తమిళులు భారతీయులు కాదా.! || తమిళ ప్రజలు తమకు మేలు చేసిన పాతదనాన్ని ఆస్వాదిస్తూనే కొత్తదనాన్ని స్వాగతిస్తారు. || తమిళులు భారతీయు...
తమిళులు భారతీయులు కాదా.!
|| తమిళ ప్రజలు తమకు మేలు చేసిన పాతదనాన్ని ఆస్వాదిస్తూనే కొత్తదనాన్ని స్వాగతిస్తారు. ||
తమిళులు భారతీయులు కాదా.!
భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వార సత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల , జంతువుల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
భారత ప్రజలమైన మనం చేసిన ప్రతిజ్ఞ మరిచి పోయిన కొందరు రాజకీయవాదులు ఈ మధ్యకాలంలో తమిళులు దేశ ప్రజలందరిలో వేరన్నట్లుగా, తమిళ భాష మాట్లాడే ప్రజలు ఇతర భాషలను ఇతర భాషీయులను స్వీకరించరనీ, భారతీయ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు మాకు శిరోధార్యం కాదన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇవి తమిళ ప్రజలకు మాత్రమే కాకుండా, సంపూర్ణ భారతదేశ ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తున్న ప్రకటనలు.
ఈ జాడ్యం ఇప్పటిది కాదు దశాబ్దాల నాటిదే. ద్రావిడం పేరుతో రాజకీయాలు ప్రారంభం చేసి నాస్తిక ప్రభుత్వాలు ఏర్పాటైయిన కాలం నుండి ఇటువంటి మాటలు వినవస్తున్నవి.
అయితే నిజానికి తమిళ ప్రజలు వేర్పాటు వాదులా..?? కానే కాదు. సాధారణ భారతీయుడు ఆలోచించిన మాదిరిగానే సాధారణ తమిళ వ్యక్తి ఆలోచిస్తాడు, ఆచరిస్తాడు. అయితే ఈ వేర్పాటువాద రాగాలు తీసే రాజకీయ పక్షులు పదవుల కొమ్మలెక్కి అరుస్తారు కానీ ప్రజల భావననూ, వారి దిశను మార్చలేకపోయారు.
తమిళులయినా, కన్నడిగులయినా మరి ఇతర భాషలు మాట్లాడే భారతీయులయినా , "భాషలు వేరైనా భావం ఒక్కటే అని నమ్ముతారు" అయితే రాజకీయాల ముసుగు వేసుకున్న విదేశీ ఏజెంట్లు కొందరు భాష పేరుతో, ప్రాంతం పేరుతో భారతీయుల నమ్మకాలను మరియు మన దేశపు ఏకాత్మతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరి మాయమాటలను నమ్మి కొందరు అమాయకంగా వీరిని అనుసరిస్తున్నవారు కూడా త్వరలోనే సత్యాన్ని గ్రహిస్తారు, తప్పుచేసిన వారిని త్యజిస్తారు.
ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతున్నది ..?
తెలుగు మాతృభాషగా కలిగిన ఆంధ్రప్రదేశ్ లో మూలాలున్న కుటుంబంలో పుట్టి ఒక రష్యన్ పేరు పెట్టుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి 'స్టాలిన్' ఉత్తర భారతీయుల ఆధిపత్యం మాకొద్దు, ఉత్తరభారతీయుల హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. దక్షిణాదికి చెందిన రాష్ట్రాల రాజకీయ పార్టీల ప్రముఖులను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశాడు. వారి ఎజెండా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడం . ఎప్పుడో చేయవలసిన పార్లమెంట్ స్థానాల డి'లిమిటేషన్ ను కేంద్రం చేస్తుందేమోనని ముందే వ్యతిరేకత వ్యక్తం చేయడం.
అసలు కారణం ఏమై ఉంటుంది.?
