అఖండ హిందూస్దాన శక్తుల ఓటమి - కనుచూపులో పాకిస్ధాన్ రాజాజీ జిన్నా సంప్రదింపులు: వీరసావర్కర్ 1937 నుంచి హిందువులను హెచ్చరించినప్...
రాజాజీ జిన్నా సంప్రదింపులు: వీరసావర్కర్ 1937 నుంచి హిందువులను హెచ్చరించినప్పటికీ ఉపేక్షింపబడిన హిందూజాతికి వ్యతిరేకంగా జరిగిన కుట్రను 1944లో రాజాజీ బహరంగపరచారు. రాజాజీ జిన్నాకు ఇచ్చిన ఒక టెలిగ్రాం ఇట్లా ఉంది, మిస్టర్ గాంధీకి కాంగ్రెస్లో ఏ విధమైన బాధ్యతాయుత అధికారం లేనప్పటికీ నాప్రతిపాదనలను పూర్తిగా ఆమోదించి వాటి ఆధారంగా మీతో చర్చలు జరుపనున్నారు. ఆయన అభిప్రాయ బలంతో దీనిని తర్వాత కాంగ్రెసు ఆమోదించవచ్చును. 1944 ఏప్రిల్ 16 న మరొక ప్రకటనలో నేను నా ప్రతిపాదనలకు గాంధీజీ సంపూర్ణ ఆమోదంతో నాపనిని ప్రారంభించి రెండు సంవత్సరాలైంది. ముస్లిం లీగు 1940 తీర్మానంలో కోరిన కోర్కెలన్నీ ఆమోదింపబడ్డాయని తెలిపారు. అంటే, 1942లోనే గాంధీ కాంగ్రెసు పార్టీకి కూడా తెలియకుండా రాజాజీతో చేరి దేశ విభజనకు అంగీకరించి దేశంలోని వ్యతిరేకత దృష్ట్యా విషయాన్ని రహస్యంగా వుంచారన్నమాట.
మే నెలలో వ్యాధిగ్రస్తుడైన గాంధీని మానవతా దృష్టితో విడుదల వేశారు. జూలైలో గాంధీజీ రాజకీయ సంభాషణలకై కలుసుకొవటానికి తనకు అవకాశమిమ్మని జిన్నాను కొరారు. జిన్నా తనను బొంబాయిలోని తన ఇంట్లో కలుసుకోవచ్చని జవాబు ఇచ్చారు. ఈ పరిణామాలు కాంగ్రెసు వారికే విస్మయం కలిగించాయి. గాంధీజీ ఈ విధంగా దేశ విభజనకు తన ఆశీర్వాదం ఇస్తాడని వారు ఊహించలేదు. ఈ పరిస్థితి వీరసావర్కర్కు దుర్బరంగా తోచింది.
అత్యంత ఆవేశంతో “ఈ విషాదకర పరిణామాలలో రాజాజీ ఒక్కరిని మాత్రమే దుష్టశక్తిగా చూడడం న్యాయం కాదు. అతని తప్పంతా ఐచ్చికంగా గాంధీజీ చేతి పనిముట్టుగా వాడబడటానికి అంగీకరించడం మాత్రమే" అంటూ తాము తలచిన వారికి దానంగా ఇవ్వటానికి భారతదేశంలోని రాష్ట్రాలు గాంధీజీ, రాజాజీల సొంత ఆస్తులు కావు" అని ప్రకటించారు. ఆగష్టు 1944 మొదటి వారాన్ని ఆఖండ హిందూస్థాన్ వారంగా జరపాలని హిందువులను కోరారు. అంతే కాదు, అమెరికా పత్రికలకు, బ్రిటీషు ప్రభుత్వానికి, గాంధీ రాజాజీల భారతదేశ విభజన ప్రతిపాదనలను ఖండిస్తూ ప్రకటనలను పంపించారు.
