు స్పర్శతో ఆనందాన్ననుభవించి సీత ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఉన్నదని శ్రీ రాముడు భావిస్తాడు. ముత్యాల హారాలు, మలయమారుతాలు, వెన్నెలలు సీతను వీడినప్పటి నుండి ఎక్కువ తాపాన్నే కలిగిస్తున్నాయి. గోమతీ తీరంలో మాత్రం హఠాత్తుగా ఆ నదీ తీర వాయువు మనుసుకి ఆనందాన్ని కలిగిస్తున్నదని ఆ కారణం వలన నిజ ప్రేయసి ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందని నిశ్చయిస్తాడు. భవభూతి ఉత్తర రామచరిత్రలో సీత చేతి స్పర్శ చేతనే సీతను గుర్తిస్తాడు రాముడు. ఇక్కడ దిఙ్నాగుని ‘కుందమాల’ లో సీత వైపు నుండి వచ్చే గాలి తాకుడు చేతనే ఆమె ఉనికిని శ్రీ రాముడు దృఢ పరచుకున్నాడు.
ఇంతలో గోమతీ నదీ తీరానికి ఒక కుందమాల మెల్లగా రాముని పాదములకు ఉపాహారము వలె నీట కొట్టు కొని వస్తుంది. దానిని తీసుకొని ఆ కూర్పును నేర్పునూ సీతాదేవిదిగా వెంటనే శ్రీరాముడు గుర్తించి అది దేవతోపహారము కదా అని దానిననుభవించక విడిచి వేస్తాడు. ఇది అనన్య సామాన్య దైవభక్తి అభివ్యక్తి. ఈ కుందమాల ప్రభావంతో రామ లక్ష్మణులు ఆ నదీ తీరంలో సీత అడుగుజాడలు గుర్తించి క్రమముగా పోయి వాల్మీకాశ్రమ సమీపానికి చేరుతారు. ఈ సన్నివేశానికంతటికి ఈ కుందమాలయే ప్రధాన కీలకమై ఉండటంతో ఈ నాటకానికి కుందమాల అనే పేరు వచ్చింది.
ఆ స్థలంలో స్త్రీ పదాంకాలు చూచి అవి ఎవరివో అని లక్ష్మణుడు అంటే రాముడు “వత్స! కిముచ్యతే? కస్యాశ్చిదితి: నను వక్తవ్యం సీతాయా: పదాని ఇతి” (నాయనా ! ఎవరివో అంటా వేమిటి? సీత అడుగులే అవి) అంటాడు శ్రీరాముడు. సైకతము (ఇసుక)లో అడుగుజాడలను బట్టే అవి సీతవని చెప్పగలగడం సీతారాముల ప్రేమానురాగం అద్భుత మనడానికి ఒక చక్కటి దృష్టాంతం.
చెట్ల చల్లని నీడల్లో విశ్రమిస్తున్న రామలక్ష్మణుల్ని దగ్గరలో పూలు కోస్తున్న సీత వారి సంభాషణల్ని బట్టి గ్రహిం చింది. వివిధ భావోద్వేగాలు ముప్పిరిగొనగా పరాజ్ఞ్ముఖుడై ఉన్న శ్రీ రాముని ఎదుట పడి చూడడానికి సీత శంకించింది. ఒక వైపు భర్త కనబడెనని సంతోషం, చిరప్రవాసమని కోపము, రాముడు కృశించాడనే ఉద్వేగం, నిరనుక్రోశుడు అనే అభిమానము, ఆదర్శనీయుడని ఉత్కంఠ, భర్త అనే అనురాగము, తన బిడ్డలకు తండ్రి అనే కుటుంబీకుని సద్భావము ఆమెను ఉక్కిరిబిక్కరి చేశాయి.
చేయి దిండుగా, చీర చెరుగు పడకగా పున్నమిరేయి సీతతో ఎప్పుడు గడుపుదునా అని శ్రీరాముడు పరితపించాడు. శ్రీరాముడు విరహబాధ భరించలేక మూర్ఛిల్లితే, సీతా తన పటాంతం(ఉత్తరీయం) తో వీచుతుంది. శ్రీరాముడు వెంటనే మేల్కొని ఆ పటాంతాన్ని పట్టుకొంటాడు. సీత ఆ పటాంతాన్ని వదులుతుంది. అది చిత్రకూట వనదేవత మాయావతి ఇచ్చినదని శ్రీరాముడు గుర్తిస్తాడు. ఆ ఉత్తరీయాన్ని కప్పుకొని శ్రీ రాముడు తనది విసిరి వేస్తాడు. శ్రీ రాముని ఉత్తరీయాన్ని గ్రహించి సీత దానిని కప్పుకొని రోమాంచిత అవుతుంది. ఇది ఒక రసాత్మక సన్నివేశం. ఆమెలో శ్రీరాముని పట్ల అనురాగం శ్రుతించిన విపంచి వోలె సరాగాలు పోతుంది.
కానీ ఆమె శ్రీరామునికి కనబడదు. దీనికి కారణం వాల్మీకి వరమున ఆశ్రమ దీర్ఘికా తీరమున స్త్రీలు అదృశ్యులై ఉంటారు. దీర్ఘికాజలములో సీత ప్రతిబింబాన్ని చూసి సంభ్రాంతి చెందిన శ్రీరామునికి సీత కనబడదు. ఆమె ఆ తీరములోనే కూర్చొని ఉంటుంది. తన ఉనికి శ్రీరామునిచే అనుమానింపబడేనని సిగ్గుతో తన ప్రతిబింబము కూడా రామునికి కనబడకూడదని సీత అక్కడనుండి వైదొలుగుతుంది. ఒక వ్యూహాత్మకమైన నాటకీయ సన్నివేశానికి రూపకల్పన చేసాడు దిఙ్నాగుడు.
సీత రాముని స్పృశింపకున్నా ఆమె ఉత్తరీయ గాలిచే రాముడు ప్రభావితుడు కావడం దిఙ్నాగుని భావ సౌకుమార్యాన్నికి పరకాష్ట. సీత విషయక మోహంతో శోక్తప్తుడైన రాముని మనోభావాన్ని మరాల్చటానికి దిఙ్నాగుడు విదూషకుడి కల్పన చేశాడు. కథానాయకుడైన రామునికి సీత అట్టి అవస్థలో కనబడటం తగదని ఆమె శీల పోషణకు తిలోత్తమ అనే అప్సరసను సీత రూపంలో రాముని కడకు పంపి రాముని మనస్సు పరీక్షింప వచ్చినట్లు చూపాడు. “తిలోత్తమో, శిలోత్తమో నాకు తెలియదనే” విదూషకుడు కౌశికుని మాట నెంచి దేవతలు కామరూపులుగా తిలోత్తమను సీతగా చేసి తన వద్దకు పంపి నట్లు రాముడు విశ్వసించాడు.
రసపోషణలో, పాత్రచిత్రణలో, సున్నితమైన భావాలను అత్యంత చమత్కారంగా, లోకసహజంగా వర్ణించటంలో దిఙ్నాగుడు సిద్ధహస్తుడు. వియుక్తులైనవారు పున:స్సమాగమ సందర్భంలో పొందే భావపూర్ణత రసస్ఫోరకంగా లలితమైన శైలిలో రచించాడు. భావోద్భవానికీ, రసోత్పత్తికీ, సద్య: పర నిర్వృత్తికి భవభూతి ‘ఉత్తర రామచరిత’కు ఏ మాత్రం తీసిపోనిది దిఙ్నాగుని ‘కుందమాల.’
“బాహు యుగళేన పృథివీం హృదయేన పృథివి దుహితర ముద్పహన్న తీవ గురుతర: సంవృత్త ఇతి.” బాహు యుగళంతో పుడమిని, హృదయంలో సీతను, నిలుపుకోవటం వలన ఎక్కువ భారం కలవాడివైనావు అంటాడు విదూషకుడు శ్రీ రామునితో. సందర్భం సీత విషయిక ప్రస్తావన. సీతాచ్చాయను వాల్మీకాశ్రమ ప్రాంతంలో చూచి చింతాక్రాంతుడై శ్రీరాముడున్న గంభీరమైన సన్నివేశమిది. సీతారాముల ప్రేమ కారణానురోధి కాదని రాముడే అంటాడు. వారి దాంపత్యమే భిన్నము, లోకాతీతము. శ్రీ రాముడు తాను కర్కశుడనని, తన అనురాగ భావాలు సూక్ష్మములై పద్మనాళములోని తంతువలవలె తన హృదయంలో లీనమై ఉన్నవని చెప్పాడు.
సుఖ దు:ఖాలు రెండింటిలోనూ దాంపత్య ధర్మం అద్వైత రూపంలో ఉంటుంది. భార్యాభర్తలలో ఒకరి సుఖమే మరొకరి సుఖంగాను, ఒకరి దు:ఖమే మరొకరి దు:ఖంగాను భావింప బడుతుంది. ఏ అవస్థలోనైనా సంపదలు వచ్చినా, ఆపదలు వచ్చినా ఒకరితో ఒకరు తలపోసుకొని ఊరట చెందుతారు. ముసలితనం పై బడుతున్నా భార్యా భర్తలలో ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గదు. కాలక్రమంలో ఆవరణాలన్నీ తొలగిపోయి, భార్యా భర్తల ప్రేమపండి స్థిర్త్వాన్ని పొందుతుంది. ఇలాంటి దాంపత్య ధర్మసారాన్ని లోకంలో ఎవరు కోరుకోకుండా ఉంటారని. సీతారాముల దాంపత్య మాధుర్య పరమావధిని, దాంపత్య ధర్మాన్ని ఇంత రమణీయంగా చెప్పిన నాటకం మరొకటి సంస్కృత సాహిత్యంలో కనబడదు. -మంగు శివరామ్ ప్రసాద్.
No comments