1968లో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేత్రుత్వం లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖచే పాఠశాల విద్యాస్థాయిలో విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో రూపొందించబడిన "త్రి-భాషా సూత్రం". అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తరువాత 1968 జాతీయ విధానం (national policy resolution) గా అమలులోకి వచ్చింది.ఈ సూత్రం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ మూడు భాషలను ఉపయోగించాలి. హిందీలో మాట్లాడే రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాష (ప్రాధాన్యంగా దక్షిణ భారతదేశపు భాష), హిందీ మాట్లాడని రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ప్రాంతీయ భాషల్లో ఏవైనా మూడు భాషలు ఉండాలని నిర్ణయించారు, (ఉదాహరణ కు తమిళనాడులో 70 లక్షలకు పైగా ఒక కోటి వరకు తెలుగు మాట్లాడే వారున్నారట వారి భాషను, ఆంగ్లము, తమిళం లను కూడా ఈ త్రిభాషా సూత్రానికి అనుకూలంగా ప్రకటించవచ్చు) హిందీ తప్పనిసరి అని కూడా లేని విషయాన్ని మనం గమనించాలి. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై సమయం నుండి ఈ సూత్రాన్ని అనుసరించడంలేదు.
ఈ విషయాన్ని ఫిలడెల్ఫియా లో ఉన్న పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ 'షిఫ్ఫ్మన్' ఈ త్రి-భాషా సూత్రం విద్యారంగంలో విఫలమైందనే చెప్పవచ్చు అని ప్రకటించాడు.
"ఈ సూత్రం అమలు పరచడం కంటే ఉల్లంఘించడం వల్లనే ఎక్కువ పేరు పొందిందని" చెప్పాడు.
ద్రవిడ సంస్కృతిలో నిష్ణాతుడైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన షిఫ్ఫ్మన్ అంటూ ద్రావిడ రాజకీయ వర్గాలవారు ఉదాహరించే ఈయన ఎవరు.?
ఈ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా లో ఉన్న ఒక అమెరికన్ ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం. దీనిని సాధారణంగా పెన్ లేదా యుపెన్ గా సూచిస్తారు. పెన్ అమెరికన్ విశ్వవిద్యాలయాల సంఘం ప్రారంభించిన 14 సంస్థలలో ఒకటి, తొమ్మిది ఒరిజినల్ కొలోనియల్ కళాశాలల్లో ఒకటి. "పెన్ యొక్క స్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్, అది వాణిజ్యం, వ్యాపారం కోసం ఆచరణాత్మక విద్యపై, ఎక్కువగా క్లాసిక్స్, వేదాంతశాస్త్రం పైన ప్రజాసేవగా దృష్టి పెట్టే విద్యా కార్యక్రమమని ప్రకటించాడు".
అంటే ఇతరదేశాల యొక్క Education, Arts, philosophy, etc.. (విద్య, కళలు, వేదాంతం) పై దృష్టి పెట్టి వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడం వీరి లక్ష్యం. దీనికి ప్రజాసేవ అని ముద్రవేశారు.
ఇతర దేశాలపై తమ రాజకీయపు పట్టు కోసం, తమ వ్యాపారాలు సాగడం కోసం, స్థానిక ప్రజలకు ఇంగ్లీష్ భాషను నేర్పించి తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం, స్థానిక ప్రజలకు తమ పూర్వీకుల పట్ల, తమ పూర్వపు సంస్కృతి పట్ల, తమ పూర్వీకులు అందించిన విద్య, భాష,సాహిత్యాల పట్ల, కళల పట్ల, చులకన భావం పెంచడం, క్రమంగా పూర్వీకుల సంస్కారాలేవీ వీరికి అందకుండా చూడడం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థలు ఇవి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో జార్జ్ సోరోస్ యొక్క 'ఓపెన్ సొసైటీ ఫౌండేషన్' గా పేరుగాంచిన సేవా సంస్థలు 'డీప్ స్టేట్' ("డీప్ స్టేట్" అంటే, ప్రభుత్వ విధానాలను రహస్యంగా ప్రభావితం చేయడానికి లేదా నియంత్రించడానికి, ఎన్నుకోబడని ప్రభుత్వ అధికారులు, లేదా కొన్నిసార్లు ప్రైవేట్ సంస్థలు చేసే ఒక "కుట్ర సిద్ధాంతం". ) చేసిన పనినే దశాబ్దాల క్రితం వీరూ చేసారని గ్రహించాలి.
