Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దైవాంశ సంభూతుడు కేశవ రావ్ బలీరాం హెడ్గేవార్‌ - About Keshav Baliram Hedgewar

శతాబ్దాలుగా భారతావని మీద ఆవరించిన చిమ్మచీకటి తొలగి, కొత్త సూర్యోదయాన్ని దర్శించడం ఎప్పుడు సాధ్యం కాగలదని హెడ్గేవార్ వేసుకున్న ప్...

శతాబ్దాలుగా భారతావని మీద ఆవరించిన చిమ్మచీకటి తొలగి, కొత్త సూర్యోదయాన్ని దర్శించడం ఎప్పుడు సాధ్యం కాగలదని హెడ్గేవార్ వేసుకున్న ప్రశ్నకు సమాధానమే - సంఘటిత హిందూ సమాజం. సంఘే శక్తి కాలౌ యుగే అని నమ్మిన దైవాంశ సంభూతుడు హెడ్గేవార్. దైవాంశ సంభూతులుగా మనం ఇప్పటి వరకూ ఆదిశంకరుల వారిని రామకృష్ణ పరమహంస ల వారిని చేప్పుకుంటాం అదే కోవలోకి వచ్చేవారు హెడ్గేవార్. అదే విధంగా కలియుగ కారణజన్ముడిగా కూడా మనం తలచుకోవలసిన వ్యక్తి, ప్రాతస్మరణీయులు హెడ్గేవార్.

1921లో కేరళలో మోప్లాలు హిందువు లపై భారీయెత్తున హత్యాకాండ సాగించారు. సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ ప్రకటించిన నివేదిక ప్రకారం ఆ దారుణకాండలో 1500 హిందువులు హత్య గావించబడ్డారు. 20 వేల మంది హిందువులు బలాత్కారంగా ముస్లింలుగా మార్చబడ్డారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఈ వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించింది. 1923లో ఖిలాఫత్‌ ఉద్యమం నేపథ్యంలో దేశంలో మత ఘర్షణలు జరిగాయి. ఆనాడు దేశంలో, స్వాతంత్య్ర సమరంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ నిలిపివేశారు. అందుకు కారణం చౌరీ చౌరా ఉదంతమని అన్నారు. కానీ దానితోనే మొదలైన ఖిలాఫత్‌ ఉద్యమం దేశంలో పెను విపత్తుకు బాటలు వేసింది. ఆ సమయంలో దారుణంగా గాయపడిన హిందువుల మనోభావాలను గుర్తించడంలో, అభిప్రాయాలను స్వీకరించడంలో, గౌరవించడంలో కాంగ్రెస్‌ నాయకత్వం విఫలమైందని హెడ్గేవార్ అభిప్రాయానికి వచ్చారు.

ముస్లింలను జాతీయోద్యమంలో, జీవన స్రవంతిలో కలపడమనే ప్రక్రియ ఒక పెద్ద చారిత్రక తప్పిదానికి బీజం వేస్తున్న సంగతి అర్ధం చేసుకున్నవారిలో హెడ్గేవార్ ప్రథములు. అప్పుడే ఆయనలో హిందువుల ఐక్యతకు ఒక సంస్థ అవసరమన్న భావన కలిగింది. అప్పటి వరకు కాంగ్రెస్ లో పని చేసిన హెడ్గేవార్ జైలుకు కూడా వెళ్లారు. ఎవరికైనా ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ సిద్ధాంతం ఏమిటి? ఆ సంస్థ ఎవరికోసం పనిచేస్తుంది అనే విషయం ఏమాత్రం ఆలోచించిన వ్యక్తికైనా అర్ధమవుతుంది. కాంగ్రెస్ హిందువుల పక్షాన లేదన్న విషయాన్ని గ్రహించారు హెడ్గేవార్. ఇది భారత అస్తిత్వానికే ముప్పని భావించారు, హిందూ సంఘటన లేకపొతే భారత భవిష్యత్తు శూన్యమని నిర్ధారణకు వచ్చారు. 