పాకిస్థాన్ స్పెషల్ రైలులో గాంధీజీ: పరిస్థితులు దిగజారి పోసాగాయి. రాజాజీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. జిన్నాను కలుసుకోవటానికి గాంధీజీ వార్థా నుండి “పాకిస్థాన్ స్పెషల్ రైలు" ఖాక్సారు ముస్లిం వాలంటీర్లు, బ్రిటీషు సైన్యం కాపలాతో బయలుదేరగా పలుచోట్ల నల్లజెండా ప్రదర్శనలు జరిగాయి. అప్పుడు వార్థాలో యల్.జి యల్ ధ ట్రై నాయకత్వాన గాంధీ జిన్నా సంభాషణలకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహంలో నెల్లూరు నుండి పైడిపాటి రాఘవయ్య పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. కానీ గాంధీ, కాంగ్రెస్, బ్రిటీష్ ప్రభుత్వం వారు దేశ విభజనకు సన్నాహాలు ప్రారంభించారు. ఏ దేశాన్నైతే ఒక మాతృమూర్తిగా భావించి ఆమె దాస్యశృంఖలాల విచ్ఛేదశకు తాను, తన కుటుంబాన్ని సర్వస్వం త్యాగం చేసినారో, ఆమాతృ దేశ విభజనకు గాంధీజీ ఆశీస్సులు ఇచ్చారన్న విషయం బహిరంగం కాగానే, ఆగ్రహం ఆవేదవ పట్టలేక సావర్కరు “ఉన్మాదపు ఉధృతము ఏనాడూ ఇంత మించి పోలేదు. ఏ పాపకార్యమూ ఇంతకన్న నల్లగా ఉండలేదు. అతని రాజకీయ జీవితానికి మన మాతృదేశం విభజన వంటి అత్యంత హేయమైన పాపకార్యం కలికితురాయిగా అమరబోతున్నది. అదీ అహింస, సత్యము, దేవుడుల పేరిట" అని గాంధీ చర్యలను ఖండించారు.
విషాదాంతాన్ని నివారించడానికి సావర్కర్ చేయగలిగినదంతా చేశారు. "పాకిస్థాన్ ఒక పాపం. ఒక అసత్యం, దైవాన్ని విరాకరించడం, అనేకులైన మన పూర్వీకులు సాధించిన దానిని భంగపరచడం, నన్ను విభజించి, దేశాన్ని విభజించండి.” అని దేశ ప్రజల యెదుట ప్రవచించిన గాంధీ, ఏ ప్రదేశం వల్ల, ఈ దేశానికి హిందూ స్థానమని పేరు వచ్చిందో ఆ సప్త సింధు ప్రదేశాన్ని ఆ సింధు నదీతీరాలను, దేశానికి అత్యంత పవిత్రమైన భాగాన్ని విభజించి, తమ జన్మస్థానమైన ఆ సప్త సింధుప్రాంతంలో హిందువుల నిర్మూలనకు, ముస్లిం రాజ్యస్థాపనకు అంగీకరించారు.
అఖండ హిందూస్థాన్ నాయకుల సమావేశం: సావర్కర్ చివరి ప్రయత్నంగా 1944 అక్టోబరు 7-8 తేదీలలో అఖండ హిందూస్థానాన్ని బలపరచే నాయకుల సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పరిచారు. సిక్కు నాయకుడు మాష్టరు తారాసింగ్ తో సహా 300 మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొని పాకిస్థాను ఎదిరించడానికి దృఢపంకల్పాన్ని ప్రకటించారు.
సావర్కర్ అనారోగ్యం - అధ్యక్షపదవికి రాజీనామా: సావర్కర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. హిందూ మహాసభ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించలేనని ప్రకటించి డాక్టరు శ్యామప్రసాద్ ముఖర్జీని ఎన్నుకోవలసినదిగా కోరాడు. డాక్టరు శ్యామ ప్రసాద్ అంతకు ముందే రాష్ట్రాలకు స్వయుం నిర్ణయాధికారాన్నివ్వడాన్ని ఖండించారు. ఆయనా డాక్టరు మూంజే వంటి హిందూసభ నాయకులు ఇలాంటి క్లిష్ట సమయంలో సావర్కర్ ఒక్కడే ఆఖండ 'హిందూస్థాన్ ఉద్యమాన్ని నడిపించగలరని భావించారు. కానీ సావర్కర్ రాజీనామా ఉపసంహరించుకోలేదు. 1944 డిసెంబరులో బిలాస్పూరులో జరిగిన హిందూ మహాసభ సమావేశానికి శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షత వహించారు. సావర్కర్ సమావేశంలో పాల్గొని ప్రారంభించారు.