అప్పటి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ 'షిఫ్ఫ్మన్' ఇప్పటి జార్జ్ సోరోస్ ఒకే రకమైన వారనీ అంటారు. సేవల పేరుతో వారిచ్చే డబ్బు, రాజకీయపు పదవులు, అధికారం పొందడం కోసం వీరు తయారుచేసిన నేరేటివ్స్ ను స్థానిక ప్రజల్లోకి తీసుకువచ్చి మాయ మాటలను చెప్పి, ప్రజలను రెచ్చగొట్టి, తమిళులకు ఉత్తరాది వారు వ్యతిరేకులని, హిందీభాష మాకు పరమ వ్యతిరేకమనీ ప్రచారం చేసి, స్థానికులైన తమ ప్రజలనే తప్పుదోవ పట్టించే రాజకీయ నాయకులు తమిళనాట రాజ్యమేలుతున్నారు.
రెండు నాలుకల ధోరణి:
- చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూతురు 'సెంతామరై' నడిపించే 'సన్ షైన్' ఆంగ్ల మాధ్యమం లో సీ.బీ.ఎస్.ఈ. సిలబస్ బోధించే పాఠశాలలో తమిళం భాషలో మాట్లాడితే 2500 రూపాయలు ఫైన్ విధిస్తారుట.? వీరే తమిళనాడులో తమిళం తప్ప మరో భాష ఉండడానికి వెళ్ళలేదంటూ బూటకపు ఉద్యమాలు తీస్తారు.
- ఒకవైపు తమిళ భాషావాదం అంటూ మాట్లాడే రాజకీయవాదుల పిల్లలెవరు తమిళ భాషా మాధ్యమ పాఠశాలల్లో చదవడం లేదు వారందరూ ఇంగ్లీషు చదువులకు మాత్రమే పరిమితమయ్యారు, ఇక ప్రఖ్యాతిగాంచిన సంస్కృత సాహిత్యాన్ని సమాజం మరిచిపోయినట్లుగానే కొద్ది సంవత్సరాల లోనే తమిళ సాహిత్యాన్ని చదివే వ్యక్తులిక కనిపించరు.
- తమిళభాష ఒక బరిబీరియన్ భాష అంటూ రామస్వామి పెరియార్ చెప్పిన మాటలను ఈ ద్రావిడ రాజకీయ వాదులు తప్పు పట్టలేదు, వ్యతిరేకించనూ లేదు, పైపెచ్చు రామస్వామి పెరియార్ మా నాయకుడని నెత్తిన పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటారు.
- తమిళనాడు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఇన్ఫర్మేషన్ చెకర్ లో ‘‘10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తమిళ సబ్జెక్టు తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించిందని అబద్ధం ప్రచారం జరుగుతోందని తెలియజేసింది. తమిళనాడు ప్రభుత్వం 2006లో తమిళ్‌ను అన్ని రకాల పాఠశాలల్లో ప్రథమ సబ్జెక్టుగా నిర్బంధ తమిళ అభ్యాస చట్టం ద్వారా ప్రకటించింది అని చెప్పినప్పటికీ
సంబంధిత కేసులో, చెన్నై హైకోర్టు 2020 నుండి 2022 వరకు పదో తరగతి సాధారణ పరీక్షలో తమిళ సబ్జెక్ట్ పరీక్ష వ్రాయకుండా భాషా మైనారిటీ పాఠశాలల్లో (అది ఏ భాష పాఠశాలలో మీకు తెలిసిపోయి ఉంటుంది.) చదువుతున్న విద్యార్థులకు మినహాయింపు ఇచ్చింది. దీనిని ధృవీకరిస్తూ 2023లో కూడా మినహాయింపు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ప్రభుత్వపు నిధులు తీసుకొని నడిపించే ఏ మదర్సాలో కూడా తమిళం కనీసం రెండవ భాషగానో మూడో భాషగా కూడా నేర్పించకపోవడాన్ని ఎలా భావించాలి.? ప్రజలు చెల్లించిన టాక్స్ ల నుండి వీరికి నిధులు కేటాయిస్తున్న డీఎంకే ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాలి.
-As of June 2019, Tamil Nadu had around 5,700 government schools with English medium classes, employing approximately 6,000 teachers.
English-medium enrolments in government and government-aided schools increased from 55.18 lakh in 2018-19 to 82 lakh in 2023-24.