శకులు, హూణులు దండయాత్ర చేసినప్పుడు భారతీయ సమాజం తనవైన జీవన మూల్యాలతో దృఢంగా ఉంది. దీనితోనే ఆక్రమణదారులు కూడా ఈ జీవనంలో భాగస్థులుగా ఉండిపోయారు. అలాగే కొత్త ఆక్రమణదారులను కూడా అదే విధంగా భారతీయ సమాజంలో ఐక్యం చేసుకోలేమా? ఇందులో సాధ్యాసాధ్యాలు వెతక్కుండా సాధ్యం చేసుకోవడం ఎలా అన్నదే ప్రధానంగా చూడాలన్నదే హెడ్గేవార్ దృఢ నిశ్చయం. వీటన్నిటికి మూల సూత్రం, పరిష్కారం హిందూ ఐక్యత అని ఆయన అంతిమంగా నిర్ణయానికి వచ్చారు. అది నిజమని చరిత్ర నిరూపించింది.

మనల్ని బానిసలుగా మార్చిన ఆంగ్లేయులనూ, పెరుగుతున్న ముస్లిం వేర్పాటువాదాన్నీ ఎదుర్కొవాలంటే భిన్నమైన మరో మార్గం అవసరమని భావించి రాజకీయ ఆందోళనల నుంచి పూర్తిగా విరమించుకుని. ఎవరైనా త్వరగా ఫలాలనిచ్చే పండ్ల మొక్కలను నాటుతారు కానీ ఆర్ ఎస్ ఎస్ అనే వట వృక్షాన్ని నాటారు కేశవరావు బలిరాం హెడ్గేవార్. వేయేళ్ల బానిసత్వం నుంచి విముక్తం కావాలనీ, ఆత్మ విస్మృతి అనే పెను నిద్దర వీడాలనీ మొదలైన స్వాతంత్య్ర సమరం ‘స్వ’ చింతనకు దూరంగా జరగడం ఎంత ప్రమాదమో గుర్తిస్తూ అంకురించింది ఆర్‌ఎస్‌ఎస్‌.

1925లో విజయదశమికి హిందూ ఐక్యత ఉద్దేశంతో హెడ్గేవార్ కొద్దిమంది బాలురతో ఒక సంస్థను స్థాపించారు. తన హిందూ సంఘటనా యజ్ఞానికి అదే అంకురార్పణ. అప్పుడు ఆయన వయసు 36 ఏళ్లు. ఆదిలో ఆ సంస్థను ఆర్‌ఎస్‌ఎస్‌ అని పిలవలేదు. ఏప్రిల్‌ 17, 1926న 26 మంది స్వయంసేవకులతో ఒక సమావేశం జరిగింది. అది సంస్థకు ఏం పేరు పెట్టాలనే దాని మీదే. కొన్ని పేర్లు అనుకున్న తరువాత చివరకు ఆర్‌ఎస్‌ఎస్‌ పేరును ఖరారు చేశారు.

సంఘ సిద్ధాంతం ఏమిటి? సంఘ సంస్థాపకులు ఏదో కొత్త సిద్ధాంతాన్ని తమ మస్తిష్కం నుంచి సృష్టించలేదు. యుగయుగాలుగా పరంపరగా వస్తున్న సనాతన హిందూ రాష్ట్ర శాశ్వత తత్వజ్ఞానం, జీవన దర్శనం గత కొన్ని శతాబ్దాలుగా ప్రజల మనసులలోను, ప్రజా జీవనంలోను లోపిస్తూ వస్తున్నది. దానిని జాగృతం చేసే పనినే పూజనీయ హెడ్గేవార్ ప్రారంభించారు. కనుక హిందూ విచార ధారయే సంఘ విచారధార. ఆ విచార ధార ఆధారంగా సమాజమంతటినీ తిరిగి సంఘటిత పరచడమే సంఘకార్యం.

నాగపూర్ పట్టణం లో ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగుర వేసి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదే రోజు హెడ్గేవార్ ఏప్రిల్‌ 1,1889, ఆదివారం (భారతీయ పంచాంగం ప్రకారం వర్ష ప్రతిపాద) నాగపూర్‌లోనే జన్మించారు. ఆయన పూర్వికులు తెలంగాణలోని నిజామాబాద్‌ దగ్గరి కందకుర్తి వాసులు. అక్కడ మూడు నదులు సంగమిస్తూ ఉంటాయి. అవి గోదావరి, మంజీర, హరిద్ర. అలాగే మూడు భాషలు వినిపిస్తాయి. తెలుగు, మరాఠీ, కన్నడ. బలీరాం పంత్‌, రేవతీబాయి దంపతుల ఆరుగురు సంతానంలో ఐదోవారే కేశవ హెడ్గేవార్‌. 12 లేదా 13వ ఏటనే ప్లేగు ఆ ఇద్దరినీ ఒకేసారి కేశవ కు దూరంచేసింది. ఇద్దరి భౌతికకాయాలు ఒకేసారి శ్మశానవాటికకు వెళ్లాయి. 13 ఏళ్ల వయసులో అమ్మ, నాన్న ల ప్రేమకు దూరమయి అన్న, వదినల దగ్గర కొంత కాలం చదువుకున్నారు.

బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సమయంలో హెడ్గేవార్ పాఠశాల ప్రవేశం చేశారు. మోరేశ్వర్‌ సంరక్షణలో నాగపూర్‌లోని ఒక పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో శివాజీ పేరిట మిత్రబృందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజులలో విద్యాసంస్థలలో ‘వందేమాతరం’ అని నినదించకుండా రిస్లే సర్క్యులర్‌ ఉండేది. దీనిని హెడ్గేవార్ నిరంతరం ఉల్లంఘించేవారు. ఫలితం` పాఠశాల నుంచి పంపేశారు. తరువాత నాగపూర్‌ వదిలి యవత్‌మల్‌లోని రాష్ట్రీయ విద్యాలయంలో చేరారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌ విల్సన్‌కు సలాం కొట్టనందుకు చదువు ఆపివేయవలసి వచ్చింది. పూనా వెళ్లి రాష్ట్రీయ విద్యాపీఠ్‌లో మెట్రిక్యులేషన్‌ చేశారు హెడ్గేవార్.

స్వాతంత్య్ర భావాలు కలిగిన కేశవ్ విప్లవకారులకి దగ్గరవడానికి, విప్లవకారుల కేంద్రమైన కలకత్తా లో వైద్యశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. 1910లో వైద్యశాస్త్రం చదవడానికి కలకత్తాలోని నేషనల్‌ మెడికల్‌ కాలేజీలో చేరారు. కలకత్తాలో ఆయన అనుశీలన్‌ సమితిలో చేరి ఆ సంస్థలో ప్రముఖుడు ఫులిన్‌ బిహారీదాస్‌ వద్ద తీవ్ర జాతీయ వాద కార్యకలాపాలలో శిక్షణ పొందారు. ఆయనకు అప్పగించిన బాధ్యత దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తీవ్ర జాతీయ వాదులకు ఆయుధాలు అందించే పని. మరొకటి, రహస్య సాహిత్యం చేరవేయడం. విప్లవ కార్యకలాపాల సమయంలో హెడ్గేవార్ అజ్ఞాత నామం ‘కొకెన్‌’. ‘ప్రతివాసి’, ‘సంధ్య’, ‘వందేమాతరం’ వంటి పత్రికలలో బ్రిటిష్‌ జాతికి వ్యతిరేకంగా చక్రవర్తి పదునైన భాషతో వ్యాసాలు రాసేవారు. వైద్య విద్యార్థిగాను హెడ్గేవార్ అత్యంత నిరుపేద జీవితమే గడిపారు. ఒకే జత బట్టలతో ఆయన విద్యార్థి జీవితం గడిచింది. చాలాసార్లు కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావు. ఎక్కువ సమయాలలో మిత్రులే సహకరించేవారు.

లాభసాటిగా ఉండే ఉద్యోగం చేరవలసిందంటూ బ్యాంకాక్‌ ఆహ్వానించింది. అయినా చేరలేదు. హెడ్గేవార్ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ సంవత్సరం అమృత్‌సర్‌లో జరిగిన వార్షిక సమావేశాలకు కూడా హాజరయ్యారు. నాగపూర్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో రాష్ట్రీయ మండల్‌లో పని చేశారు. ఇది తిలక్‌ అనుచరులు ఏర్పాటు చేసినది. నాటి జాతీయవాద నేతల ప్రేరణతో రాష్ట్రీయ ఉత్సవ మండల్‌ అనే సంస్థను ఆయన స్థాపించారు.