గణేశ సావర్కర్ మరణం: 1945 సంవత్సరం సావర్కర్ జీవితంలో మరో విషాదకరమైన సంవత్సరం. ఆరోగ్యం మరింత క్షీణించింది. మార్చి నెలలో సోదరుడు గణేశ సావర్కర్ మరణించాడు. ఆయన మరణానికి కొద్ది రోజుల ముందే సావర్కర్ ఆయనను కలుసుకొన్నారు. మరణ శయ్యపై వున్న తన సోదరునికి ఇట్లు వ్రాసాడు “మన సోదరుల జీవిత ధ్యేయం ఒక్కటే. మన పితరుల ఆధ్యాత్మిక ఋణాన్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేశాం. ఆధునిక హిందూదేశ చరిత్ర వ్రాసే ఏ చరిత్రకారుడు కూడా స్వర్ణాక్షరాలతో మనలను గూర్చి ఒక అధ్యాయం వ్రాయకుండా ఉండలేడు. మన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ అధ్యాయాన్ని సావర్కర్ శకంగా పరిచయం చేశారు. మనకు, మన దేశీయులకు, స్వాతంత్య్రదేవతకు జయం కల్గుగాక. హిందూ స్థానం హిందువులదే అనే రెండు యుద్ధ నినాదాలను అందజేసి జాతి ఆదర్శంలో, దేశ రాజకీయ జీవనంలో సిద్దాంత పరమైన విప్లవాన్ని సాధించడానికి రెండుమార్లు మార్గదర్శకులమైనాము.”
"ఇప్పుడు నీ ప్రక్కన నిలబడియుండే మరణదేవత నీ శత్రువుగా కాక, ఏ మిత్రుడుగానే నిలబడి యున్నాడు. నీ జీవిత ధ్యేయానికి తగినట్టు నీవు జీవించావు. నీ బాల్యంలో ప్రమాణం చేసి, చేత ధరించిన స్వాతంత్ర జ్యోతిని పరిత్యజించే ఆలోచనను స్వప్నంలో కూడా ఏనాడూ చేయలేదు. నీబాధలలో గానీ, సుఖాలలో గానీ, ఏనాడు విప్లవ పతాకాన్ని నీవు క్రిందకు దించలేదు." అంటూ వ్రాశాడు.
నిజాం తల్లి చనిపోయినపుడు నైజామును ఊరడిస్తూ టెలిగ్రాం ఇచ్చిన గాంధీజీ సావర్కర్కు ఊరడింపుగా ఒక జాబు రత్నగిరికి వ్రాశాడు. సావర్కర్ సరియైన విలాసం గాంధీజీకి గానీ, ఆయన పరివారానికి గాని తెలియక పోవడం విచిత్రమైన విషయం. సావర్కర్ ఎనిమిదేండ్లకు ముందే రత్నగిరి వదలి ముంబాయిలో తమ వివాసం ఏర్పరచుకొన్నారు. అయినా సావర్కర్ శ్రీమాన్ గాంధీజీకి కృతజ్ఞతలు తెల్పుతూ ఆయన ఆరోగ్యాన్ని గురించి అడుగుతూ లేఖ వ్రాసి తన సౌజన్యాన్ని ప్రకటించారు.