తమిళనాడు పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం తప్పనిసరిగా నేర్పించవలసిన నిర్బంధపు భాషగా చేయని కారణంగా మరియు ఇంగ్లీష్ వ్యామోహంలో పడి గత సంవత్సరానికి గాను 82 లక్షల మంది విద్యార్థులను ఇంగ్లీష్ మాధ్యమ స్కూళ్లలో ఇంగ్లీషు చదివేటట్లుగా, రాబోయే తరాలు తమిళం మరిచిపోయేటట్లుగా పాఠశాలలను ప్రారంభం చేసిన ఈ విదేశీ పేరు గల స్టాలిన్ పేరుగల ముఖ్యమంత్రి యొక్క ప్రభుత్వం తమిళభాషకు ఎలా సేవ చేయాలనుకుంటున్నది.?
- ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) పార్టీకి చెందిన తమిళనాడు రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు ఎన్.ధర్మలింగం కుమారుడు. డాక్టర్ D. ఉదయ కుమార్ ధర్మలింగం. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (ఎస్.ఎ.పి) నుండి ఆర్కిటెక్చర్ (బి.ఆర్కి) లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన ఈయన రూపొందించి రూపీ (₹) డిజైన్ బాగుందనీ ఆనాటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు మరియు రూపకర్తను అభినందించారు, ప్రస్తుతం పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు, ఇండోనేషియా వంటి దేశాలలో కూడా రూపీని ద్రవ్య కొలమానంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడేమో స్టాలిన్ ఈ రూపీ (₹) డిజైన్ బాగాలేదని దీనికి భారత దేశ ప్రాచీన సాంస్కృతికపరమైన మూలాలు ఉన్నాయని దీనిని మేము వ్యతిరేకిస్తామని, మాకు వేరే డిజైన్ ఉందనీ రెండు రకాల మాటలతో రెండు నాలుకలతో ప్రచారం చేస్తున్నారు.
తమిళ ప్రజలు ఎవరిని అనుసరిస్తారు.?
తమిళ భాష మరియు సాహిత్యం అభివృద్ధిలో అగస్త్య మహర్షికి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళ వ్యాకరణం మరియు భాషా శాస్త్రానికి చేసిన కృషి వల్ల ఆయనను తమిళభాషా పితామహుడిగా భావిస్తారు, వీరిని 'సిత్తర్' (శైవ సాంప్రదాయంలో సిద్ధుడు) అంటూ పిలుచుకుంటారు, వీరు తమిళ సాహిత్యంలో అద్భుతమైన రచనలు చేశారు. అవి వరాహ పురాణంలోని అగస్త్య గీత, ద్వైత నిర్వాణ తంత్రం, స్కంద పురాణంలోని అగస్త్య సంహితలను రచించాడు. అంతేకాదు 'అగస్త్య ఆయుర్వేదం' అనే ఒక గ్రంథం కూడా ఉంది ఈ గ్రంథం తమిళనాడు ప్రజలను ఆరోగ్యరీత్యా ఎంతగానో ఆదుకున్నది. వేదాలలో గొప్పగా కీర్తించబడే ఏడుగురు ఋషులలో ( సప్తఋషులు ) అగస్త్య మహర్షి ఒకరు. అతను చిరంజీవి అని కూడా అంటారు. అగస్త్య మహర్షి మరియు వారి భార్య 'లోపాముద్ర' ఋగ్వేదం లోని 1.165 నుండి 1.191 వరకు ఋక్కులను (శ్లోకాలను ) దర్శించి వ్రాశారు. వీరిని తమ కులదైవముగా, ఆరాధ్య దైవముగా భావించి గ్రామ గ్రామాల్లో అగస్త్యర్ విగ్రహాలను నెలకొల్పుకొని పూజిస్తున్న తమిళులు అగస్త్యర్ ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వారనీ ఎప్పుడూ విమర్శించలేదు. వారిని విస్మరించలేదు. వారు చూపిన దారిని విడువలేదు. 'దేశం నలుమూలలా వేద సంప్రదాయాన్ని అనుసరించే ప్రజలు ఎలా భావిస్తారో తమిళూలూ అలాగే భావిస్తారు.'