ఒక హిందువు ఓ సభలో ఉన్నా కానీ, యాత్ర చేస్తున్నాకానీ, కుంభమేళాలో పాల్గొన్నప్పటికీ అతడు ఒంటరిగానే ఉంటాడు అని, పాము పాము అంటూ ఓ సభలో జరిగిన సంఘటన ద్వారా అనిపించింది. ఈ ఒంటరిగా ఉండటమనే భావన హిందూ సమాజాన్ని ఆత్మ వినాశం వైపునకు తీసుకువెళుతుంది. దీనికి విరుగుడు అన్నట్టుగా మనం ‘నేను ఒంటరిని కాను.. నా చుట్టూ ఉన్న సమాజం నాది.. అది నాతోనే ఉంటుంది’ అని. హిందూ సమాజం నరనరాల్లో ‘నేను కాదు మనం’ అనే భావన ఇంకి పోవాలి. హెడ్గేవార్ ఇలా ఆలోచిస్తూ ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ’ పేరిట ఓ సంస్థ ప్రారంభించారు. సంఘ అంటే అర్థం రోజూ ఓ గంటసేపు జరిగే సంఘ శాఖ అని. శాఖ అంటే ఓ సామూహిక అనుభవం. మనం ప్రతి రోజూ ఏకమై ఒంటరిగా ఉండిపోకుండా అనేకుల్లో ఒకరిగా ఉండిపోవడం. ఇంకా వివరంగా చెప్పాలంటే ‘సింధువులో ఓ బిందువు’ అనే భావన అంతరాల్లోకి చేరుకొని ఆత్మగతమైన పక్షంలో ఒంటరితనం నుంచి ఉత్పన్నమయ్యే భయాందోళన దూరమైపోతుంది. కలకత్తా నుండి వైద్య శాస్త్రం పూర్తిచేసిన తరువాత నాగపూర్ ప్రజలు హెడ్గేవార్ ని డాక్టర్ జీ అంటూ పిలవనారంభించారు, సంఘాన్ని స్థాపించిన తరువాత స్వయంసేవకుల హృదయాలలో డాక్టర్జీ గా స్థానం పొందారు.

సంఘ శాఖ అంటే దానర్థం వ్యక్తిలో నేను అనే భావన నుంచి మనం అనే భావనకు చేరుకోవడం. ‘నేను’ ను నేలమట్టం చేసి ‘మనం’ అనే భావనను నలుదిక్కులకు విస్తరింపజేయాలి. సంఘ శాఖలో ఆలపించే పాటలు అత్యంత సరళంగా ఉంటూ ‘మనం’ అనే భావనను బలోపేతం చేస్తుంటాయి.

గత వందేళ్ల గా హిందువుల్లో నేను అనే దాని నుండి మనం వైపు తీసుకు వస్తున్న తరుణం లో ఆర్ ఎస్ ఎస్ పై అనేక అభియోగాలు  కాంగ్రేస్, కమ్యూనిస్ట్ నాయకులు హిందూ విభజన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ లో బ్రాహ్మణ వాదం ఉందని, జాతీయా జండా ని గౌరవించారని ఇలా అనేకమైన ఆరోపణలు చేస్తుంటారు. కాని అవన్నీ అవాస్తవాలు...

1934 లో వార్దాలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన శిబిరాన్ని గాంధీ సందర్శించారు. శిబిరంలో వాలంటీర్లు వేర్వేరు కులాలు, మతాలకు చెందిన వారుగా ఆయన గుర్తించారు. అదే సమయంలో ఏ ఒక్క వాలంటీరులో కూడా ఇతరుల కులమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడాన్ని గమనించారు. వారందరిలో ఉన్న ఏకైక భావన వారు పంచుకున్న హిందూ సారూప్యత. ఈ ఏకతా భావన వారిని కలిసి జీవించేలా, కలిసి భుజించేలా, కలిసి పనిచేసేలా ప్రేరేపించింది. ఇది చూసి గాంధీ ఎంతగానో ఆశ్చర్యపోయారు. మరుసటిరోజు ఆయన అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘ్‌చాలక్‌ ‌పూజనీయ డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను కలుసుకున్నారు. అస్పృశ్యతా నివారణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారంటూ డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ను ఆయన అభినందిం చారు. ఇందుకు పూజనీయ హెడ్గేవార్‌ ‌సమాధానమిస్తూ అస్పృశ్యతను నివారించడానికని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించడంలేదు. మేం చేస్తున్నదల్లా మనమంతా హిందువులం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయడం. ఏకతా భావన కుల భేదాలు లేదా అస్పృశ్యతను అసంగతమైనదిగా చేస్తుంది. మనం హిందువులమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ మిగిలిపోతుంది అని అన్నారు.

అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జాతీయ పతాకాన్ని గౌరవించదని, ఆగస్టు 15 లేదా జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జాతీయ పతాకాన్ని ఎగురవేయదనే ఆరోపణలు ఉండేవి. అయితే ఈ ఆరోపణలు కూడా నిరాధారమైనవని తేలింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయంసేవ కులు స్వరాజ్య ఉద్యమంలో పాల్గొనలేదన్న వితండవాదాన్ని సైతం ఖండించడం జరిగింది.

డాక్టర్‌జీ పూరించిన శంఖారావం భారతీయ సమాజం చెవులలో పడడానికి దాదాపు 100 ఏళ్లు పట్టింది. ధార్మిక పునాదితో, చరిత్ర చెప్పే గుణపాఠంతో, తాను ప్రత్యక్షంగా వీక్షించిన స్వాతంత్య్రోద్యమ కాలపు చేదు వాస్తవాలతో డాక్టర్‌జీ ఇచ్చిన అమృతోపమానమైన ఆ సందేశం హిందూ సోదరుల గుండెలను తాకడానికి ఇంతకాలం పట్టింది. ఏడెనిమిది శతాబ్దాల బానిసత్వం, పరాయి పాలన; వాటి ఫలితంగా జరిగిన విలువల విధ్వంసం ఈ ఘోర బధిరత్వానికి మూలం. హిందువులు హిందువుల మని చెప్పుకునే చొరవా లేదు. మేం హిందువులమని చెప్పుకుందామన్న ఆత్మగౌరవ వ్యక్తీకరణా లేదు. కానీ, ఔను! మేం మహమ్మదీయులం, మేం వేరు, ఈ దేశంలో మాకో ముక్క కావాలని వారు విభజించుకుపోవడం ఇటీవలి చరిత్రే. ఈశాన్య భారత పరిస్థితి అంతదాకా వచ్చినా, క్రైస్తవానికి భంగపాటు ఎదురైందంటే కారణం పెరిగిన హిందూ చైతన్యమే. అది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కృషి ఫలితం. స్వయంసేవకుల త్యాగఫలం. కశ్మీర్‌ ‌భారతదేశానికి మకుటాయమానమని చరిత్ర ఘోషిస్తున్నా, వాస్తవాలు గొంతెత్తుతున్నా అక్కడి ప్రజలను ఇంకా నాన్చకుండా ప్రధాన స్రవంతి భారతీయులతో మమేకం చేయడం వెనుక ఉన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంత స్ఫూర్తి ఒక్కటే.

మన పురోగతికి మన గతం, దాని తాత్త్వికత; మన ధర్మం, అది ఇచ్చే దృష్టి చోదకశక్తిగా ఉండాలన్నదే డాక్టర్‌జీ సందేశమని అర్ధమవుతుంది. భారతీయమైన ఆలోచన భారతీయతకు శ్రీరామరక్ష అన్న సూత్రంతో సాగుతున్న సంస్థ సంఘం. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లేని ఆధునిక హిందూ సమాజం మనుగడను ఊహించడానికి ఇవాళ ఎవరికీ మనస్కరించడం లేదన్నది వాస్తవం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇవాళ హిందూ సమాజపు గుండె లయ. ఇందుకు మూల పురుషుడు డాక్టర్‌జీ. వారి సానుకూల దృక్పథం. అందుకే డాక్టర్‌జీ జయంతిని కూడా వెంటపెట్టుకుని వచ్చే ప్రతి ఉగాది భారతీయులకు ప్రత్యేకమైన పండుగ.

