ఋణ విమోచనలో మొదటి వాయిదా తల్లీ నీఋణాన్ని ఎలా తీర్చు కోగలం? నీవు మమ్ము ఆశీర్వదించి నీ చనుబాలతో పెంచినావు కదమ్మా? తల్లీ విను – ఈ ప...
ఋణ విమోచనలో మొదటి వాయిదా
తల్లీ నీఋణాన్ని ఎలా తీర్చు కోగలం? నీవు మమ్ము ఆశీర్వదించి నీ చనుబాలతో పెంచినావు కదమ్మా? తల్లీ విను – ఈ పవిత్ర అగ్ని జ్వాలల లోనికి ఈదినం మేము ప్రవేశిస్తున్నాం నీ ఋణములోని మొదటి వాయిదా చెల్లిస్తున్నాం. (ఋణ విమోచనలో మొదటి వాయిదా అన్న సావర్కర్ గీతం నుండి)
1910 జూలై 1 వ తేదీన యప్ యస్ మేరియా అనే నౌక బంధితుడైన సావర్కర్తో భారత దేశానికి బయలు దేరింది. జూలై 7వ తేదీన ఫ్రెంచి నౌకాశ్రయం మార్శేల్కు చేరింది. నౌక నుండి తప్పించుకొని బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేసేందుకు, విప్లవోద్యమానికి ఒక ఊపునిచ్చేందుకు సావర్కర్ పూనుకున్నాడు. ఆయన నౌక అన్ని భాగాలను విశితంగా పరిశీలించాడు.
సాహసోపేత యత్నం: అది 1910 జూలై 10వ తేది. అప్పుడే తెల్లవారింది స్నానాల గది లోనికి పోవలెనని సావర్కర్ కావలి వారిని అడిగాడు. స్నానాల గదిలోకి పోయి 'నైట్ గౌను' ను గ్లాసు కిటికీకి అడ్డంగా వేసి పోర్టు హోల్ (ఇరువైపుల వుండే గుండ్రవి గవాక్షం) గుండా సముద్రం లోనికి దూకాడు. గజ ఈతగాడు సావర్కర్ ఈది రేవు చేరి ఫ్రెంచి గడ్డమీద కాలు మోపాడు. అంతర్జాతీయ న్యాయ చట్టం క్రింద రాజకీయ ఖైదీ అయిన సావర్కరును. ఇక బ్రిటిష్ పోలీసులు తాకడానికి వీలు లేదు కానీ ధూర్తులు కపటవర్తములు కుటిల రాజనీతిపరులకు చట్టమెుక్కడిది. బ్రిటిష్ పోలీసులు సావర్కరు వెంటబడ్డారు సావర్కరు చేతిలో 'ట్రాం' ఎక్కడానికి కూడా చిల్లిగవ్వలేదు పరుగెత్తడం యొక్కటే మార్గం. ఒక ఫ్రెంచి పోలీసు వద్దకు పోయి తనను మాజిస్ట్రేటు వద్దకు తీసుకొని పొమ్మని బ్రతిమాలాడు. ఈలోగా బ్రిటిష్ పోలీసులు దొంగ దొంగ అని అరుస్తూ సావర్కర్ వెంటబడి పట్టుకొన్నారు. ఫ్రెంచి పోలీసు బ్రిటిష్ పోలీసులిచ్చిన లంచంతో సరిపెట్టుకొన్నాడు. అంతే సింహం మరల బోనులో పడింది. ముందు వేసిన పధకం సావర్కర్ను తప్పించేందుకు మేడమ్ కామా వి వి ఎస్ అయ్యర్ అక్కడ ఉండాల్సింది. కానీ వారిద్దరూ కొన్ని గంటల ఆలస్యంగా మార్శెల్ చేరారు. విధి బలీయం! ఈ ఆలస్యం భారత విప్లవోద్యమ మార్గాన్నే మార్చి వేసింది.
న్యాయం పాలించలేని అంతర్జాతీయ న్యాయస్థానం: అయితేనేమి సావర్కర్ సాహసోపేత వీరగాథ దేశ దేశాలలో మారుమ్రోగింది. బ్రిటిష్ పిరికి పందలు చేసిన అంతర్జాతీయ న్యాయపత్ర భంగాన్ని దేశ దేశాలలోని న్యాయప్రియులు గర్జించారు. భారత స్వాతంత్ర్యోద్యమం అంతర్జాతీయు ఖ్యాతిగాంచింది. ఇతర దేశాల ప్రజాభిప్రాయం కల్పించిన ఒత్తిడికి తట్టుకోలేక ఫ్రెంచి ప్రభుత్వం సావర్కరు తమకు అప్పగించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ పట్టుదల చూపలేదు విషయం హేగు అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయింది. తెల్లవారి ఆధిపత్యంలో ఉండే హేగు అంతర్జాతీయ వ్యాయస్థానం సావర్కరును బ్రిటిష్ వారికి అప్పజెప్పడం న్యాయసమ్మతంకాదు అని మాత్రం అంటూ, సావర్కరును ఫ్రెంచి వారికి తిరిగి అప్పగించ వలసిన విషయమై మౌనం వహించి కేసును నాన బెట్టింది.
భారత దేశంలో విచారణ యావజ్జీవ శిక్ష: హేగు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నప్పుడే ఆంగ్లేయులు సావర్కరుపై భారతదేశంలో న్యాయవిచారణ అనే నాటకాన్ని కొనసాగించారు. 1910 జూలై 22 తేదీన సావర్కర్ ను ముంబాయికి తీసుకు వచ్చారు. స్పెషల్ ట్రిబ్యునల్ సెప్టెంబరు 15 తేదీన విచారణ ప్రారంభించింది. విప్లవ కారులతో కలసి వుండివ కాశీనాధ్ అంకుశ్కర్ దత్తాత్రేయ జోషీ, డబ్ల్యు ఆర్ కులకర్ణి ఇండియా హౌస్లో వంటవాడుగా ఉంటూ సావర్కర్ ఇచ్చిన రివాల్వర్లు ఇండియాకు తెచ్చిన చతుర్చుజ్లు ప్రభుత్వ సాక్షులుగా మారారు.
నేను ఇంగ్లండులో అరెస్టు అయ్యాను, నన్ను ఇంగ్లండులోనే విచారించాలి. భారతదేశంలో ఏర్పరచిన న్యాయస్థానం న్యాయసమ్మతమైంది కాదు. హేగు తీర్పు వచ్చే వరకు నన్ను విచారించడానికి ఈ న్యాయస్థానాలకు అధికారం లేదు అంటూ సావర్కర్ వాదించాడు. కానీ ట్రిబ్యువల్ అక్టోబరు 23 తేదీన ఏక పక్షంగా తీర్పు ఇచ్చి, బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి కొనసాగించినందుకు యావజ్జీవ శిక్ష విధించి ఆయన యావదాస్తిని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వు చేసింది. బ్రిటిష్ వారి పగ అంతటితో చల్లారలేదు నాసిక్ కలెక్టర్ జాక్సన్ హత్యా నేరారోపణతో మరొక కేసు బనాయించారు. ఈ కేసు విచారణ 1911 జనవరి 23 తేదీన ప్రారంభమైంది. ఇంకొక మారు ఏకపక్ష నిర్ణయంగా జనవరి 30 తేదీన సావర్కర్కు మరియొక యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. శిక్ష విధింపు జరుగగానే సావర్కర్ ఈ క్రింది విధంగా అన్నాడు.
"మా ప్రియతమ మాతృ దేశం, మా త్యాగం వలన - మేము కష్ట పరంపరలను అనుభవించడం వలన - తప్పక మరింత త్వరిత గతిని స్వాతంత్ర్య విజయాన్ని సాధించగలదనే నమ్మకంతో మీరు మీ చట్టములతో విధించిన ఈ విపరీత శిక్షను అనుభవించడానికి నేను సిద్దంగా వున్నాను "
అత్యంత శాస్త్ర విరుద్ధమైన రెండు జీవిత శిక్షలు కానీ, అర్థ శతాబ్దం అండమాను నరకంలో యాతనలను భరించలసిన శిక్ష కానీ సావర్కర్ ని యే మాత్రం చలింప చేయలేదు విడుదల కాబడిన సహచరుల ద్వారా స్పూర్తి దాయకమైన 'ఋణ విమోచనలో ప్రథమ భాగం' అనే గీతాన్ని భారత యువకులకు తన జాగృతి సందేశంగా అందజేశాడు.
No comments