* మొదటి రాజేంద్ర చోళుడు గంగానది వరకు రాజ్యాన్ని విస్తరించినందున గంగైకొండ చోళన్ అని పేరుతో పిలువబడినాడు. ఇతడు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిషా మరియు బెంగాల్‌లను పరిపాలించాడు, ఈ విజయాల తర్వాత తన తండ్రి రాజరాజ చోళుడు నిర్మించిన తంజావూర్ ఆలయం మాదిరి చోళపురంలో ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించారు. తాను అద్భుతంగా నిర్మించిన శివాలయం దర్శించుకోవడానికి దేశ ప్రజలందరినీ ఆహ్వానించాడు, ఓడిపోయిన రాజ్యాల పాలకులను గంగానది నుండి కుండలలో నీటిని తెచ్చి ఈ ఆలయ బావిలో పోయమనీ కోరి మనందరం ఒకటే అనే భావనను తీసుకొని వచ్చాడు.. ఇది తమిళ ప్రజల సహజ స్వభావం.
గంగానది నుండి సుమత్రా ద్వీపంలోని శ్రీవిజయ సామ్రాజ్యం వరకు విస్తరించిన ఆనాటి వైభవం. ( చోళ సామ్రాజ్యం 848 నుండి 1279వరకు = 431 సం.లు ) దక్షిణ, ఆగ్నేయ మరియు తూర్పు ఆసియాలోని రాజ్యాలలో చోళులది గొప్ప సామ్రాజ్యం. విజేతలై ఆయా ప్రదేశాలలో నెలకొల్పిన శైవ, వైష్ణవ, శాక్తేయ, కౌమార, గణపత్యా సంప్రదాయాలను, మలేషియా, జావా, సమత్ర, సింగపూర్ వంటి చోట్లలో ఇప్పటికీ ప్రత్యక్షంగా దర్శించవచ్చు.
చేరన్ చెంగుట్టవాన్ :
ప్రాచీన చేరనాడు(ప్రస్తుతం కొంత తమిళనాడు ప్రాంతం మరికొంత కేరళ ) ను పాలించిన తమిళరాజు చేరన్ చెంగుట్టువన్ క్రీస్తుపూర్వం మూడు శతాబ్దలో 'వన్నాతిపార' వద్ద 'కణ్ణగి మాత' ఆలయాన్ని నిర్మించాడు దానిని ' కన్నగి కొట్టం ' లేదా ' మంగళాదేవి కన్నగి ఆలయం ' అని పిలుస్తారు, ఈ ఆలయంలోని విగ్రహాల నిర్మాణం కోసం హిమాలయాలకు వెళ్లితెచ్చారు. ఆ క్రమంలో స్వాగతించిన వారిని ఆదరించాడు, తనను ఎదిరించిన రాజులందరినీ ఓడించాడు, ఇలా అప్పటి స్థానిక రాజులందరితో కలిసి హిమాలయాల నుండి రాళ్లను తలపై పెట్టుకుని తీసుకువచ్చారట, అలా తెచ్చిన రాళ్ళతో 'వన్నాతిపార' ఆలయం విగ్రహాలు తయారుచేయించి నిత్య పూజలు నిర్వహించారు
- నెడుంజెరియన్ రాజు యొక్క రాజ్యం ఉత్తరాన హిమాలయాల దాకా ఇటు తూర్పు ఆసియా ప్రాంతం వరకు వ్యాపించి ఉండేది. ప్రజలు అతన్ని గౌరవంగా 'ఇంద్రుడు' అన్న పేరుతో పిలిచేవారు. వారు ధర్మప్రభువు. ఆయన రాజధాని తమిళనాడు మధురై పట్టణం. ఆయన నిలువెత్తు ధర్మానికి మారుపేరు. హిమాలయాల మీద ఆయన రాజ్యపతాకం రెపరెపలాడుతుండేదట. అనగా హిమాలయాల వరకు అతని రాజ్యము వ్యాపించిందని అర్థం.
ఇలా చరిత్రలో రాజకీయంగా, సంపూర్ణ భారతంలోని అత్యధిక భాగం అనేకమార్లు తమ పాలనలోకి తెచ్చుకున్న తమిళులు మిగతా భారతీయులు తాము ఒకే సాంస్కృతిక వారసత్వానికి చెందిన వారమనే భావిస్తాం.