చాలామందికి హిందూ సంఘటన పని పూర్తికావాలన్న తొందర ఉంటుంది. ‘మనచుట్టూ ఇంత హింసాకాండ జరుగుతోంది కదా, మనం దక్ష-ఆరమ చేస్తూ కూర్చుంటే ఏమి లాభం’ అని వాళ్లకు అనిపిస్తుంది. ఈ పద్ధతిలో పని చెయ్యడంలో వాళ్లకు నీరసం, విసుగు కలుగుతాయి. డాక్టర్‌జీ ఈ కార్యం కోసం తన యావజ్జీవితాన్ని వెచ్చించారు. అహోరాత్రాలు దీన్నిగురించే ఆలోచించారు. ఎటువంటి శ్రమకు ఆయన వెనుదీయలేదు. తన హృదయంలో ఒక అగ్నిపర్వతాన్ని ధరించి పని సాగించారు. ఏనాడూ తన ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. అదే ప్రగాఢమైన ఆత్మవిశ్వాసంతో మనం ఆత్మసమర్పణ పూర్వకంగా పనిచేస్తే సాఫల్యం లభించి తీరుతుంది. అంతా బాగానే ఉంది; ఆత్మవిశ్వాసంతో పనిచేసే వారే తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనిని అర్థం చేసుకొని ఏకసూత్ర బద్ధులు, ఏకాత్మభావ యుక్తులు, అనుశాసనపరులు అయిన లక్షలాది వ్యక్తులను పోగుచెయ్యాలి. అందరి హృదయాలలోను ఏకత్వాన్ని స్థాపించి సమష్టిరూపంలో హృదయనిర్మాణం చెయ్యాలి. అందులోనే అన్ని సందేహాలకు సమాధానం లభిస్తుంది.

అన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఆర్ ఎస్ ఎస్ జన్మ శతాబ్ది ఉత్సవాలలో సమాజంలో పంచ పరివర్తన తీసుకురావాలని పని చేస్తుంది.

  1. కుటుంబ ప్రబోధన్‌: మన జాతీయ జీవనం అఖండంగా అప్రతిహతంగా సాగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థ నిరంతరంగా నిలిచేందుకు మన పూర్వులు ఏర్పరిచిన విధివిధానాలు అమూల్యమైనవి.
  2. పర్యావరణం: అభివృద్ధి పేరిట పర్యావరణా నికి చేటు కలిగించటం ద్వారా మానవుడు తన కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. భోగలాలసత కాదు, త్యాగభావన కావాలి. పాశ్చాత్య భావన యాంత్రికతను, భౌతికవాదాన్ని ప్రోత్సహిస్తే హిందుత్వం సమగ్ర దృష్టిని, త్యాగభావనను ప్రవచించింది. శాశ్వత ఆనందాన్ని పొందాలంటే కోరికలను తగ్గించుకోవాలని భగవద్గీత పేర్కొంది. కోరికలను తగ్గించుకోవడం వల్ల వస్తూత్పత్తిలో ప్రకృతి శోషణ ఉండదు. భోగవాదం ఆశకు, శోషణకు, హింసకు దారితీస్తే త్యాగం శాంతినిస్తుంది. త్యాగభావన ద్వారా హిందుత్వం ప్రపంచ ప్రగతికి నమూనాను అందిస్తుంది.
  3. సమరసత: హిందువులందరినీ సంఘటితం చేయడం సంఘం లక్ష్యం. దీనికొక ఆధారం అవసరం. మానవుని మనోలక్షణాన్నిబట్టి ఇది భావాత్మకమై ఉండాలి. కనుక ఇది మన మాతృభూమి. మనందరం ఒకే తల్లిబిడ్డలం అని మనం ప్రారంభిస్తాం. అస్పృశ్యత మన సమాజంలోని అసమానతలలో అత్యంత దురదృష్టకరమైన అంశం. ప్రాచీనకాలంలో ఇది లేదని కొందరు మేధావులు అంటారు. కాలక్రమంలో ఇది మన సాంఘిక వ్యవస్థలో చోటుచేసుకొని వేళ్లూనింది. వాస్తవం ఏమైనప్పటికీ ఈ తప్పిదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ‘‘అస్పృశ్యత తప్పు, అది తప్పుకాకపోతే ప్రపంచంలో మరేదీ తప్పుకాదు’’ అని మనమందరం ప్రకటించాలి. అసమానతల వల్ల మనం ఏ విధంగా బలహీనుల మైనామో ప్రజలందరికీ విశదీకరించాలి. అప్పుడే హిందూ సంఘటనకు పెద్ద అవరోధం తొలగిపోగలదు.
  4. ‘స్వ’ (స్వదేశీ): శతాబ్దాల తరబడి విదేశీ పరిపాలకులు సాగించిన అణచివేత విధానాల ఫలితంగానే భారత్‌ ప్రగతి సాధనలో ప్రపంచ దేశాలతో పోటీపడలేక వెనుకబడి పోయిందనేది సత్యం. స్వాతంత్య్రం రాగానే భారత్‌ సిరిసింపదలతో తులతూగగల స్వావలంబ దేశంగా అవతరించగల దని భారతీయులు భావించారు. కానీ అలా జరగలేదు. పైగా సమస్యలు పెరుగుతూనే వస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలోనే అరవిందమహర్షి, గాంధీజీ, ఇతర తత్త్వవేత్తలు దేశ వికాసానికి దారిచూపారు. కానీ స్వతంత్ర భారత నేతల దృష్టి స్వాభావికంగానే అభివృద్ధి చెందిన దేశాలవైపు పడింది. ఆ దేశాల ప్రణాళికలను మనపై రుద్దడం ప్రారంభించారు. స్వదేశీ సంకుచితమైనది కాదు. ప్రపంచ ప్రగతి కోసం అందరికీ ఆమోద యోగ్యమైన ప్రత్యమ్నాయ నమూనాగా స్వదేశీని పేర్కొనవచ్చు.
  5. పౌర విధులు: మన దేశంలో హక్కుల కంటే విధులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పౌరుడిగా బాధ్యతలను నిర్వర్తించడం అనేది ఎవరో చూస్తున్నారని కాకుండా స్వీయ క్రమశిక్షణతో సంబంధించినదిగా మనం భావిస్తాం. ఉదాహరణకు రోడ్డులో వెళుతున్నప్పుడు ఎడమవైపున వెళ్లడం, కూడలిలో రెడ్‌ సిగ్నల్‌ పడినపుడు వాహనాన్ని ఆపడం. కుటుంబంలో నియమాలను, విధానాలను ఎలా అయితే మనం స్వయంగా పాటిస్తామో అదేవిధంగా ప్రభుత్వ నియమాలను, విధానాలను గౌరవించి పాటించడం మన ధర్మంగా పాటిస్తూ వస్తున్నాం. మన బాధ్యతలను నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కులకు రక్షణ ఉంటుంది.
దేశంలో పంచపరివర్తన ద్వారా ఎంతో మార్పుకోసం పనిచేస్తుంది ఆర్ ఎస్ ఎస్.