చెరి సగం పంపకం: ఈ సమయంలోనే గాంధీజీ ఆశీస్సులతో కాంగ్రెసు నాయకుడు భూలా భాయి దేశాయి ముస్లింలీగు నాయకుడు లియుకత్ ఆలీఖాన్ తో ఒక రహస్య ఒప్పందం చేసుకొన్నాడు. దీని ప్రకారం అన్ని పదవులలో హిందువులకు, ముస్లింలకు 50:50 వంతున ప్రాతినిథ్యం వుంటుంది. ఇది ముస్లింలీగుకు మరో విజయం. వైస్రాయి లారు వేవెల్ ప్రతిపాదనల చర్చలకై లండన్ వెళ్లారు.
ఈ సమయంలో హిందూ సంస్థానాల మార్గదర్శనానికి అంత అనారోగ్యంలోనూ సావర్కర్ పూనుకున్నారు. 1945 ఏప్రిల్ లో బరోడాలో జరిగిన హిందూ సంస్థానాల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. మే నెలలో తన కుమార్తెకు పూనాలో వివాహం జరిపి, ఆ సమయం లోనే జరిగిన హిందూ రాష్ట్రదళ్ సమావేశంలో పాల్గొన్నారు.
వేవెల్ ప్రణాళిక - హిందూ మహాసభ ప్రతిఘటన: జూన్లో వేవెల్ తన ప్రణాళికతో తిరిగి వచ్చినాడు. ఇండియా స్వాతంత్ర్యాన్ని గూర్చిగానీ, సంస్థానాలను గూర్చిగానీ అందులో ఏమీలేదు. జపాన్ కు వ్యతిరేకంగా యుద్ధ యుత్నంలో సహాయపడాలనే షరతు మీద సంపూర్ణ హిందువులకు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం వుండేటట్లు వైస్రాయికి సలహాదారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేయబడింది.
22 శాతం వున్న ముస్లింలకు 54 శాతం వున్న సవర్ణ హిందువులతో సమానంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి కాంగ్రెసు అంగీకరించింది. అంతేకాదు ముస్లింల తరపున ముస్లింలీగు తరపున అధ్యక్షుడు జిన్నా, సవర్ణ హిందువుల తరపున కాంగ్రెసు అధ్యక్షుడు మౌలానా ఆజాద్, నిమ్నజాతులు, శిక్కుల తరపువ వారివారి ప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు. హిందూ మహాసభను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. సిమ్లా సమావేశానికి కూడా మహాసభను పిలువలేదు. ఈ విధంగా దేశ భవితవ్యం నిర్ణయించే తరుణంలో హిందువుల హక్కుల రక్షణకు హిందువుగా మాట్లాడే ప్రతినిధిని లేకుండా చేశారు. దేశమంతా ప్రతిఘటన, ప్రదర్శనలు జరిగాయి. 'హిందూ మహాసభ ప్రత్యక్ష చర్య నడపదలచింది. కానీ, సావర్కర్ నాయకత్వం లేని లోపం హిందూ మహాసభ అనుభవించింది. దేశంలోని అసంతృప్తిని సంఘటిత పరచి ఉద్యమాన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ నడుపలేక పోయారు. ఇది హిందూ మహాసభను ప్రజల దృష్టిలో చులకన చేసింది. రానున్న ఎన్నికలలో హిందూ మహాసభ వైఫల్యానికి దారి తీసింది.
ఇంగ్లండులో లేబర్ పార్టీ అధికారం: 1945 జూలైలో ఇంగ్లండులో లేబరు పార్టీ ఎన్నికలలో గెల్చి అధికారం లోనికి వచ్చింది. అప్పుడే జపాన్ యుద్ధంలో అపజయం పొంది లొంగి పోయింది. సెప్టెంబరులో భారతదేశంలో కేంద్ర అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించబడ్డాయి. ఈ ఎన్నికలలో నిర్ణయింపబడవలసింది, ముస్లిం ప్రతినిధులు ఎవరు? హిందూ ప్రతినిధులు ఎవరు అనేది మాత్రమే. వీరసావర్కర్ కదలలేని పరిస్థితులలో నాయకుడు లేని పార్టీగా హిందూ మహాసభ ఒక వైపు, అప్పటికే ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉండి విధులను కూర్చుకొని పాకిస్థాన్ వ్యతిరేకంగా ప్రగల్భాలు పలికే సర్దారు పటేలు వంటి నాయికులు గల కాంగ్రెస్స్ మరియొక వైపు హిందువుల ప్రాతినిధ్యానికై ఎన్నికల రంగంలో నిలిచాయి. సర్దారు పటేలు, నెహ్రూ, గాంధీజీలు ఏదో మ్యాజిక్స్ చేసి దేశ ఐక్యతను, తమ హక్కుల రక్షణలను సాధించగలరనే నమ్మకం హిందువులు విడనాడలేదు. దానికి తోడు ఎన్నికల ముందు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థైర్యాన్ని కోల్పోయి హిందూ మహాసభ ఎన్నికల ప్రచారానికి ఊపు తేలేకపోయాడు. ఈయన కూడా అనారోగ్యంతో ఎన్నికల రంగం నుండి వెనుకంజ వేసినారు. సావర్కర్ ఆరోగ్యంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గూడ ఆయనను గూర్చి విచారించని నెహ్రూ, సర్దారు పటేలు, శ్యామ ప్రసాద్ వద్దకు ఆయన ఆరోగ్యాన్ని గూర్చి విచారించడానికి హుటాహుటిగా వెళ్లారు. ఎన్నికల యుద్ధం ప్రారంభించకముందే శ్యామ ప్రసాద్ రంగం నుండి నిష్క్రమించారు. హిందూ మహాసభ నాయకుడు లేని పక్షముకాగా, కాంగ్రెస్ నాయకులు హిందూ నాయకులుగా ఉపన్యాసాలు చేయసాగారు. ఏ సైనికులనైతే పొట్టకూటి కొరకు చేరిన సైనికులని కాంగ్రెసువారు వర్ణించారో, ఆ నేతాజీవి, ఐ.ఎన్.ఎ. సైనికులను సమర్థిస్తూ, ప్రేమ కురిపించారు. బోపట్కర్, బాయి పరమానంద, మూంజీల వంటి కొంతమంది మాత్రమే తుది వరకు పోరాడారు.
ఎన్నికలలో పాకిస్థాన్ శక్తుల విజయం: కానీ హిందూ మహాసభ ఎన్నికలలో తుడిచిపెట్టి వేయబడింది. జాతీయ పక్షమని చెప్పుకొనే కాంగ్రెసు, ముస్లింలు తమ నియోజక వర్గాల్లో తుడిచిపెట్టి వేసి, అన్ని స్థానాల్లో ముస్లింలీగు ను గెలిపించారు. పాకిస్థాన్ శక్తులు విజయం సాధించాయి. హిందువులమని చెప్పుకోడానికి సిగ్గుపడే కాంగ్రెస్ వారిని హిందువులు తమ ప్రతివిధులుగా ఎన్నుకొన్నారు.
హిందువుల ఈ ఆత్మహత్యా సదృశ్యమైన చర్య సావర్కర్ ను క్రుంగదీసింది. "గత రెండు సంవత్సరాలుగా నా నరముల దారుఢ్యం పూర్తిగా సడలిపోయింది. ఇప్పుడు పూర్తిగా ధ్వంసమయింది'' అని ఎస్.పి.చటర్జీకి యిచ్చిన టెలిగ్రాంలో సావర్కర్ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆ కదలలేని అనారోగ్య పరిస్థితులలోనే సావర్కరు ఎన్నికల ఫలితాల వల్ల దేశ భవిష్యత్తు ఏ విధంగా రూపొందుతుందో స్పష్టంగా చూడగలిగారు. అఖండ హిందూ స్థానానికై పోరాటం వీగి పోయిందని తెలుసుకొన్నారు. అతని ఆరోగ్యంపై ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతీసింది. మధ్య మధ్య మతి భ్రమణం సంభవించింది. వైద్యుల సలహాపై 1946 జనవరిలో వారిని పూనా వద్ద వాలాచంద్ నగరానికి ఆయనను చేర్చారు. అక్కడ హిందూ సంఘటన ఉద్యమంలో అచంచల విశ్వాసం ఉన్న సేట్ గులాబ్చంద్ అత్యంత భక్తిశ్రద్ధలతో సావర్కరు కు సేవ చేశారు.
ముస్లింలీగు ప్రత్యక్ష చర్య - కలకత్తా, నౌఖాలి హిందూజన సంహారం - బీహారులో ప్రతీకారం. 1946 సంవత్సరం రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ప్రారంభమైంది. కాంగ్రెసు నాయకులు ఇంకా హిందువులను ఆఖండ భారతదేశమే తమ ధ్యేయమైనట్లు మభ్యపెడుతూ ఉన్నారు. 1946 జనవరి 14వ తేది అహమ్మదాబాదులో మాట్లాడుతూ సర్దారు పటేల్ “పాకిస్థాన్ను మంజూరు చేయటం బ్రిటీషు వాళ్ళ వేతులలో లేదు. పాకిస్థాన్ సాధించాలంటే హిందువులు ముస్లింలు పోరాడుకోవాలి. ఒక అంతర్ యుద్ధం జరుగుతుంది. కాంగ్రెసు ఇక ముస్లింలీగు తలుపులు తట్టబోవడం లేదు” అని ప్రకటించారు. కాంగ్రెసుమహానాయకులు ఇట్టి ప్రచారంతో, ధనపు సంచులతో, వార్తా పత్రికలపై తమకు గల తిరుగులేని పలుకుబడితో ఎన్నికల ప్రచారం సాగించి, హిందూ మహాసభను హిందూ నియోజక వర్గాలలో తుడిచిపెట్టి వేసినారు. ముస్లింలీగు ముస్లిం నియోజక వర్గాలలో కాంగ్రెసును తుడిచి వేసింది.
భారత నావికా దళంలో తిరుగుబాటు: ఈలోగా నేతాజీ భారత జాతీయ సైన్య విచారణ భారతదేశ సైన్యంపై ప్రభావం చూపింది. భారత నావికా దళంలో నావికులు, భారత విమానదళంలోని వైమానికులు తిరుగుబాటు ధ్వజాన్ని ఎత్తారు. పదాతిదళంలో కూడా కలకలము ప్రారంభమైంది. బ్రిటీష్ ప్రభుత్వ చట్టం గడగడలాడింది.
బ్రిటీషు దౌత్యవర్గం: బ్రిటీషు లేబర్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే పదిమందితో కూడిన ఒక ప్రతినిధి వర్గాన్ని భారతదేశానికి పంపించారు. వారు సావర్కర్తో సంభాషించ గోరారు. కానీ ఆయన అప్పుడు తీవ్ర అస్వస్థతలో వున్నారు. ఫిబ్రవరిలో ఈ ప్రతినిధి వర్గం తిరిగి లండన్ వెళ్లిన తర్వాత ముగ్గురు క్యాబినెట్ మంత్రులతో మరియొక ప్రతినిధి వర్గాన్ని పంపబోతున్నామని బ్రిటీషు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15వ తేదీన ఒక ప్రకటన చేస్తూ బ్రిటీషు ప్రధానమంత్రి అట్లా స్వాతంత్ర్యం పొందటానికి భారతదేశ హక్కును గుర్తించి “ఒక అల్పవర్గం అత్యధిక ప్రజల పురోగతిని నిరోధింప లేదు" అని ప్రకటించారు. మార్చి 24న క్యాబినెట్ మిషన్ వచ్చి అనేక మంది రాజకీయ నాయకులతో చర్చలు జరిపారు. ఏప్రిల్ 5న నెహ్రూ "పాకిస్థాన్ పై ముస్లింలీగు దబాయింపు కోర్కె బ్రిటీష్ ప్రభుత్వం ఒప్పుకొన్నా సరే కాంగ్రెసు ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకోదు" అని గర్జించారు. ఈ యుద్ధ నినాదాల తర్వాత కొద్ది రోజులకే నెహ్రూ దీనంగా తన మాటలను దిగమింగడం యావజ్ఞాతి వీక్షించింది.
సర్వత్రా ముస్లిం ప్రాతినిధ్యం: ఆనాటి రాజకీయ రంగంలో ప్రముఖమైన దృశ్యమేమిటంటే ముస్లింలకు ప్రతినిధిగా జిన్నా, హిందువుల ప్రతివిధిగా మౌలానా అజాద్, సంస్థానాల ప్రతినిధిగా భోపాలు నవాబు చర్చలు సాగించి, సర్వం ముస్లింలమయంగా చేయడం. ఈ సమయంలోనే ముస్లిం నాయకులు తమ కోర్కెలను ఒప్పుకోకపోతే, దేశంలో చెంగీజ్ ఖాన్ ను మరిపిస్తామని బహిరంగంగా ప్రకటించి అందుకు సన్నాహాలు చేయ ప్రారంభించారు.
క్యాబినెట్ మిషన్ - హిందూ మహాసభ: జనవరి 20న వాలాచంద్ నగరులో తీవ్రమైన గుండెపోటుకు గురి అయిన సావర్కరు ఆరోగ్యం కొద్దిగా కుదుటబడగానే ఏప్రిల్ 3న పూనాకు వచ్చి ఒక హోటల్లో విశ్రాంతి తీసుకొన్నారు. ఆ సమయంలోనే భోపట్కరు, శ్యాము ప్రసాద్ ముఖర్జీ ఆయనను కలుసుకొని క్యాబినెట్ మిషన్ కు సమర్పించవలసిన వివరణ పత్రాన్ని గూర్చి చర్చించారు.
క్యాబినెట్ మిషన్ పథకం: మే 16న బ్రిటీషు ప్రతినిధి వర్గం కొత్త ప్రతిపాదనలు చేసింది. " దీని ప్రకారం జిన్నా దేశ విభజన పధకం తిరస్కరింపబడింది. కేంద్ర ప్రభుత్వానికి, విదేశ వ్యవహారాలు, దేశ రక్షణ, రవాణా, వార్తా విషయాలలో మాత్రం అధికారం వుండేట్లు మిగతా విషయాలలో రాష్ట్రాలకే అధికారాలు ఉండేటట్లు ప్రతిపాదించబడింది. ఇంకా రాష్ట్రాలను మూడు గ్రూపులుగా ఉంచటానికి ఒక అవకాశం కల్పింపబడింది. ఈ గ్రూపులను ఏర్పాటు చేయటంలో పాకిస్థాన్లో చేర్చమని కోరే రాష్ట్రాలను ప్రత్యేక గ్రూపులుగా వుంచటం జరిగింది. నియోజక వర్గాలను సాధారణ, ముస్లిం, సిక్కు అని వర్గీకరణ చేసి హిందూ ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఈ ప్రతిపాదనలతోనే పాకిస్థాను సాధించవచ్చని, ముస్లింలీగు వీటిని ఆమోదించింది. ఐక్య భారతాన్ని సాధించవచ్చని ఊహలలో కాంగ్రెసు కూడా ప్రతి పాదనలను ఆమోదించింది. కానీ జూలై 10వ తేది బొంబాయిలో " ప్రతిపాదనలలోని గ్రూపులలో నుంచి బయట పడటానికి రాష్ట్రాలకు స్వాతంత్ర్యం వుంటుంది." అన్న నెహ్రూ రాజనీతిజ్ఞత లేని ప్రకటనతో జిన్నాకు తన డిమాండ్లు పెంచుకోవడానికి మరొక అవకాశం దొరికింది.
జూలై 27వ ముస్లింలీగు పై ప్రతిపాదనలను తిరస్కరించి ప్రత్యక్ష చర్య కార్యక్రమాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ వారికి కాళ్ళలో దడపుట్టి జిన్నావద్దకు పరిగెత్తి ప్రతిపాదనలకు ఏ మార్పు లేకుండా ఆమోదిస్తామని ప్రాధేయపడసాగారు.
కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం: ఈలోగా వైస్రాయి 16 మంది సభ్యులతో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలచినట్లు ప్రకటించారు. ఇందులో ఆరు కాంగ్రెస్ వారు, అయిదు ముస్లింలీగ్ వారు, అయిదు ఇతర అల్ప వర్గాలవారు వుండేటట్లు నిర్ణయించారు. కాంగ్రెసువారు తమ ఆరుగురిలో ఒకటి ముస్లింలకు ఒకటి నిన్నుజాతులకు ఇవ్వ నిశ్చయించారు. అనగా 16 మందిలో 54% ఉన్న సవర్ణ హిందువులకు నలుగురు, 22% ఉన్న ముస్లింలకు ఆరుగురు ప్రతినిధులు ఏర్పాటు అయినది. ముస్లింలీగు కలసి రాకపోయినా, కాంగ్రెసు సెప్టెంబరు 2న ప్రభుత్వంలో చేరింది. తాత్కాలికంగా ముస్లింలీగు కోటాలో ఇద్దరు ముస్లింలను నియమింపగా అందులో ఒకరు హత్య చేయబడ్డారు.
లీగు ప్రత్యక్ష చర్య కలకత్తా నౌకాలీలలో హత్యాకాండ: కాంగ్రెస్ మాత్రమే చేరిన ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేయుడానికి, ముస్లింలీగు ఆగస్టు 16న ప్రత్యక్ష ప్రతిఘటన చర్య ప్రారంభించింది. కలకత్తాలో పరిస్థితుల ఎదుర్కోవడానికి సిద్దంగాని హిందువులపై జరిగిన హత్యాకాండ చరిత్రలో వర్ణింప సాధ్యంకాని కలకత్తా హత్యాకాండగా వర్ణింబడింది. ఇక్కడి నుండి ఈ మారణహోమం తూర్పు బెంగాలు నౌఖాలి జిల్లాకు ప్రాకి ముస్లింలు అధికసంఖ్యలో ఉన్న ప్రాంతాలలో హత్యలు, దోపిళ్ళు, మానభంగాలు, స్త్రీలని బలవంతంగా ఎత్తుకొని పోవటం, బలవంతపు మత మార్పిడులు ఒక ప్రణాళికాబద్ధంగా జరుపబడి, హిందువులలో భీతావహం కల్పింపబడింది. 20వ శతాబ్దంలో హిందువులపై జరిగిన సంఘాత మరణాలు, బ్రిటీషు వారిచే ఆయుధ రహితులుగా చేయబడి, తమ నాయకులచే అహింసావ్రతానికి అర్పణ చేయబడిన హిందువులు విభ్రాంతులై అనుభవిస్తూ పిరికిపందల వలె మతం మార్చుకోవడమో, తమ స్త్రీలను ఆహుతి ఇవ్వడమో లేక తమ జన్మస్థానం నుండి పరిగెత్తి పోవడమో చేయసాగారు. గాంధీజీ మౌనం వహించారు. తాత్కాలిక ప్రభుత్వంలోని నెహ్రూ, పటేలులు కర్తవ్యతా విమూఢులైనారు. ముస్లింల దౌష్ట్యాలను నిర్దాక్ష్యణ్యంగా అణచడానికి వారు సాహసించలేక పోయారు.
ఒక్క బీహారులోనే సోదర హిందువులపై జరిగిన అత్యాచారాలకు పగతీర్చుకోడానికి సంసిద్ధులయ్యారు. డాక్టరు మూంజే కురుక్షేత్రం నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయని హెచ్చరించారు. బీహారు హిందువులు కొట్టిన తిరుగుదెబ్బ పరిస్థితిని కొంత చక్కబెట్టింది. కానీ కాంగ్రెసు నాయకులు బీహారు హిందువులపై కక్షగట్టినట్లు ప్రవర్తించారు. మిలిటరీని, పోలీసులను ఉపయోగించి, హిందూ జాగృతిని అణచి వేయబూవారు. గాంధీ, నెహ్రూలు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ప్రకటనలు చేశారు. కానీ నౌఖాలి హిందువులను ఆదుకొన్నవారుగాని, ఓదార్చిన వారుగాని లేరు.
No comments