* పురాణ కాలంలో కైలాస శివుడిని పెళ్లాడ కోరిన హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి తమిళనాడు కన్యాకుమారిలో సముద్రపు ఒడ్డున గల ప్రస్తుతం వివేకానంద రాక్ మెమోరియల్ గా పిలవబడుతున్న శిలపై ఘోర తపస్సు చేసినట్లు ఆ తరువాత శివుడితో కళ్యాణమైనట్లు ఆ కళ్యాణానికి సాక్షాత్తు విష్ణుమూర్తి సాక్షిగా నిలబడగా చతుర్ముఖ బ్రహ్మ కళ్యాణం నిర్వహించినట్లు ఇక్కడి చరిత్ర.
వారి కుమారుడు కుమారస్వామి తనఅన్న గణపతికి గణాధిపత్యం ఇచ్చినారని అలిగి తమిళనాడులోని పళని కొండపై కూర్చున్నాడట అతడిని లాలించడం కోసం, ఒప్పించడం కోసం స్వయంగా శివపార్వతులు ఆయన దగ్గరికి వచ్చారట. కుమారస్వామి కారణంగా తమకు శివపార్వతుల దర్శనం లభించిందని స్థానిక ప్రజలు కుమారస్వామి భక్తులుగా మారిపోయారు తమిళనాట ప్రతి గ్రామంలోని వీధి వీధిలో మురుగన్ /షణ్ముఖ/స్కందుడిగా పిలువబడే కుమారస్వామి ఆలయాలను చూడవచ్చు ఇది తమిళుల భక్తి చరిత్ర.
ఇప్పటికీ కైలాస పర్వతాన్ని, కేదారేశ్వరుడినీ మరియు కాశీ అన్నపూర్ణా సమేత విశ్వనాథున్ని మరియు గంగను దర్శించుకోవడం కోసం కోట్లాది తమిళులు యాత్ర చేస్తుంటారు. చెన్నై నుండి వారణాసికి కాశీ తమిళసంఘం పేరుతో రైలు ప్రతిరోజూ నడుస్తూంది. ఇది సంపూర్ణ భారతదేశాన్ని ఒకటిగా భావించే తమిళనాడు ప్రజల ఉదాత్తమైన సమైక్యతా భావన.
- ప్రపంచంలోని కోట్ల మంది అనుసరించే పూజా విధానాలు, ప్రధానంగా పరిఢవిల్లుతున్న శైవ, వైష్ణవ సంప్రదాయాల్లో ప్రధానంగా 'ద్వైత' సాంప్రదాయమును ప్రవచించిన శ్రీరామానుజుల వారు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించి భారతజాతిని సమైక్యంగా నిలిపిన ఆదిశంకరాచార్యుల కేంద్రం తమిళనాడే కావడం మరో విశేషం. ఇలా దేశానికి ధార్మికమైన తేజస్సును అందించిన తమిళప్రాంతాన్ని దేశ ప్రజలు దర్శించుకుంటూనే ఉన్నారు, చేతులెత్తి నమస్కరిస్తూనే ఉన్నారు. ఇది తమిళ ప్రాంతానికి దక్కిన గౌరవమని తమిళనాడు ప్రజలు గర్వంగా భావిస్తారు.
తమిళులు ఇతర ప్రాంతాల వారిని ఆహ్వానిస్తారా, స్వాగతిస్తారా.?
అవును నిజమే స్వాగతిస్తారు:
ఉదాహరణకు కొన్ని :
విదేశీ దురాక్రమణకారుల చేతిలో విధ్వంసమైన తిరువణ్ణామలై ఆలయాన్ని పునర్నిర్మించి, లక్షగోవుల పాలతో అభిషేకం చేసినవారు మహారాష్ట్ర నుండి వచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్.
శ్రీరంగం ఆలయాన్ని విధ్వంసం చేసిన మాలిక్ కాఫుర్ వారసులను అణచివేయడం కోసం అప్పటి మైసూరు, తిరువన్నామలై సంస్థానాధీశులు 'కోపన్న వడయార్' తో కలిసి విజయనగర చక్రవర్తులు 'వీర కుమార కంపన' 31 మే 1371 రోజున, ముస్లిం బీభత్సకారులను తరిమివేసి తిరుపతిలో ఉన్న శ్రీరంగనాథుని విగ్రహాలను శ్రీరంగానికి తెచ్చి పునఃప్రతిష్ఠించినారు. ఇక మదురై ఆలయాలను కూడా పునఃనిర్మాణం చేసిన వీరు కన్నడరాజ్యం నుండి వచ్చిన వారే. అప్పటి చరిత్ర ఆయన శ్రీమతి గంగాదేవి వ్రాసిన 'మధురా విజయం' అనే పుస్తకాన్ని చదివి తీరవలసినదే అది అప్పటి తమిళనాడు ప్రజల యొక్క జీవన పరిస్థితి వారి హృదయాలను తెలియజేసే పుస్తకం.
- మరో సందర్భంలో విజయనగర సామ్రాజ్యం లో అంతర్భాగంగా తమిళనాడు ప్రజలు ఉండేవారు ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసిన అనేక దేవాలయాలు, వాటిలో దేవతా విగ్రహాలు ఇప్పటికీ పూజలు అందుకుంటూనే ఉన్నాయి
-ఆధునిక చరిత్రలో సుభాష్ బాబు పిలుపునందుకొని వేలాదిమంది తమిళులు ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. నాటి నుండి నేటి వరకు దేశ ప్రజలను ఉర్రూతలూగించే "జయ్ హింద్" నినాదం తమిళనాడుకు చెందిన 'షణ్ముఖ నాథపిళ్ళై' గారు ఇచ్చినదే. ఆ.హిం.ఫౌజ్. లోని ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ కెప్టెన్ గా విజయలక్ష్మి తమిళనాడుకు చెందిన వారే.
- అప్పుడే కాదు ఇప్పుడు స్వాతంత్ర్యం తరువాత కూడా భారతదేశమును పాలించిన ముగ్గురు రాష్ట్రపతులు తమిళులే కదా.
ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో.. దబ్దాసో అపరితాస ఉద్భిదః| ( ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చే మేలు చేసే ప్రతి విషయాన్ని మేము స్వాగతిస్తాము) అను ప్రాచీన శ్లోకంలో చెప్పిన మన ఋషుల యొక్క దారిలోనే తమిళనాడు ప్రజలు నడుస్తున్నారు.
||గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు || అని పుణ్యం స్నానం చేసే కోట్ల మంది భారతీయులలో తమిళ్ కూడా భాగమే.. ఇది గత జనవరిలో జరిగిన కుంభమేళాలో స్పష్టంగా కనిపించింది. పుణ్యస్నానాలు ఆచరించిన 60 కోట్ల మందిలో తమిళుల శాతం కూడా అధికమే.
||అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారావతీ చైవ సప్తయితాన్ మోక్షదాయకః|| మోక్షం ఇచ్చే ఏడు ప్రాచీన సాంస్కృతిక రాజధానులలో కాంచి పట్టణం నాల్గవది కదా ఇప్పటి భారతానికే కాదు అఖండమైన సంపూర్ణ భారతదేశానికి సాంస్కృతిక రాజధాని ఆది శంకరాచార్యుల వారు నెలకొల్పిన సర్వజ్ఞ పీఠం కొలువైనదీ కాంచి పట్టణమే కదా.
ఉత్తర భారతంలో ఉన్న వ్యక్తి గంగాజలాన్ని తీసుకొని రామేశ్వరుడికి అభిషేకం చేసి సముద్రంలో ఉన్న ఇసుకను తీసుకెళ్లి గంగానదిలో ఏ భావనతో కలుపుతాడో.. తమిళులు కూడా అలాగే చేస్తారు, అలాగే భావిస్తారు. ఇది మనదేశపు అంతర్గత సాంస్కృతిక ఏకత్వం. దీనికి ఉత్తరము దక్షిణము పశ్చిమము అంటూ ఎల్లలు లేవు. భాష పేరుతో ప్రాంతం పేరుతో రాజకీయ పక్షులు చేసే వేర్పాటు వాద నినాదాలు తమిళనాట శాశ్వతంగా పనిచేయవు. తమిళనాడులో రాబోయేది సాంస్కృతిక విప్లవం. -ఆకారపు కేశవరాజు విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి - అఖిలభారత గోరక్ష సహప్రముఖ్. తిరుచిరాపల్లి, తమిళనాడు.
No comments