సంఘ సిద్ధాంతం, ధ్యేయం, కార్యపద్దతి, లక్ష్యం

సిద్ధాంతం: భారతదేశం హిందూ దేశం.

ధ్యేయం: హిందూ సంఘటన, రాష్ట్రీయ పునర్నిర్మాణం.

కార్యపద్ధతి: శాఖ (సంఘానికి హృదయం).

లక్ష్యం: భారత పరమవైభవ స్థితి.

ఒక వ్యక్తి ఆలోచన వందేళ్ల కు పూర్తి స్థాయిలో భారత దేశానికి ఒక రూపుని తెచ్చింది. చివరగా ఆర్ ఎస్ ఎస్ ఏమి చేస్తుంది అంటే కేవలం శాఖ నడుపుతుంది. ఆ శాఖ లో వ్యక్తి నిర్మాణం చేస్తుంది. ప్రపంచంలో వ్యక్తి నిర్మాణం కోసం వందేళ్ల గా పనిచేస్తున్న ఒకే ఒక సంస్థ ఆర్ ఎస్ ఎస్. ఇంతటి మహత్కార్యానికి పూనుకున్న డాక్టర్జీకి ప్రతి స్వయంసేవక్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రణామ్ చేస్తాడు, ఈ ప్రణామ్ ఉగాది నాడు మాత్రమే చేస్తారు. అదే ఆధ్య సర్ సంఘచాలక్ ప్రణామ్. అందుకే ఇంతటి మహోన్నతమైన ఆలోచనతో సంఘాన్ని స్థాపించిన పరమ పూజ్య హెడ్గేవార్ ని దైవాంశసంభూతుడు, కారణజన్ముడు, ప్రాతస్మరణీయుడు అని సంబోధించడం జరిగింది.    -నన్నపనేని రాజశేఖర్

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments